గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2011, శుక్రవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 16 / 21 వ భాగము

చ:- చిఱు నగు మోముతో సుధలు చిందు గురూత్తము సూక్తు లెల్లనున్
       మఱి  వినినన్ మహా ఘనత; మాన్యత; తప్పక కల్గఁ జేయు నీ
       తఱి సుగుణాకరా! తమరి ధైర్య గుణాదులె తాను చెప్పునా
       ఉఱియ; హరీ! గురున్ వినగ నొప్పెద వీవట! వేణూ గోపకా! 76.
         భావము:-
         ఓ వేణు గోపకుఁడా!  దిట్టతనము కలవాఁడవైన నా శ్రీహరీ! చిఱునవ్వులు చిందించే
         ముఖముతో అమృతము చిందించే గురూత్తముని యొక్క మంచి మాటలన్నియు;
         పలు మారులు వినినచో గొప్ప ఘనత; గౌరవము తప్పక కలుగఁ జేయును కదా!
         ఇట్టి సమయములలో ఆ గురుడు నీయొక్క ధైర్య గుణాదులను గూర్చియే మాకు చెప్పును.
         ఓ సుగుణాకరా!  మేము వినినచో ఆగురుని యందు ఒప్పియుండెడి వాడవు నీవేనట కదా?

క:- నగు మోముతో సుధలు చిం  -  దు గురూత్తము సూక్తు లెల్లనున్ మఱి  వినినన్
      సుగుణాకరా! తమరి ధై  -  ర్య గుణాదులె తాను చెప్పునా ఉఱియ; హరీ! 76.
        భావము:-
        ఓ సుగుణాకరా! దిట్టతనము కలవాఁడవైన నా శ్రీహరీ! నవ్వులు చిందించే ముఖముతో
        అమృతము చిందించే గురూత్తముని యొక్క మంచి మాటలన్నియు; పలు మారులు
        వినినచో ఆ గురుడు నీయొక్క ధైర్య గుణాదులను గూర్చియే మాకు చెప్పును.

గీ:- సుధలు చిందు గురూత్తము సూక్తు లెల్ల  -  ఘనత; మాన్యత; తప్పక కల్గఁ జేయు
      తమరి ధైర్య గుణాదులె తాను చెప్పు!  -  వినగ నొప్పెద వీవట! వేణూ గోప! 76.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! అమృతము చిందించే గురూత్తముని యొక్క మంచి మాటలన్నియు;
        ఘనత; గౌరవము తప్పక కలుగఁ జేయును!  ఆ గురుడు నీయొక్క ధైర్య గుణాదులను
        గూర్చియే మాకు చెప్పును. మేము వినినచో ఆగురుని యందు ఒప్పియుండెడి వాఁడవు
        నీవేనట కదా?

ఉ:- హే కరుణాకరా! హితుఁడ! హే హరి! పావన! హే దయాబ్ధి! అ
      స్తోక శుభా వహా! సకల శోక వినాశక! సద్గుణాఢ్య! దే
      వా! కరుణించవా! సకల భాగ్య రమా ధవ! సన్నుతాంగ! జ్ఞా
      నైక హరీ! కృపన్ విజయ మేర్పడ గొల్పర! వేణుగోపకా! 77.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! ఓ కరుణకు స్థానమైనవాఁడా! ఓ క్షేమము కోరువాఁడా! ఓ శ్రీహరీ!
        ఓ పవిత్ర మూర్తీ! ఓ దయా సముద్రుఁడా! అనల్పమైన శుభములకు స్థానమైనవాఁడా!
        సమస్తమైన దుఃఖములను నశింపఁ జేయు వాఁడా!  సద్గుణ సంపన్నుఁడా! ఓ పరమాత్మా!
        జ్ఞానమే ముఖ్యముగా గల ఓ శ్రీ హరీ! సమస్త భాగ్య రమా ధవుఁడా! ఓ సన్నుతాంగుఁడా!
        నను కరుణింపవా యేమి? దయతో విజయము ప్రస్ఫుటమగునట్లు కలిగించుము.

క:- కరుణాకరా! హితుఁడ! హే  -  హరి! పావన! హే దయాబ్ధి! అస్తోక శుభా!
      కరుణించవా! సకల భా -  గ్య రమా ధవ! సన్నుతాంగ! జ్ఞానైక హరీ!  77.
        భావము:-
        ఓ కరుణకు స్థానమైనవాఁడా! ఓ క్షేమము కోరువాఁడా! ఓ శ్రీహరీ! ఓ పవిత్ర మూర్తీ!
        ఓ దయా సముద్రుఁడా!అనల్పమైన శుభుఁడా! జ్ఞానమే ముఖ్యముగా గల ఓ శ్రీ హరీ!
        సమస్త భాగ్య రమా ధవుఁడా! నను కరుణింపవా యేమి?

