గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఆగస్టు 2011, బుధవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 14 / 21 వ భాగము

ఉ:- నా కను పాపవై కనగ నా కను ముందర కాచి యుండగా!
      నాకము గాన నే! వినగ నా చెవి నీ కథ విన్చు నుండగా
      నే; కన గోరెదన్. హితులు నే కన నీవని యెంచి చూడగా!
      శ్లోకి హరీ! ననున్ విజయ లోకముఁ జేర్చర వేణు గోపకా! 66.
         భావము:-
         కీర్తిమంతుఁడవైన ఓ శ్రీహరీ! ఓ వేణు గోపకుఁడా! నాకను పాపవై; చూడగా 
         నా కనుల ముందరే నీవు కాచుకొని యుండగా; నా చెవులు నీ కథలనే 
         వినుచూ ఉండగా; వినినచో నేను స్వర్గమునైనను చూడను కదా! నేను 
         చూచినట్లైతే హితులు నీవే అని గణించి చూచుచుండగా నేను చూడ గోరెదను.  
         నిత్యమూ విజయములకు స్థావరమైన లోకమునకు నన్ను జేర్చుము.

క:- కను పాపవై కనగ నా -  కను ముందర కాచియుండగా నాకముగా!
      కన గోరెదన్ హితుల నే -  కన నీవని యెంచి చూడగా! శ్లోకి! హరీ! 66.
        భావము:-
        కీర్తిమంతుఁడవైన ఓ శ్రీహరీ! నాకను పాపవై; చూడగా నా కనుల ముందరే 
        నీవు  కాచుకొని యుండగా; చూచినట్లైతే హితులు నీవే అని నేను  గణించి 
        చూచునట్లున్నచో దానిని  స్వర్గముగా  చూడఁ గోరెదను.  

గీ:- కనగ నా కను ముందర కాచియుండ!  -  వినగ నా చెవి నీ కథ విన్చు నుండ;
      హితులు నే కన నీవని యెంచి చూడ!  -  విజయ లోకముఁ జేర్చర వేణు గోప! 66.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! చూడగా నా కనుల ముందరే నీవు కాచుకొని యుండగా; 
        విన్నట్లైతే నా చెవులు నీ కథలనే వినుచూ ఉండగా; నేను చూచినట్లైతే హితులు 
        నీవే అని గణించి చూచునట్లున్నచో దానిని  స్వర్గముగా  చూడ గోరెదను. 
        నిత్యమూ విజయములకు స్థావరమైన లోకమునకు నన్ను జేర్చుము.

చ:- పరవశమైతి నిన్ కనుచు; భవ్య శరీరముఁ గల్గఁ జేసి భ
       క్తి రగులగా మతిన్ వెలయు తీరును  గొల్పెదు. విశ్వ తేజ!  ధీ
       వర! యశమున్ గొనన్ మదిని భాగ్య శుభాన్వితమై వెలుంగగా
       భరమ? హరీ! దయన్ వెలసి భాసిలు నన్ గని వేణు గోపకా! 67.
         భావము:-
         ఓ వేణు గోపకుఁడా! నిన్ను చూచుచు నేను పరవశించిపోతిని. ఓ విశ్వ తేజుఁడా! 
         మాకు భవ్యమైన శరీరమును కలుగఁ జేసి భక్తి భావము ప్రజ్వరిల్లు విధముగా 
         మనస్సును వెలసే విధానమును కలుగఁ జేసెదవు. బుద్ధిమంతులలో శ్రేష్టుడవైన 
         ఓ శ్రీ హరీ! భూమిపై పుట్టి భాసించెడి నన్ను చూచి; కీర్తిని పొందే విధముగా 
         నా మనస్సున నీవు దయతో భాగ్య శుభాన్వితమై ప్రకాశించుట యనునది 
         నీకు కష్టమైన పనియా!

క:- వశమైతి నిన్ కనుచు; భ  -  వ్య శరీరముఁ గల్గఁ జేసి భక్తి రగులగా
      యశమున్ గొనన్ మదిని భా  -  గ్య శుభాన్వితమై వెలుంగగా భరమ? హరీ ! 67.
        భావము:-
        బుద్ధిమంతులలో శ్రేష్టుడవైన ఓ శ్రీ హరీ! నిన్ను చూచుచు నేను నీ వశమైతిని! 
        మాకు భవ్యమైన  శరీరమును కలుగఁ జేసి భక్తి భావము ప్రజ్వరిల్లు విధముగా; 
        కీర్తిని పొందే విధముగా; నా మనస్సున నీవు  భాగ్య శుభాన్వితమై ప్రకాశించుట 
        నీకు కష్టమా!

