గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2010, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 53; 66; 70; 77; 95; 100.భాగములందు చేర్చినవి

సాహితీ ప్రియులారా!

మేలిమి బంగారం మన సంస్కృతి 53; 66; 70; 77; 95; 100.భాగములందు గల శ్లోకాదులు పునరుక్తమైనందున ఆ స్థానములలో నుంచిన నూతన శ్లోకాదులు ఈ క్రింద వివరింపఁ బడెను.
శ్లోll
ఈశ్వరే నిశ్చలా బుద్ధిః దేశార్థం జీవన స్థితిః.
పృథివ్యాం బంధువద్వృత్తిః ఇతి కర్తవ్యతా సతమ్.53 ( నేపాల చరిత్రమ్ )
తే.గీ.ll
దట్టమైనట్టి నిశ్చల దైవ భక్తి;
దేశ హితమయ జీవన దీక్ష కలిగి;
లోకులందరు తనవారుగా కనుటయు;
సజ్జనాళికి కర్తవ్య మిజ్జగమున.  
భావము:-
అచంచలమైన ఈశ్వర విశ్వాసము కలిగి యుండుట; తన జీవితమును దేశ హితార్థమైయే గడుపుచుండుట; లోకమందరి యెడలను బంధు సమాన దృష్టి కలిగి యుండుట; ఇవన్నీ సత్పురుషులైనవారికి కర్తవ్యములు.
శ్లోll
అద్రోహః సర్వ భూతేషు కర్మణా మనసా గిరా.
అనుగ్రహశ్చ దానంచ సతాం ధర్మః సనాతనః.66
(మహా భారతము - వన పర్వము - ౨౯౭ - ౩౫.)
తే.గీll
త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు.
భవము:-
మనోవాక్కాయములచే యే ప్రాణి పట్లను ద్రోహమును చేయ కుండుటయే కాక; అందరి యెడలను ప్రేమాదరములను కలిగి యుండుట; తనకు కలిగిన దానిని యెల్లరకు దానమిచ్చుచుండుట; అనునవి సనాతనమైన ధర్మములు.
శ్లోll
అకృత్వా పర సంతాపం అగత్వా ఖల మందిరం
అక్లేశయత్యచాత్మానం యదల్ప మపి తద్బహుః.70
తే.గీll
పరుల సంతాప హేతువై ప్రబల రాదు.
చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ
ఘనతరంబుగ మనకిది కనగ నగును.
భావము:-
ఇతరులకు సంతపము కలిగించకయు; ఖలులతో సహవాసము చేయకయు; గావించిన కొలది సుకృతములు కూడా మహత్తరమైనవగుచున్నవి.
శ్లోll
అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః
తే హరేః ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మ యద్ధరేః.77.
తే.గీ.ll
చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.
కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ
డరయ దేవుని శత్రువు. పరమ పాపి.
ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె.  
భావము:-
స్వధర్మ కర్మలను విడిచిపెట్టి కేవలము కృష్ణ కృష్ణ యనుచు కూర్చొనువారు శ్రీహరిని ద్వేషించు వారు. పాపులు అగుదురు. ఎందుచేతనంటే ఆ హరి యవతారములెత్తినది ధర్మ రక్షణమునకే గాని ఊరకనే కాదు కదా! 
స్వధర్మానికి దూరముగా ఉంటూ భగవన్నామ జపము చేయుచూ కాలము వ్యర్థపుచ్చుట యుక్తము కాదని గ్రహించ వలెను. స్వధర్మాచరణము చేయుచూ భగవాన్నామ స్మరణ చేయుచూ కర్మఫలమా పరమాత్మకే అర్పింప దగును.
శ్లోll
నిత్యాన్నదాతా నిరతాగ్నిహోత్రీ వేదాంతవిణ్మాస సహస్ర జీవీ
పరోపకారీచ పతివ్రతాచ షట్ జీవ లోకే మమ వందనీయా:.95.
ఆ.వెll
అన్నదాతయు; ప్రథిత నిత్యాగ్ని హోత్రి;
వేదసంపన్నుఁడును; వయో వృద్ధ నరుఁడు;
పరుల కుపకారి; నుత పతి వ్రతయు నాకు
వందనీయులు. భువి పైన భాగ్యనిధులు.
భావము:-
పేదవారికి నిత్యము అన్నదానము చేయువాఁడును; నిత్యాగ్నిహోత్రియు; వేదాంత వేత్తయు; సహస్ర చంద్ర దర్శనము చేసినవయో వృద్ధుఁడు; పరోపకార పరాయణుఁడు; మహా పతివ్రత; ఈ ఆరుగురూ నాకు వందనీయులు.
శ్లోll
బ్రహ్మ నిష్ఠో గృహస్థః స్యాత్; బ్రహ్మ జ్ఞాన పరాయణః
యద్యత్ కర్మ ప్రకుర్వంతి తద్బ్రహ్మణి సమర్పయేత్.100.
తే.గీll
బ్రహ్మ నిష్ఠయు; జ్ఞానము; భక్తియు; మది
కలిగి యుండి; గృహస్థుఁడు కర్మములను
చేయ వలయును. అతఁడవి చేయు చుండి;
ఫలము కృష్ణార్పణము చేయ వలయు సతము. 
భావము:-
గృహస్థు బ్రహ్మ జ్ఞాన పరాయణుఁడై; బ్రహ్మ నిష్ఠుఁడై; ఈశ్వరార్పన బుద్ధితోనే సర్వ కర్మలను చేస్తూ ఉండ వలెను.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.