గీ:- హితుఁడ! హే హరి! పావన! హే దయాబ్ధి! -  సకల శోక వినాశక! సద్గుణాఢ్య!
      సకల భాగ్య రమా ధవ! సన్నుతాంగ! -  విజయ మేర్పడ గొల్పర! వేణుగోప!  77.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా!  ఓ క్షేమము కోరువాఁడా! ఓ శ్రీహరీ! ఓ పవిత్ర మూర్తీ!
        ఓ దయా సముద్రుఁడా! సమస్తమైన దుఃఖములను నశింపఁ జేయు వాఁడా!
        సద్గుణ సంపన్నుఁడా! సమస్త భాగ్య రమా ధవుఁడా!  ఓ సన్నుతాంగుఁడా!
        విజయము ప్రస్ఫుటమగునట్లు కలిగించుము.

ఉ:- భాసుర! లోకమున్ మదుల భాసురమౌ పరమాత్మవీవ. శో
      భాసరణిన్. వినన్ మృదుల భాషణలో నినుమించ లేనురా!
      నీ సరివారలే? ప్రజలు? నీసరి వారని పల్కుచుండ్రి స
      త్పోష హరీ! దయన్ వినర!  పూజ్యుడ వీవెర! వేణు గోపకా! 78.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! ప్రకాశవంతమైన వాఁడా! ఈ లోకమందు మా మనస్సులలో
        ప్రకాశించు పరమాత్మవు నీవే సుమా! వినగా శోభ విషయమునను;
        మృదు భాషణ విషయమునను నిన్ను నేను మించ లేను సుమా!
        మంచిని పోషించు వాఁడవైన ఓ శ్రీ హరీ! దయతో వినుము. ఇక్కడి ప్రజలు
        నీ తో సమానమైన వారుగా తాము చెప్పుకొను చుండిరి. వారు నీతో సరి పోలువారా?
        పూజ్యుఁడవు నీవేసుమా!

క:- సుర లోకమున్ మదుల భా  -  సురమౌ పరమాత్మవీవ. శోభాసరణిన్.
      సరివారలే ప్రజలు? నీ  -  సరి వారని పల్కుచుండ్రి  సత్పోష హరీ! 78.
        భావము:-
        మంచిని పోషించు వాఁడవైన ఓ శ్రీ హరీ!  దేవ లోకమందు గల వారి మనస్సులలో
        ప్రకాశించు పరమాత్మవు నీవే సుమా! ఇక్కడి ప్రజలు శోభ విషయమున నీతో
        సరి పోలువారా? నీతో వారు సమానమైన వారుగా చెప్పుకొను చుండిరి.

గీ:- మదుల భాసురమౌ పరమాత్మవీవ. -  మృదుల భాషణలో నినుమించలేను!
      ప్రజలు? నీసరి వారని పల్కుచుండ్రి  -  వినర! పూజ్యుడ వీవెర! వేణు గోప! 78.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! మా మనస్సులలో ప్రకాశించు పరమాత్మవు నీవే సుమా!
        మృదు భాషణ విషయమున నిన్ను నేను మించ లేనుసుమా!  ఇక్కడి ప్రజలు
        నీతో వారు సమానమని చెప్పుకొను చుండిరి. స్వామీ ఆలకింపరా! పూజ్యుఁడవు నీవేసుమా!

ఉ:- అందరివాడ! నే కనెద నందరిలో నిను! కాంక్ష తీరదా?
      సుందరుఁడా! దయా సుగుణ సుందర మీవెర! సూక్ష్మ రూప! న
      న్నుం దరి చేర్చరా! కనగ నూత్న రహస్యము కానిపించు. న
      న్నొందు హరీ! మదిన్ వెలసి యుండెడి దీవెర! వేణు గోపకా! 79.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! ఓ అందరి వాఁడా! నన్ను పొందెడి ఓ శ్రీ హరీ! అందరిలోనూ
        నేను నిన్నే చూచెదను.కోరిక తీరదా యేమి? ఓ అందగాడా!  దయాసుగుణము చేత
        నీవే అందము సుమా! ఓ సూక్ష్మ రూపుఁడా! నన్ను ఒడ్డునకు చేర్చుము.
        చూడఁగలిగినచో ఒక క్రొత్తదైన రహస్యాంశము తప్పక కనఁ బడును. అదేమిటనగా
        మా మనస్సులలో వెలసి యున్నది నీవేనని సుమా!

