గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, అక్టోబర్ 2024, సోమవారం

చంపకభారతీశతకము రచన. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.

చంపకభారతీశతకము

రచన. చింతా రామ కృష్ణా రావు.

 

సరస్వతీ నమస్తుభ్యమ్.

 

 

 

 

 

చంపకభారతీశతకము.

రచన. చింతా రామకృష్ణారావు

 

. అనయమునా గజాననుని, యాతనిఁ గాంచిన పార్వతీసతిన్,

ప్రణవమహత్స్వరూపుఁడగు భక్తవశంకరు శంకరున్, కృపా

మణియగు శ్రీహరిన్, రమను, మాన్య చతుర్ముఖునిన్, మహిన్ నినున్

బ్రణుతులు చేసి మ్రొక్కెదను భక్తిని నిల్పగ నన్ను. భారతీ!         

భావము.  సరస్వతీమాతా! గజాననుని, అతని తల్లియగు పార్వతిని, ప్రణవ స్వరూపుఁడయిన శంకరుని, కృపామణియగు శ్రీహరిని, ఆలక్ష్మీమాతను, చతుర్ముఖుఁడయిన బ్రహ్మను, నిన్ను నన్ను భక్తిమార్గమున నిలుపగోరి మ్రొక్కెదనమ్మా!

 

. అజముఖ వేద్య! యీ సృజనమౌ సకలంబును నీ యధీనమై

ప్రజనితమౌట నిక్కము,. ప్రపంచమునందలి జీవరాశులన్

సృజనము చేయు బ్రహ్మయును చేకొను నీ మహనీయ శక్తి,. నీ

నిజమగు శబ్దశక్తియె వినిర్మితి హేతువు చూడ భారతీ!   .

భావము. శ్రీమద్బ్రహ్మ ముఖమున తెలియఁబడుచున్నట్టి మహాభద్రా మాతా! సృష్టింపఁబడుచున్నట్టి సృష్టి అంతయు నీచే పుట్టించఁబడుచుండుట నిజము. జీవులను పుట్టించు బ్రహ్మయు నీ యొక్క గొప్ప శక్తిని నీ నుండి పొందుచుండును. నీ యొక్క నిజమయిన శబ్ద శక్తియే సృష్టికి మూలము.

 

. సరగున పొంగివచ్చెనిట చంపక భారతి సద్విభాతి నే

డరుదగు నూరుపద్యము లహర్నిశమాత్రములోన. నేను సు

స్థిర మతినై రచించెద ప్రసిద్ధము కాగ విధాతృ రాజ్ఞి సుం

దర దరహాస సత్ఫల సుధా మధురంబునుఁ దెల్ప భారతీ! .

భావము. మహామాయామాతా! మంచిచే ప్రకాశించు చంపకవృత్తములలో భారతీ శతకము వేగముగా పొంగుచూ ఒక్క రోజులో నా కలము నుండి జాలువారినది. శారదా సుందర దరహాస సత్ ఫలసుధ యొక్క మాధుర్యమును ప్రసిద్ధమగునట్లు నేను సుస్థిర చిత్తుఁడనై రచించెదను.

 

. వదనము నుండి వెల్వడు ప్రభావము చూపెడి శబ్దశక్తియే

యెదలను సంస్పృశించు నదియే కద మూలము  మంచి చెడ్డలన్                                        

మదులను పాదుకొల్పఁగను. మంచిగ పల్కినఁ, జెడ్డ పల్కినన్                                   

వదనమునుందు వీవెకద. వాఙ్మయ రూప! యనంతభారతీ! .

భావము. వాఙ్మయ స్వరూపవయిన వరప్రదా! మానవుల ముఖములనుండి వచ్చెడి ప్రభావమును చూపెడి మాటలే వినువారి మనసులకు తాకును. అదే వారి మనస్సులలో మంచిగానైనా చెడ్డగానైనా  భావించునటు చేయును. కదా. అది మంచయినను చెడ్డయినను అది నీ వలననే మాటలరూపమున ప్రకాశమగును.. అది నీవే సుమా.

 

. పలుకక యుంట నేరమగు, పల్కిన నేరము, పల్కు పల్కునం

బలుపలు భావనావళులు మానవులందు సముద్భవించుచున్

గొలిపెడు మంచి చెడ్డలను, కోరని చెడ్డయొ, కోరు మంచియో,

నిలువక మాన దబ్బుచు. గణింపుచు కావుమ మమ్ము భారతీ! .

భావము. శ్రీప్రదా! పలుకకుండా ఉండుట నేరముగా గణింపఁబడును. అటులని ఒక్కొక్కప్పుడు పలుకుటయు నేరము. మా పలుకుల వలన అనేక అర్థములు మానవులకు తోచుచుండును.. ఆవిధముగ కలుగజేసెడి మంచిచెడ్డలలో కోరే మంచియో కోరని చెడ్డయో తప్పక కలుగుచుండును. విషయమును గిర్తించి మమ్ము కాపాడుము.

 

. కనుప నకారమాద్యవయి కల్పన చేయుదువన్ని నీవెయై

మనుప నుకార మధ్యవయి మన్ననతో నడిపింతు విన్నిటిన్.

దునుప మకారమంతమయి దోయిలిఁ బట్టి గ్రహింతువన్నిటిన్,

నినుఁ గన నోంకృతిన్ మునులు నిత్యము గొల్తు రనంత భారతీ! .

భావము. పద్మనిలయా! అకార స్వరూపవై సృష్టిని చేయుచుంటివి. ఉకార స్వరూపవై నడుపుచుంటివి. మకార రూపవయి నీలో కలుపుకొనుచుంటివి. అందువలననే నిన్ను చూచుట కొఱకు భక్తులు ఓం కార రూపమున నిన్ను నిత్యము కొలుచుచుందురు.

 

. పలుకుల తల్లివీవు. పరిపాలనఁ జేసెద వెల్ల లోకముల్,

మెలకువ తోడ పల్కినను మేలును గూర్తువు మాకు నట్టి మా

పలుకులలోన దోషములు వచ్చుట నీ దయ లేకపోవుటన్.

పలుమరు వేడుకొందు. వర భాషణ భాగ్యము నిమ్ము భారతీ! .

భావము. పద్మాక్షీ! నీవు పలుకులమ్మవు. లోకములను పాలించుదువు. మేము స్పృహ కలిగి మాటాడినచో మంచి చేయుదువు. విధముగా పలికే మా మాటలలో దోషములు నీ కృప లేకపోయినప్పుడే వచ్చును. మాచేత మంచిగా మాటాడచేయుమని నిన్ను వేడుకొందునమ్మా.

 

. పరుల మనంబులన్నిలువ, పట్టుగ వారికి శోభఁ గూర్పఁగా,

వరమగు భాషణం బెలమి వారి మనంబులు మెచ్చు మాటలున్,

నిరుపమ సాధు వృత్తి, మహనీయతయున్ భవదీయ సత్కృపన్

వరముగఁ గల్గినన్ గలుఁగు. భాగ్యమదే కద మాకు భారతీ! .

భావము. పద్మవక్త్రా!! నీ కృపావరముననే ఇతరుల మనస్సులలో స్థానము సంపాదించుట, వారికి శోభను కొల్పఁగలుగుట, శ్రేష్టమైన భాషణము, వారి మనసునకానందము కలిగించు విధముగ మాటాడుట, సాటిలేని మంచి ప్రవర్తన, మహనీయత, అనునవి మాకు లభించునమ్మా.అదే కదా మాకు భాగ్యము.

 

. ఇహ పర సాధకంబగు మహీస్థలి వాక్ పరి భూషణంబు.

న్నిహితముగా పరాత్పరుని నేర్పునఁ జూడఁగఁ జేయు. భాషణం

బిహమున శాంతి సౌఖ్యము లహీన పరాత్పరుచింతనంబునున్

మహిమను గొల్పునమ్మ. కనుమా! వర భాషణ మిచ్చి భారతీ! .

భావము. శివానుజా! మాటలాడుట అనెడి గొప్ప అలంకారము మానవులకు ఇహపర సాధక సాధనము. పరాత్పరుని నిపుణతతో సమీపమునుండి చూచునట్లు చేయును. మాటయనెడిది ఐహికముగా శాంతిని, అంతులేని పరాత్పర చింతనమును, మహిమను కలుగజేయును తల్లీ.

 

. మనమున హావ భావములు మాటలఁ గానఁగఁ జేయుచుండ నా

వినెడి మనంబులం గలుఁగు భిన్న వివేచనఁ జేసి మంచిగా

కనఁబడు, చెడ్డ కానఁబడు, కాంచెడివారి మనంబు సాక్షిగా,

వినఁబడ మంచిగా పలుకఁ బ్రీతిని జేయుమ మమ్ము భారతీ! ౧౦.

భావము.  పుస్తకభృతా! మాట యనునది మానవుని మనసులోని హావభావములను ముఖములో కనఁబడునట్లు చేయును. వినెడివారి వివేకమును పట్టి వినెడి మాటలు మంచిగా అనిపించవచ్చును, లేదా చెడ్డగా అనిపించ వచ్చును. మమ్ములను చూచువారి మనసులకు మేము మంచిగా అనిపించుకొను విధముగా పలుకునట్లు మమ్మనుగ్రహింపుము.

 

. వరగుణ గణ్య వాఙ్మధుర భవ్య మనోజ్ఞ సుధాస్రవంతిగా,

నిరుపమ మాతృమాధురి పునీత మనస్స్థితి మాన్య మూర్తిగా

చరణములంటి మ్రొక్కను, ప్రశాంతిగఁ గొల్వను తోచుటొప్పు నే

తరుణిని జూచినన్. వనిత తత్త్వము నట్లొడఁగూర్చు. భారతీ! ౧౧.

భావము. జ్ఞానముద్రా! తరుణిని చూచిననూ మంచి గుణగణ్యగా, వాగమృత ప్రవాహముగా, సాటిలేని మాతృమూర్తిగా భావించి ఆమె పాదములనంటి మ్రొక్కవలెనని, ప్రశాంత చిత్తముతో ఆమెను కొలువ వలెనని, అనిపించుట ఒప్పిదముగనుండును. వనితలను అందుకు తగిన తత్వముతో ఒప్పువారిగా చేయుమమ్మా.

