గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2011, మంగళవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 13 / 21 వ భాగము

చ:- నట విట లంపటుల్; కలిగినారట దుష్టులు కల్మిఁ జేసి? రా
       వట భయముల్. కృపన్ దురిత భావనఁ బాపుమ దుష్టులందు; నే
       నిట నటనల్ గనన్; నిలుపుమీవటు గూర్పుమ నేర్పు మీర ప్రా
       కటము హరీ! సదా వెలయఁ గావుమ జ్ఞానుల వేణు గోపకా! 61
         భావము:-
         ఓ వేణు గోపకుఁడా! ఓ శ్రీ హరీ! యదార్థమును దాచి అబద్ధమును 
         నటించు వారు; విటులు; దురాశాపరులు; వారికి ప్రాప్తించిన ధనము 
         కారణముగా దుష్ట స్వభావము కల వారలున్నారట. పాపాదులచే
         కలుగు భయములు వారి వద్దకు ప్రవేశింపవట. అటువంటి దుష్టులందు కల 
         దురిత భావనను  కృపతో నశింపఁ జేయుము. నేను ఇక్కడ వారు చూపెడి 
         నటనలను కన జాలను. నీవు నే నైపుణ్యము  అతిశయించగావారి లోని 
         దుష్ప్రవృత్తిని నిలిపివేయుము. ఆవైపునుండి ప్రశస్తిని వారికి కలుగునట్లు  చేయుము. 
         ఎల్లప్పుడూ జ్ఞానులను వెలయు విధముగ కాపాడుము.

క:- విట లంపటుల్; కలిగినా  -  రట దుష్టులు కల్మిఁ జేసి; రావట భయముల్
      నటనల్ గనన్; నిలుపుమీ  -  వటు గూర్పుమ నేర్పు మీర ప్రాకటము హరీ! 61.
        భావము:-
        ఓ శ్రీ హరీ! విటులు;  దురాశాపరులు; వారికి ప్రాప్తించిన ధనము కారణముగా దుష్ట స్వభావము
        కలవారలున్నారట. పాపాదులచే  కలుగు భయములు అసలు వారి వద్దకు ప్రవేశింపవట. 
        నేను చూచెడి విధముగ నీవు వారిలోని నటనలను నిలుపుదల చేయుము. అటునుండి వారికి  
        ప్రాశస్త్యమును నీ నైపుణ్యముతో కలిగించుము.

గీ:- కలిగినారట దుష్టులు కల్మిఁ జేసి? -  దురిత భావనఁ బాపుమ దుష్టులందు;
      నిలుపుమీవటు గూర్పుమ నేర్పు; మీర  -  వెలయఁ గావుమ; జ్ఞానుల వేణు గోప! 61
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! వారికి ప్రాప్తించిన అధికమైన ధనము కారణముగా దుష్ట స్వభావము కల
        వారలున్నారట. అటువంటి దుష్టులందు కల దురిత భావనను నశింపఁ జేయుము.  
        మరొక వైపు నుండి  ప్రశస్తిని వారికి కలుగునట్లు  చేయుము.  జ్ఞానులను వెలయు విధముగ 
        కాపాడుము.

చ:- అట ఒక పట్టున న్నిచట నౌ నొక పట్టున; నెన్ని చూతు నో
      నటన హరీ్ నినున్. చెపుమ నాకు వసింతువు చెన్ను నేడ? నే
      నిట నికటంబునం కనుల నెన్ని కనుంగొన కాచి యుంటి నే!
      పటలి హరీ! కృపన్ వినుమ పట్టుగ నామొర. వేణు గోపకా! 62.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! సృష్టి నాటకమాడెడి ఓ శ్రీ హరీ!  నిన్ను నేను అక్కడొక ప్రదేశమునను; 
        ఇక్కడ  ఒక ప్రదేశమునను  వెదకి కనుగొందును. నిక్కము. నిజముగా నీవు ఇష్టముతో 
        ఎక్కడుందువో నాకు చెప్పుము. నే నిక్కడ చాల సమీపమునుండియే నిన్నే ఎన్నికతో 
        కనులారా చూచుటకు కాచుకొని యుంటిని కదా! సమూహమునందు కానవచ్చెడి 
        ఓ శ్రీ హరీ! దయతో పట్టుదలతో నా మొరను ఆలకింపుము.

క:- ఒక పట్టున న్నిచట నౌ -  నొక  పట్టున నెన్ని చూతు నో నటన హరీ!
      నికటంబునం కనుల నె  -  న్ని కనుంగొన కాచి యుంటి నే! పటలి హరీ! 62.
        భావము:-
        సృష్టి నాటకమాడెడి ఓ శ్రీ హరీ! సమూహమునందు కానవచ్చెడి ఓ శ్రీ హరీ!  నిన్ను నేను 
        అక్కడ  ఒక ప్రదేశమునను; ఇక్కడ  ఒక ప్రదేశమునను  వెదకి చూతును. నిక్కము.  
        నే నిక్కడ చాల సమీపమునుండియే నిన్నే ఎన్నికతో కనులారా చూచుటకు 
        కాచుకొని యుంటిని కదా!

