గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జనవరి 2009, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 50.

శ్రేష్ఠుల్లాగా ప్రవర్తిద్దాం.

మానవుడు
అనుకరణ శీలి. పరిసరాల ప్రభావం ప్రతీ మానవునిపైనా వుంటుంది. పెద్దలను అనుసరించి పిన్నలు ప్రవర్తిస్తుంటారు. ప్రతీ వ్యక్తి ప్రవర్తన యొక్క ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షం గానూ సమాజం మీద పడక మానదు. అందుకే మన ప్రవర్తన మనకోసమే ఐనప్పటికీ దాని ప్రభావం సంఘంపై చెడుగా పడకూడదు. అందుకె భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేస్తూ ఒక చక్కని శ్లోకం చెప్పాడు. చూడండి.

శ్లో:-
యద్యదా చరతి శ్రేష్ఠః
తత్తదేవేతరో జనః
స యత్ ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే.

క:-
ఉత్తముడు నడచు మార్గమె
యుత్తమమని తలచి నడచుచుండెద రితరుల్.
ఉత్తమమని దేనిని గొను
నుత్తము డదెగొనెదరయ్య.! యుర్విని లోకుల్.

భావము:-
లోకములో ఉత్తమ వ్యక్తి ఎట్లు నడచుచున్నాడో ఇతర జనులునూ అట్లే నడుస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం కూడా అనుసరిస్తుంది.

చాలా చక్కని బోధ. సందేహం లేదు.
మనమందరంకూడా మనల ననుసరించే వారికోసమైనా మంచిగా ప్రవర్తించడం ద్వారా ఉత్తమ వర్గానికి చెందిన వారిగా ఋజువు చేసుకొందామా?

జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

మేష్టారు మీ బ్లాగు చాలా అసక్తి కరముగా ఉంటుంది. సాహిత్యాంకి సంబంధించిన మంచి వషయాలు అందిస్తున్నందుకు చాలా ధన్యవదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.