గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2009, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం. 7.

సుహృన్మిత్రులారా! సహృదయ పాఠకులారా!
ఈ దిగువనొక ప్రశ్న మీకోసం పద్య రూపంలో సిద్ధంగా వుంది. సమాధానం మీరు పద్యరూపంలో చెప్పగలిగితే నాకు కలిగే ఆనందం అపారం. ఎందుకంటే పద్యాలు వ్రాసేవారి సంఖ్య దిగజారిపోవడాన్ని నేను జీర్ణించుకో లేకపోతున్నాను.
తెలుగు మాటాడే ప్రతీవారూ ఛందో భాషణం చేయగలిగి వుండాలని నా కోరిక. అది సాధ్యమా? అని మీరనుకో వచ్చు. ఎందుకు సాధ్యం కాదు?

భోజ మహారాజు కాలంలో ప్రజలు సంస్కృతంలో సంభాషించడమే కాక ఛందో భాషణం చిన్నవీరితో సహా చేసేవారట. అందుకు చిన్న ఉదాహరణ మీకు తెలియందేమీ కాకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుతున్నాను.

ఒక అమ్మాయి తాళ పత్రంపై ఏదో వ్రాస్తూ వుండగా కాళిదాసు చూచి ఆ అమ్మాయితో సంభాషించాడు. ఆ యిరువురి మధ్యా జరిగిన సంభాషణ ఒక శ్లోక రూపంలో వుంది. చూడండి.

శ్లోకము:-
కాళి దాసు అడుగుతున్నాడు:-
కావా బాలా?
ఆప్రశ్నకి సమాధానంగా యిలా చెప్పింది:-
కాంచన మాలా.
మళ్ళీ అదుగుతున్నాడు;-
కస్యాః పుత్రీ?
ఆ అమ్మయి చెప్పుతోంది;-
కనకలతాయ.
మళ్ళి అడుగుతున్నాడు;-
కింవా హస్తే?
ఆ అమ్మాయి చెప్పుతోంది:-
తాళజ పత్రం.
అతడు మళ్ళీ ఇలాగడిగాడు ;-
కావా లేఖా?
ఆ అమ్మాయి ఇలా చెప్పింది;-
కాఖాగాఘా.
అదే సంభాషణని శ్లోకరూపంలో చూడండి.

కావా బాలా? కాంచనమాలా.
కస్యాః పుత్రీ? కనకలతాయ.
కింవా హస్తే? తాళజ పత్రం.
కావా లేఖా? కాఖాగాఘా.

కాళిదాసు:-
ఎవరివమ్మాయ్ నీవు?
అమ్మాయి:- కాంచన
 మాలను.
కాళిదాసు:-
ఎవరి కుమార్తెవి?
అమ్మాయి;- కనకలత కుమార్తెను.
కాళిదాసు:-
చేతిలోనిదేమిటి?
అమ్మాయి;-
తాటాకు పత్రము.
కాళిదాసు:-
ఏమిటి వ్రాస్తున్నావు?
అమ్మాయి:-
క ఖ గ ఘ లు వ్రాస్తున్నాను.

చూచారుకదా.
మనం మాత్రం ఎందుకు ప్రయత్నించ కూడదు?
తప్పక ఛందో భాషణానికి ప్రయత్నిద్దాం.

ఇక ఇప్పుడు మీముందుకొస్తున్న
ప్రశ్న.

ఆ:-
దేహమెల్ల కనులు దేవేంద్రుడా కాదు.
భుజము పైన నుండు బుడుత కాడు.
తాను ప్రాణి కాదు తగిలి జీవుల జంపు.
దీని భావమేమి తిరుమలేశ?

సమాధానం తెల్ల రంగుతో వుంది. అవసరమనుకొంటే మౌస్ సహాయంతో చూడ మనవి.

సమాధానం;-
వల.


మీరు కూడా మీ స్ఫందనను కామెంట్ రూపంలో తెలియ జేయ గలందులకు మనవి.


జైహింద్.
Print this post

4 comments:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

తే. వలపున వలన జిక్కిన వారి చరము
ఆవల వలవలేడ్చిన చావ కుండె?
చేప కైననెట్టి పడుచు పాపకైన
వలపు వలలందు జిక్కిన వగపు కలుగు!!

అసంఖ్య చెప్పారు...

ఆచార్యా: దూరవిద్యను మాకందిస్తున్నందుకు కృతజ్ఞతలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తేటగీతి:-
సత్య నారాయణా మీరు స్తుత్యముగను
వలనుగూర్చిన పదము లావలను జేర్చి
తేటగీతిని తెలుపిరి తేనెలొలుకు
మాటలనుజేర్చి ప్రశ్నకు దీటుగాను.

ధన్యవాదములు.

తేటగీతి:-
ధవళ వంశాబ్ధి సోమ! సాధనముచేసి
విద్య నేర్తురు . మీకునసాధ్యమేది?
దూరవిద్యను గరపితొ? దురధిగమము
పద్యవిద్యయ. దానిని బడసితీరు.

ధన్యవాదములు.

Hariharan Ramamurthy చెప్పారు...

తెలుగులో డయబెటీసు విద్య అని నేనొక బ్లాగు ప్రజలకు ఉపయోగపడెందుకు వ్రాస్తున్నాన్ను .
కాని కాలాభావం వల్ల మరియు తెలుగు బాష వాదుక తగ్గిపోఇనందువల్ల్ తర్జుమా చేయదం కష్తతరమై ఎక్కువ విషయాలు చెప్పలేక పోతున్నాను .
ఎవరైన తెలుగు బాగ తెలిసినవారు
వీటిని తెలుగులోకి అనువదిస్తే అది అందరికి ఉపయోగ పడుతుంది.
మీ నుంచి ఈ సహాయాని అర్థిస్తున్నను .
మీకు వీలైతే నా ఇమెయిల్ కి రయగలరు
నమస్కారం
http://diabetiisu.blogspot.com/

haridallas@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.