గీ:- ఇచట నౌ నొక  పట్టున నెన్ని చూతు. -  చెపుమ నాకు. వసింతువు చెన్ను నేడ?
      కనులనెన్ని కనుంగొన కాచి యుంటి!-వినుమ పట్టుగ నామొర.వేణుగోపకా!  62.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! నిన్ను నేను ఇక్కడ  ఒక  ప్రదేశమున  ఎన్నికతో చూతును. నిక్కము.  
        నిజముగా నీవు ఇష్టముతో ఎక్కడుందువో నాకు చెప్పుము. నిన్నే ఎన్నికతో కనులారా 
        చూచుటకు కాచుకొని యుంటిని కదా! దయతో పట్టుదలతో నా మొరను ఆలకింపుము.

చ:- గుణ గణనంబుచే కలిమి కోరిన తీరున గాంచ లేను. ప్రే
      మను మెలగన్; సదా మదిని మన్నికఁ నిన్ గన మాన్యు నౌదుగా!
      గుణ వినయంబులన్; కలిమిఁ గూర్చిన నీ కృప గాంచ నౌనె? శ్రీ
      వినుత హరీ! సదా విజయ వృద్ధిని గొల్పుమ! వేణు గోపకా! 63.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! సద్గుణములను గణించుచు; ప్రేమతో మెలుగుతూ ఉన్నంత మాత్రమున  
        కోరిన విధముగ  కలిమిని చూడ లేరు. ఎల్లప్పుడూ మన్నికగా నిన్ను మనస్సున కలిగి 
        చూచినచో గౌరవప్రదమైనవారగుదురు కదా! మాకు మంచి గుణమును; మంచి వినయమును; 
        గొప్ప కలిమిని సమకూర్చిన నీ యొక్క కృప మేము చూడగలమా? లక్ష్మీ దేవి చేత 
        పొగడఁ బడెడి ఓ శ్రీ హరీ! ఎల్లప్పుడు విజయము యొక్క వృద్ధిని కలిగించుము.

క:- గణనంబుచే కలిమి కో  -  రిన తీరున గాంచ లేను. ప్రేమను మెలగన్;
      వినయంబులన్; కలిమిఁ గూ - ర్చిన నీ కృప గాంచ నౌనె? శ్రీ వినుత హరీ! 63.
        భావము:-
        లక్ష్మీ దేవి చేత పొగడఁ బడెడి ఓ శ్రీ హరీ! వినయాది గుణములను  లెక్ఖపెడుతూ; ప్రేమతో 
        మెలుగుచూ  ఉన్నంత మాత్రమున  కోరిన విధముగ కలిమిని చూడ లేరు.  గొప్ప కలిమిని 
        సమకూర్చిన నీ యొక్క కృపను మేము చూడఁ గలమా?

గీ:- కలిమి కోరిన తీరున గాంచ లేరు. -  మదిని మన్నికఁ నిన్ గన మాన్యు నౌదు!
      కలిమిఁ గూర్చిన నీ కృప గాంచ నౌనె? -  విజయ వృద్ధిని గొల్పుమ! వేణు గోప! 63.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! మానవులు కోరిన విధముగ కలిమిని పొంద లేరు. ఎల్లప్పుడూ మన్నికగా 
        నిన్ను మనస్సున కలిగి చూచినచో గౌరవప్రదమైనవారగుదురు ! మాకు గొప్ప కలిమిని 
        సమకూర్చిన నీ యొక్క కృప మేము చూడగలమా? మాకు విజయము యొక్క 
        వృద్ధిని కలిగించుము.

చ:- మృదు మదిరేక్షణల్ మదుల మిమ్ము దలంచుట మాయ గాదె? మో
       క్ష దుఁడ! కనన్. వినన్ విపుల జ్ఞానమయం బని విజ్ఞులంద్రు గా!
       యెద సదసద్‍జ్ఞతల్‍ కనెడి యెల్ల దయామయ జ్ఞానులందు డా
       గెదవు హరీ! కృపన్ విజయ కృష్ణులఁ గాచిన వేణు గోపకా! 64.
         భావము:-
         దయతో అర్జున ద్రౌపదులను ( విజయ;  కృష్ణ అనే పేళ్ళతో ఉన్నవారిని ) కాపాడిన
         ఓ వేణు గోపకుఁడా!  ఓ శ్రీ హరీ! ఓ మోక్ష ప్రదుఁడా! మృదు స్వభావులైన స్త్రీలు 
         వారి మనస్సులలో మిమ్ములనే తలచుకొను చుండుట నిజముగా మాయయే కదా! 
         ఇది చూచిననూ; దీనిని గూర్చి విన్నను ఇది గొప్ప జ్ఞానముతో కూడిన విషయమని 
         విజ్ఞులైనవారందురు కదా! తమ హృదయములందు మంచిని; చెడును చూచెడి 
         దయామయులైన సమస్త జ్ఞానులయందును దాగి యుందువు.

