గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఆగస్టు 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ1)

అవధాన శేఖర, అవధాన భారతి బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ  కట్టమురి చంద్ర శేఖర్ అవధాని  విజయనగరం నివాసి. విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు, సుప్రసిద్ధ తెలుగు ఉపన్యాసకులు. రాష్ట్ర ప్రతిభారత్న పురస్కార గ్రహిత. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత, శ్రీమాన్ సద్గురు కృష్ణ యాజిగారి నిర్వహణలో గల శ్రీ సూర్య సదన ఆస్థాన పండితులు. 
అట్టి శ్రీమాన్ కట్టమురి చంద్రశేఖర్ చేసిన అవధానములలో పూరణకై  ఇచ్చిన సమస్యలను, అవధాని ఆ సమస్యలను  పూరించిన విధమును మీ ముందుంచుటకు ఆనందంగా ఉంది.
ఈ సమస్యలను పాఠకులు తమ నిపుణత చూపుతూ పూరించి, తమ పూరణలను కూడా తోటి పాఠకులకు అందించడం ద్వారా ముదావహులగుదురని ఆశించుచున్నాను.
ఈ రోజు ప్రకటిస్తున్న సమస్య:-
రంభా శ్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.
(రంభ యొక్క గెడ్డపు వెంట్రుకలచే రావణుఁడు పీడింప బడినాఁడు అని ఈ సమస్య యొక్క భావము) 
ఈ సమస్యను మన అవధానిగారు పూరించిన విధానం చూద్దాము.
స్తంభంబుం గనినాడు, కామ దహితోత్కంపంబునుం బొంది దోః 
స్తంభాలింగిత చేష్టలెవ్వి యొకటా! తాపంబునం జేయుచున్
గుంభీభూత మనస్కుఁడై ధరణిజం గోల్పోవు కోపాన  ఓ 
రంభా! స్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.
చూచారు కదా అవధాని చేసిన పూరణ.
ఔత్సాసికులైన మీరు కూడా ఈ సమస్యను పూరించే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ప్రయత్నించి చూడండి. తప్పక పూరించ గలరని నా నమ్మకం. శంకరాభరణంలో అద్భుతంగా తీర్చి దిద్దబడుతోంది మీ రచనా పాటవం. అది ఎంతవరకూ మెఱుగులు దిద్దుకుందో ఈ సమస్యా పూరణద్వారా ప్రయత్నించండి.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

15 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణను చూడండి.

సంభావ్యంబు శపింప.రావణుఁడు తా చైతన్యమున్వీడి ఓ
రంభా!శ్మశ్రు నిపీడినోచ్చలితుఁడౌ !రా!రావణుండెంతయున్
శంభుం గొల్చెడి భక్తి తత్పరుఁడు లేశంబైన ద్వేషించకే.
దంభంబుల్ పలికేటి రావణుఁడు తా తప్పున్గ్రహించున్ సతీ!

కంది శంకరయ్య చెప్పారు...

కట్టమూరి వారి అవధానాలలో సమస్యాపూరణలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
‘రంభా శ్మశ్రు .. ’ సమస్యను పూరించడానికి విఫలప్రయత్నం చేసాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ!
పట్టు వదలకండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి.
తప్పక సాధిస్తారనే నమ్మకం నాకుంది. మీ ప్రయత్నానికి నా అభినందనలు, ధన్యవాదాలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చింతా రామ కృష్ణా రావు గారికి నమస్కారములు.
మీ బ్లాగులో మొదటి అడుగు వేయుచున్నాను. ఈ బుడతడి తప్పటడుగులను సహృదయంతో సరి చేయగలరనే నమ్మకంతో తప్పులుంటాయని తెలిసినా పద్య పాదములుంచే సాహసం చేస్తున్నాను.

వాలిని వెనుకనుండి పట్టుకున్న రావణుడిని అలాగే ఒడిసి పట్టి సప్త సముద్రాలలో ముంచాడని ఒక కథ.
అలా పట్టు కున్నప్పుడు వాలి గడ్డము రావణుని చేతులకు తగిలి వుంటుంది కదా . అది నా భావన.
భాషా పాండిత్యము అంతగా లేని వాడను. తప్పులుంటే మన్నించ ప్రార్థన.


శంభున్ కొండను బాహు శక్తి మతుడై శౌర్యంబు తో నెత్తినన్
సంభావించగ బాహు మూలములలో చక్కంగ నే పట్టియున్
శంభో ! యన్నను వాలి రావణుడినే సంద్రాలలో ముంచగా
రంభా! స్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.

ఊకదంపుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఊకదంపుడు చెప్పారు...

సాహసం జేస్తున్నానండి, పెద్దలు గురువులు తప్పులుంటే మన్నించాలి.

