గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఆగస్టు 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ2)


సాహితీ బంధువులారా! 
అవధాన శేఖర, అవధాన భారతి
 బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ  కట్టమురి చంద్ర శేఖర్ అవధాని  విజయనగరం నివాసి. విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు, సుప్రసిద్ధ తెలుగు ఉపన్యాసకులు. రాష్ట్ర ప్రతిభారత్న పురస్కార గ్రహిత. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత, శ్రీమాన్ సద్గురు కృష్ణ యాజిగారి నిర్వహణలో గల శ్రీ సూర్య సదన ఆస్థాన పండితులు. 
అట్టి శ్రీమాన్ కట్టమురి చంద్రశేఖర్ చేసిన అవధానములలో పూరణకై  ఇచ్చిన సమస్యలను, అవధాని ఆ సమస్యలను  పూరించిన విధమును మీ ముందుంచుటకు ఆనందంగా ఉంది.
ఈ సమస్యలను పాఠకులు తమ నిపుణత చూపుతూ పూరించి, తమ పూరణలను కూడా తోటి పాఠకులకు అందించడం ద్వారా ముదావహులగుదురని ఆశించుచున్నాను.
ఈ రోజు ప్రకటిస్తున్న సమస్య:-
"పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్."
(ఆకుతో కోసినంత మాత్రముననే వట వృక్షము నేలకూలినది  అని ఈ సమస్య యొక్క భావము) 
ఈ సమస్యను మన అవధానిగారు పూరించిన విధానం చూద్దాము.
ధాత్రికి వృక్షమె ప్రాణము
ధాత్రిని జనియించి కాచు ధరణిని ప్రజలన్.
పాత్రములౌనే వాటిని 
"పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్."
చూచారు కదా అవధాని చేసిన పూరణ.
నేను చేసిన పురాణము వ్యాఖ్యలలో చూడఁ గలరు. 
ఔత్సాసికులైన మీరు కూడా ఈ సమస్యను పూరించే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ప్రయత్నించి చూడండి. తప్పక పూరించ గలరని నా నమ్మకం. శంకరాభరణంలో అద్భుతంగా తీర్చి దిద్దబడుతోంది మీ రచనా పాటవం. అది ఎంతవరకూ మెఱుగులు దిద్దుకుందో ఈ సమస్యా పూరణద్వారా ప్రయత్నించండి. మీ పాటవాన్ని పరీక్షించుకోండి. 
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

24 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నేను చేసిన పూరణము.
పుత్రుఁడు ధాత్రిం బడెనని
శ్రోత్రియ ద్రోణుఁడు వినుచు నశువులను బాసెన్
మిత్రమ! విధినేమందును.
పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగుంది.
కాని ‘శ్రోత్రియద్రోణుఁడు’ అన్నప్పుడు ‘య’ గురువై గణదోషం వస్తుంది కదా!

కంది శంకరయ్య చెప్పారు...

ఒక రాజు భవననిర్మాణానికి ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అడ్డుగా ఉన్న వటవృక్షాన్ని కూల్చమని ఆదేశించాడు. ఇదీ నేపథ్యం ...
ధాత్రీశుం డొక భవనము
నాత్రమ్మునఁ గట్టఁ బూని యాదేశింపన్
క్షత్రియవీరుఁడు తన కర
పత్రముతోఁ గోయ నొరిగె వటభూరుహమున్.
(కరపత్రము = ఱంపము)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్యగారూ!
లాగి పలుకబడునవియు మరి ఊది పలుకబడునవియు గురువుల్ అన్న నియమాన్ననుసరిస్తే శ్రోత్రియ అనే పదంలో సంయుక్తాక్షరం యొక్క ఒత్తిడి ముందు అక్షరం పై ఉండనందున అది లఘువే ఔతుంది అని నా భావన.
మీ సూచనకి ధన్యవాదములు.
మీ పూరణము చక్కగా ఉంది. ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

