గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2009, గురువారం

మధు సేవా ప్రభావం.

మధు సేవ అనే నాటకంలో ఓక తమాషాగా వుండే సీసపద్యాన్ని చూచానండి. మీరన్నీ ఇలాగే చెపుతారు అని అనకండి. కావాలంటే మీరూ చూడబోతున్నారుకదా!.
ఆపద్యంలో మధుసేవ చేసేవారి ప్రవృత్తిని ఎంత యదార్థంగా వివరించాడంటే ఆ పద్యాన్ని మనం కూడా కంఠస్థం చేసి
" మధు "రమైన ఆ మత్తులో తేలని జన్మ జన్మ కదేమో అనిపించేటంతటి గొప్పగా వుంది.
మధువే కాదు. దానిని గూర్చిన సంభాషణ, దాని మహత్యం తెలిపే పద్యాలు, అంతెందుకు. దాని ప్రస్తావన వస్తే చాలు మనకు కూడా మత్తెక్కిస్తుందనడానికి యీ పద్యమే తార్కాణం. ఇక చూడండా పద్యమెలాంటి మత్తిస్తుందో.

సీ:-
మోర్నింగు కాగానె మంచము లీవింగు.
మొగము వాషింగు. చక్కగ సిటింగు.
కార్కు రిమూవింగు. గ్లాసులో ఫిల్లింగు.
గడగడ డ్రింకింగు. గ్రంబులింగు.
భార్యతో ఫైటింగు. బైటకు మార్చింగు.
క్లబ్బును రీచింగు. గేంబులింగు.
విత్తము లూజింగు. చిత్తము రేవింగు.
వెంటనే డ్రింకింగు. వేవరింగు.
తేటగీతి:-
మరల మరల రిపీటింగు. మట్టరింగు.
బసకు ష్టార్టింగు. జేబులు ప్లండరింగు.
దారి పొడవున డేన్ సింగు. థండరింగు.
సారె సారెకు రోలింగు, స్లంబరింగు.

చదివిరి కదా! గం "మత్తు" గావుందికదూ! ఇప్పుడు చెప్పండి. నేను పైన చెప్పినవి యదార్థమో, కాదో.
ఇలాంటి తమాషా పద్యాలు మన సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా వున్నాయంటే ఆశ్చర్యపోయే పని లేదు. మీరే చూస్తారికదా ముందు ముందు. ప్రసుతానికి

జైహింద్.
Print this post

4 comments:

ఆత్రేయ కొండూరు చెప్పారు...

గుప్పని తాగిందిపుడే
యన్నట్టుగ కిక్కు మెదడుకు జరిగెను చెప్పన్‌
తప్పని తికమక మనమున
గప్పెగమీమాట ఇపుడు నిక్కము చూడన్‌

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆ{చా}ర్యా! ఆత్రేయా! పద్య రచన చాలా బాగుంది.
చిన్న సవరణ ఆ పద్యానికింకా వన్నె తెస్తుందనే భావంతో క్రింద వ్రాస్తున్నాను. చూడండి.

కందము:-
గుప్పనిపించగ త్రాగిన్
దిప్పుడె యన్నట్టు కిక్కు యెక్కి మెదడుకున్.
తప్పని తికమక మనమున
గప్పెగ మీ మాట యిపుడు గాంచిన నిజమే.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

ధన్యవాదాలు గురువుగారూ. వాగ్విలాసం రాఘవ గారు మీ బ్లాగును పరిచయంచేశారు. మీ బ్లాగు పుణ్యమా అని చందస్సు కురించి నేర్చుకుంటున్నాను. గణాల దాకా వచ్చాను. కందం నాకు నచ్చింది. ఇంకా ప్రాస యతి స్థాయికి ఇంకా నేను చేరుకోలేదు. నా తప్పటడుగులని సరి దిద్దుతారని మార్గదర్శన చేస్తారని ఆకాంక్షిస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శార్దూలము:-
ఆత్రేయా! నిను బోలు సజ్జనులు తా మాకాంక్షతో నేర్చినన్
సూత్ర ప్రాయముగా వచింతునెలమిన్ సూచింతు ఛందంబు. నా
మాత్రా ఛందము తోడ పాట పగిదిన్ మస్తిష్కమున్ ఛందమున్
చిత్రంబట్టుల నిల్పగల్గిన యదే చిత్రంబుగా పద్యమౌన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.