గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఆగస్టు 2011, శనివారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 17 / 21 వ భాగము

ఉ:- ఈ యుగ ధర్మమీ కలుష సృష్టిగ దైవమ! గాంచ లేము శ్రీ
       శా! యశమా! యిటుల్ తమరు సల్పుట? ధర్మము తప్పుటే గదా?
       ఏ యుగ ధర్మమున్ తలప నీశుఁ గనంబడు తత్వమేది? స్తో
       త్రీయ హరీ!  మదిన్ విషయ తృప్తి యదేలర? వేణు గోపకా!  81.
         భావము:-
         ఓ వేణు గోపుఁడా! ఓ లక్ష్మీ పతీ! ఈ యుగధర్మము ఈ కలుషమైన సృష్టే ఐతే
         అది మేము చూడలేము కదా! ఈ విధముగ తమరు సృష్టి చేయుట మీకు
         కీర్తిప్రదమా యేమి? ఈ విధముగ మీరు చేయుట ధర్మమును తప్పుటే కదా!
         ఏ యుగ ధర్మాన్ని గమనించినా సరే పరమేశ్వర స్వరూపమును చూపెడి
         తత్వ మెక్కడుంది? స్తోత్రము చేయఁబడెడి ఓ శ్రీ హరీ! మనస్సు నందు
         విషయ వాంఛల మీద తృప్తి యన్నదసలెందులకయ్యా!

క:- యుగ ధర్మమీ కలుష సృ  -  ష్టిగ దైవమ గాంచలేము శ్రీశా! యశమా!
      యుగ ధర్మమున్ తలప నీ  -  శుఁ గనంబడు తత్వమేది? స్తోత్రీయ హరీ!  81.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! ఓ లక్ష్మీ పతీ! ఈ యుగధర్మము ఈ కలుషమైన సృష్టే ఐతే
        అది మేము చూడలేము కదా! ఈ విధముగ తమరు సృష్టి చేయుట మీకు
        కీర్తిప్రదమా యేమి? ఈ విధముగ మీరు చేయుట ధర్మమును తప్పుటే కదా!
        ఏ యుగ ధర్మాన్ని గమనించినా సరే పరమేశ్వర స్వరూపమును చూపెడి
        తత్వ మెక్కడుంది? స్తోత్రము చేయఁబడెడి ఓ శ్రీ హరీ! మనస్సు నందు
        విషయ వాంఛల మీద తృప్తి యన్నదసలెందులకయ్యా!

గీ:- కలుష సృష్టిగ దైవమ! గాంచలేము -  తమరు సల్పుట? ధర్మము తప్పుటేగ?
      తలప నీశుఁ గనంబడు తత్వమేది? -  విషయ తృప్తి యదేలర? వేణు గోప!  81.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! తమరు కలుషమైన కల్పనగా  సృష్టి చేయుట ధర్మమును
        తప్పుటే కదా! ఓ పరమాత్మా! మేము చూడలేము! గమనించగా పరమేశ్వర
        స్వరూపమును చూపెడి తత్వ మెక్కడుంది? మనస్సు నందు విషయ వాంఛల మీద
        తృప్తి యనునది అసలెందులకయ్యా?

చ:- నుత సుగుణాలయా! అట నినుం దగ పూజల హాయి గొల్పు దై
      వత క్రతువుల్ సుధా మధుర వాక్యసమృద్ధిని మాన్యు లెన్ని; య
      ద్భుత! ప్రగణింపగా యతనముం దగఁ జేతురు ధ్యాస నిల్పి; ద
      క్షతను హరీ! కృపన్ వెలయ గానవి చూడుమ! వేణు గోపకా!  82.
        భావము:-
        పొగడఁబడెడి మంచి గుణముల సమూహమైనవాఁడా! అద్భుతమైనవాఁడా! ఓ శ్రీహరీ!
        ఓ వేణుగోపకుఁడా! అక్కడ మాన్యులు గణించి నీకు తగిన పూజలతో హాయి గొల్పవలెనను
        భావనతో అమృతోపమానమైన వేద వాక్య సమృద్ధితో తమ ధ్యాసను నిలిపి గొప్పగా
        గుర్తించు విధముగా తగిన విధముగా ప్రయత్నమును చేయును. కృపతో దక్షుఁడవై
        అవి వెలయు విధముగ చూడుము.

క:- సుగుణాలమా! అట నినుం -  దగ పూజల హాయి గొల్పు దైవత క్రతువుల్
      ప్రగణింపగా యతనముం -  దగఁ జేతురు  ధ్యాస నిల్పి; దక్షతను హరీ!  82.
        భావము:-
        పొగడఁబడెడి మంచి గుణముల సమూహమైనవాఁడా! అద్భుతమైనవాఁడా! ఓ శ్రీహరీ!
        ఓ వేణుగోపకుఁడా! అక్కడ మాన్యులందరూ నీకు తగిన పూజలతో హాయి
        గొల్పవలెనను భావనతో అమృతోపమానమైన వేద వాక్య సమృద్ధితో తమ ధ్యాసను నిలిపి
        గొప్పగా గుర్తించు విధముగా తగిన విధముగా ప్రయత్నమును చేయుదురు.
        కృపతో దక్షుఁడవై అవి వెలయు విధముగ చూడుము.