 

. శరణు సరస్వతీ! సుకవి సన్నుత! సత్కమనీయ కావ్య సం

భరిత హితోక్తి మాధురి! ప్రపంచ వివర్ధిత బ్రహ్మ తేజమా!

నిరుపమ జ్ఞానతేజ మహనీయత మాకొడఁ గూర్చి నిత్యమున్

స్మరణము చేయఁ జేయుము సమర్థత నా విధి నెంచి, భారతీ! ౧౨.

భావము. రమామాతా! సరస్వ! తీశరణు తల్లీ! సుకవి సన్నుత! మంచి కమనీయ కావ్యములలోని మంచిమాటల రూపమున నిండియున్న తల్లీ! ప్రపంచమంతటను వ్యాపించియున్న బ్రహ్మ తేజమా! సాటి లేనిజ్ఞానము వలన కలిగెడి తేజస్సు యొక్క మహనీయతను మాకు సంభవింపఁ జేయుచు నిత్యమూ మా వ్రాత నెంచుచు నిన్ను స్మరించునట్లు చేయుము.

 

. ఇహ పర మెన్న శబ్ద చయమే కద మూలము సృష్టికంతకున్.

మహితుఁ డజుండు వాణి కృప మన్నికఁ గొంచు రచించునంతె. యీ

మహిమయు, మన్ననన్ గనఁగ మా వర వాణియె యోగ్య యందురే

సుహిత మనస్కులౌ కవులు, శోభిలు పండితు లెల్ల భారతీ! ౧౩.

భావము. పరా మాతా! ఇహమునందు పరము నందు సృష్టి మొత్తమునకు శబ్దమే మూలము. గొప్పవాఁడయిన బ్రహ్మ నీ కృపను సంపాదించి సృష్టి చేయునంతే. పండితులు, కవులు సమస్త మహిమ మన్నన అంతయు నీదే అందురు.

 

. నలువ ముఖాబ్జ సంభవ మనంత నిరంత వసంత సంతతుల్.

వెలుఁగులు చీకటుల్, మహిని వెన్నెల రాత్రులు, కాళ రాత్రులున్,

పలుకుల రాణి వాసమటు పర్విడఁ జేయును సృష్టినింతయున్.

కొలువయి యుండి నీ నలువ గొప్పను పెంచితివొక్కొ? భారతీ! ౧౪.

భావము. కామరూపా! బ్రహ్మ ముఖము నుండి సృష్టింపఁబడిన అనంత నిరంతర వసంతములు, చీకటి వెలుగులు, వెన్నెల రాత్రులు కాళ రాత్రులు, నీ నివాసమయిన బ్రహ్మ ముఖము సృష్టిని పరుగుపెట్టించునునీవు బ్రహ్మ ముఖమున కొలువుతీరి ఇంత గొప్పగా చేసి బ్రహ్మ కీర్తిని పెంచుచుంటివి.

 

. క్షరములె యక్షరమ్ములగు సాధన సత్కవితామృతంబగున్.

భరములె భాగ్య రాశులగు, భారత భారతి భవ్య తేజ సు

స్థిర కరుణా కటాక్ష ఫల తేజమునన్ విధి పత్ని పాద సు

స్థిర మతులైన వారికిని. దివ్య శుభ స్థితిఁ గొల్పు భారతీ! ౧౫.

భావము.  మహావిద్యా! దివ్య శుభ స్థితిని కలుఁగ జేసే భారతీ! నీ పాదములనమోఘ భక్తితోనాశ్రయించువారికి నీ యొక్క సుస్థిరమైనటువంటి కరుణా కటాక్షము వల కలిగిన తేజము చేత నీ కృపతో క్షరములే అక్షరములగును, సాధనచే సత్కవితామృతమే ఉద్భవించును కదా. బరువులే భాగ్య రాశులగును.

 

. సుమధుర భావనాంబర సుశోభిత మూర్తి యనంత కృష్ణ తే

జమును గనంగ సాధ్యమగు సద్వర భావ ప్రపూర్ణ దివ్య చి

త్త మహితులైన వారికిల. తత్పరతన్ నిజ తైజసంబునన్.

ప్రముదముతోడ వారి మది వర్తిలుచుందువు నీవు భారతీ! ౧౬.

భావము. మహాపాతకనాశినీ! మంచి శ్రేష్ఠమైన భావప్రపూర్ణులైన గొప్పవారికి మంచి మధురమైన భావనాకాశములోవిహరించువాడయిన కృష్ణుని యొక్క అనంతమైన తేజమును చూచుటకు సాధ్యపడును ఏలననగా నీవు అటువంటి వారి మనస్సులలో సంతోషముతో వసించుచున్నందుననే.

 

. నిరుపమ శాంతి తత్వము, వినిర్మల చిత్తము, సత్ప్రవృత్తి, నీ

సురుచిర సుందరాక్షర విశుద్ధ ఫలంబులనొందువారికిన్

వరములుగా లభించును. సభాసదు లెల్లెడఁ బ్రస్తుతింప. నీ

చరణములంటి మ్రొక్కెదఁ, బ్రశాంతముగా నను గాంచు. భారతీ! ౧౭.

భావము. మహాశ్రయా! నీ సాటిలేని అందమయిన అక్షర ప్రసూనములొందగలిగినవారికినిర్మల ప్రశాంత చిత్తము, మంచి నడవడిక ఫలములుగా లభించును,  అంతటనూ నన్ను సభాసదులు ప్రశంసించున్నతరి నేను నీ పాదములను మనసుచేత తాకి మ్రొక్కుచుందునమ్మా. నన్ను ప్రశాంతునిగా కాపాడుము.

 

. జగతికి మూలమెద్ది కన? శబ్దమె కాఁదగు. నక్షరాకృతిన్

సుగతికి సాధకంబునయి చూడఁగఁ జేయు ననంత తైజసం

బగు పరమాత్మ తత్వమును. భక్తి, స్వశక్తి ప్రయుక్త మార్గమున్

భగవ దనుగ్రహంబు మురిపంబునఁ గొల్పఁగ నీవు భారతీ! ౧౮.

భావము. మాలినీమాతా! ఆలోచింపగా జగతికి మూలము శబ్దమే అగును. నీవు మాకు స్వశక్తి ప్రయుక్త మార్గమును భగవదనుగ్రహమును కల్పించిననాడు అది అక్షరాకృతిలో సుగతికి మార్గమయిన

అనంత తేజోరూపమయిన పరమాత్మ తత్వమును చూచునట్లు చేయును.

 

. క్షరమగు సృష్టిఁ బుట్టి, ఘన కర్కశ వృత్తులు చేతఁ బట్టి,

స్థిర మగు జీవితంబున గతించెడి కాలము విస్మరించి, సం

కర మతులైన వారికిని గల్గినఁ గల్గును గాదె నీదు సుం

దర చరణాబ్జ మందుటయు, ధాత్రిని ధన్యులు వారు, భారతీ! ౧౯.                                             

భావము. మహాభోగామాతా! నశించెడి సృష్టిలో పుట్టి, కర్కశమైన వృత్తులను జీవితము గడుపుటకు ఎంచుకొని, స్థిరము కాని జీవితమున గడిచిపోయే కాలం గుర్తించకకలుషిత మతులైన వారికి కూడా నీ పాద పద్మదర్శనభాగ్యము నీ అనుగ్రహముచే కలుగవచ్చునమ్మా.వారెంతటి అదృష్టవంతులో కదా.

 

. కటిక కసాయి బోయకు ప్రకాశముఁ గొల్పఁగ నారదుండు ప్రా

కటముఁగఁ జెప్పరామిని ప్రకల్పనఁ జేసి మరా యటంచు సం

కటములు బాపు వర్ణములు గాఢముగా మది కెక్కఁ జెప్పఁగా

కటిక కసాయి సాధువయి కావ్యమునే విరచించె భారతీ! ౨౦.

భావము. మహాభుజా! కటిక కసాయి అయిన బోయవానికి జ్ఞానము కలిగించ గోరి నారదుడు వానికి సంకటములు బాపు రామ శబ్దమును మరా అని ఉపదేశించగా కసాయి జపము చేసి సిద్ధిపొంది నీ అనుగ్రహమున రామయణ కావ్యమునే వ్రాసెను.

 

. కనులకుఁ గానిపించునవి కావు మహీస్థలి శాశ్వతంబు లీ

కనులను మూసి జ్ఞానమను కంటికిఁ గన్పడు కాంచఁ గల్గినన్

వినుత పరాత్పరాక్షర సువేద్య మహత్వ కవిత్వ తత్వ సం

జనిత మయూఖజృంభణము. జక్కఁగ కానగనిమ్ము భారతీ! ౨౧.

భావము. మహాభాగా! కనులకు కనిపించునవి అశాశ్వితము.. జ్ఞాన నేత్రముతో చూడఁ గల్గినచో గొప్ప కవిత్వ తత్వమునుండి ఉద్భవించిన పొగడబడెడి పరాత్పరుని యొక్క అక్షయమైన సువ్యక్తమయే కాంతి విజృంభణ కన్బడును... దానిని చక్కగా చూచునట్లు చేయుమమ్మా.

 

. అజుఁడు సృజింపనోపునె సహాయము నీ వొనరింపకున్నచో,

ప్రజలు రహింపఁ గల్గుదురె? వాగ్వర మీవయి లేకపోయినన్,

సుజనులు శోభలొందుదురె? సూక్తిచయంబయి నీవు లేనిచో

నిజము వచింప నీవ మహనీయ జగత్క్రయ భాతి, భారతీ! ౨౨.

భావము. మహోత్సాహా! నీవు సహాయము చేయనిచో బ్రహ్మ సృష్టి చేయఁగలఁడా. మాటాడుట అనే వరముగా నీవు దక్కకున్నచో ప్రజలు రహింపఁ గలరా. సూక్తిచయమై నీవు లేనిచో సుజనులు కీర్తి కాంచఁ గలరా. నిజము చెప్పవలెనన్నచో ముల్లోకములందు కాంతిగా నున్నది నీవే సుమా.

 

. శుక పిక శారికా వితతి చూపులలో పరిభాష లేమిటో?

ప్రకటన చేయఁ బల్కు పలు భాషలలోఁగల భావమేమిటో?

