గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2011, మంగళవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 20 / 21 వ భాగము

ఉ:- మా మదిఁ భద్రమా! అనుపమాన దయా! మది నాశఁ జేరినా
      వా మహిమన్? సదా సుఖద !  పావన దేవళ శోభఁ గూర్చి దే
      వా!  ముదమార నీ వెలుఁగ; భాగ్య దశ స్థితిఁ వెల్గి తేము. హా!
      రామ హరీ! మదిన్ వెలుగు ప్రాణమె నీవుగ! వేణు గోపకా! 96.
       భావము:-
       ఓ వేణుగోపకుఁడా! సాటి లేని దయా స్వరూపుఁడా! నీ మహిమతో
       మా మదిలో ఆశతో ప్రవేశించితివా? మా హృదయము నందు
       నీకు భద్రముగానున్నదా? ఎల్లప్పుడూ సుఖమునిచ్చేవాఁడా! ఓ దేవా!
       సంతోషముతో నా శరీరమునకు పవిత్రమైన దేవాలయ  శోభను గూర్చి
       నీవు ప్రకాశించుచుండగా మహద్భాగ్య దశస్థితితో నేను కూడా ప్రకాశించితిని.
       అందమైన ఓ శ్రీహరీ! ఆశ్చర్యము. నా మదిలో వెలుగునటు వంటి ప్రాణ దీపమే
       నీవయి యుంటివి కదా!

క:- మది భద్రమా! అనుపమా  -  న దయా! మది నాశఁ జేరినావా మహిమన్?
      ముదమార నీ వెలుఁగ; భా  -  గ్య దశ స్థితిఁ వెల్గి తేము. హా! రామ హరీ! 96.
       భావము:-
       సాటి లేని దయా స్వరూపుఁడా! ఓ శ్రీహరీ! నీ మహిమతో నా మదిలో ఆశతో ప్రవేశించితివా?
       మా హృదయము నందు నీకు భద్రముగానున్నదా? అందమైన ఓ శ్రీహరీ! ఆశ్చర్యము.
       మా శరీరమున సంతోషముతో నీవు ప్రకాశించు చుండగా మహద్భాగ్య దశస్థితితో
       మేము కూడా ప్రకాశించితిమి.

గీ:- అనుపమాన దయా! మది నాశఁ జేరి  -  సుఖద! పావన దేవళ శోభఁ గూర్చి
     వెలుఁగ; భాగ్య దశ స్థితిఁ వెల్గి తేము. -  వెలుగు ప్రాణమె నీవుగ! వేణు గోప! 96.
      భావము:-
      సాటి లేని దయా స్వరూపుఁడా! సుఖమునిచ్చేవాఁడా!  ఓ వేణుగోపుఁడా!
      మా మదిలో ఆశతో ప్రవేశించి; మా నా శరీరమునకు పవిత్రమైన దేవాలయ  శోభను గూర్చి
      నీవు ప్రకాశించుచుండగా మహద్భాగ్య దశ స్థితితో మేము కూడా ప్రకాశించితిమి.
      మా మదిలో వెలుగునటు వంటి ప్రాణ దీపమే నీవయి యుంటివి కదా!

చ:- బుడుతడవేలరా కొనగ? పూజలు; చేసెడు గొప్ప వారు! చ
      క్క; లలితమౌన్ గదా! తనివి గాంచగ నీమది తత్వమెన్ని; సా
      పడ కడు చక్కనౌ యడవి పండెడి పండుల నాశఁ బెట్టెడిన్
      గొలిచి హరీ! కృపన్ వినుమ! క్రోలిన బాగుర! వేణు గోపకా! 97.  
       భావము:-
       ఓ వేణుగోపకుఁడా! ఓ శ్రీహరీ! కృపతో నా మాట వినుము.  మహాత్ములు
       పూజలు చెస్తూ ఉండగా అవి చక్కగా స్వీకరించుట చిన్న వాడివైన నీకెందులకు ?
       తృప్తిని పొందుటకై నీ యొక్క మనస్సు యొక్క తత్వమును గణించినట్లైతే
       మిక్కిలి లలితమై యొప్పియుండును కదా! నిన్ను సేవిస్తూ నీకు భుజించుట కొఱకు
       అడవిలో చక్కనైనటువంటి పండే పళ్ళనే ఆశతో పెట్టెను కదా! అవి స్వీకరించినచో
       క్షేమ మగును కదా!

క:- తడవేలరా కొనగ? పూ  -  జలు; చేసెడు గొప్ప వారు! చక్క; లలితమౌన్.
      కడు చక్కనౌ యడవి పం  -  డెడి పండుల నాశఁ బెట్టెడిన్  గొలిచి హరీ!  97.
       భావము:-
       ఓ శ్రీహరీ! మహాత్ములు పూజలు చేయు చుండెను. నీకు భుజించుట కొఱకు
       అడవిలో పండే  చక్కనైనటువంటి పళ్ళనే ఆశతో పెట్టెను కదా!   అవి చక్కగా
       స్వీకరించుటకు ఆలస్య మెందులకు?