క:- దరివాడ నే కనెద నం  -  దరిలో నిను! కాంక్ష తీరదా? సుందరుఁడా!
      దరి చేర్చరా! కనగ నూ  -  త్న రహస్యము కానిపించు నన్నొందు హరీ!  79.
        భావము:-
        నన్ను పొందెడి ఓ శ్రీ హరీ! ఈ సమీపమున గల పల్లెలో అందరి లోను నేను నిన్నే చూచెదను.
        కోరిక తీరదా యేమి? ఓ అందగాడా! నన్ను ఒడ్డునకు చేర్చుము.  చూడగలిగినచో
        ఒక క్రొత్తదైన రహస్యాంశము తప్పక కనఁ బడును.

గీ:- కనెద నందరిలో నిను కాంక్ష తీర; -  సుగుణ సుందర మీవెర! సూక్ష్మ రూప!
      కనగ నూత్న రహస్యము కానిపించు. -  వెలసి యుండెడి దీవెర వేణు గోప!  79.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! అందరిలోనూ; నేను నిన్నే కోరిక తీరునట్లుగా చూచెదను. సుగుణము చేత
        నీవే అందము సుమా! ఓ సూక్ష్మ రూపుఁడా! చూడఁగలిగినచో ఒక క్రొత్తదైన రహస్యాంశము
        తప్పక కనఁబడును. అదేమిటనగా మా మనస్సులలో వెలసి యున్నది నీవేనని సుమా!

ఉ:- సుందరహాసమే ఫలము చూడర; సాదర ! వాంఛ తీర. లౌ
      ల్యందనమున్ నినున్ కనుల హాయిగ చూడము గర్వమబ్బ. ని
      న్నుందరి జేర్చుచున్ మదిని నోచి రహించుట మన్ననంబ చే
      కొందు హరీ! నినున్. వినర కూర్మిని నామొర వేణు గోపకా! 80.
        భావము:-
        ఆదరముతో కూడు కొన్న ఓ వేణు గోపకుఁడా! చూడుమురా. నీ యొక్క అందమైన
        నవ్వే మాకు మంచి ఫలము సుమా! మా కోరిక తీరా చూడరా! లౌల్యము చేతను;
        గర్వ మబ్బుట చేతను మా కన్నులారా హాయిగా చూడకుంటిమి.నిన్ను సమీపమునకు
        చేర్చు కొనుచు మనస్సునందు నిన్నుఁ గూర్చి నోచి;  అతిశయించుట గౌరవము.
        నిన్నునేను  స్వీకరింతునయ్యా! ఓ శ్రీహరీ! ప్రేమతో నా మొర వినుము.

క:- దరహాసమే ఫలము చూ  -  డరసాదర వాంఛ తీర. లౌల్యందనమున్
      దరి జేర్చుచున్ మదిని నో  -  చి రహించుట మన్ననంబ చేకొందు హరీ! 80.
        భావము:-
        ఆదరముతోకూడుకొన్న వాఁడా! ఓ శ్రీహరీ!  నీ యొక్క అందమైన చిఱు నవ్వే
        మాకు మంచి ఫలము సుమా! మా కోరిక తీరా చూడరా! లౌల్యముతో నిన్ను
        సమీపమునకు చేర్చు కొనుచు మనస్సునందు నిన్నుఁ గూర్చి నోచి; అతిశయించుట
        గౌరవము. నిన్నునేను స్వీకరింతునయ్యా !

గీ:- ఫలము చూడరసాదర వాంఛ తీర. -  కనుల హాయిగ చూడము గర్వమబ్బ.
      మదిని నోచి రహించుట మన్ననంబ -  వినర కూర్మిని నామొర వేణు గోప!  80.
        భావము:-
        ఆదరముతో కూడు కొన్న ఓ వేణు గోపకుఁడా! చూడుమురా. మా కోరిక తీరా చూడరా!
        గర్వ మబ్బుట చేతను మా కన్నులారా హాయిగా చూడకుంటిమి. మనస్సునందు
        నిన్నుఁ గూర్చి నోచి; అతిశయించుట గౌరవము. ప్రేమతో నా మొర వినుము.
          ( స శేషం )
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.