సకల జగంబు భావనలు చక్కఁగ వాగ్వరమార్గమందునే

ప్రకటనఁ జేయుఁ గాదె. మది భావనవీవె కదమ్మ. భారతీ! ౨౩.

భావము. దివ్యాంగామాతా!పక్షుల చూపులలో పరిభాష యేమిటయి యుండును? అవి ప్రకటించే పలుకులలోని భావములేమిటయి యుండును? సృష్టి అంతటా భావనలను శ్రేష్ఠమైన పలుకులతోనే ప్రకటన చేయును కదా. మదులందు భావ రూపముననున్నది నీవే కదమ్మా.

 

. విదితము చేయు దైవమును వేదములెల్ల గ్రహింపఁ గల్గినన్.

విదిత మదెట్లగున్? సుగుణ పేశల చిత్త సరోజ వర్తివై

పదిలముఁగాఁగ నిన్నునిచి భక్తిని కొల్చిన వేద్యమౌను. సం

పదవు, మనః ప్రకాశ వర భాస్కర తేజవు నీవు. భారతీ! ౨౪.

భావము. సురవందితా! గ్రహించ గలిగినచో వేదములన్నియు దైవమును వ్యక్తమ గునట్లు చేయగలవు. ఐతే ఏవిధముగా వ్యక్తము కాగలవనిన సుగుణ పేశల చిత్త మనోజ్ఞవర్తివయిన నిన్ను మనస్సులో నిలిపి కొలిచినచో అది సాధ్యమగును. నీవే మా సంపద్సవు. మనస్సులో ప్రకాశించే శ్రేష్ఠుడయిన భాస్కర తేజస్సుతో నీవే ఒప్పి యుందువు.

 

. కదలదు లోక మించుకయు కాదని నీవు నిరాకరించినన్.

మెదలదు భూమి నీ సుగుణ మేదుర వర్ణ చయంబు లేనిచో,

వదలదు దుర్గుణార్ణవము భద్రము నీవయి లేకపోయినన్

మదుల వికాసమై వరలు మానిత మూర్తివి నీవు భారతీ! ౨౫.

భావము. మహాకాళీమాతా! కాదు అని నీవు నీ సహాయమును నిరాకరించినచో లోకము కొంచెమైనను ముందుకు సాగదమ్మా. నీ మంచి గుణములతో ప్రకాశించే వర్ణసమామ్నాయము లేనిచో భూగోళము ఇంచుకైనను కదలదు సుమా. నీ భద్రత లేనినాడు దుర్గుణార్ణవము కబళించక విడిచిపెట్టదు. మదులలో ప్రకాశమై వరలే మహనీయ మూర్తివమ్మా నీవు.

 

. అసదృశమంచు వస్తువుల నాదరణంబొనరింత్రు కొన్నిటిన్,

విషమముగా తలంచెదరు భీతిని కొందరు కొన్నిటిన్, భువిన్

విషయము స్పష్టమాయె,  కలప్రీతికి భీతికి హేతు వీవె(యం) యో

(చసమ పరాత్పరీ! మదిమహాద్భుత భావన నీవె భారతీ!)

ధిషణ నిధానమా! కృపను తేజముఁ గొల్పెడి దివ్య భారతీ! ౨౬.

 

భావమ. మహాపాపాశామాతా! సాటి లేనివిగా తలచి కొందరు కొన్ని వస్తువులను అతిగా ఆదరింతురు. కొందరు కొన్నింటిని విషమముగా భావించి భయపడుచుందురు. ఇట్టి భావనలన్నింటికినీ నీవే కారణము. నీవు హృదయములలో కలిగించు ప్రేరణయే ఇన్నిటికీ మూలము. సాటిలేని భారతీమాతా! మహాద్భుతమైన భావనలను మా హృదయములందు కల్పింపుము.

 

. క్షరము గణింప నీ జగతి. గౌరవ సన్మహనీయ గాధలన్

సురుచిరమై వెలుంగుటది చూడగ హేతువు నీవె కాదె? నీ

వరగుణ వర్ణ సంచయ మవారిత రీతిని నిల్పు నీ కథల్.

పరమ వివేక మీ జగతి భాసిలఁ జేయునదీవె భారతీ! ౨౭.

భావము. మహాకారా! లోకము నశించునదే. అట్టి యీ జగతిలో గౌరవపూరిత గాథలు ప్రకాశించుచుండుటకు కారణము నీవేకదా. వరగుణభాసితమైన నీ స్వరూపమైన వర్ణ సంచయము నీ మహనీయ గాథలను శాశ్వితముగా నిలుపునమ్మా. ప్రపంచమున పరమ వివేకమును భాసిలఁ జేయునది నీవేకదా.

 

. జగతి ననంత సాక్షి గుణ సన్నుత పాళికి, దుష్ప్రజాళికిన్.

సుగణిత సచ్చరిత్రకులు శోభిలు గాధలలోన, నీ కృపన్

నిగమ సువేద్య దైవమటు నిర్భర కీర్తి మనోజ్ఞ చంద్రికల్,

సొగసులు, భూమిపై వెలుఁగ సుస్థిరులై మనుచుంద్రు భారతీ! ౨౮.

భావము. మహాంకుశామాతా! సద్గుణములచే పొగడఁబడు మంచివారి సమూహమునకైనను, దుర్మార్గులకైనను వారి చరిత్రలకు లోకమే సాక్ష్యము. నీ కృప వలన గొప్పగా గుర్తింపఁబడెడి మంచిగా ప్రవర్తించు మహనీయులు వారి గాధలలో ప్రకాశించుచుందురు. వేదములందెఱుగఁబడు దైవము వలె వారియొక్క పూర్తిగా నిండిన మనోజ్ఞమైనకీర్తికాంతి యొక్క సొగసులు భూమిపై ప్రకాశించుచుండగా కీర్తి రూపమున భూమిపై స్థిరముగ నిలిచిపోవుదురు. అన్నిటికీ నీ కృపయే కారణము..

 

. మగనికి సృష్టి కర్త యను మన్ననఁ గొల్పితివీవె కాదె? నీ

మగని ముఖాబ్జమున్ నిలిచి మన్నికతోసృజియించు కార్యమున్ 

దగిన విధంబుగా సలిపి, తత్ప్రభ భర్త పరంబు చేయుదీ

వగణిత భావనా భరిత! అక్షర రూప విలాస భారతీ! ౨౯.

భావము. అగణిత భావనాభరిత! అక్షర రూపా! పీతామాతా! నీ భర్తయగు బ్రహ్మకు సృష్టికర్త యనెడి గౌరవమును నీవే కొలిపితివి కదా. నీ భర్త యొక్క ముఖపద్మమున నీవు వసించియుండి, గౌరవముతో సృష్టి చేయు పనిని చేసి, కీర్తిని భర్తకు కలిగించుచుంటివికదా.

 

. హరి జగతిన్ వహించియు నహర్నిశలున్ మదిఁ జింతనొందు. నీ

వరయుచు భాషణాధ్వర మహావ్రతమున్గృప సేయకున్నచో

జరుగునదెట్లు లోకమని. చక్కని వాఙ్మహనీయ భాగ్యమై

నిరుపమ లోకమాతవయి నిత్యము వర్తిలుదీవు భారతీ! ౩౦.

భావము. విమలామాతా! లోకభారమును శ్రీహరి భరించుచు, అన్నియు నీవు చూచుచు భాషణాధ్వర మహావ్రతమును నీవు కృపతో చేసియుండనిచో నేను పనిని ఏవిధముగా చేయ గలిగి యుండెడివాడిని? లోకము విధముగా జరుగును అనుచు నిత్యమూ ఆలోచించుచుండును. నీవు సాటిలేని మహనీయమైన వాగ్రూపములో మాకు లభించిన భాగ్యముగా నిలిచి ప్రవర్తించుదువమ్మా.

 

. పలుకుల లోన మాధురులు, పంచఁగ నేర్చిన పండితాళికిన్

సలుపుదురెల్ల లోకులును సత్కృతు లెన్నుచు సంస్తుతించుచున్

గలుష వినాశివై సుగుణ కారణమై యిల కాచుచున్నచో

వెలుగుదు రందరున్ భువిని వేల్పుగ నిన్ మదిఁ గొల్త్రు భారతీ! ౩౧

భావము. విశ్వమాతా! మాటలలోని మధురిమలను పంచెడి పండితులనందరూ గుర్తించి గౌరవించుదురు.నీవు కలుషములు బాపుచుమా సుగుణకారకురాలివగుచుఉన్నచో అందరూ ప్రకాశించుచు నిన్ను నిత్యము కొలుచుచుందురు. దయతో నీవావిధముగా చేయుచు మమ్ము కాపాడుము.

 

. వినుటకు వీనులిచ్చితివి విజ్ఞత నిచ్చితి విన్నవెన్నఁగన్.

గనుటకుఁ గన్నులిచ్చితివి. కాంచినవాటిని మన్నికెన్నగా.

ననుటకు నోటినిచ్చితివి. హాయిగ పల్కఁగ సత్యమెన్నుచు.న్.

మనుటకు మంచిమార్గమిడి మమ్ము కృపం గనుమమ్మ! భారతీ! ౩౨.

భావము. విద్యున్మాలామాతా! వినుటకు చెవులొసంగితివి. విన్నవాటిలో మంచిచెడ్డలరయుటకు విజ్ఞతనిచ్చితివి. చూచుటకు చూచిన వాటిలో మంచిచెడ్డలెఱుఁగుట కొఱకు కన్నులనిచ్చితివి. సత్యమును గ్రహించి సుఖముగా పలుకుటకు నోటినిచ్చితివి. జీవించుటకు మంచి మార్గమును కల్పించి మమ్ములను కృపతో చూడుమమ్మా.

 

. అభయము నిచ్చి భాషణ ననంత శుభాస్పద మార్గ వేద్య

త్ప్రభవ విశేష శక్తియుత ధార్మిక వర్గ నిరంత వర్తనన్

శుభములు గొల్ప జేయఁ గదె! సుస్వరభాగ్యమనోజ్ఞ వాఙ్మయీ!

విభునికి వేల్పు వైతివిగ. విజ్ఞత నొప్పుటఁ జేసి భారతీ! ౩౩.

