గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జనవరి 2009, గురువారం

దత్తపదితో వర్ణన - మేడసాని పూరణ.

2007 ఏప్రెల్ 23వ తేదీన మేడసాని మోహన్ గారు చేసిన సహస్రావధానంలో ఒక తమాషా అయిన దత్త పది యిచ్చారు.
దానిని ఆ అవధాన పుంగవుడెంత తమాషాగా పూరించారో మీరే చూడండి.

దత్తపది:
1) పంచరు
2) టించరు
3) వెంచరు
4) లాంచరు.
యీ నాలుగు పదాలతో భారతీయసంస్కృతి వర్ణన.
అవధానిగారి పూరణ చూడండి.

ఉత్పలమాల:-
పంచరు ద్వేషభావనలు భారత వీరులు, కల్మి లేమి పా
టించరు, అందరున్ కలిసి డీకొని శత్రు సమూహ శక్తి లా
వెంచరు, పోరులోని అరిభీకరమూర్తులు భారతాంబ చే
లాంచరుచి ప్రతీకలు భళా! మన సంస్కృతి సంస్తుతంబగున్

భావము:-
భారత వీరులు ద్వేష భావమును తమ ప్రవర్తన ద్వారా ఎవరికీ పంచిపెట్టరు. అంటే భారత వీరులకు ద్వేష భావ మసలుండనే యుండదని తెలియవలసి వుంది.
ఆదాన ప్రదానాలలో భేద భావానికి తావివ్వక అంతా సమానమనే భావంతో కలిమి లేములను పరిగణింపరు.
సమైక్యంగానుండి శత్రువులనెదుర్కొందురే తప్ప శత్రువు బలాబలాలను ఆలోచించనే ఆలోచించరు.
యుద్ధ రంగంలోని శత్రువులకు భయాన్ని పుట్టించే భారత వీరులు నిజముగా భారతమాత కొంగు బంగరు కాంతికి నిదర్శనములు సుమా!
మన భారతీయ సంస్కృతి పొగడబడునదియేసుమా!


చూచారా ఎంతచక్కగా చెప్పారో. మనం కూడా ప్రయత్నించి కనీసం కొంచెమైనా వ్రాసే ప్రయత్నం చేస్తే ఈ మన ప్రయత్నం సార్థకమౌతుంది.

జైహింద్.
Print this post

4 comments:

Disp Name చెప్పారు...

Baavundandi. Ee dattapadi bhaavaanni kooda visadeekarinchi vunte inkaa sreshtamgaa undedi.

రాఘవ చెప్పారు...

చదవగానే "భలే" అనిపించింది. ఏ పదాన్నీ దాని అర్థంలో వాడకుండా చక్కగా పూరించారు. కాకపోతే నన్ను పంచరులో దంత్యచకారం మాత్రం కొంచెం నిరాశపెట్టింది. చక్కటి దత్తపది, సరసమైన పూరణ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మీకు నాధన్య వాదములు.
మీరు సూచించి నట్టుగా భావాన్ని చేర్చి మళ్ళీ వ్రాశాను చూడండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవా!
అవధానాల్లో సరసత్వాన్నే కాని రసత్వాన్ని చూడ గలగడం అరుదుగా ఉంటుంది.
అందునా సహస్రావధానం.
మీరనుకొన్నట్టుంటే మరీ బాగుండేది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.