గీ:- కనుచు; భవ్య శరీరముఁ గల్గఁ జేసి -  వెలయు తీరును  గొల్పెదు విశ్వ తేజ!  
      మదిని భాగ్య శుభాన్విత మై వెలుంగ; -  వెలసి భాసిలు నన్ గని వేణు గోప! 67.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! ఓ విశ్వ తేజుఁడా!  చూచుచు మాకు భవ్యమైన శరీరమును 
        కలుగఁ జేసి వెలసే విధానమును కలుగఁ జేసెదవు. నన్ను చూచి; నీవు 
        భాగ్య శుభాన్వితమై ప్రకాశించుట  కొఱకు నా మనస్సున వెలసి; భాసిలుము.

చ:- అల సదుపాయమున్ హృదయ మందు దయాస్థితి నిచ్ఛ నుండెదో?
      యడరుకొనన్ దగన్ పదిలమై సుధ లొల్కగ పల్కఁ జేసి! శో
      భల మధుసూదనా! మధుర భావ దయాదుల మంచినిచ్చి; బ్రాఁ
      తిలగ హరీ! దయన్ వెదకు తీవగ  చేరితె? వేణు గోపకా! 68.
        భావము:-
        ఓ వేణు గోపకా! ప్రసిద్ధమైన మంచి ఉపాయముతో భద్రముగా తగిన విధముగ 
        వృద్ధి యగు నట్లుగా నా హృదయములో దయ కలవాడివై కోరి యుండెదవా? 
        ఓ శ్రీ హరీ! అమృత మొల్కునటుల పలుకునట్లు చేసె గదా! శోభలతో 
        మధురమైన భావన; దయా మొదలగునవి అధిక మగునట్లుగా మన్నిక గొల్పుచు 
        నాలో ఉండెను. ఓ మధుసూదనుఁడా! నేను వెదక బోయిన తీగ వలె నీవు దయతో 
        నన్ను చేరితివా!
     
క:- సదుపాయమున్ హృదయ మం  -  దు దయాస్థితి నిచ్ఛ నుండెదో? యడరుకొనన్!
      మధుసూదనా! మధుర భా  -  వ దయాదుల మంచినిచ్చి; బ్రాఁతిలగ! హరీ! 68.
        భావము:-
        ఓ శ్రీ హరీ! మంచి ఉపాయముతో నా హృదయములో వృద్ధి యగు నట్లుగా  దయ కలవాడివై 
        కోరి యుండెదవా? ఓ మధుసూదనుఁడా!  మధురమైన భావన; దయా మొదలగునవి 
        మన్నిక గొల్పుచు  అధిక మగునట్లుగా నాలో ఉండెను.

గీ:- హృదయ మందు దయాస్థితి నిచ్ఛ నుండె!  -  పదిలమై సుధ లొల్కగ పల్కఁ జేసి;
      మధుర భావ దయాదుల మంచినిచ్చి;  -  వెదకు తీవగ  చేరితె? వేణు గోప! 68.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! నా హృదయములో దయ కలవాడివై కోరి యుండెదవు. భద్రమైనవి 
        అమృత మొల్కునటుల పలుకునట్లు చేసెదవు! మధురమైన భావన; దయా మొదలగునవి 
        అధిక మగునట్లుగా మన్నికఁ గొల్పుచు నాలో ఉండెను. నేను వెదక బోయిన తీగ వలె 
        వాటి రూపములో నీవు దయతో నన్ను చేరితివా!

చ:- రహిఁ దయచూపరా!  సుగుణ రాశి! యొసంగర  సూక్ష్మ బుద్ధి  శ్రీ
      సహచరుడా! కృపన్ నిగమ సార! యొనర్చర! నిశ్చితమ్మురా!
      ఇహ భయమేదుచున్నఘము లెన్ని;  యడంచర; యాశ తీర్చి నీ                
      వె; హరి హరీ! మహా వినుత వేద్యముఁ దెల్పర! వేణు గోపకా! 69.
        భావము:-
        సుగుణ రాశి వైన ఓ వేణు గోపకుఁడా! ఇష్టముతో నాపై దయ చూపుము. 
        ఓ లక్ష్మీ సహచరుఁడా! నాకు సూక్ష్మ బుద్ధిని ప్రసాదింపుము. ఓ నిగమసారా! 
        కృపతో నేను కోరినది చేయుము.ఇది నా నిశ్చితాభిప్రాయము సుమా! 
        ఇక్కడ నా భయమును పోఁగొట్టుచూ పాపము గుర్తించి; అణచి వేయుము. 
        ఇంద్రునిచే మిక్కిలి పొగడఁ బడెడి ఓ శ్రీ హరీ! నీవే నా ఆశ తీర్చి; తెలియ దగినదేదో 
        దానిని (భగవత్తత్వమును)  తెలియఁ జేయుము.
   