భావము. వైష్ణవీమాతా! మంచి స్వరమనెడి భాగ్య స్వరూపమైన వేదమాతా! నీవు విజ్ఞతతో ఒప్పుచుండుట చేసి నీ భర్తకే దేవతవైతివమ్మా. మాకు అభయమునిచ్చి, భాషణ చేత అంతులేని శుభములకు నెలవైన మార్గము తెలిసిన, మంచిని పెంచగలుగు అధికమైన శక్తితో కూడిన ధర్మప్రవర్తకుల నిరంతర ప్రవర్తన మూలముగాశుభములను కలుఁగునట్లు చేయువచ్చును కదా తల్లీ.

 

. కదలిక లేని జన్మలకు గౌరవమెద్ది? విధాత సృష్టిలో

మదిని కదల్చు మార్గమది మాన్యతనొప్పెడి భాషణంబు.

న్మధుర వచోవిలాసముగ మాన్యులు మెచ్చ వచించు టొప్పగున్.

వదులక నా కొసంగుమది. వర్ధిలఁ జేయఁగ నన్ను భారతీ! ౩౪.

భావము. చంద్రికామాతా! బ్రహ్మ సృష్టిలో చైతన్యము లేని జన్మలకు మనస్సులను కదల్చ గలిగినది గౌరవముతో కూడిన భాషణమే. అందు చేతనే మధురమైన వచో విలాసముగా గొప్పవారు మెచ్చునట్లు పలుకుట ధర్మము. నన్ను వర్ధిల్ల చేయుటకు నీవు నాకు అట్టి వచోవిలాసమును కలిగించుము తల్లీ.

 

. జగతిని కల్గు దైవమది సద్విభవంబయి వెల్గుచుండు, నీ

యగణిత సత్ప్రభావుల కహర్నిశలున్ శుభ చింతనంబె. లో

జగతి వెలుంగు దైవమును చక్కఁగ నంతట చూడ నేర్తు రీ

ప్రగణిత మూర్తులిద్ధర నిరంతరమున్ నినుఁగొల్త్రు భారతీ! ౩౫.

భావము. చంద్రవదనా! మంచివారి యొక్క వైభవము రూపములో దైవమీలోకమున వెలుఁగుచుండును.. గొప్ప మంచిప్రభాపూర్ణులకు అహర్నిశలూ మంచిని గూర్చియే ఆలోచన ఉండును. తమలోనున్న ప్రపంచమును చక్కగ చూచుచు వీరు నిన్నే కొలుచుదురుకదా. 

 

. మునుమును పాడు లోకమున పూజ్యులు దుర్భర జీవనంబుతో

మనుటకు మూలమన్నటుల మంచిని దుష్టులు దూరుచుంట,

జ్జనులను దుఃఖపెట్టుట, విషాద పరిస్థితి గొల్పనోమొ,. నీ

వనిశము మంచివారికి మహర్దశఁ గొల్పుచు నేలు, భారతీ! ౩౬.

భావము. చంద్రలేఖావిభూషితా! రాబోవు రోజులలో పాడగుచున్న లోకములో సజ్జనులు భరింపరాని కష్టమయ జీచితము గడపుటకు మూలము వీరే అనే విధముగాదుర్మార్గులు మంచి పనులను తిట్టుకొనుచు,మంచివారిని దుఃఖపెట్టుట విషాద పరిస్థితిని కల్పించుటకేమో. మంచివారికెల్లప్పుడు నీవు మహర్దశనే కలిగించుచు పాలించుమమ్మా.

 

. మనమున భక్తి భావమును మాకు నొసంగిన లోటు రాదుగా?

ఘనముగ మా లలాటమున కర్మలు వ్రాసిన గౌరవంబెగా?

గుణగణనీయ మూర్తులుగ గొప్పగ చేసిన మమ్ము నొప్పుగా?

(గణనము చేయుమా జనని!)

కని మము చేయుమట్టులనె గౌరవమొందఁగ జేయు భారతీ! ౩౭.

భావము. మేము గౌరవింపఁబడునట్లు చేయు సావిత్రీమాతా! మా మనస్సులలో భక్తిభావమును నీవు నెలకొల్పినచో నీకేమీ లోటు రాదుకదా. మా నుదుటి వ్రాత బాగుగా ఉండునట్లు వ్రాసినచో నీకు గౌరవమే కదా.మమ్ములను గుణగణులుగా చేసిన ఒప్పిదముగనే ఉండును కదా. నా మాటలను గణించి విధముగా చేయుము.

 

. సునిశితమైన తత్వమును శోభను గాంచ నొసంగితీవు. మా

కనిశము తోడు నీడగ భవార్ణవ మీదఁగఁ జేయ నిల్చితే.

మనమున సంశయార్ణవము మాపవదేల త్వదీయ శక్తి నే

ఘనమని నమ్మి కొల్వఁగను గాంచఁగ వేడెద నిన్ను భారతీ! ౩౮.

భావము. సురసామాతా! మేము శోభించుటకు సునిశిత తత్వమునిచ్చితివి. సంసార సాగరము ఈదుటకుమాకు తోడుగా బలమునిచ్చితివి. అట్టి నీవు మా మనస్సులో సంశయమనెడి మహార్ణవమును పోగొట్టవేమి? నీ శక్తినే గొప్పగా నమ్మి నిన్ను కొలుచుటకై నేను నిన్ను చూడవలెననివేడుకొనుచున్నానమ్మా.

 

. మొరవినుమా! దయా సరసి! పూజ్యుల నే కొలువంగఁ జేయుమా!

నిరతమనంత భక్తిమతి నిర్జర పాళి భజింపఁ జేయుమా!

కరుణ దయార్ద్ర చిత్తమున గాంచఁగఁ జేయు మనంతు నెల్లెడన్.

సరి యెవరమ్మ నీకు. విలసన్నుత మంగళ దాయి భారతీ! ౩౯.

భావము. విలసన్నుత మంగళములను కలిగించు దేవీమాతా! దయాపరా! మా మొర వినుము. మేము పూజ్యులయిన వారినే సేవించునట్లు చేయుము. దేవతలను భక్తితో ఎల్లప్పుడూ కొలుచునట్లు చేయుము. అనంతుని కరుణతో దయార్ద్ర చిత్తముతో అంతటా చూచునట్లు చేయుము.

 

. పలుకులు భావముల్ భవుఁడు పార్వతి రూప మనంగ వచ్చు నా

పలుకును వీడి భావమును భావము కల్గని పల్కులుండునే?  

పలుమరు చింతితుండనయి పట్టుగ గాంచగ శారదాంబయే

పలుకును, భావమై వరలు భవ్యుఁడు పార్వతి యెన్న. భారతీ! ౪౦.

భావము. దివ్యాలంకార భూషితా! వాగర్థాలు పార్వతీ పరమేశ్వరులనవచ్చును.వారి వలెనే వాగర్థములు ఒకదానిని విడిచి మరొకటి ఉండనేరదు.ఆలోచింపగా వాదర్థములు శారదా స్వరూపములే అనగా నీవే పార్వతీ పరమేశ్వర స్వరూపము.

 

. గగన తలంబునన్ వెలుఁగు కాంతిమయుండగు సూర్య దేవుఁడీ

జగతికి వెల్గులిచ్చినను సన్నుతినీ జగమంత నిల్వగా

నగణిత శబ్ద జాతమున కాద్యము నీవయి నిండియుండుటన్                                                 

నిగమ సువేద్యు సృష్టికి సునిశ్చిత సుస్థితి కల్గె భారతీ! ౪౧.                                                

భావము. వాగ్దేవీ! ఆకాశమునుండి సూర్యుఁడు వెలుగులిచ్చుచున్నప్పటికి సృష్టి మొత్తము నిలుచుటకు శబ్దమునుండి నీవుద్భవించుచుండుట చేతనే పరమేశ్వర సృష్టినిశ్చితమైన స్థితితో నొప్పఁగలుగుచున్నదమ్మా.

 

. కనులకుఁ గానిపించునవి కల్గు టబద్ధము. జ్ఞాన చక్షువున్

గనఁబడు టాత్మ తత్వమది కర్మ ఫలంబునఁ గల్గు. నిక్కమై

వినఁబడునట్టి శబ్దముల విస్తృత మైనది నిత్య సత్యమో

మ్మను ప్రణవాక్షరం బొకటి, హత్తెను మన్మతిలో భారతీ! ౪౨.

భావము. వసుధామాతా! కనులకు కనిపించునవి అబద్ధము,.జ్ఞాన నేత్రమునకు ఆత్మతత్వము కనఁబడుట కర్మ ఫలితముననే కలుఁగును. నిజముగ వినఁబడునట్టి శబ్దములలో ఓం అను ప్రణవాక్షరము నిత్య సత్యమై విస్త్రుతమైనది. ఓమ్ నామదిలో హత్తుకొనెనమ్మా.,

 

. జయములనిచ్చు తల్లివి,  ప్రజన్ గృపఁ గాచెడి కల్పవల్లివై

భయహర తేజమై నిలిచి భద్రముఁ గొల్పెడి భద్రమూర్తివై.

నయమును, నేర్పు,  నేర్పుచును, నా మది వర్తిలు శారదాంబవై

రయమున పద్యరూపమున ప్రస్ఫుటమైతివి నాకు భారతీ! ౪౩.

భావము. తీవ్రా మాతా! ప్రజలను కాపాడు కల్పవల్లివై జయములనిచ్చుదానవు.. భయమును పోఁగొట్టుదానివయి,మనసులలో నిలిచి బ్రద్రతను కల్పించెడి భద్రమూర్తివయి, న్యాయము, నైపుణ్యము నేర్పుచు, నా మనసున వసించు వాగీశ్వరివై వేగముతో కూది పద్యరూపములలో నీకు స్పష్టమైతివమ్మా.

 

. తలపులలోన నిల్పుమిక తత్పరతత్వము. దైవ మార్గమున్.

తెలిపెద భావనా చయము, తెల్పగ భాష నమేయ రీతిలో

గొలుపుము. నీ పదాబ్జ నుత గోచర దీప్తులు దుర్మదాంధమున్

నిలపడనీక మాపు నిక. నీ దయ నా కభయంబు భారతీ! ౪౪.

భావము. మహాభద్రా! దైవ మార్గమును తత్పరత్వమును నా ఆలోచనలలో ని నేను నా భావనలను తెలిపెదను. ఆవిధముగ తెలుపుటకు భాషను నాలో నిలుపుము. నీ పాద దీప్తులు దుర్మదాంధమును పారద్రోలును.నీ దయయే నాకు అభయమమ్మా.