నేను ప్రస్తావించింది ‘శ్రోత్రియ’లోని సంయుక్తాక్షరం గురించి కాదు, ‘ద్రోణుఁడు’లోని సంయుక్తాక్షరం. ‘శ్రోత్రియ ద్రోణుఁడు’ ఏకసమాసం కనుక ‘ద్రో’ అనే సంయుక్తాక్షరం యొక్క ఒత్తిడి ‘య’ మీద ఉండదా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రోత్రియ ద్రోణుదు లో కూడా లఘువుగానే పరిగణించవచ్చండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంరయ్య గారూ!
సుధీవరశ్రేష్ఠ, లో ర అనే వర్ణము ఒక పరి గురువుగాను, ఒకపరి లఘువు గాను ప్రాచీనుల ప్రయోగం.
అలాగే
సద్ధృతిప్రాజ్ఞ లో తి అనే వర్ణము పొకపరి గురువుగా, ఒకపరి లఘువుగా ప్రాచీన ప్రయుక్తము.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

ఛత్రమ్మే నాడు ప్రజకు
పత్రిక, నేటికి విలువలు పడిపోయెఁ గదా!
చిత్రముగ నేడు వార్తా
పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్

వార్తా పత్రము = News Paper

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగుంది . ఇద్దరు పండితుల గురు లఘువుల సవరణ వలన తెలియని వారికి తెలుసుకునే అవకాసం లభిం చినండులకు చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికీ ధన్య వాదములు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చిత్రముఁ గాదిది, యొకపరి
పత్రముతో కోయ ఒరిగె వటభూరుహమున్.
మిత్రుని పుత్రుని శరముల
నా త్రినయనముల శివుండు- నారిని వలచెన్.

కంది శంకరయ్య చెప్పారు...

ఇవి నాకు తెలియక వ్యాఖ్యానించాను. మన్నించండి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

సొంపైన పూరణ లందించిన చింతా వారికి, కంది వారికి నమస్కారములతో ..

మిత్రునికై లిఖియించిన
పత్రము నొక కోయ వాడు పట్టుకు వెళుచున్
మిత్రుని రశ్మికి డస్సియు
పత్రముతో ' కోయ' ఒరిగె వట భూరుహమున్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చిత్ర మదేమియు లేదిల,
చిత్రములో ' తెలుగు హీరొ ' చిత్ర విచిత్రం
గా త్రెళ్లుచు శ్రీ యంత్రపు
పత్రముతో కోయ, ఒరిగె వట భూరుహమున్!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జిగురు సత్యనారాయణ గారూ! మీ భావన బాగుంది. ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ!చాలా సునాయాసంగా సమస్యా పూరణను చేసిన మీ సామర్ధ్యాన్ని అభినందిస్తున్నాను. మీ స్పందనకు ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రిగారూ! మీ రెండు పూరణలూ కూడా మనోరంజకంగా ఉన్నాయి.
కోయ ఒరిగిపోవటడం మరీ బాగుందండి. మీ భావనకు నా అభినందనలు. మీ స్పందనకు ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్యగారూ! మీరు వ్యాఖ్యానించారు కాబట్టే నేను మరొక్కసారి విషయ వివేచన చేసుకొనే అవకాశం కలిగింది.
నిర్ధారణగా మీకు చెప్పే అవకాశం కలిగింది. ఈ విషయంలో మీకు నా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:
శ్రీ చింతా రామకృష్ణారావు గారికి నమస్కారములు.
ఆర్యా, మహామహులు పూరించిన సమస్యలను పూరించటము కష్టమే ఐనప్పటికీ వారివలె
పూరించలేకపొయిననూ చిన్న ప్రయత్నము చేయుచున్నాను. పెద్దలు,కవులు,పండితులు నా తప్పులను
మన్నింప ప్రార్థన.

శాత్రవమను వటవృక్షము
నాత్రముగా కూల్చివేయ నందరు ఒకటై
మైత్రీ బంధంబను కర
పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ! చక్కని భావపతో మీరు పూరించిన పూరణ చక్కగానున్నది. మీకు నా అభినందన పూర్వక ధన్యవాదములు.

మిస్సన్న చెప్పారు...

గురువర నా పూరణమ్ము ..........

ఆ త్రిపథ గామి పుత్రుడు
చిత్రముగా కూలె పేడి చేయగ రణమున్ !
శాత్రవు లానందింపగ!
పత్రముతో కోయ, ఒరిగె వట భూరుహమున్!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మిస్సన్నగారూ! చాలా చక్కగా అర్థాంతరన్యాసాలంకారంతో పూరించిన మీకు అభినందన పూర్వక ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.