గీ:- కొనగ పూజలు; చేసెడు గొప్ప వారు! -  తనివి గాంచగ నీమది తత్వమెన్ని
      యడవి పండెడి పండుల నాశఁ బెట్టె  -  వినుమ! క్రోలిన బాగుర! వేణు గోప! 97.
       భావము:-
       ఓ వేణుగోపుఁడా! వినుము. మహాత్ములు నీవు స్వీకరించుట కొఱకని పూజలు
       చేయు చుండును. నీ హృదయ స్వభావము గణించి యడవిలో పండెడి పండ్లనే
       నీకు ఆశతో పెట్టెను. నీవు ఆరగించినచో మంచిది సుమా!

చ:- గుడి గుడి లోన నీ  వెలుగు కోరెడి రీతిగ వెల్వరించి; కృ
      ష్ణుడి వయితే? సదా కరుణ శోభిలఁ గూర్చుమ కామితమ్ము; భృ
      త్యుఁడ! వడి నే నినున్ కనగ తోచెడు. కన్పడి కాంక్ష తీర్చు శ్రీ
      వలయు హరీ! కృపన్ వినుమ వారిజ నేత్రుఁడ! వేణు గోపకా!  98.
       భావము:-
       ఓ పద్మ నేత్రుఁడా! లక్ష్మీ దేవిని వలచెడివాఁడవైన ఓ శ్రీ హరీ!  ఓ వేణుగోపకుఁడా!
       నా మాట కృపతో వినుము. నీవే నిజముగా కృష్ణుఁడవయినట్లయితే ప్రతీ గుడిలోపలను
       మేము కోరే విధముగా కరుణతో నీ వెలుగును బహిర్గతము చేసి;  ఎల్లప్పుడూ
       మేము శోభిల్లే విధముగా మా కోరికలను తీర్చుము. నేను నీ సేవకుఁడను.
       వేగముగా నేను నిన్ను చూడ వలెనని నాకు తోచు చున్నది. నా కనుల కగుపించి
       నా కోరిక తీర్చుము.

క:- గుడి లోననీ వెలుగు కో  -  రెడి రీతిగ వెల్వరించి; కృష్ణుడి వయితే?
      వడి నే నినున్ కనగ తో  -  చెడు. కన్పడి కాంక్ష తీర్చు శ్రీవలయు హరీ! 98.
       భావము:-
       లక్ష్మీ దేవిని వలచెడివాఁడవైన ఓ శ్రీ హరీ! నీవే నిజముగా కృష్ణుఁడవయినట్లయితే
       గుడి లోపల మేము కోరే విధముగా నీ వెలుగును బహిర్గతము చేసి;   వేగముగా
       నేను నిన్ను చూడ వలెనని నాకు తోచు చున్నట్టి నా  కనుల కగుపించి నా కోరిక
       తీర్చుము.

గీ:- వెలుగు కోరెడి రీతిగ ; వెల్వరించి; -  కరుణ శోభిలఁ గూర్చుమ కామితమ్ము;
      గనగ తోచెడు.కన్పడి కాంక్ష తీర్చు -  వినుమ వారిజ నేత్రుఁడ! వేణు గోప!  98.
       భావము:-
       ఓ పద్మ నేత్రుఁడా! ఓ వేణుగోపకుఁడా! నా మాట కృపతో వినుము. మేము కోరే విధముగా
       కరుణతో నీ వెలుగును బహిర్గతము చేసి; కరుణతో ఎల్లప్పుడూ మేము శోభిల్లే విధముగా
       మా కోరికలను తీర్చుము. నేను నిన్ను చూడ వలెనని నాకు తోచు చున్నది.
       నా కనుల కగుపించి నా కోరిక తీర్చుము.

చ:- పలు పలు రీతులన్ ప్రబల భావలసద్గుణ భాగ్య మిచ్చి; భ
      క్తులఁ గనుదే! మమున్ తలచి; ఘోర కుయుక్తులఁ తప్పఁ ద్రోచి; నీ
      చుల పలు దౌష్ట్యముల్ కనుచు శోభిల దౌష్ట్యము కాల్తు వీవు. భృ
      త్యులను హరీ! కృపన్ వినగ యుక్తము నీ పని వేణు గోపకా! 99.
       భావము:-
       ఓ వేణుగోపకుఁడా! ఓ శ్రీ హరీ! సేవకులమైన మమ్ము గూర్చి తలచి; మా భావనలందు
       ప్రకాశించెడి సద్గుణ మనెడి భాగ్యమును ప్రబలునట్లుగా ప్రసాదించి; భక్తితో కూడిన
       మమ్ములను అనేకానేక విధములుగా చూచెదవే! నీచులలో ఉండెడి
       కుయుక్తులను చూస్తూ కృపతో నీవు అవి తప్పిపోవునట్లుగా నెట్టివేసి; వారు శోభిల్లే
       విధముగా వారిలోగల దౌష్ట్యమును  కాల్చివేతువు. వినినచో నీవు చేయుచున్న
       యీ పని యుక్తమైనదే సుమా!

