గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఆగస్టు 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ4)


సాహితీ బంధువులారా! అవధాన శేఖర, అవధాన భారతి బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ  కట్టమురి చంద్ర శేఖర్ అవధాని  విజయనగరం నివాసి. విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు, సుప్రసిద్ధ తెలుగు ఉపన్యాసకులు. రాష్ట్ర ప్రతిభారత్న పురస్కార గ్రహిత. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత, శ్రీమాన్ సద్గురు కృష్ణ యాజిగారి నిర్వహణలో గల శ్రీ సూర్య సదన ఆస్థాన పండితులు. 

అట్టి శ్రీమాన్ కట్టమురి చంద్రశేఖర్ చేసిన అవధానములలో పూరణకై  ఇచ్చిన సమస్యలను, అవధాని ఆ సమస్యలను  పూరించిన విధమును మీ ముందుంచుటకు ఆనందంగా ఉంది.
ఈ సమస్యలను పాఠకులు తమ నిపుణత చూపుతూ పూరించి, తమ పూరణలను కూడా తోటి పాఠకులకు అందించడం ద్వారా ముదావహులగుదురని ఆశించుచున్నాను.
 ఈ రోజు ప్రకటిస్తున్న సమస్య:-
"ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె"

ఈ సమస్యను మన అవధానిగారు పూరించిన విధానం చూద్దాము.
అన్ని గణములకధిరపతి యైన నాడు
అయ్య గణపయ్య జూచి యా అంబ ముద్దు
లాడె తమకంబుతో మేనునాని తనయు
"డెంతవాఁడైన తన తల్లి కింత వాడె"
చూచారు కదా అవధాని చేసిన పూరణ.
నేను చేసిన పురాణము వ్యాఖ్యలలో చూడఁ గలరు. 
ఔత్సాసికులైన మీరు కూడా ఈ సమస్యను పూరించే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ప్రయత్నించి చూడండి. తప్పక పూరించ గలరని నా నమ్మకం. శంకరాభరణంలో అద్భుతంగా తీర్చి దిద్దబడుతోంది మీ రచనా పాటవం. అది ఎంతవరకూ మెఱుగులు దిద్దుకుందో ఈ సమస్యా పూరణద్వారా ప్రయత్నించండి. మీ పాటవాన్ని పరీక్షించుకోండి. శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

7 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

తల్లి తఱుమగ పర్విడి తనను గెలిచె,
కట్ట నెంచగ తాడునఁ గట్ట బడియె,
చిన్ని కృష్ణుని ముద్దుల చేతలివియె,
ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నేను చేసిన పూరణ.

భ్రాంతులను బాపి కృష్ణుఁడా ప్రాంత జనుల
కబ్బురంబులఁ జూపుచు ఘనతఁ బొంద
తల్లడిలె తల్లి దృష్టియే తగులునంచు.
"ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ! మీ భావనా పటిమా ఆ చిన్ని కన్నయ్యకే ముచ్చట గొలిపేలాగుంది. చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహానికీ, పూరణా నిపుణతకు, సద్యస్పందనకూ మిమ్ములనభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మన రాజేశ్వరక్కయ్య గారు చేసిన కామెంట్, మరియు సమస్యా పూరణ చూద్దాం.

చిరంజీవి తమ్ముని దీవించి ! రాయాలన్న ఆసక్తే తప్ప రాస్తే ఈ మధ్య బాగా తప్పులు వస్తున్నాయి తమ్ముడూ ! అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను.
" నోట జూపిం చె లోకాలు మాట లేక
రోట గట్టిన బెడగుచు రాటు దేలె
గట్టి వాడమ్మ నీ తనయు డెట్టి వాడొ
ఎంత వాడైన తన తల్లి కింత వాడె ! "

చాలా చక్కగా వ్ర్స్స్తూనే తన ఔన్నత్యాన్ని వ్యక్తం చేస్తూ వ్రాసిన వ్యాఖ్య కనువిప్పు కలిగిస్తోంది.
అక్కయ్యా! ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధన్య వాదములు తమ్ముడూ!

మిస్సన్న చెప్పారు...

రామచంద్రుడు వనికేగ రమణి గూడి
దుర్గమా రణ్యముల బడు దుర్గతికిని
తల్లి కౌసల్య దుఃఖించె తలచి తలచి
ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చిన్న తనమున సేవలు చేసి చేసి
పెద్ద జేయగ; పదవుల వృద్ది నొంది
ఎంతవాఁడైన, తన తల్లి కింత, వాడె
చేయ వలయును అలయక సేవ లెపుడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.