గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2011, సోమవారం

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీకందరికీ అభినందనలు.

వాడుక భాషా ఉద్యమ పితామహుఁడు  గిడుగు వేంకట రామ మూర్తి.
గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29వ తేదీ శ్రీకాకుళానికి  ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్నపర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. 
గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. 
వాడుక భాషా ఉద్యమ పితామహుఁడు  గిడుగు వేంకట రామ మూర్తి.
పంతులుగారి పుట్టిన రోజు 'తెలుగు భాషా దినోత్సవము'గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది.
తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషాభిమానులకూ, తెలుగు సంతతికి, నా హృదయ పూర్వక అభినందనలు. 
గిడుగు రామమూర్తి , జనవరి 22, 1940 న కన్ను మూశారు. వారి సామాజిక దృక్పథానికి జోహార్.
పాఠకులు  హాస్యావధానాన్న, మేడసానివారి శతావధానంలోని, సమస్యా పూరణ కొంత భాగాన్ని ఈ క్రింది urlల ద్వారా తెరచి, చూచి, విని ఆనందించవచ్చును.
http://www.youtube.com/watch?v=72pWN0ml9M8&feature=player_detailpage
http://www.youtube.com/watch?v=7KUWs8hzY_g&feature=player_detailpage
http://www.youtube.com/watch?v=uHidzTYwbss&feature=player_detailpage
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

8 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! నమస్కారములు.
తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు.

తేనె తినగ నాకు తీయగా నే లేదు
పటిక బెల్లమందు పసయె లేదు
చెరకు రుచిని జూడ చెల్లుబాటుగ లేదు
తెలుగు పద్య రుచిని తెలిసి యుండ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ!

తేనె తినగ నేల తెలుగు పద్యము గల్గ,
పటిక బెల్లమేల? పనస లేల?
చెరకు రుచులవేల?చిత్రకవితలుండ.
తెలుగు పద్య రుచులు తెలుసు మీకు.

మిస్సన్న చెప్పారు...

ఆర్యా!

పాప నవ్వు వోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్లు మల్లెలట్లు
వీణ పాట రీతి విన సొంపుగా నుండు
తీయ తేనె లొలుకు తెలుగు పలుకు.

తెలుగులందరికీ శుభా కాంక్షలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మిస్సన్న గారూ!
చాలా చక్కగా చెప్పారండి.

పాప నవ్వు కన్న, పాల మీగడ కన్న,
మంచి గంధము మరి మల్లె కన్న,
వీణ పాట కన్న, విన సొంపు మిస్సన్న
తెలుగు పలుకు నిజము తేనె లొలుకు.

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

నారదాది మునులు నారాయణుని జేరి
మధుర మైన భాష మాకు నిమ్ము
ననుచు గోరగ నత డాంధ్రము బలికించె
భారతమ్మ చేత, బ్రహ్మ నడిగి !

అందుచే మన మంతా అదృష్టవంతులము. అందఱికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నారసింహా. నమోనమహ్. చక్కగా సెలవిచ్చారు మన మాత్ర్భాష ఆవిర్భావం గురించి.అద్భుతమైన సత్యాన్ని వెలువరించిన మీకు నా ధన్యవాదములు.

తెలు"గన్న వరమె"యందురు.
తెలుగదిమనకొదవినవిధి తెలిపిరి సుగతిన్.
తెలుగన్న వరదుఁడొసగిన
విలువగు మనభాష. తెలుగు వెలుగును సతమున్.

Pandita Nemani చెప్పారు...

శబ్ద మధురిమయును సద్భావ సంపద
బహుళ ప్రక్రియా ప్రభావిభవము
సామరస్య పటిమ చక్కగా గలుగుచు
విశ్వ భాషలందు వెలుగు తెలుగు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండిత నేమాని అవధాన శేఖరులకు. ఆర్యా! నమస్తే.

మానితమగు తెలుగున నే
మాని తమ గుణ ప్రశస్తి, మర్యాదలనే
మానితమని భావించితి.
మానిత నేమాని కవి! ప్రమాణము మీరే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.