గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జనవరి 2009, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 45.

విద్యా ధనం సర్వ ధన ప్రధానం:-

విద్యా ధనమును గూర్చి అనేకమంది అనేక విధములుగా చెప్పిననూ, అది ఎన్ని మారులు ఎన్ని విధములుగ విన్ననూ ఇంకనూ విన వలసియే యున్నది. ఇంకనూ తెలుసుకొన వలసియే యున్నది.

ఇప్పుడు ఒక చక్కని పద్ధతిలో చెప్పిన శ్లోకమును పరిశీలిద్దాము.

శ్లో:-
న చోర హార్యం నచ రాజ హార్యం
న భ్రాతృ భాజ్యం నచ భార కారీ
వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం
విద్యా ధనం సర్వ ధన ప్రధానం.

తే:-
దొంగిలింపరు దొంగలు. దొరలు కొనరు.
అన్న దమ్ముల కందదు. అవదు బరువు.
తరుగబోదిది వెచ్చింప పెరుగు చుండు.
విద్య యనబడు ధనమిది తృప్తి నొసగు.

భావము:
దొంగలచే దొంగిలింప బడనిది, రాజులచే లాగుకొనబడనిది, అన్న దమ్ములలకు పంచ నవసరము లేనిది, ఎంత సంపాదించినా బరువుండనిది, ఖర్చు చేసినకొద్దీ పెరుగుతూ వుండేది, విద్య అనబడే ధనము మాత్రమే సుమా! అట్టి ధనమే మనకు చాలా ప్రథానమైన, నిజమైన ధనము. మనకు తృప్తిని కలిగిస్తుంది. కావుననే ఎంత శ్రమించ వలసి వచ్చిననూ బాధనొందక ఓర్పుతో శ్రమించి విద్యా ధనాన్ని సంపాదించాలి. అన్నారు మన పెద్దలు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.