 

. మదికి పురాణముల్ కథలు, మార్గ సుదర్శకమెట్టులౌను?

ద్బుధజన వాక్ప్రభా కలిత బోధక వాఙ్మహనీయ సారమే

మదిని రహించి నిల్చు. వర మాతృకలై వికసించుచుండు. సం

పదలవి మాకునెల్లెడల భాసిత సత్కృతులమ్మ. భారతీ! ౪౫.

భావము. మహాబలా! పురాణములు కథలు మార్గదర్శకములగుటకు పెద్దలు చెప్పెడివే మా మనసులలో నిలుచును. రచనకు మాత్రుకలై వికసించుచుండును. అవియే మాకు సంపదలు. భాసించు సత్కృతులవేనమ్మా.

 

. చదువుల జోలికేగుటది సాధ్యము కానిది నీవు లేక. సం

పదలకు నేగుటన్నయది వర్ధిలఁ జేయదు నిన్ను వీడ. నే

కదలక నీ మహత్వమును కావ్యగతిన్ విరచింపఁ జూచినన్

వదులవవెల్ల నన్ను. వరవాఙ్మయ భాగ్య విభాతి భారతీ! ౪౬.

భావము. గొప్ప వాఙ్మయమనెడి భాగ్యమున ప్రకాశించు భోగదాయీ! నీవు మాలో లేకపోయినచో చదువుకొనుట అసాధ్యము. నిన్ను వదిలి సంపాదనకు ప్రయత్నించినను అది వర్ధిల్లఁ జేయదు. నేను కదలకుండ ఉండి నీ గొప్పఁదనమును కావ్యముగా రచింపఁ బూనినను సంపాదనా తత్పరత మున్నగునవి నన్ను వదలకున్నవి.

 

. తనయుఁడ నేను. తల్లివి. నితాంతము నీ మహనీయ భావనా

ధనమును కోరుచుండెదను. తప్పక నా కమనీయ కల్పనా

గుణ గణనాభిజాతమయి కోరిన నీమహనీయ తేజమే

మనముల సుస్థిరంబగుచు మన్ననఁ గొల్పును గాదె భారతీ! ౪౭.

భావము. భారతీ! నేను సుతుఁడను. నీవు తల్లివి. ఎల్లప్పుడు నిన్ను గూర్చిన భావనాగుణము యనెడి ధనమునే నేను కోరుదును. తప్పకుండా నీకమనీయమగుకల్పన చేసెడి గుణమునెన్నుట నుండి జనించుచు నేను కోరెడి నీ మహనీయ తేజస్సే నా మదిలో సుస్థిరమయి నాకు గౌరవమును కొలుపునమ్మా.

 

. ప్రణవమె నీవు. మద్ధృది విరాజిత భవ్య ప్రబంధ (శారదా) వాణి! సు

(జననివి) స్వనమది  నీవు. సంస్కృత ప్రశస్త కవీశ్వర తేజమీవు.

ద్గుణ గణవీవు. నీ మహిమ తోచెడు భక్త కవీశ్వరాళికిన్.

జననిరొ! సంస్తుతించెదను సద్గుణ భావనఁ గొల్పు. భారతీ! ౪౮.

భావము. భామామాతా! ప్రణవస్వరూపమే నీవు! నా హృదయమున విరాజిల్లెడి దివ్య ప్రబధమమ్మా నీవు. సంస్కృత కవుల ప్రశస్తమైన తేజస్సు నీవే నమ్మా. నీవు సద్గుణ గణనవే. భక్తులకు నీ మహిమయే మనసునకు తోచునమ్మా. అమ్మా! నిన్ను స్తుతింతును నాకు సద్గుణభావననే ప్రసాదించుము.

 

. జగతిని కొల్పునప్పుడె ప్రజన్ సుగుణాళిగఁ గొల్ప వచ్చుగా!

ప్రగతికి మూల కారణము భద్ర విరాజిత భావ భాగ్యమౌ

నగణిత భవ్య భాష. సుగుణాకరమౌ వర భాష గొల్పినన్

ప్రగణితులే వసుంధరను భవ్యముగా ప్రభవింత్రు భారతీ! ౪౯.

భావము. గోవిందమాతా! సృష్టించునప్పుడే ప్రజల మేలునే ఆలోచించవచ్చునుకదమ్మా. భవ్యమైన భాష భద్రతా గుణముచే ప్రకాశించెడి భావమనెడి భాగ్యమునకు దాని అభివృద్ధికి మూలము. సుగుణములకు మూలమైన భాషను కొల్పినచో భూమిపై గొప్పవారే గొప్పఁగా పుట్టుదురమ్మా.

 

. ననుఁ గను. రామకృష్ణ కవి నాన్ రహియింతు, ననన్య సాధ్యమై

తనరెడు చిత్ర బంధ కవితా మహిమాన్విత మార్గమీవెగా,

గొనకొని కల్వపూడి వర కోవిద రాఘవు శిష్యరేణు వే

ననగ ప్రవర్ధమానుఁడ, మహార్తిని నిన్ వినుతింతు భారతీ! ౫౦.

భావము. గోమతీ! నన్ను చూడుము. రామకృష్ణ కవిగా రహింతును తల్లీ. అనన్య సాధ్యమయి ఒప్పెడి చిత్ర బంధ కవిత్వముల మహిమతో కూడిన మార్గము నీవే కదా. నేను శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారి శిష్యపరమాణువనునట్లుగా వర్ధిల్లుదును. గొప్ప ఆర్తితో నిన్ను వినుతించుచుంటినమ్మా.

 

. స్వరములలోన నోంకృతిని, స్వాదుశుభాస్పద భాషణంబునున్,

నిరుపమ నిర్మలాత్మను, వినీతి ప్రవృత్తిని, నిర్వికల్పమున్,

గరువముఁ బెంచు కావ్యకృతి, గౌరవనీయుల సన్నిధానమున్,

దొరలఁగఁ జేయు మెల్లెడలఁ దోచగనిమ్ము శుభాళి, భారతీ! ౫౧.

భావము. వంద్యామాతా! ఓంకార శబ్దమును, మధుర శుభంకరభాషణమును సాటిలేని నిర్మలమైన ఆత్మను,నైతిక ప్రవృత్తిని, నిర్వికల్ప జ్ఞానమును, అందరూ ప్రశంసించు కావ్యనిర్మాణ దక్షతను, గౌరవనీయుల సాన్నిధ్యము, ఎల్లెడలా అనుభవింపఁ జేయుము.శుభసంహతినే నా మనసునకు తోచునట్లు చేయుము.

 

. ధ్వని జనియింప భావమును, తత్వము, నెన్నసుసాధ్యమౌను,

ధ్వనియె రహస్య సృష్టికిల దారులు కొల్పెను ప్రస్ఫుటంబుగా

ననితర సాధ్య సాధక మహాధ్వని యోంకృతి నీదు రూపమే

మనమున మారుమ్రోగు నది, మాన్యత నొప్పెడి దివ్య భారతీ! ౫౨.

భావము. మన్ననతో ఒప్పెడి జటిలా! శబ్దము పుట్టినచో భావమును, తత్వమును, తెలుసుకొనుట సాధ్యమగును. అట్టి ధ్వనియే రహస్యమైన సృష్టికిమార్గము లేర్పరచెను. అట్టి ధ్వనులలో అనితర సాధ్యమైనది ఓంకార నాదము. అది నీ పూర్ణ రూపమేనమ్మా. అది నా మనస్సులో మారుమ్రోగుచూ ఉండునమ్మా.

 

. సురుచిర బ్రహ్మ దృష్టిని వసుంధర నెల్ల సృజంబులయ్యె సు

స్థిరమన స్థావరాదులు. వశీకరణంబయి మాయ చేతికిన్

నరకము చూచుచుండెను, వినాశనమే కనిపించునెల్లెడన్,

రుణను  జూపి కావు మిల. కామిత దాయిని! దివ్య భారతీ! ౫౩.

భావము. కోరికలను పండించు మనోజ్ఞవయిన వింధ్యవాసా! మిక్కిలి కాంతివంతమయిన బ్రహ్మ చూపు తగిలినంత మాత్రము చేతనే భూమిపై స్థావరాదులన్నియు స్థిరములనుకొను విధముగా సృజింపఁబడినవి. మాయకు చిక్కి నరకముననుభవించుచున్నవి. ఎక్కడ చూచినను వినాశనమే గోచరమగుచున్నది. నీవు కరుణించి కాపాడుమమ్మా.

 

. ప్రగతిని కోరువారలకు భాగ్యము నీ కృప, భద్ర మార్గమున్

సుగమము చేయునమ్మ. మధుసూదనుఁడైనను మెచ్చు నీదు సత్

ప్రగణిత భావనా కృతిని వర్ధన శక్తిని. లోక బాంధవీ!

నిగమ సువేద్యుఁడౌ విధికి నేర్పుగ నీ గతి నేర్పు భారతీ! ౫౪.

భావము. వింధ్యాచల విరాజితా! వేదములందెఱుఁగబడు బ్రహ్మకు నీ సుగతిని నిపుణతతో నేర్పెడి లోక బాంధవీ! ప్రగతి పథమున చరించువారికి నీ కృపయే భాగ్యము. భద్రమార్గమును సుకరముగా లభింపఁ జేయునుకదా. నీ యొక్క ప్రశంసనీయమైన భావనాధన వివృద్ధి చేయు శక్తిని మధుసూదనుఁడునూ మెచ్చునమ్మా.

 

. జగతికి వెల్గువీవె. విరజాజుల సౌరభమీవె.  వెల్గుదీ

వగణిత భావ బోధన నహర్నిశలున్ వర శబ్దజాలమై.

సుగమము చేసి సాధకుల సుందర స్వప్నము మోక్షసిద్ధి. సత్

ప్రగతిని సాగఁ జేయుము నిరంతరసాధన నిచ్చి భారతీ! ౫౫.