నారదుడు వినాయకునితో పలుకుతున్నట్లుగా భావన, ఆత్మలింగం తోడ రావణుడు లంకకేగుతున్న వేళ, సంధ్యాసమయంలో:


శంభుండారయలేక,భక్తుడనువాత్సల్యంబునన్ బ్రోచె, హా!
కుంభీంద్రావనవైరిలంకఁజననే ఘోరమ్ములౌఁలోకమున్
స్తంభింపన్ దగు;లింగమున్గొని త్వరన్ ధారుణిన్ జేర్చ -హే
రంభా! స్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.

[కుంభీంద్రావనవైరి -కుంభీంద్రావనువైరి ? - కుంభీంద్ర- అవన వైరి = హరివైరి అన్న అర్ధం లో అన్నానండి, ఒప్పో కాదో తెలియదు.]

భవదీయుడు
ఊకదంపుడు

12 ఆగస్టు 201

ఊకదంపుడు చెప్పారు...

రెండవపాదం లో చిన్న మార్పు చేస్తూ -

సాహసం జేస్తున్నానండి, పెద్దలు గురువులు తప్పులుంటే మన్నించాలి.

నారదుడు వినాయకునితో పలుకుతున్నట్లుగా భావన, ఆత్మలింగం తోడ రావణుడు లంకకేగుతున్న వేళ, సంధ్యాసమయంలో:


శంభుండారయలేక,భక్తుడనువాత్సల్యంబునన్ బ్రోచె, హా!
కుంభీంద్రావనవైరిలంకకుఁజనన్ ఘోరమ్ములౌఁలోకమున్
స్తంభింపన్ దగు;లింగమున్గొని త్వరన్ ధారుణిన్ జేర్చ -హే
రంభా! స్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.

[కుంభీంద్రావనవైరి -కుంభీంద్రావనువైరి ? - కుంభీంద్ర- అవన వైరి = హరివైరి అన్న అర్ధం లో అన్నానండి, ఒప్పో కాదో తెలియదు.]

భవదీయుడు
ఊకదంపుడు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి మహత్వ భావన గనన్నాహా యనం జెల్లునే!
ప్రనుతింపన్ దగు పూరణంబు. ఘనుడా!ప్రఖ్యాత సద్వృత్తమే.
గనె నా వాణి మహోన్నతంబుగ తమన్ కారుణ్యయై.ధీ నిధీ!
వినసోంపౌ తమ పూరణంబు మదికిన్ విజ్ఞానముం గూర్చునే.

ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ!
ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చింతా రామ కృష్ణా రావు గారికి నమస్కారములు.
నా పూరణను మెచ్చుకుని మునుముందుకు ' ఆడుగులు' వేసే దైర్యాన్నీ, ఉత్సాహాన్నీ కలిగించారు.
పద్యములో దోషములుంటే సరి యైన మార్గ దర్శకత్వము చేయ వలసి నదిగా మనవి.
ధన్యవాదములు.

మిస్సన్న చెప్పారు...

గురువర మీ బాట లోనె.........

జంభారి ప్రముఖాది దేవతలకే సంతోషముంజేయు సం-
రంభంబందున నుండు దేమి సతమున్ రాజీవ పత్రేక్షణా !
రంభోర్యుగ్మ తనూ! విశాల హృదయా! రావేమి నన్ జేర నో
రంభా!శ్మశ్రు నిపీడినోచ్చలితుఁడౌ !రా!రావణుండెంతయున్

rākeśvara చెప్పారు...

పూరించే స్థోమత లేదు గాని.
గురువుగారు కొన్ని చోట్లఁ స్మశ్రు అని కొన్ని చోట్ల శ్మశ్రు అని ఇచ్చినారు. నిఘంటువులో శ్మశ్రుయని వున్నది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాకేశ్! చాలా చక్కగా సరిచేసావు అక్షర దోషాన్ని.
ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

ayyaa! sree kattamoori garu maa baavamaradulaku family friends mariyu classmate. swayam krishito caala unnata sthaayi kedigina mahaa mahulu. vaariki maa subhaaseessulu.

Pandita Nemani చెప్పారు...

ayyaa! sree kattamoori avadhaani gaaru maaku sannihitulu. vaaru swayamkrishito caala unnata sthaayiki edigaru. vaari tandri garu kooda mamci telugu panditule. vaarigurinci meeru pracurincinanduku santoshamu.
vaariki subhaabhinandanalu.
pandita nemani.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

ఆత్మలింగమును తాను కాచెదనని చెప్పి చివరకు భూమిమీద పెట్టిన వినాయకుడితో రావణుడు పోరినట్లుగా భావన జేసి ఆ పోరునందున వినాయకుడి గడ్డము రావణాసురినికి తగిలిందనే ఊహ. ( తప్పులుంటే మన్నించవలసినదిగా ప్రార్థన )

శంభుండిచ్చిననాత్మలింగమును నిస్సంకోచమున్ కావగా
దంభంబుల్ బలె పల్కినావునిట మద్భాగ్యమ్మునీరీతిగా
స్తంభింపన్ విధిలీలయంచు కలితస్వాంతుండునై పోర, హే
రంభాస్మశ్రునిపీడనోఛ్ఛలితుడౌరా! రావణుండెంతయున్.

హేరంభుడు = వినాయకుడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.