గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జనవరి 2009, శుక్రవారం

శ్లోకౌచిత్య వివరణ

ఔచిత్య విచారణ:-

2008డిశంబరు31 వతేదీని ఔచిత్య విచక్షణాధికారం మీదే అనే శీర్షికలో ఒక శ్లోకం మీ మిందుంచాను . ఆ శ్లోకమేంటోదాని ప్రతిపదార్థం ఏమై యుంటుందో పరిశీలించగా నాకు తోచిన విషయాన్ని మీముందుంచుతున్నాను.

శ్లోకము:-
కేశవం పతితం దృష్ట్వా
భీమం చైవ గతాయుషం
రుదంతి కౌరవాః సర్వే
పాండవాః హర్ష మాయుః.

కేశవుఁడు {కృష్ణుఁడు} పతితమైపోవడం చూచిన భీముఁడు గతాయుష్కుఁ డాఆయెనట. కౌరవులు ఏడ్చుచుండిరట. పాండవులు సంతోషించిరట.
ఈ విధంగానే కదా అంతా అస్తవ్యస్తంగా ఉన్నట్టు  మనకు తోస్తుంది? ఇందులో మనకు కనిపించనిది మరేదో ఉండి తీరుతుంది.

ఐతే కవి హృదయాన్ని నిశితంగా  పరిశీలించి చూస్తే మరోలాగ మనకు తెలియ వస్తుంది. చూడండి

ప్రతి పదార్థము:-
కే = నీటియందు ,
పతితం = పడియున్న ,
గతాయుషం = గతించిపోయిన ఆయువు కలదియు,
భీమంచైవ = భయంకరముగ నున్నదియును అగు,
శవం = శవమును ,
దృష్ట్వా = చూచి ,
కౌరవాః = కుత్సితమైన రవముకలవియగునక్కలు,
సర్వే = అన్నీ,
రుదంతి = అరచు చున్నవి.
పాండవాః = తెల్లని వర్ణముతో నొప్పెడివగు కొంగలు
హర్షమాయుః = సంతోషమును పొందు చున్నవి.

భావము:-
నీటియందున్న ప్రాణమును కోల్పోయిన భయంకరముగ నున్న శవమును చూచిన నక్కలన్నీ అరచు చున్నవి. కొంగలు సంతోషించు చున్నవి.

ఈవిధంగా చూస్తే ఔచిత్య రాహిత్యం మనకీ శ్లోకంలో కనబడుట లేదుకదా!

బహుశా ఇది యే అవధానం సందర్భంలోనో పృచ్ఛకుడడిగిన క్లిష్టమైన ప్రశ్నకు సమాధానంగా అవధాని యీ శ్లోకాన్ని వ్రాయ వలసి వచ్చి యుండవచ్చు.

ఏదియేమైనా శ్లోకం తమాషాగా వున్నట్టుగా అనిపించి మనసులో దాచుకోలేక మీ ముందుంచాను. మీ సమయాన్ని వ్యార్థం చేసి వుంటే మన్నించే మనసు మీకుండనేవుంది. ధన్యుఁడను.


జైహింద్.
Print this post

4 comments:

అజ్ఞాత చెప్పారు...

బావుంది మాస్టారు. మంచి అన్వయం సాధించారు.

రాఘవ చెప్పారు...

గతాయుషం భీమం చైవ శవం పతితం దృష్ట్వా కే రుదంతి?
కౌరవాః సర్వే

కే హర్షమాయుః?
పాండవాః

భలే. అద్భుతమైన శ్లోకాన్ని పరిచయం చేశారు.

అజ్ఞాత చెప్పారు...

బాగుందండి. ఇవన్నీ ఎక్కడ నుంచి తెస్తున్నారు?

నేస్తం చెప్పారు...

భలే బాగుందండి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.