గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జనవరి 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 4.

మెదడుకు మేత.

ప్రపంచ భాషలలో కవితా చమత్కారాలతోను, రచనా నైపుణ్యంతోను, మేధావంతులకు పరిజ్ఞానంగల పాఠకులకు, అనిర్వచనీయమైన ఆనంద దాయకమైన సాహితీ ప్రక్రియలతో సంతోషం కలిగించే సంస్కృత భాష లాగే తెలుగు కూడా పరిగణనలోకి వస్తుంది. ఈ క్రింది పద్యాన్ని చూడండి.

క:-
అంచిత చతుర్థ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్
గాంచి, తృతీయంబప్పురి
నించి, ద్వితీయంబు దాటి, నృపు కడ కరిగెన్.

ఈ పద్యం మన మెదడుకు మేత వేసింది. దీనిలో సంకేతాలున్నాయి. ఆ సంకేతాల నాధారం చేసుకొని పద్యంలో గల భావాన్ని తెలుసుకో గలిగితే తద్వారా మన మనసుకు కలిగే ఆనందం వర్ణనాతీతం.

మీరూ ప్రయత్నించండి.
సమాధానం మీ కామెంట్ గా పోష్ట్ చెయ్యండి.
మీరు కూడా ఇలాంటి ప్రక్రియతో పద్యాలున్నట్లయితే తప్పక పంపి మా మెదడుకు కూడా మేతనందించండి.

జైహింద్.
Print this post

7 comments:

జ్యోతి చెప్పారు...

ఈ పద్యాన్ని పంచభూతములతో అన్యయించుకొని చెప్పుకోవాలి.1.భూమి 2. నీరు 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశాలు .

చతుర్ధజాతుడు అనగా వాయుపుత్రుడైన హనుమంతుడు పంచమ మార్గమున(ఆకాశ మార్గాన ) వెళ్ళి, ప్రధమ తనూజను(భూమిపుత్రి సీత) చూసి , తృతీయంబు(అగ్ని)నక్కడ నుంచి అంటే లంకా దహనం చేసి ద్వితీయంబు( నీరు-సముద్రం) దాటి తిరిగొచ్చాడు అని అర్ధం. ఒప్పుకుంటారా కవి సామర్ధ్యాన్ని .

కామేశ్వరరావు చెప్పారు...

భూమి రాపొ೭నలొ೭నిలొ నభహ్ :-)

అజ్ఞాత చెప్పారు...

ఇక్కడ పేర్కొన్నవి పంచ భూతాలు. పృథివి, సముద్రము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవీ పంచ భూతాలు.
చతుర్థజాతుదు = వాయు పుత్రుడు ఆంజనేయుడు
పంచమ మార్గము= ఆకాశ మార్గము
ప్రథమ తనూజ = భూమి సుత సీతా దేవి
తృతీంబప్పురి నుంచి = ఆ పురము నందు(లంక లో) అగ్ని నుంచి
ద్వితీయము దాటి = సముద్రము దాటి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

1)
దైవ దత్త నేస్తమా! ధన్యవాదములు.
కందము:-
నేస్తము నాశింపగనే
నేస్తమె నేస్తముగ కల్గె. నేర్పరివౌరా!
వాస్తవ మీ వచనంబులు.
కాస్తైనా చదువువారు కలరీ బ్లాగున్.
2)
జ్యోతిగారూ! చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
మీరంత చక్కని వివరణ యిచ్చినతరువాత కవి సామర్ధ్యాన్ని ఒప్పుకోనివారెవరుంటారమ్మా!

తేటగీతి:-
జ్యోతి తమజ్ఞాన జ్యోతిని , ద్యోతకమవ.
సుందరుండగు అంజనీ నందనుడని
కవితలోపలి భావంబు గాంచచేసె
ధన్యతను గొల్పె బ్లాగుకు, తత్వవిదులు.
3)
కందము:-
భైరవభట్లకు సాటిగ
భైరవభట్లే యనంగ ప్రస్ఫుటమగు మీ
గౌరవసద్గుణగణములు
ధీరవచో నిపుణతయును తృప్తిని గొలిపెన్.
4)
శ్రీ మురళీ మోహనా! ధన్య వాదములు.
కందము:-
మురళీ మోహను వివరణ
సరళము సమ్మతము. నిజము. సత్ పండితులున్
సరిసరి. మహబాగున్నది.
పరిణత ప్రజ్ఞాని యనుచు ప్రస్థుతి చేసెన్.
5)
తేటగీతి:-
శ్రీ అసంఖ్యా! క{క/ఖ్య} గుణగణ! చిత్తమందు
పసుపు పులిమిన దానిలో పస నెఱింగి.
నాదు భావంబు కనుగొని నయత నెఱుగ
తెలెయ జెప్పితివేర్పడ ధీవరేణ్య!

అజ్ఞాత చెప్పారు...

అద్భుతమైన టపా. మీరు ఆశువుగా, పేర్లతో, ఛందోబద్ధంగా రాసిన పద్యాలు వాహ్ వాహ్. మీకో చిన్న విన్నపం. సంగీతంలో రాగ లక్షణలు ఉంటయి కదా! అలాగే, పద్యాలకి కూడా లక్షణాలు ఉంటాయా? దీని మీద (తెలుగు వ్యాకరణం, పద్యఛేదనం, గణ విభజన, పద్యలక్షణం వంటివాటిపై) ఒక టపా వేస్తే మాబోటి పామరులకు ఉపయుక్తంగా ఉంటుంది. నాకు అలాంటి పద్యాలు రాయాలని ఎప్పటినుంచోకోరిక

అజ్ఞాత చెప్పారు...

సంఖ్యల తో చమత్కార పద్యము చాలా బాగుంది, ధన్యవాదాలు ఈ పద్యాన్ని అండించినందుకు, వ్యాఖ్యాతలకు పద్యాలతో ధన్యవాదాలు చెప్పడము ఇంకా చాలా బాగుంది

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అసంఖ్యాకాఖ్య! నమస్తే.
ఉత్పలమాల:-
మీకు నెఱుంగ సాధ్యమగు మేలిమి గ్రంధములెన్నగా నసం
ఖ్యా!కము లుండె. నేర్పెదను. ఖ్యాతి గడింప రచింప జేతునే
నాకరమయ్య ఛందముకు నప్పకవీయము. చూచి యుందురే!
మీకది నేర్వగాతగును. మీరు పఠించిన వ్రాయ నేర్తురోయ్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.