గీ:- అట నినుం దగ పూజల హాయి గొల్పు -  మధుర వాక్యసమృద్ధిని మాన్యు లెల్ల
      యతనముం దగఁజేతురు  ధ్యాస నిల్పి; -వెలయ గానవి చూడుమ! వేణుగోప! 82.
        భావము:-
        ఓ వేణుగోపకుఁడా! అక్కడ మాన్యులందరూ నీకు తగిన పూజలతో హాయి గొల్పవలెను
        అనెడి భావనతో అమృతోపమానమైన వేద వాక్య సమృద్ధితో తమ ధ్యాసను నిలిపి
        ప్రయత్నమును చేయుదురు . అవి వెలయు విధముగ చూడుము.

చ:- పలు జతనంబులన్  నిలిచె పండిత మండలి నిండుగాను టీ
      కలఁ దెలుపెన్ గదా కనుల కామిత మేర్పడ గాంచఁజేయ. లీ
      లలు సుతి మెత్తగా  కవిత లక్ష్యతఁ జెప్పెడు; గాంచి నిన్ను క
      న్నులను హరీ! మహా వినుత నూత్న పథంబిది! వేణు గోపకా! 83.
        భావము:-
        ఓ వేణుగోపకుఁడా! లక్ష్యతతో కవితలు సుతి మెత్తగా చెప్పెడి లీలల యందు, నిన్నే
        తమ జ్ఞాన నేత్రములతో చూచి; అనేక ప్రయత్నములతో నిన్ను కన్నుల కోరిక
        తీరునట్టి విధముగా తెలియఁ జేయుట కొఱకు పండిత మండలి నిలిచెను.
        పరిపూర్ణముగా టీకా తాత్పర్యములలో నిన్ను తెలిపెను కదా! ఓ శ్రీ హరీ!
        ఇది అత్యద్భుతముగ ప్రశంసింపఁ బడెడి సరిక్రొత్త మార్గము.

క:- జతనంబులన్  నిలిచె పం  -  డిత మండలి నిండుగాను టీకలఁ దెలుపెన్
      సుతి మెత్తగా  కవిత ల  -  క్ష్యతఁ జెప్పెడు; గాంచి నిన్ను కన్నులను హరీ! 83.
        భావము:-
        ఓ శ్రీహరీ! పండిత మండలి నిన్ను కన్నులారా గాంచి;  లక్ష్యతతోచెప్పునటువంటి
        ప్రయత్నముతో నిలిచెను. సుతిమెత్తగా పరిపూర్ణముగా టీకల యందు తెలిపెను.

గీ:- నిలిచె పండిత మండలి నిండుగాను -  కనుల కామిత మేర్పడ గాంచఁజేయ.
      కవిత లక్ష్యతఁ జెప్పెడు; గాంచి నిన్ను -  వినుత నూత్న పథంబిది! వేణు గోప! 83.
        భావము:-
        ఓ వేణుగోపుఁడా!  నిన్ను చూచి కనుల కోరిక స్పష్టపడునట్లుగా నిన్ను చేడఁ జేయుట కొఱకు
        పండిత మండలి నిండుగా నిలిచెను. లక్ష్యతతో కవిత చెప్పుచుండెను.
        ఇది ప్రశంసనీయమైన క్రొత్తమార్గము.

చ:- శుభ ఫల మందగా కొలుతు; శోభిలఁ జేయఁగ కోరుచుందు. ప్రీ
       తి భజనలన్ నినున్ పిలుతు దీనుల గావగ ప్రేమఁ జూపి. స
       త్శుభ తలపున్ గొనన్ వలతు చూడ; లసత్శుభ వర్ణనీయ! ల
       క్ష్య భవ హరీ! కృపన్ వెలసి కాంక్షను తీర్చర వేణు గోపకా!  84.
         భావము:-
         ఓ వేణుగోపకుఁడా! లక్ష్యముతో ప్రభవించిన ఓ శ్రీ హరీ! నేను శుభ ఫలితముల
         నందుటకు గాను నిన్ను నేను కొలుతును. నన్ను శోభిలేటట్టు చేయుమని
         కోరుచుందును. ప్రేమ చూపుతూ దీనులను నీవు కాపాడు కొఱకు నేను భజించుచు
         నిన్ను పిలుతును. ఓ ప్రకాశవంతమైన  మంగళప్రదమైన వర్ణింపఁ  దగిన ఆకారము
         గలవాఁడా! మంచి మంగళప్రదమైన భావనలు పొందఁగోరి నిన్ను చూచుటకై
         యిష్ట పడుదును.  కృపతో నాముందు నీవు వెలిసి; నా కోరిక తీర్చుము.