క:- పలు రీతులన్ ప్రబల భా  -  వలసద్గుణ భాగ్య మిచ్చి; భక్తులఁ గనుదే!
      పలు దౌష్ట్యముల్ కనుచు శో  -  భిల దౌష్ట్యము కాల్తు వీవు. భృత్యులకు హరీ! 99.
       భావము:-
       ఓ శ్రీహరీ!  నీ భక్తులలో భావ లసద్గుణ భాగ్యమును పలు రీతులుగా ప్రబలునట్లుగా
       యిచ్చి చూచెదవు కదా! నీచులలో ఉండెడి కుయుక్తులను చూస్తూ; వారు శోభిల్లే విధముగా
       వారిలోగల దౌష్ట్యమును  కాల్చివేతువు.

గీ:- ప్రబల భావలసద్గుణ భాగ్య మిచ్చి! -  తలచి; ఘోర కుయుక్తులఁ తప్పఁ ద్రోచి;
      కనుచు శోభిల దౌష్ట్యము కాల్తు వీవు.  -  వినగ యుక్తము నీ పని వేణు గోప! 99.
       భావము:-
       ఓ వేణుగోపుఁడా! మా భావనలందు ప్రకాశించెడి గుణ మనెడి భాగ్యమును ప్రబలునట్లుగా
       ప్రసాదించి; నీచులలో ఉండెడి కుయుక్తులను అవి తప్పిపోవునట్లుగా నెట్టివేసి;  మమ్ములను
       గమనిస్తూ మమ్ములనుశోభిలఁ జేయుటకై మాలో గల దౌష్ట్యమును  కాల్చివేతువు.
       వినినచో నీవు చేయుచున్న యీ పని యుక్తమైనదే సుమా!

చ:- మది మది నీవెరా! విజయ మార్గ దివాకర! ప్రేమ రూపకా!
      సదయుఁడవే కదా! కవుల సాంద్ర ప్రభావన గాంచ నీవెరా!
      మది సుధలొల్క నా కవిత మార్గ దిశాదులఁ గాంచఁ జేతుగా
      సదయ హరీ! సదా విజయ సాధన నీ కృప వేణు గోపకా!  100.
      భావము:-
      ఓ వేణుగోపకుఁడా! ఓ ప్రేమస్వరూపకుఁడా! విజయ మార్గమును చూపెడి
      దివాకరుఁడా! ప్రతీ హృదయమునా నీవే కదా! దయతో కూడుకొనినవాఁడవే కదా!
      కవులు వెలయించెడి దట్టమైన ప్రకృష్టమైన భావనను చూచినచో అందు అంతా
      నీవే సుమా! ఓ శ్రీ హరీ!  నా మనస్సున భావనామృతము ప్రవహించునట్లుగా
      నా కవిత కు మార్గము దిశ మొదలగువానిని చూడఁ దయతో కూడుకొన్నవాడవై
      చేతువు కదా! ఎల్లప్పుడూ నేను విజయము కొఱకై చేయుచున్న సాధన అంతయు
      నీ కృప వలననే సుమా!

క:- మది నీవెరా! విజయ మా  -   ర్గ దివాకర! ప్రేమ రూపకా! సదయుఁడవే!
      సుధలొల్క నా కవిత మా  -  ర్గ దిశాదులఁ గాంచఁ జేతుగా! సదయ హరీ! 100.
       భావము:-
       విజయ మార్గమును చూపెడి దివాకరుఁడా! ఓ ప్రేమస్వరూపకుఁడా!   దయతో కూడుకొనిన
       ఓ శ్రీహరీ! నా హృదయము నిండా నీవే సుమా! నా కవిత మధువులు చిందు విధముగ
       విజయప్రదమైన మార్గము; దిశ మొదలగు వాటిని నాకు చూపింతువు కదా!

గీ:- విజయ మార్గ దివాకర ప్రేమ రూప!  -  కవుల సాంద్ర ప్రభావన గాంచ నీవె!
      కవిత మార్గ దిశాదులఁ గాంచఁ జేతు!  -  విజయ సాధన నీ కృప వేణు గోప!  100.
       భావము:-
       విజయ మార్గమును చూపెడి దివాకరుఁడా! ఓ ప్రేమస్వరూపకుఁడా!  ఓ వేణుగోపుఁడా!
       కవులు వెలయించెడి దట్టమైన ప్రకృష్టమైన భావనను చూచినచో అందు అంతా నీవే సుమా!
       నా కవిత మార్గమున అసలు చేర తగిన మార్గమును గూర్చియు; పయనింప వలసిన
       దిశను గూర్చియు మనో నేత్రమునకు కనిపించు విధముగా రచన చేయుదును.
       విజయము సాధించుట యనునది నీకృపపై ఆధారపడి యున్నది.
       ( సశేషం )
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.