గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఆగస్టు 2010, మంగళవారం

మనం గ్రహించ గలిగినా గ్రహించ లేకపోయినా ఇది మాత్రం నిజం.

శ్లోll
పుణ్యస్య ఫల మిచ్ఛంతి , పుణ్యం నేచ్ఛంతి మానవా:
న పాపఫల మిచ్ఛంతి , పాపం కుర్వంతి యత్నత:
తే.గీ.ll
పుణ్య కార్యము లొనరింపఁ బోరు  కాని
పుణ్య ఫలము కోరుదు రయ్య! పుడమిఁ జనులు.
పాప కార్యము లొనరింత్రు. పాప ఫలము
వల దటంచును తలతురు. భావ్య మౌనె?
భావము:-
మానవులు  పుణ్యం చేయడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. కాని పుణ్యం వలన వచ్చే ఫలితం మాత్రం తమకి దక్కాలని తెగ ఆరాట పడి పోతూ ఉంటారు. 
నిత్యం అనేక పాపాలు చేస్తూనే ఉంటారు కానీ, ఆ పాప ఫలితం మాత్రం తమకు రాకూడదని కోరుకుంటూ ఉంటారు ! 
మన అనుభవానికి వచ్చే మంచి చెడ్డలు మనం చేసుకొన్న పుణ్య పాప ఫలములే కాని వేరు కానేరవు అని మనం గ్రహించి ఇప్పటి నుంచైనా మనకేది కావాలని కోరుకొంటామో అది లభించే విధంగా ఆచరించ వలెను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమె " పాత్ర ఎంతో ప్రాప్త మంతె " అన్నట్టు మన పూర్వ జన్మ సుకృతాలె పాప పుణ్యాల ఫలితాలు.తక్కువ పూజ చేసి ఎక్కువ కోరు కోవడం దురాశ కదా ? ఐనా ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి నమస్కరించే వారెందరు ? " మంచి ముత్యాల సరాలను అందిస్తున్నందుకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.