క:- ఫల మందగా కొలుతు; శో  -  భిలఁ జేయఁగ కోరుచుందు. ప్రీతి భజనలన్
      తలపున్ గొనన్ వలతు చూ  -  డ లసత్శుభ వర్ణనీయ! లక్ష్య భవ హరీ!  84.
        భావము:-
        లక్ష్యము కలిగి ప్రభవించిన ఓ  ఓ శ్రీహరీ! నేను శుభ ఫలితములనందుటకు గాను నిన్ను
        నేను కొలుతును. నన్ను శోభిలేటట్టు చేయమని నేను భజించుచు నిన్ను కోరుచుందును.
        ఓ ప్రకాశవంతమైన మంగళప్రదమైన వర్ణింపఁ దగిన ఆకారము  గలవాఁడా! నిన్ను
        చూడ వలెననెడి ఆశను పొందవలెనని ఇష్టపడుదును.

గీ:- కొలుతు; శోభిలఁ జేయఁగ కోరుచుందు. -  పిలుతు దీనుల గావగ ప్రేమఁ జూపి.
      వలతు చూడ లసత్శుభ వర్ణనీయ! -  వెలసి కాంక్షను తీర్చర వేణు గోప! 84.
        భావము:-
        ఓ వేణుగోపుఁడా! నిన్ను నేను కొలుతును. నన్ను శోభిలేటట్టు చేయమని కోరుచుందును.
        ప్రేమ చూపుతూ దీనులను నీవు కాపాడుట కొఱకు నేను భజించుచు నిన్ను పిలుతును.
        ఓ ప్రకాశవంతమైన  మంగళప్రదమైన వర్ణింపఁ  దగిన ఆకారము గలవాడా! నిన్ను
        చూడ వలెనని కోరుకొందును.  కృపతో నాముందు నీవు వెలిసి; నా కోరిక తీర్చుము.

చ:- సమ తుల లేని; యీ  సతియు; సంతులు; బంధులు; చక్కఁ బల్క; నొ
       చ్చి; మనమునన్ గనన్  నిజము చెప్పగ నిద్దని నే తలంతు. భా
       గ్యమ? చలియించితిన్. నిజము. కాంతుల నిన్ గన నేర్పవయ్య! దు
       ర్గముఁడ! హరీ! మహా వినుత! గౌరవ రక్షక! వేణు గోపకా!  85.
         భావము:-
         ఓ వేణుగోపకుఁడా! ఈ భార్య; సంతతి; బంధువులు  చూచినట్లైతే ఈ బాహ్య ప్రపంచము
         ఈ బంధనములు చెప్పాలంటే నిజమే సుమా అని చక్కగా పలుకు చూండగా
         మనసులో  మిక్కిలి బాధ పడి సమతుల్యత లేని మాటలుగా నేను తలంతును.
         మిక్కిలి చలించిపోతిని. ఇది యదార్థము సుమా! గొప్పగా పొగడఁ బడెడి వాఁడా!
         మా గౌరవ రక్షకుఁడా! అధిగమింప మాకలవి కానివాఁడా! ఓ శ్రీ హరీ! సత్య జ్యోతులలో గల
         నిన్ను నేను చూచే విధముగా నాకు నేర్పుము.

క:- తుల లేని యీ  సతియు సం  -  తులు బంధులు చక్కఁ బల్క నొచ్చి; మనమునన్
      చలియించితిన్ నిజము. కాం  -  తుల నిన్ గన నేర్పవయ్య! దుర్గముఁడ! హరీ! 85.
         భావము:-
         ఓ శ్రీహరీ! తుల్యత లేని ఈ భార్య; సంతానము; బంధువులు పలికెడి ప్రీతితో కూడిన
         మాటలకు  బాధనొంది; మనస్సున చలించిపోతిని. ఇది యదార్థము.
         దివ్య జ్యోతిర్మార్గములలో గల నిన్ను చూచుటను నాకు నేర్పుము.

గీ:- సతియు సంతులు బంధులు చక్కఁ బల్క -  నిజము చెప్పగ నిద్దని నే తలంతు.
      నిజము కాంతుల నిన్ గన నేర్పవయ్య! -  వినుత! గౌరవ రక్షక! వేణు గోప!  85.
        భావము:-
        ఓ వేణుగోపుఁడా!  గొప్పగా పొగడఁ బడెడి వాఁడా! మా గౌరవ రక్షకుఁడా! నా సతియు;
        సంతానము; బంధువులు తీయగా మాటాడుతూ ఉంటే చెప్పాలంటే ఇది నిజమే సుమా అని
        నేను తలంతును.ఇది యదార్థము.  దివ్య జ్యోతిర్మార్గములలోఁ గల నిన్ను చూచుటను
        నాకు నేర్పుము. 
           ( స శేషం )
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.