భావము. చండికా మాతా! లోకమునకు వెలుగువు నీవే. విరజాజుల సువాసన నీవే.గొప్ప జ్ఞానమును కలుగఁజేయుశబ్దరూపమున నీవు ఎల్లప్పుడూ ప్రకాశింతువు. సాధకుల సుందర స్వప్నఫలమైన మోక్షసిద్ధిని సుగమము చేయుము.నిరంతర సాధననిచ్చి మంచి ప్రగతిమార్గమున నడిపించుమమ్మా.

 

. క్షణములలోన పద్యములు కమ్మగ వ్రాయు కవీశులందు, సద్

(గణిత) వినుత వధానముల్ సలుపు  (గౌరవమొందు) విజ్ఞతనొప్పు వధానులందు, ని

న్ననయము గొల్చు భక్తుల మహాద్భుత భావవిలాసమందు నీ

వనయము గొల్వు తీరెడి మహాద్భుత శక్తివి చూడ భారతీ! ౫౬.

భావము. వైష్ణవీ మాతా! అలవోకగా పద్యములు కమ్మగా వ్రాయు కవీశ్వరులందు, గణితవధానము సునాయాసముగా చేయు అవధానులందు, నిన్ను ఎల్లప్పుడూ కొలిచే భక్తులు గొప్ప అద్భుతమైన భావ విలాసమున నీవెల్లప్పుడుకొలువుతీరియుందువమ్మా.నిజముగా నీవు మహాత్మ వరేణ్యవుమ్.

 

. నిరుపమ సాధనా పటిమ నిన్ను గ్రహింపఁగఁ జేయు. నీదు సుం

దర దరహాస చంద్రిక ముదంబును గూర్చును మాకు నిత్యమున్.

మరి మరి వేడుకొందు ననుమానము శూన్యముఁ జేసి నిన్ మదిన్

స్థిరముగనుండఁ జేయునటు చేయుము నాకు మనోజ్ఞ భారతీ! ౫౭.

భావము. మనోజ్ఞమైన బ్రాహ్మీ! సాటిలేని భావనా బలము నిన్ను గ్రహించునట్లుగా మమ్ము చేయును.నీ అందమైన చిఱునగవు మాకు నిత్యమూ సంతోషమును కూర్చునమ్మా.నాలో అనుమానమును పోవునట్లు చేసి, మనస్సు నిన్ను స్థిరముగా లోన ఉంచుకొనునట్లు  చేయుమని మరీ మరీ ప్రార్థించుచున్నాను.

 

. వరముగ నీవె దక్కితివి వర్ధిలఁ జేయగ మమ్ము తల్లివై

నిరుపమ మార్గదర్శివయి నేర్పెదవీవు చరించు పద్ధతిన్,

గురువయి కూర్మి చూపెదవు కోరిన విద్యలనెల్ల నేర్పుచున్.

భరముగ నెంచవెన్నడును భక్తులనో మహనీయ భారతీ! ౫౮.

భావము. మహనీయవైన బ్రహ్మజ్ఞానైకసాధనా! మమ్ము వృద్ధి చేయు తల్లివై మాకు వరముగా నీవు లభించితివమ్మా. సాటిలేని మార్గదర్శిగా ఉండి నీవు మాకు ప్రవర్తనా విధానమును మప్పెదవమ్మా. మేము కోరుకొనెడి విద్యలు నేర్పు గురువుగా ఉండి ప్రేమను చూపించుదువుకదా.నీ భక్తులను ఎప్పుడూ భారముగా తలపోయని తల్లివమ్మా నీవు.

 

. సరియెవరమ్మ నీకు మనసా వచసా భవదీయ పాద సం

స్మరణము చేయు భక్తులను మానసమందు వసించి కాచుటన్?

జరిపెదవీవమోఘమగు సత్కృతులన్ కవికావ్య కాంతికిన్

వరగుణ మేధకున్,  ధృతినవారిత రీతి నొసంగు భారతీ! ౫౯.

భావము. శ్రేష్ఠమైన గుణములతోనొప్పు మేధా సంపత్తిని అంతు లేని విధముగా ప్రసాదించు సౌదామినీమాతా! త్రికరణ శుద్ధిగా నిన్ను కొలుచు భక్తుల మనస్సులలో ఉండి కాపాడుటలో నీకు సాటి ఎవ్వరూ లేరమ్మా. కవియొక్క కావ్య ప్రకాశమునకు నీవు సత్కృతి జరిపించుచుందువు కదా.

 

. గరువము బాపు దేవతవు, కామిత సత్ ఫలదాతవీవు. నీ

చరణము సంస్మరించినను సంస్మృతులెన్నడు చేర రావు. సు

స్థిరముఁగ నిన్ను నామదిని జేర్చి భజింపఁగ శోభ గూర్తువే

నిరుపమ నిర్వికల్పమును నేర్పుగ మన్మది నుంచు భారతీ!  ౬౦.

భావము. సుధామూర్తీ! నాలోని గర్వమును పోఁగొట్టెడి దేవతవమ్మా నీవు. నీ పాద సంస్మరణ మాత్రముననే సంస్మృతులు విడిపోవును. నా మనస్సులో సుస్థిరముగా నిన్ను చేర్చి భజించితినేని నాకు శోభను కలుగఁ జేయుదువు. సాటి లేని నిర్వికల్పమును నీ నిపుణతతో నా మనస్సులో స్థిరపరచుము తల్లీ.

 

. మనుజులు వ్రాయు వ్రాతలవి మానక నీవయి యుండునెల్లెడన్,

మనుజులు పల్కు భాషలును మానక నీవయి యుండునన్నియున్,

మనుజుల హావ భావములు మానక నీవయు యొప్పి యుండు నీ.

మనుజుల జ్ఞానరూపమయి మన్ననఁగొల్పెదవీవె భారతీ! ౬౧.

భావము. సుభద్రా మాతా! మానవులువ్రాయునవి, పల్కునవి, ముఖములందు వ్యక్తమగు హావభావములు నీవే. జ్ఞానరూపమున మనుజులలోనుండి గౌరవము కలిగించునది నీవేనమ్మా.

 

. హృదయపు స్పందనంబుడుగ హృద్వరభావమనంత తేజమై

పదిలము గాత నీదు వర పాదయుగంబున ముక్తినొందగా,

మదికిననంత సాధనము మాతృ పదద్వయ సేవనంబెగా?

మదిఁ గని నిన్నుఁ జేరెదను మన్నికతో ననుగాంచు భారతీ! ౬౨.

భావము. సుపూజితా మాతా!ప్రాణము పోవు సమయమున హృదయమందలి శ్రేష్టమైన భావము శాశ్విత తేజమైనీ పాదయుగళమునందు ముక్తి కొఱకై పదిలమగుగాక. మనసునకు అనంతుని సాధించుట యనునదు మాత్రుపాదద్వయ సేవవలననే సాధ్యము కదా.నా మనసులో నిన్ను చూచుచు నిన్ను చేరుదునమ్మా. నన్ను దయతో చూడుము..

 

. మనము విచిత్ర సాధనము, మంచికి, చెడ్డకు మార్గమిద్ది. సద్

గుణముల కాలవాలమయి గొప్పఁగఁ జేయును లోకమందు. దుర్

గుణములనేకముల్ కలిగి  క్రూరునిగా విరచించి చూపు (నీ) యో

(మనమది నీవె కావె? యనుమానము లేదు)

ప్రణవమ! నీవె నా మనము, వర్ధిలఁజేయు పవిత్ర భారతీ! ౬౩. 

   

భావము. పవిత్రమైన సువాసినీ మాతా! మనసనునది ఒక వింత పరికరము.మంచికయినను చెడ్డకయినను మనసే మార్గము. మంచికి స్థానమయి గొప్పకార్యములు నిర్వహింపచేయకలదు. చెడ్డకు స్థానమయి దుర్మార్గునిగనూ మార్చకలదు. మనస్సు అనెడిది నీవే కదా. ఇందావంతయు అనుమానము లేదమ్మా.

 

. పర మహనీయ బ్రహ్మమది పావన సచ్చరితామృతంబు సు

స్థిరముగఁ గొల్పు  మాకు వరసిద్ధి గణాధిపు సత్కృపాకృతిన్.,

స్థిరమగు భావ భారతికి తేజము గొల్పుననేక సత్పదో

ద్ధరణముఁ జేసి పల్కులిడు, ధార్మికతత్వముకల్గ భారతీ! ౬౪.

భావము. సునాసా మాతా!వరసిద్ధి వినాయకుని కృపగా మాకు పరబ్రహ్మము పవిత్రమైన సచ్చరిత్రమును సుస్థిరముగా నిమ్ము. ధార్మిక తత్వము కలుగు విధముగ అనేక సత్పదోద్ధరణము చేసి స్థిరమయిన భావ భారతికి తేజస్సును కలుగజేసి, చక్కని మాటలను ప్రసాదించుము.

 

. స్మర రిపు నాశ్రయించి, సతి సత్పద ధూళి వహించి, చిత్త సం

చరిత దురంత దుష్టములు సాధనచేసి నశింపఁ జేసినన్,

మరువఁగ రాని సత్యధన మార్గము నీవె గ్రహింపనిత్తువో

పరమదయాన్వితా! సుగుణ భారతివై మముఁ గాచు భారతీ! ౬౫.

భావము. సుగుణములతో ప్రకాశించుదానివై మమ్ములను కాపాడునట్టి వినిద్రా మాతా! పరమ దయాన్వితా! పరమశివునాశ్రయించి, సతీదేవి పాదరజము వహించి, సాధనతో దురంత దుర్గుణములు నశింపజేయగా నీవే సత్యమార్గమును చూపుదువమ్మా.

 

. సుజనులఁ జేర్చి సచ్చరిత శోభిలఁ గూర్చెడి తల్లివీవు. నా

విజయపరంపరన్ వెలుఁగు విశ్వవిధాతవు వేదమాత! నీ

వజునకు రాణివీవయి శుభావహవైతివి వానికమ్మరో!.

ప్రజలకు మేలుగూర్చుమిల పాపవిదూరులఁ జేసి. భారతీ! ౬౬.

భావము. పద్మ లోచనా! మంచి ప్రవర్తనను సుజనులందు చేర్చి వారిని శోభిల్లునట్లు చేసెడి తల్లివమ్మా. వేదమాతా! నీవు నా విజయ పరంపరలో ప్రకాశించు సృష్టినున్న బ్రహ్మ పదార్థము నీవేనమ్మా. బ్రహ్మరాణివైనావు. అతని శుభములకు మూలమైనావు. ప్రజలను పాపములనుండి దూరముగా ఉంచి మేలుకూర్చుమమ్మా.

