గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ12)

సహృదయ సాహితీ ప్రియ బంధువులారా!
శ్రీ చంద్రశేఖరావధానిగారొక అవధానంలో పూరణకై స్వీకరించిన ఒక సమస్యను చూడండి.
"సూర్యుఁడు, చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్"
ఈ సమస్యకు మీపూరణల ద్వారా ఆంధ్రామృతాస్వాదనా లోలురకానందమందించండి.
అవధానిగారి యొక్క, నాయొక్క పూరణలను వ్యాఖ్యానంలో నూంచగలను.
జైశ్రీరాం.
జైహింద్.



Print this post

19 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

సూర్యుఁడు తూర్పు కొండపయి శోభను గొల్పుచు వచ్చె.నంత ధీ
వర్యులు లోక బాంధవుని వర్ధిలఁ జేయగ వేడి, తాము సత్
కార్యము లాచరించ్రి.భువిఁ గాయుచుఁ గ్రుంకెను పశ్చిమాద్రి నా
"సూర్యుఁడు! చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు అవధాని గారి పూరణము.

అర్యముఁడైన భాస్కరుఁడహర్నిశలున్ బ్రజ కాయుచుండగా
శౌర్యము తోడ తూరుపున సంతస మందుచు వచ్చు, సాంధ్యలన్
కార్యములందు మంత్రములకామయతన్ పఠియింప గ్రుంకె నా
"సూర్యుఁడు! చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్"

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

సూర్యాస్తమయం లోగా సైంధవుణ్ణి సంహరిస్తానని చెప్పిన అర్జునుడు, సూర్యాస్తమయం అవుతోందని బాధపడుతున్నట్లుగా.......

క్రౌర్యగతిన్ హరించెద హరాదిసురల్ రణమందు జొచ్చినన్
స్థైర్యము చేత సైంధవుని సైన్య సమేతముగా యటంచు నా
ధైర్యము పెక్కుటిల్ల శపథంబును జేసితి నేను, గ్రుంకె నీ
సూర్యుడు, చంద్రుడున్ బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్.

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శౌర్యము జూపి శంకరుని, శైలజ నొక్కరు జేయ బూనగా
తూర్యపు తుంటవిల్తుఁడిని దొల్లిటి గాల్చెనె మంటకన్ను నా
చర్యల గాంచ మింట కడు సంభ్రమ విభ్రమ శోక తప్తులై
సూర్యుఁడు,చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్ !

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

కార్యము దగ్గరాయె నని కాంతలు కన్నెలు వేగ వచ్చి కైం
కర్యము చేయ దేవళము కాంతులు చిమ్మగ మ్రుగ్గు పెట్టగన్
పర్య వసానమిద్ది, యట బాగగు రంగుల చుక్క మ్రుగ్గులో
"సూర్యుఁడు, చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్"

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

కార్యములన్ని మానుకొనె వికారము కల్గగ దేహమందునన్
భార్యను వెంట రమ్మనుచు పట్టణ మేగగ, నస్తమించె నా
సూర్యుడు,చంద్రుడున్ పొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్
ధైర్యము జెప్ప వైద్యుడును, దారయు,నాప్తులు సంతసించెతాన్

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

క్రౌర్యము జూపు జంతువులు రాతిరి వేళల నేమిజేయునో
ధైర్యము సన్నగిల్లినది, దారులు గానక నస్తమించనా
సూర్యుడు,చంద్రుడున్ పొడమె చుక్కలు మిక్కిలి నిక్కుచుండగన్
స్థైర్యము నివ్వుమా జనని సాగిలుచుంటిని నీదు ముంగిటన్

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

శౌర్యపరాక్రమాదులనుఁ సాగెను పార్థుడు! భీతుడయ్యెనా
సూర్యుఁడు! చంద్రుఁడుం బొడమె, చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్,
ధైర్యము తోడుగా నిలువ, ధారుణి నేలగఁ బోరుచున్న ధీ
వర్యులు ధర్మమెప్పుడును బాయరు, యుద్ధము నాపిరప్పుడే.

