గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2009, గురువారం

చెప్పుకోండి చూద్దాం.10.

sembah
మనలో వేమన శతకం గూర్చి తెలియవారుండరు. ఐతే
వేమన శతకంలో ని పద్యాలు మనకు తెలిసిన అర్థాలే కలిగున్నాయా?
లేక ఒక
ప్రత్యేకమైన అర్థాలేమైనా కలిగుండవచ్చా!
ఈ క్రింది పద్యం చూడండి.

ఆ:-
చెప్పు లోని రాయి చెవులోను జోరీగ
కాలి లోనిముల్లు. కంటి నలుసు.
ఇంటి లోని పోరు యింతంత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ.

ఈ పద్యంలో
వేదాంతార్థం వున్నట్టుగా నాకు అనిపిస్తోంది.

మీరు ఊహించి చెప్పే ప్రయత్నం చేసేందుకు వీలుగా దీని
వివరణను తెల్ల రంగు పులిమి నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తాను.
మీరు ప్రయత్నించి కామెంట్ ద్వారా పంప గలందులకు మనవి. ఆలస్యం సహించలేనివారు వివరణ చూడ దలచుకొంటే మౌస్ సహాయంతో తెల్ల రంగు పులుముకొని ఈ క్రిందనే దాగి వున్న వివరణ చూడగలందులకు మనవి.

వివరణ:-
నా మదిలో మెదులుతున్న భావన వివరిస్తున్నాను. ఇదే ప్రమాణంగా తీసుకో వలసిన అవసరం లేదు. చూడండి.

ఒక గురువుకు శిష్యునకు మధ్య జరుగు చున్న సంభాషణ యిది.
శిష్యుడు:-
లోని = మనలో వుండే,
రాయి = బరువైన పదార్థమును గూర్చి,
చెవులోను = నా చెవులలో
జోరీగన్ = గింగిరు పెట్టేలాగున
చెప్పు = తెలియజేయండి.

గురువు బోధించారు. శిష్యుడు శ్రద్ధగా ఆలకించాడు.మళ్ళీ యిలా గంటున్నాడు.

లోని = నా మనసులో వుండేటు వంటి,
ముల్లు = సందేహమనే ముల్లు,
కాలి = కాలిపోగా
నలుసు = సూక్ష్మమైన ఆ పరమాత్మ స్వరూపమును,
కంటి = చూచితిని.
యింటిలోని = నా యీ శరీరమనే యింటిలోని
పోరు = జీవాత్మ పరమాత్మలకు జరిగే సంఘర్షణా రూపమైన పోరు
ఇంతంత కాదయా = ఇంతటిది, అంతటిది అని చెప్పుటకు శక్యము కానిది సుమా!

భావము:-
గురువుగారూ! మనలో వుండేటువంటి ఆబరువైన పదార్థమగు పరమాత్మ స్వరూపమును గూర్చి దయతో చెప్పండి. అని శ్శిష్యుడడుగగా గురువు వివరించి చెప్పడంతో శిష్యుని సందేహంతీరి ఇలాగంటున్నాడు.
నా మనసులో వుండే సందేహమనే ముల్లు మీ మాటల వలన కలిగిన జ్ఞానమనే అగ్నిలో కాలిపోయింది. నాలో ఆసూక్ష్మరూపముననున్న పరమాత్మ స్వరూపాన్ని చూచాను. నా శరీరమనే యింటిలో జీవాత్మకు పరమాత్మకు జరిగే పోరు యింత అంత అని చెప్పనలవికానిది.

చూచారు కదా!.
ఎంత సామాన్యంగా ఎంత అద్భుతంగా ఆడుతూ పాడుకొనేలా ఆటవెలదిలో వ్రాశాడో వేమన. ఎంతటి రచనా కౌశలము?

మీ దృష్టిలో వుండే పద్యాలు మీరు కామెంట్స్ ద్వారా పంపినట్లయితే విజ్ఞానం పదిమందికీ పంచవచ్చునని నా భావన.

జైహింద్.
babai
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.