 

. కవన సుధాపయోధిని ప్రకాశితమౌనటు, కావ్యరాజమే

నివసనమై రహిన్ నిలుచు నిత్య శుభాస్పద శారదాం! చి

ద్భవ నుత బంధ సత్కవిత భావన చేసెడు సత్కవీశులే

జవమును గల్గు సత్కృతులు సన్నుతి వ్రాయఁగ నేర్త్రు, భారతీ! ౬౭.

భావము. విద్యారూపా! కవనసుధాసాగరమున ప్రకాశించునట్లు కావ్యరాజమే నివాసముగా కలిగి రహించు నిత్య శుభములకు తావౌన శారదాంబా!  ఆత్మ భవమయెడి బంధకవితా సమూహమును భావించెడి మంచి కవీశ్వరులే మంచి వేగముతో కవిత్వమును పొగడబడునట్లుగా వ్రాయ నేర్చుదురమ్మా.

 

. మరిమరి వేడుచుంటినని మారము చేసితి నంచు నన్నునే

మరచుట నీకు కాని పని. మద్ధృదిమందిరవాసివైనని

న్నరయుచు వేడకుండనెటులన్యుల వేడుదు? చెప్పవమ్మ . సు

స్థిరమతి నీయుమమ్మ నిను దీక్షఁగ కొల్చెదనమ్మ, భారతీ! ౬౮.

భావము. విశాలాక్షీ! మిక్కిలిగా అడుగుచుంటినని, మారాము చేయుచుంటినని నన్ను మరచుట నీకు సాధ్యము కాని పని. నాహృదయ మందిర వాసివైన నిన్ను అరసి వేడుట మాని ఇతరుల నెట్లు వేడఁగలనమ్మా? నీవే చెప్పుము. నేను నిన్ను స్థిరముగా కొలిచెదను నాకు సుస్థిరమైన మతిని ప్రసాదించుము.

 

. తెలివి యనంగ నేది? యది తెల్లమె నీవని నగ్న సత్యమే.

తెలివి యదేలతప్పు? నది తెల్లమె నీవది వీడిపోవుటన్.

తెలివిగ నీవు కల్గి నిజ తేజమునన్ మది నిల్చుదేని నే

తెలియఁగ సత్కవిత్వరుచి దిక్కులనింపుదునమ్మ. భారతీ! ౬౯.

భావము. బ్రహ్మజా! తెలివి అంటే ఏమిటి?అది నీవే అన్నది స్పష్టమైన నగ్న సత్యమేనమ్మా. మరి అటువంటి తెలివి మాకు ఎందుకు తప్పును? అదియు స్పష్టమే నీవు మమ్ములను వీడి వెళ్ళిపోవుట వలననే అని.తెలివిగా మాలో నీవే ఉండి నీ ప్రకాశముతో మాలో ఉందువేని నేను సత్కవిత్వపు తేజమును అందరికీ అర్థమగునట్లుగా దిక్కులనంతటా నింపుదునమ్మా.

 

. విధికి నమస్కరించెదను. విద్యలరాణి కృపాబ్ధినున్ననే

నధిక ధనాఢ్యుఁడౌ హరికి,, నార్త జనావన సాంబమూర్తికిన్,

మధుర మనోజ్ఞ భావన సమాధి యవస్థను నిల్చి మ్రొక్కెదన్

వ్యధలకు దూరమై శుభమహాకృతి కర్తగఁ జేయ. భారతీ! ౭౦.

భావము. మహా ఫలా! విద్యలరాణి కృపా సాగరముననోలలాడుచున్న నేను వ్యధలకు దూరమైశుభ మహాకృతికర్తగ చేయుట కొఱకు మిక్కిలి ప్రపత్తితో విష్ణుమూర్తికి, ఆర్తజనులను కాపాడు శివునకు, బ్రహ్మదేవునకు నమస్కరించెదను.

 

. పరవశమైతి నీ కృపకు భద్రతఁగొల్పెడి భవ్య తేజమా!

నిరుపమ సాధనా పటిమ నీ కృపచేఁ బ్రభవించునమ్మ. నిన్

మరిమరి వేడుకొందు నను మంచిని వీడగనీక కావుమా.

సురుచిర భక్తి తత్పరత శోభిలఁజేయఁగ నిమ్ము. భారతీ! ౭౧.

భావము. త్రయీమూర్తీ! భద్రతను కలుఁగఁ జేసెడి తేజస్వరూపమా! నీ కృపకు నేను పరవశించితిని. నీ కృప వలననే నిరుపమైన సాధనా పటిమ నాకు లభించినదమ్మా. నా నుండి మంచి వీడిపోకుందా కాపాడుమని నేను నిన్ను మరీమరీ వేడుకొందును. శోభిలుటకు కొఱకు ప్రకాశవంతమయిన భక్తితత్పరతను నాకు కలిగించుము తల్లీ.

 

. చదువులతల్లికిన్ శుభము, సద్గురు పూజ్య మహత్వ భారతీ

హృదయ మనోజ్ఞ సత్కవన  సృష్టి విధాతలకెల్ల శోభనం

బధిపతులైన పీఠపతులందరికిన్ శుభసంహితోన్నతుల్

పదిలములౌత యంచనెడు పండిత పాళిని కావు. భారతీ! ౭౨.                                          

భావము. త్రికాలజ్ఞా! చదువులతల్లికి శుభమగుగాక, సద్గురు పూజ్యులయినగొప్ప భారతీదేవి హృదయవర్తులగుకవితా బ్రహ్మలకు,శుభములుపీఠాధిపతులకుశుభములు అనుచుచూచెడి పండితులనుకాపాడుతల్లీ.

 

. శిశువుల జ్ఞాన సంపదను చిందరవందర చేయుచుండి రీ

పశువుల వోలె వర్తిలెడు పాంసులనాగరికంబు నేర్పుచున్.

నిశితముగా కనుంగొనుమ. నిత్య దరిద్రుల నుండి కావుమా

శశివదనా! కృపం గనుమ చక్కగ బాలలనెన్ని, భారతీ! ౭౩.

భావము. త్రిగుణా మాతా! పశుప్రవృత్తి కలిగిన దుర్మార్గులు అనాగరిక ప్రవృత్తిని నేర్పుచు శిశువుల జ్ఞాన సంపదను ధ్వంసము చేయుచున్నారమ్మా.వీరు నిత్యము దరిద్రపు లక్షణములతో ఉండు దుర్మార్గులు.నీవు నిశితముగా చూచి వారిబారినుండి శిశువులను కాపాడుము.

 

. అణువు కదల్పనౌనె పరమాత్మకునైన భవత్ ప్రతాపమున్

గొనకొని స్వీకరింపక, నిగూఢ మహాద్భుత శక్తివీవు, నిన్

వినయముతోడ గొల్చుటనె వేద్యమగున్ బరమాత్మ సృష్టియున్.

సునిశిత దృష్టి నాకునిడి చూపుమ దైవ బలంబు భారతీ! ౭౪.

భావము. శాస్త్ర రూపీ! నీవి నిగూఢముగానుండెడి అద్భుతమైన శక్తివమ్మా. పరమాత్మునికైననునీ ప్రతాపమును స్వీకరించనినాడుఅణువునైనను కదల్చుట సాధ్యమా? నిన్ను గొప్పగా వినయముతో కొలిచినప్పుడే పరమాత్మ సృష్టి అర్థమగునమ్మా.నాకు సునిశిత దృష్టి ప్రసాదించి,దైవబలమును కనఁజేయుమమ్మా.

 

. సరసవిదూరమౌ కవిత సద్గురు తేజముఁ జూపఁబోదు.నీ

చరణ పయోరుహంబులను సన్నుతి సేసి భవత్ ప్రతాపమున్

నిరుపమమంచు నెంచి కవి నేర్పున వ్రాయ రసాద్భుతంబగున్

భరమును నీపయిన్ నిలిపి భక్తిగ వ్రాసితినమ్మ. భారతీ! ౭౫.                                              

భావము. శుంభాసుర ప్రమథినీ! రసహీనమైన కవిత్వము సద్గురువు యొక్క తేజస్సును ఏనాడునూ అందుకొనలేదు. నీ పాదపద్మములను నుతించి, నీ ప్రతాపమును సాటి లేనిదిగా భావించి నిపుణతతో వ్రాసినచో రసాద్భుతముగా ఒప్పునమ్మా. నీపై భారముంచి శతకమును వ్రాసితినమ్మా.

 

. వలచిన నిన్ను నెంచుచునవారిత రీతిని బ్రహ్మ మోములన్

నలుదిశలం గనుంగొనగ నాల్గు పదంపడి యొందియుండు. నీ

తలపులనంత సృష్టికి విధాతగ తోడ్పడునంచు నెంచుటన్.

ఫలితముగా ముఖాబ్జముల భ్రాంతిగ నిన్ వరలించె భారతీ! ౭౬. 

భావము. శుభదా! నిన్ను గూర్చిన ఆలోచనలే యీ అనంతమైన సృష్టి చేయుటకు తనకు తోడ్పడునని అతఁడు భావించియుండుట చేతనే సృష్టికర్త యగు బ్రహ్మ నిన్ను వలచి నాలుగు దిక్కులనూ నిన్ను కనుఁగొనుటకు నాలుగు ముఖములను పొందియుండును. దీని ఫలితముగనే నిన్ను తన నాలుగు ముఖములందును నిన్ను వరలించియుండునమ్మా.

 

. జనని భవాని నీవలెనె సన్నుత శ్రీహరి రాణి నీవలెన్

ఘనతరమైన సృష్టి శుభ కార్యము చేయుననంత శక్తితో

ననుపమ సాధనాగరిమనంతయు నీవె యనుగ్రహింపగా.

మనమున ముగ్గురమ్మలకు మాతృకవీవగుదమ్మ భారతీ! ౭౭.

భావము. స్వరాత్మికా! సాటి లేని సాధనా సంపత్తిని నీవనుగ్రహింపగా లక్ష్మీ పార్వతులు సృష్టిని నిర్వహించుచున్నారమ్మా.మనస్సులో ఉండే నా ముగ్గురమ్మలకు మాతృక నీవేనమ్మా.