పార్థుని చూచి పుత్రునికై సూర్యుడు తల్లడిల్లుతున్నాడు. అంతలో సంధ్యా సమయమై ఆ వేళకు ధర్మప్రకారం యుద్ధం చేసే పెద్దలు చాలించారు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ: సవరణ

కార్యములన్ని మానెను వికారము కల్గగ దేహమందునన్
భార్యను వెంట రమ్మనుచు పట్టణ మేగగ, నస్తమించె నా
సూర్యుడు,చంద్రుడున్ పొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్
ధైర్యము జెప్ప వైద్యుడును, దారయు,నాప్తులు సంతసించెతాన్

క్రౌర్యము జూపు జంతువులు రాతిరి వేళల నేమిజేయునో
ధైర్యము సన్నగిల్లినది, దారులు గానక నస్తమించనా
సూర్యుడు,చంద్రుడున్ పొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్
స్థైర్యము నివ్వుమా జనని సాగిలుచుంటిని నీదు ముంగిటన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంపత్ కుమార్ శాస్త్రి గారూ! మీ పూరణ చాలా బాగుంది. మీకు నా భినందనలు.
ఐతే మొదటి పాదంలో యతి విషయంలో ఆలోచించవలసిన పనుంది.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురువుగారూ,

ధన్యవాదములు. ఆత్రములో యతిభంగమైనది. క్షమించవలసినది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నరసింహ మూర్తి గారూ! చాలా చక్కని వృత్తాంతాన్ని తీసుకొని మనోహరంగా పూరించారు. మీకు నా అభినందనలు.

హనుమచ్ఛాస్త్రి గారూ! మంచి ముగ్గులు పెట్టించారు కాంతల చేత. అద్భుతంగా పూరించారు. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ! మీ రెండు పూరణలూ బాగున్నాయి.
ఐతే మొదటి పూరణ మొదటి పాదంలో ఒక్క లఘువు తొందరపడి మధ్యలో చొరబడింది.
అది తప్పిస్తే ఇంకా బాగుంటుంది కదండీ!

మందాకినిగారూ! అర్థాంతర న్యాసాలంకారంతో అద్భుతంగా పూరించారీసమస్యను. మీకు నా అభినందనలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారు ధన్యవాదములు

కంది శంకరయ్య చెప్పారు...

(1)
ఆర్య! యిదేటిమాట? జగమం దెపుడైనను సంభవించెనా?
కార్యము లెవ్వియైనఁ దగు కారణముల్ పచరించు టొప్పు; చా
తుర్యముఁ జూపి చెప్ప నిజదూరము గాదె తలంప నెవ్విధిన్
సూర్యుఁడు చంద్రుఁడున్ పొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండఁగన్.
(2)
క్రౌర్యముఁ బూని రాజ్యమునకై గురుబంధులఁ జంపఁ బోవ స
త్కార్యము కాదంటం చుడిగె గాండివధారియు; కృష్ణుఁ డిచ్చె స
ద్ధైర్యము విశ్వరూపమును తాను ధరించియు, నట్టి వేళలో
సూర్యుఁడు చంద్రుఁడున్ పొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండఁగన్.

మిస్సన్న చెప్పారు...

ఆర్యుడు నాది వేల్పు ఘన హస్తిముఖుండు గణాధిపుండు తా-
భార్యలతో చతుర్థికిని భాద్ర పదమ్మున భారతాన కైం-
కర్యము లందువేళలను కాంచగ నుత్సవ వైభవమ్ములన్
సూర్యుడు, చంద్రుడున్ బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! శంకరయ్య గరూ!
మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అవి మీ రచనలు అలా ఉండడంలో ఆశ్చర్యమేముంటుంది చెప్పండి? మీ పూరణలు కవులకుత్ప్రేరణలు.
చాలా ఆనందం కలిగించాయి.
మొదటి పూరణలో పద్యంతంలో ప్రశ్నార్థకం గుర్తు ఉంచితే చూడగానే మీ భావన సుబోధకమౌతుంది.
మీకు నా ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మిస్సన్న గారూ!

కన్నుల కట్టినట్లు వర కాంతుల శ్రీ గణనాధు రాక మీ
రెన్నికతో వచించ, విని, యింతటి భాగ్యమదెన్నడొచ్చటం
చెన్నిక తోడ, సూర్య శశి శ్రీకర తారలు వచ్చినార? మి
స్సన్నవచింపనద్దియగు సత్యము.స్తుత్యము,
వాంఛనీయమున్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అందరి పూరణలు ఎంత గానో అలరిస్తున్నాయి .చదివి ఆనందించ గల అదృష్టం కలిగి నందుకు మరింత ఆనందంగా ఉంది. .

అజ్ఞాత చెప్పారు...

చౌర్యము జేయు మానసము చారుమృగాయత భీత నేత్ర మా
ధుర్యపు దర్శనంబు సఖి తూపులు వైచి విడుంగు భంగి! హా!
తూర్యము మ్రోగువేళ ; కను దోయికిఁ బండువ నేడుఁ ద్రోచెఁ గా
సూర్యుడు చంద్రుడున్ పొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.