గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2011, ఆదివారం

పాఠకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు (దీని తరువాత టపాలో గీతా మాహాత్మ్యం చూద్దాం)

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు భగవద్భక్త బాంధవులకు నా శుభాకాంక్షలు.
శ్రీ కృష్ణామృత నామ పాన రతులై చెల్వొందు భక్తాళికిన్
శ్రీకృష్ణుండవనీతలంబున శుభాశీస్సుల్ ప్రసాదింపగా
వక్రత్వంబులు రూపుమాపగ భువిన్ ప్రఖ్యాతిగా బుట్టె నా
శ్రీకృష్ణాష్టమి మీకు శోభ గొలుపున్. క్షేమంబుగా వెల్గుఁడీ!   
జై శ్రీకృష్ణ.
జై హింద్.
Print this post

12 comments:

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:
గురువులకు,కవిమిత్రులకు శ్ర్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు.

శరణము రాధికారమణ, శ్యామలమైన త్వదంఘ్రియుగ్మమే
శరణమునాకు నాపయినశాంతముతోకృపజూపుమా హరీ
సరసిజనేత్ర పార్థరథసారథి శ్రీపతి శిష్టరక్షకా
కరములు మోడ్చి మ్రొక్కెదను కావుము దేవర ఎల్లవేళలన్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ననీత చోరుని ఆశీస్సులు అవనీతలానికి పంచిన పద్యము నవనవ లాడు చున్నది.

నవనీత చోరు దయచే
నవనీతల మెపుడు జూడ నవ నవ లాడున్!
నవనీత హృదయు డాతడు
నవ నీరాజనము లివియె నారద నుతకున్ !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి శాస్త్రి పూజ్య! నివసించుచు నుండుచు మీ హృదిన్ సదా
శ్రీ పతి శిష్ట రక్షకుడు క్షేమము గూర్చుచు కాచు మిమ్ములన్
శ్రీపతి పాదపముల్ శరణు చేకొనినార లశాంతి బాపి మీ
రేపగిదిన్ శుభంబు గన నెంతురొ యట్టులె కృష్ణుడిచ్చెడున్.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో...........

నల్లనివాడు పద్మనయనమ్ముల చూపులె కామధేనులై
చల్లగ జూచువాడు, కడు జవ్వనుడాశ్రిత భక్త పోషకుం
డెల్ల జగంబులందు తననిచ్చ జరించెడివాడు,బోధకుం
డల్లన యున్న నాతనికి నంజలినిత్తును భక్తితోడుతన్.

అల్లన = గంభీరముగా
బోధకుడు = జగద్గురువనే భావన

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ!
చాలా బాగుందండి మీ భావన.
ద్విప్రాసతో చక్కగా లాగించారు పద్యాన్ని.
అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంపత్కుమార్ శాస్త్రి గారూ! పోతనను తలపించారు మీరచనా నిపుణతతో. అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు.
శ్రీపతిని - సంపత్పతిని, శ్రీకరముగా వర్ణించిన శాస్త్రి & శాస్త్రి గార్లకు అభినందనలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కమనీయ ధారఁ బద్యము
రమణీయముగాఁ బలికెడి రచనా పటిమన్
సుమ సౌరభమగు భక్తిని
విమల మనము నిమ్మనుచును వేడెద కృష్ణా!

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీకృష్ణం వందే జగత్గురుం

కృష్ణస్వరూపులైన గురువుగారి{మీయొక్క} ఆశీస్సులు నాకు సర్వదా శిరోధార్యములు

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రిగారూ ధన్యవాదములు. మీ కందం మకరందం.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మన్ను తిన్నా , వెన్న తిన్నా , మన్ను మిన్ను ,ఏకం చేయగల ముద్దు కృష్ణుని ముఖ చిత్రం చూడ ముచ్చటగా ఉంది. అందించిన తమ్మునికి అభినందనలు." శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రియ సోదరు లందరికి హృదయ పూర్వక శుభా కాంక్షలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చింతా రామకృష్ణారావు. అన్నారు...
శ్రీపతి శాస్త్రి పూజ్య! నివసించుచు నుండుచు మీ హృదిన్ సదా
శ్రీ పతి శిష్ట రక్షకుడు క్షేమము గూర్చుచు కాచు మిమ్ములన్
శ్రీపతి పాదపముల్ శరణు చేకొనినార లశాంతి బాపి మీ
రేపగిదిన్ శుభంబు గన నెంతురొ యట్టులె కృష్ణుడిచ్చెడున్.

21 ఆగస్టు 2011 1:04 సా
పై పద్యంలో మూడవ పాదంలో పాదముల్ అనేది పాదపముల్ అని పనే అక్షరం పొరపాటున పడింది. టైపాటును గ్రహించి సరిచేసుకో వలసి యున్నది.

శ్రీపతి శాస్త్రి పూజ్య! నివసించుచు నుండుచు మీ హృదిన్ సదా
శ్రీ పతి శిష్ట రక్షకుడు క్షేమము గూర్చుచు కాచు మిమ్ములన్
శ్రీపతి పాదముల్ శరణు చేకొనినార లశాంతి బాపి మీ
రేపగిదిన్ శుభంబు గన నెంతురొ యట్టులె కృష్ణుడిచ్చెడున్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.