గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 23వ శ్లోకం. 166- 171. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోపిప్పలా విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ

దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ 23  

166. ఓం *పిప్పలా*యై నమః

నామ వివరణ.

త్రిమూర్తి స్వరూపమగు (అశ్వత్థ)పిప్పల(రావి) వృక్షము అమ్మయే.

తే.గీకన్న తల్లిగ *పిప్పలా*! కాతువీవు

మన్ననముతోడ తోడుండి మనుజులనిల

చిన్ననాడీవె నన్ జేరి మన్ననముగ

శక్తి నిచ్చియు నేటికిన్ జయద వయితి.

167. ఓం *విశాలాక్ష్యై* నమః

నామ వివరణ.

సువిశాల నేత్ర సంభాస మన అమ్మ.

తే.గీచింత లేదమ్మ నేను నీ చెంతనున్న

నో *విశాలాక్షి! * నామది నుండుమమ్మ,

నీ విశాలనేత్రప్రభ నిత్యము మది

నింపుకొందును కృపతోడ నీవె కనుమ.

168. ఓం *రక్షోఘ్న్యై* నమః

నామ వివరణ.

రాక్షసులను స్ంహరించు జనని మన అమ్మ.

కం*రక్షోఘ్నీ! * నా మదిలో

రక్షోగణమే మెదలు పరంబును గననీ

వక్షీణ దయామతి! నన్

రక్షింపుము వీటి నుండి ప్రాణ ప్రదవై.

169. ఓం *వృష్టికారిణ్యై* నమః

నామ వివరణ.

వర్షమునకు కారణమగునది మన అమ్మయే.

కంసృష్టించితి వీసృష్టిని

వృష్టిని కల్పించి నావు  పృథ్విని పంటల్

తుష్టుగపండఁగఁ జేయగ,

నిష్టముతో *వృష్టి కారిణీ! *నినుఁగొలుతన్.

170. ఓం *దుష్టవిద్రావిణ్యై* నమః

నామ వివరణ.

చెడ్డవారిని తరిమి కొట్టు జనని మన అమ్మ.

తే.గీ.  *దుష్ట విద్రావిణీ!* నాదు దురిత గతిని

నీవె పాపుమా రక్షింప నీరజాక్షి!

దుష్ట సంహారిణీ! కృపన్ దోచి మదిని,

కాచి రక్షింపుమమ్మరో కరుణఁ జూపి.

ఓం *దేవ్యై  నమః.

తే.గీదేవలోకంబు గొలిపెడి *దేవి!* నిన్ను

భావనంబున సేవింతు భక్తితోడ,

నీవె నాకింక రక్షణ, నిరుపమాన!

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *దుష్టవిద్రావిణీదేవ్యై* నమః

తే.గీ.  *దుష్టవిద్రావిణీదేవి*! శిష్ట రక్ష!

మానసంబున నీవుండి మహిమఁ జూపి

దుష్టచింతనలెడఁబాపి శిష్టభావ

పూర్ణునిగ నన్నుఁ జేయుచుఁ బ్రోవుమమ్మ!

171. ఓం *సర్వోపద్రవనాశిన్యై* నమః

నామ వివరణ.

సమస్తమగు ఉపద్రవములను నశింపఁజేయు జనని.

శా*సర్వోపద్రవ  నాశినీ!* కనుమిటన్ జ్ఞానార్జనా దృష్టితో

సర్వంబీవ యటంచు నిన్నె గనుచో సర్వత్ర నా కిత్తరిన్

సర్వోపద్రవరాశి యడ్డమగుటన్, సాధింప లేకుంటినే,

సర్వోపద్రవముల్ విడన్ గనుమ, భాషా యోష! నిన్ గొల్చెదన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.