క:- మదిరేక్షణల్ మదుల మి  -  మ్ము దలంచుట మాయ గాదె? మోక్షదుఁడ! కనన్.
      సదసద్‍జ్ఞతల్‍ కనెడి యె  -  ల్ల దయామయ జ్ఞానులందు డాగెదవు హరీ! 64.
        భావము:-
        ఓ శ్రీ హరీ! ఓ మోక్ష ప్రదుఁడా! ఆలోచించి చూడగా మృదు స్వభావులైన స్త్రీలు 
        వారి మనస్సులలో మిమ్ములనే తలచుకొను చుండుట నిజముగా మాయయే కదా! 
        తమ హృదయములందు మంచిని; చెడును చూచెడి దయామయులైన 
        సమస్త జ్ఞానులయందును దాగి యుందువు.

గీ:- మదుల మిమ్ము దలంచుట మాయ గాదె? -  విపుల జ్ఞానమయం బని విజ్ఞులంద్రు !
      కనెడి యెల్ల దయామయ జ్ఞానులందు -   విజయ కృష్ణులఁ గాచిన వేణు గోప! 64.
        భావము:-
        దయామయులై చూచెడి  సమస్త  జ్ఞానులయందును విజయ ధ్యేయమును; వారి లోని 
        కృష్ణ పరమాత్మను కాపాడిన ఓ వేణు గోపకుఁడా! మనస్సులలో మిమ్ములనే 
        తలచుకొను చుండుట నిజముగా మాయయే కదా! ఇది గొప్ప జ్ఞానముతో కూడిన 
        విషయమని విజ్ఞులైనవారందురు కదా!

ఉ:- నీ యభిమానమున్ సుగుణ! నీ శుభ దర్శన శోభ నొంది; శో
       భా యశులై; మదిన్ వినుచు పాపముఁ బాసెడి వృద్ధు లెల్లరున్
       నీ యభయంబునే మనుట నీ ప్రభ! నిత్యుఁడ! మమ్ము చూడరా!
       జ్ఞేయ హరీ! కృపన్ వెలయఁ జేయను; నిల్చిన వేణు గోపకా! 65.
         భావము:-
         కృపతో మమ్ములను నిత్యమూ వెలయఁజేయుట కొఱకు మా హృదయములందు 
         నిలిచి యున్న; నిత్యుఁడవై యున్న ఓ వేణు గోపకుఁడా! ఓ సుగుణ స్వరూపుఁడా! 
         మాచే తెలియఁ బడే ఓ శ్రీ హరీ! నీ అభిమానమును మనస్పూర్తిగ వినుచు; 
         నీ శుభ దర్శనము చేత శోభను పొంది; శోభయే యశముగా  కలవారైన పాపమును 
         విడిచిన పెద్దలెల్లరు నీ అభయము చేతనే కదా మనుట జరుగు చున్నది. ఇది
         నీ యొక్క ప్రభయే కాని వేరు కాదు కదా!

క:- యభిమానమున్ సుగుణ! నీ -  శుభ దర్శన శోభ నొంది; శోభా యశులై
      యభయంబునే మనుట నీ -  ప్రభ! నిత్యుఁడ! మమ్ముచూడరా! జ్ఞేయ హరీ! 65.
        భావము:-
        ఓ సుగుణ స్వరూపుడా! ఓ నిత్యమైయుండెడివాఁడా! మాచే తెలియఁ బడే ఓ శ్రీ హరీ! 
        భక్తులు నీ అభిమానము చేతను; నీ శుభ దర్శనము చేతను; శోభను పొంది; శోభయే 
        కీర్తిగా కలవారై; నిర్ భయముగా మనుట జరుగు చున్నది. ఇది నీయొక్క ప్రభయే కాని 
        వేరు కాదు కదా!  మమ్ములను కూడా దయతో చూడుము.

గీ:- సుగుణ! నీ శుభ దర్శన శోభ నొంది; -  వినుచు పాపముఁ బాసెడి వృద్ధులెల్ల
      మనుట నీ ప్రభ!నిత్యుఁడ!మమ్ము చూడ!-వెలయఁజేయను నిల్చిన వేణుగోపకా! 65.
        భావము:-
        ఓ సుగుణ స్వరూపుడా! మమ్ములను చూచుట కొఱకు; వెలయఁ జేయుట కొఱకును; 
        మా హృదయములందు నిలిచి యున్న; నిత్యుఁడవైయున్న; ఓ వేణు గోపకుఁడా!  
        నీ శుభ దర్శనము చేత శోభను పొంది; మనస్పూర్తిగా నిన్నుఁ గూర్చి వినుచు; 
        పాపమును విడిచిన పెద్దలెల్లరు   మనుట జరుగు చున్నది. ఇది నీ యొక్క ప్రభయే కదా! 
          ( స శేషం )
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.