గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 1. ప్రహేళిక { పొడుఫు కథ }

ప్రహేళిక అంటే గూఢముగా నుంచబడిన అర్థముగల కావ్య విశేషము అని అర్థము.
ఇక్కడ ఒక చక్కనైన ప్రహేళికవుంది. చూద్దమా?

తే:-
యౌవనంబున ముసలియౌ నతడెవండు?
వరుస కర్ణ త్రయము గల్గు వాడెవండు?
వృద్ధుడై యౌవనము గన్న సిద్ధు డెవడు?
వృద్ధి క్షయములు లేని ధీ వృద్ధు డెవడు?

చూచాము కదా యీ ప్రహేళిక. దీని లోని ప్రశ్నలకు సమాధానాలు ముందుగా మన మాలొచించి వ్రాసి పెట్టుకొని ఆ తరువాత యి క్రిందున్న సమాధానానికి సంబంధించిన వివరాలు చూస్తే ప్రయోజనకరమౌతుంది. కాబట్టి ముందుగా మరొక్కసారి పై పద్యాన్ని చదివి మన సమాధానాలు వ్రాసుకొని పిదప క్రిందనున్న వివరణ చూస్తే మంచిది..

మన మెదడుకు పదును పెట్టే ప్రహేళికలోని ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఆ చెప్పిన సమాధానం సరయినదేనని ఇతరులు మనలను మెచ్చుకొంటుంటే మన ఆత్మలో కలిగే ఆనందం తద్వారా కలిగే ఆత్మ విశ్వాసం మన ఉత్సాహ వంతమైన జీవనానికి చక్కని మార్గమౌతుంది.
కాన సమాధానాలను వెంటనే పంపండి.

సమాధానం:-BLOCKED.
సమాధానాలు వ్రాసేసి వుంటాం కాబట్టి అవి సరయినవో లేక సరయిన సమధానాలేవో తెలుసుకొవడానికి వివరణను చూద్దామా? ఐతే పదండి ముందుకు వివరణ కోసం.

వివరణ:-
ముసలి = వృద్ధుడు, ముసలము ధరించినవాదైన బలరాముడు.
కర్ణ త్రయము = మూడు చెవులు, కర్ణ దుశ్శాసన శకును లను కర్ణత్రయ మంటారు. వారిని కలిగి యున్న వాడు దుర్యోధనుడు.
వృద్ధుడై యౌవనము గన్న సిద్ధుడు = చ్యవన మహర్షి.
వృద్ధి క్షయములు లేని ధీ వృద్ధుడు = మార్కండేయుడు.

సమాధానాలు చూచాం కదా? బహుశా మనమందరం చెప్పిన సమాధానాలు వీటితో సరిపోయుంటాయనుకొంటాను.

మీకు తెలిసిన మరికొన్ని ప్రహేళికలను మీ కామెంట్స్ ద్వారా పంపి అందరి ఆనందానికీ మీరూ కారకులవండి.

జైహింద్.
Print this post

4 comments:

సురేష్ బాబు చెప్పారు...

మీ బ్లాగు లోని విషయాలు అత్యద్భుతముగా ఉన్నాయి.నిజముగా అమృతము కురిపించే మన పురాణ శ్లోకాలను,పొడుపుకథలను అందిస్తున్నారు.మీకు శతకోటి కృతజ్ఞతలు.నిజంగా మన పూర్వీకుల పాండిత్య వైభవమును చూస్తుంటే ఈ నేలపైన పుట్టినందుకు గర్విస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కందము:-
ప్రియతమ సురేషు బాబూ!
దయతో వ్యాఖ్యలను వ్రాసి తనిపిరి నన్నున్.
ప్రియ పాఠక జనముండిన
జయ మాంధ్రామృతము గొలుపు. సత్ కవితలతోన్.

తేటగీతి:-
ధన్యవాదములయ్య! సమ్మాన్య చరిత.
నిండు మనసున్న పాఠకులుండెనేని
దిశల నాంధ్రామృతము జిల్కి నిశితమైన
భావ మందించ సాధ్యమౌన్ ప్రబల జేయ.
జైహింద్.

రాఘవ చెప్పారు...

కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు చదువుచుండు శిశువుతోడ
వనిత వేదములను వల్లె వేయుచునుండు
బ్రాహ్మణుండు కాకి పలలము తిను!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యోస్మి రాఘవా! ధన్యోస్మి.
మీరుటంకించిన పద్యాన్ని యిప్పుడే నా బ్లాగులో పెడుతున్నాను. చదివినవారందరూ సంతోషీస్తారు. మీరింకా విజృంభించండి. మరిన్ని మంచి రస గుళికలు పాఠక లోకానికందించండి.
ధన్య వాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.