క:- దయచూపరా! సుగుణ రా  -  శి! యొసంగర సూక్ష్మ బుద్ధి శ్రీసహచరుడా!
      భయమేదుచున్నఘము లె  -  న్ని; యడంచర; యాశ తీర్చి; నీవె; హరి హరీ! 69.
        భావము:-
        ఓ లక్ష్మీ సహచరుఁడా!   సుగుణ రాశీ! నాపై దయ చూపుము. నాకు సూక్ష్మ బుద్ధిని 
        ప్రసాదింపుము. నీవే నా ఆశ తీర్చి;  నా భయమును పోఁగొట్టుచూ నాలోని 
        పాపము గుర్తించి; అణచి వేయుము.

గీ:- సుగుణ రాశి! యొసంగర సూక్ష్మ బుద్ధి! -  నిగమ సార! యొనర్చర నిశ్చితమ్ము!
      అఘము లెన్ని;యడంచర; యాశ తీర్చి! -వినుత వేద్యముఁ దెల్పర! వేణుగోప! 69.
        భావము:-
        సుగుణ రాశి వైన ఓ వేణూ గోపకుఁడా! నాకు సూక్ష్మ బుద్ధిని ప్రసాదింపుము. ఓ నిగమసారా! 
        నా నిశ్చితాభిప్రాయమును నెరవేర్చుము. నా ఆశ తీర్చి; నాలోని పాపములను గుర్తించి 
        అణచివేయుము. మిక్కిలి పొగడఁ బడెడి తెలియఁ దగినదేదో దానిని (భగవత్తత్వమును) 
        తెలియఁ జేయుము.

చ:- మది సుమనోహరా! నిను సమస్తము నామది నిల్పి యుంచ; సౌ
      ఖ్య దము గదా! మహా ఘనతఁ గాంచగఁ జేయగ; గౌరవించ; సౌ
      మ్యద! సమ వర్తి! నీ అభయ హస్తము నీయర ఆది దేవ! సా
      కెదవ హరీ కృపన్? విజయ కృత్యము నేర్పెడి వేణు గోపకా! 70.
        భావము:-
        నా మదికి మిక్కిలి మనోహరమైనవాఁడా! విజయములకు మూలమైన పనులను 
        మాకు నేర్పెడి ఓ వేణుగోపకుఁడా! నిన్ను మొత్తము నా మనస్సులో 
        నిలిపి ఉంచినట్లైతే సౌఖ్యమును ఇచ్చునది యగును కదా! సౌమ్య స్వభావదుడవైన 
        ఓ శ్రీ హరీ! ఓ సమవర్తీ! ఓ ఆది దేవా! గొప్ప ఘనతను చూడఁ జేయుటకు;
        గౌరవించుటకు; నీ అభయ హస్తమును నా కందిమ్ము.  నీ కృపతో నన్ను 
        నడిపింతువు కదా?

క:- సుమనోహరా! నిను సమ  -  స్తము నామది నిల్పి యుంచ; సౌఖ్య దము గదా!
      సమ వర్తి! నీ అభయ హ  -  స్తము నీయర ఆది దేవ! సాకెదవ హరీ? 70.
        భావము:-
        మిక్కిలి మనోహరమైనవాఁడా! నిన్ను మొత్తము నా మనస్సులో నిలిపి ఉంచినట్లైతే
        సౌఖ్యమును ఇచ్చునది యగును కదా!  ఓ సమవర్తీ! ఓ ఆది దేవా!
        నీ అభయ హస్తమును నా కందిమ్ము! నీ కృపతో నన్ను నడిపింతువు కదా?

గీ:- నిను సమస్తము నామది నిల్పి యుంచ; -  ఘనతఁ గాంచగఁ జేయగ గౌరవించ;
      అభయ హస్తము నీయర ఆది దేవ! -  విజయ కృత్యము నేర్పెడి వేణు గోప! 70.
        భావము:-
        విజయములకు మూలమైన పనులను మాకు నేర్పెడి ఓ వేణు గోపకుఁడా! ఓ ఆది దేవా!
        నిన్ను మొత్తము నా మనస్సులో నిలిపి ఉంచుట కొఱకు; ఘనతను చూడఁ జేయుటకు;
        గౌరవించుటకు; నీ అభయ హస్తమును నా కందిమ్ము.
         ( స శేషం )
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.