గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2009, గురువారం

దీక్షా దక్షులారా! శుభా కాంక్షలు.

వత్సరాది స్వాగత ఫలం :-

ఆటవెలది:-
కాల గమన మునకు కళ్ళెమన్నది లేదు
మనము గుర్తు గలిగి మసలు కొఱకు
వత్స రాది నుండి వత్సరాంతము దాక
పదియు రెండు నెలలు పదిల పడెను.

ఆటవెలది:-
వత్స రాది యంచు వసుధపై ప్రజ లెల్ల
యుత్సవముల దేలి యూగు రాత్రి.
అర్థ రాత్రి వేళ నాశగా యెదురేగి
స్వాగతించు వత్స రాగమమును.

ఉత్పలమాల:-
ఏమిటి దీని లోన గల యింగిత మారయ ? నేమి కోరి యీ
ప్రేమను జూపి స్వాగతము ప్రీతిని తెల్పుట? ఎన్ని వత్సరా
లీ మహి పైన జూచితిమి? యేమి ఫలంబుల నందినామటం
చే మది చింత చేయు ? తమ దృష్టిని నిల్పు. ఫలించు నామదిన్.

ఆటవెలది:-
వత్స రాది నాడు వక్ర మార్గము వీడ,
సక్రమముగ నడువ, సత్ ఫలములె
తనకు సంఘమునకు తనివి తీరా గొల్ప
దీక్ష బూన వలయు. దివ్య మదియె.

చంపకమాల:-
తమకును. తమ్ము నమ్ము తమ ధాత్రి వసించెడి సజ్జనాళికిన్
ప్రమద, శుభావహంబులుగ, ప్రస్ఫుట సత్ శుభ కార్య దీక్షతో
నమిత మహాద్భుతంబయిన యాచరణీయ ప్రణాళికన్ మదిన్
సుమతులు బూను. నిశ్చయము. చూడగ నిందుకె స్వాగతించుటల్.

చంపకమాల:-
నెలకొక మారు నెమ్మదిని నేర్పునుగల్గి కృతార్థతా ఫలం
బెలమిని చూచుకో వలయు. నెంత లభించె నటంచు. నప్పుడే
ఫలితము పొందగా తగిన భావనతో కృషి చేయ సాధ్యమౌన్.
మెలకువ గల్గి వర్తిలిన మేలగు సత్ ఫలితంబు లందనౌన్.

తేటగీతి:-
వత్స రాంతాన మనమున వలచినట్టి
ఫలము పొందితిమో? లేదొ? తెలియ నగును.
వత్సరాదికి స్వాగత వచన ఫలము
తెలియగా నిదె యగునయ్య. తెలియ వలదె?

కందము:-
మన్నింపుడు నా మాటల
మన్నిక లోపించెనేని. మాన్యులు మీకే
అన్నియు తెలియును. ఐనను
మన్నించుచు చదువుట తమ మహనీయతయే.

కందము:-
శుభ కార్యములను చేయుడు.
శుభముల కాకరము లగుడు, సుఖ సంతోషా
లభవు డొసంగెడు మీకును.
శుభ శీలురు మీరు. మీకు శుభములె కలుగున్.

జైహింద్. Print this post

4 comments:

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

ఇది ఆంధ్రామృతమే
- పద్మనాభం దూర్వాసుల

కొత్త పాళీ చెప్పారు...

బాగుంది మీ శుభ చింతనం.
మీకూనూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! ధన్యుడన్యుడను. కృతజ్ఞతలు.
కందము:-
దూర్వాసుల వారే యిది
సర్వోత్తమ మనుచు పలుక సజ్జనులంతా
నుర్విని పొగడక యుండునె?
దూర్వాసులపద్మనాభ! దోయిలి గొనుమా!

రాఘవ చెప్పారు...

నిజమే రామకృష్ణగారూ,

ఓ క్షణము మార్చగలదు ని
రీక్షించి కనఁ దొలి యడుగు రీతినిఁ గానీ
లక్షలలో నే కొందఱొ
దీక్షనుఁ బూనఁగఁ దలతురు ధీనిలయములై

ఆ కొందఱు దీక్షాదక్షులకీ మనోవాఞ్ఛితాలు నెరవేరాలని కోరుకుంటూ...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.