గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2009, సోమవారం

చెప్పుకోండి చూద్దాం 2. రాఘవ పంపిన రస గుళిక.

సాహితీ రసాస్వాదనచేయుటలోకాని, అందించుటలో కాని మన బ్లాగు పాఠకులు అనితర సాధ్య మన్నట్టుగా వుంటారనడానికి " రాఘవ " గారు పంపిన వ్యాఖ్యలో నుంచిన పద్యమే మనకు సాక్ష్యము.
ఆ పద్యాన్ని యిప్పుడు చూద్దాం.

ఆ:-
కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు చదువుచుండు శిశువుతోడ
వనిత వేదములను వల్లె వేయుచునుండు
బ్రాహ్మణుండు కాకి పలలము తిను!

భావము:-
చదువ గానే కొండపై వుండే నెమలి కోరినన్ని పాలిస్తుందనీ,
పశువు తన శిశువుతో పాటు చదువు తున్నదనీ,
స్త్రీ వేదములను వల్లె వేయుచున్నదనీ,
బ్రాహ్మణుడు కాకి మాంసము తింటున్నాడనీ, భావం స్ఫురిస్తోంది.

మనం కొంచెం పరిశీలించి చూచినట్లయితే చాలా సులభంగా తెలుస్తుంది దానిలోని ఆంతర్యం. అదే ఈ పద్యంలో మనకానందాన్నిచ్చే తమాషా.
అదేమిటో చెప్పుకోండి చూద్దాం.

సమాధానం:-BLOCKED

మనమిప్పుడు పరిశీలిద్దాం.
1) కొండనుండు నెమలి.
2) కోరిన పాలిచ్చు పసువు.
3) చదువు చుండు శిశువు తోడ వనిత.
4) వేదములను వల్లె వేయుచునుండు బ్రహ్మణుండు.
5) కాకి పలలము తిను.

చూచారా ఎంత చక్కని తమాషా పద్యాన్ని మన మిత్రులు " రాఘవగారు " మనకందించారో!
మీరు కూడా మీ విజ్ఞాన భాండారం నుండి మంచి మంచి తమాషా పద్యాల్ని పాఠక లోకానికందివ్వ గలిగితే పదిమందికీ మన ఆనందంలో భాగాన్ని కల్పించిన వారవుతారు. తప్పక పంపిస్తారు కదూ?

జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

భలే ఉందండి కవిత! ఎక్కణ్ణుంచి పట్టుకొచ్చారు?

రాఘవ చెప్పారు...

మరొకటి కూడా గురుతొచ్చిందండీ...

చెరకుతోటనుండు వరిమళ్లలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలపైననుండును
దీని భావమేమి తిరుమలేశ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.