 

. వెలుగులవెల్ల నీవలన వెల్గెడి వెల్గులె, వేద రూపిణీ!

కలిగెడివెల్ల నీవలన కల్గెడి కల్ములె సద్విభాసినీ!

పలికెడివెల్ల నీవలన పల్కెడి పల్కులె బ్రహ్మ భామినీ!

తెలియునవెల్ల నీవలన దీప్తమగున్ మహనీయ భారతీ! ౭౮.

భావము. వేద రూపిణివైన రక్తబీజ నిహంతీ! వెలుగులవెచ్చట నున్నను అవి నీవలననే వెలుగునవి. సద్విభాసినీ కలిగెడి కలుములు కూడా నీ వలన కలిగెడివే కదా. బ్రహ్మాణీ! పలుకునవన్నియు నీవలన కలిగినవేనమ్మా. మహనీయ భారతీ తెలిసెడివన్నియు నీ వలననే తెలియుచున్నవిసుమా.

 

. సృజనములైన సర్వమును సృష్టిగ ధాత యొనర్చినట్టివే

ప్రజనిత భాగ్య మెల్ల భగవంతుని సృష్టియె. భారతంబునన్

సుజనులు దుర్జనుల్ కలరు చూడుమిదెవ్వరి సృష్టి యౌనొ? నీ

ప్రజలను సన్నుతాత్ములుగ భవ్య మనంబునఁ గాచు భారతీ! ౭౯.

భావము. చాముండామాతా! సృజింపఁబడు అన్నింటి సృష్టియు బ్రహ్మ చేసినవే. పుట్టింపఁబడిడి భాగ్యమంతయు భగవంతుని సృష్టియే. భారతమున మంచివారు, చెడ్డవారూ ఉండిరి. ఎది యెవరి సృష్టి? ప్రజలనుసన్నుతాత్ములుగా భవ్యమనంబుతో కాపాడుమమ్మా.

 

. సుజనుఁడె దుర్జనుండగుట చూచుచునుంటిమి. దుర్జనుండె తా

సుజనుఁడునౌటఁ జూచెదము. శోభిలు సజ్జనుఁ డేల దుర్గతిన్

నిజముగ కోరి పొందుటది? నిర్ణయమెవ్వరి చేతనుండు నో

యజుని మనోహరీ? భువి మహాత్ముల సుస్థితి నిల్పు. భారతీ! ౮౦.

భావము. అంబికామాతా! మంచివారు చెడ్డవారుగను, చెడ్డవారు మంచివారుగను అగుచుండుట చూచుచుంటిమి.మంచివారు చెడ్డవారుగా అగుట యనునది ఎవరి చేతిలో పని?. మంచివారిమంచిస్థితిని నిలఁబెట్టుమమ్మా.

 

. పరమ రహస్యమై ప్రకృతి వర్ధిలు ప్రాణులలోన ప్రాణమై

నిరుపమ జ్ఞానమై వరలు నిర్మల దైవము నిర్వికల్పుఁడై

మరుగుననుంట వింత. భరమా పరమాత్మను చూపుటన్న? నో

కరుణ సుధాంబుధీ! కనులఁ గానఁగఁ జేయము, దివ్య. భారతీ! ౮౧.

భావము. ముండకాయప్రహరణా! ప్రకృతిలో వర్ధిల్లెడి ప్రాణులలో ప్రాణమై, సాటి లేని జ్ఞానరూపుఁడై వరలెడి పరమాత్మపరమ రహస్యముగా, నిర్వికల్పుఁడైచాటుగా మాకు గోచరము కాకుండా ఉండుట వింతగానున్నది. అట్టి పరమాత్ముని కనులారా మేము చూచునట్లు చేయుట నీకు భారమా తల్లీ! మా కన్నులతో వానిని చూవునట్లు చేయుమమ్మా.

 

. మరువకు మమ్మ నన్ను, గుణమాంద్యము బాపుము. శక్తినిమ్ము. నీ

సురుచిర సుందరాకృతి వసుంధర పొంగ వచింపనిమ్ము. సుం

దర మతి మందిరంబున ముదంబుగ నిన్గని పొంగనిమ్ము. నా

భరమిక నీది. కావుమ. సభక్తిగ నిన్ను నుతింతు భారతీ! ౮౨.

భావము. ధూమ్రలోచన మర్దనా! నన్ను మరిచిపోకుమమ్మా.సుగుణ మాంద్యమును పోఁగొట్టుము. నాకు శక్తిని ప్రసాదించుము.నీ ప్రకాశవంతమైన సుందర స్వరూపమును భూజనులు ఆనందించువిధముగా నన్ను చెప్పనిమ్ము. నా అందమైన మనస్సులో నిన్ను చూచుచు నేనుప్పొంగిపోవునట్లు అనుగ్రహింపుమమ్మా నా భారమింక నీదేనమ్మా. నిన్ను భక్తిటొ నుతింతును. నన్ను కాపాడుము.

 

. నిఖిలము నీవె నిండితివి నిర్మల మానస వీధులందు.

న్మఖముల జ్వాలలందును  రమాపతి చేయు తపస్సునందునున్

సుఖమయ జీవులన్ గలుగు సుందర భావన భాగ్యమందు. నీ

వఖిలమునై రహించ తగు దద్భుత రీతిని భవ్యభారతీ! ౮౩.

భావము. సర్వదేవస్తుతా! నిర్మలమైన మనస్సులలో, గొప్ప యజ్ఞజ్వాలలలో, శ్రీమహావిష్ణువు యోగముద్రలో,సుఖనుభూతితో చూచెడి సుందరమైన భావనాభాగ్యమునను, అనిఇటియందు నీవు ఒప్పుచు అద్భుతముగా ఉండతగుదువమ్మా. సమస్తము నీవే నిండియుంటివమ్మా.

 

. చదువుల తల్లివైన నిను చంపక భారతిఁగా రచించితిన్

వదులక నీ గుణంబులను  వర్ణనఁ  జేసితి, భాగ్యవంతులీ

సుధను గ్రహింపనెంచి మది సోక పఠించిన మేలుఁ గొల్పుమా!

వదులక దోషపంకిలము  పాపుమ. భక్తులఁ గాచు భారతీ! ౮౪.

భావము. భక్తులను కాపాడెడి సౌమ్యామాతా! విద్యాధిదేవతవైన నిన్ను చంపకభారతిగా రచించితినమ్మా. ఉపేక్ష చేయక,నీ గుణములను వర్ణించెడి భాగ్యవంతులు చంపకభారతీ సుధను గ్రహింపఁ గోరి మనసునకెక్కు విధముగా చదువుదురేని వారికి తప్పక మేలును కూర్చుమమ్మా.దోషపంకిలమున్నచో పోఁగొట్టుము.

 

. జననమునొందఁ జేసితివి. చక్కని సంస్కృతి నేర్పినావు. నీ

మననము చేసి సంఘమున మాన్యతనొందఁగ జేసినావు,

ద్వినయమొసంగినావు. మహి విజ్ఞులలో మనఁజేసినావు. నే

ననయము నీ యధీనమయి, హాయిని పొందితినమ్మ. భారతీ! ౮౫.

భావము. సురాసురనమస్కృతా! నన్ను భువిపై జనింపఁ జేసితివి. మంచి సంస్కృతిని నేర్పితివి.నీ మననము చేసెడి నాకు సంఘములో గౌరవము కలిగించితివి. మంచి వినయ గుణమును ప్రసాదించితివి. విజ్ఞులచెంత నివసించు భాగ్యము కలుఁగఁ జేసితివమ్మా. నేను నీ అధీనమయి యున్న భాగ్యముచే సుఖము పొందఁగలిగితినమ్మా.

 

. వరగుణ గణ్యులౌ సుజన వర్గమునన్ కవితామృతంబు నే

మురిపముతోడ పంచునటు పూజ్యులు తృప్తిని పొందునట్లు, నన్

గురువరులెన్నునట్లు, గుణ కోవిదులందు రహించునట్లుగా

సరగున చేయునిన్ను మది చక్కగ నిల్పఁగ చేయు భారతీ! ౮౬.

భావము. కాళరాత్రీ!  మంచివారిమధ్య కవిత్వమును చెప్పే విధముగ, అది వినిన పూజ్యులు సంతోషించునట్లు, నన్ను వారు గుర్తించునట్లు, విధముగా గుణకోవిదులమద్య నేను ప్రకాశించునట్లు, వేగముగా చేయుచున్న నిన్ను నా మనస్సులోచక్కగా నిత్యమూ నిల్పునట్లు చేయుమమ్మా.

 

. మనసును విప్పి చెప్పుటకు మాటలు చాలవు నీ ప్రతాపమున్

కనులకుఁ గట్టినట్టులు ప్రకాశము చేయ కవిత్వ శక్తి లే

దనుపమ దేవతామణి వనాది మహాద్భుత శక్తివైన నిన్

మనముననుండఁ గోరుదును. మన్నికనుండుమ జ్ఞానభారతీ. ౮౭.

భావము. కళాధారా! నీ గొప్పతనమును మనసారా చెప్పుకొనెదమన్న నాదగ్గర ఉన్న మాటలు చాలవమ్మా. విధముగ కాక నిన్ను కన్నులకు కట్టినట్లుగా వర్ణించి చెప్పుటకు నాకున్న కవిత్వ శక్తి చాలదమ్మా. సాటిలేని దేవతామణివమ్మా నీవు. అనాదిగా ఉన్న మహాద్భుత శక్తివైన నిన్నునా మనస్సులో ఉండ వేడుచున్నాను. నా మనసును విడువక ఉండుము తల్లీ.

 

. ధరణియె నీకు తల్లియొకొ? ధాత్రికి తల్లివి నీవెయొక్కొ? యీ

ధరణిని నుద్ధరించుటను ధన్యత పొందితి వీవు, కాగ యీ

ధరణియు నీ సముద్ధరణ దక్షతతో నొనరించునద్దిరా!

పరమహితాత్ములిద్దరును. భాగ్యము మాదగునమ్మ భారతీ! ౮౮.

భావము. రూపసౌభాగ్యదాయినీ! భూమాత నీకు తల్లియా? కాక భూమాతకే నీవు తల్లివా? భూమిను ఉద్ధరించుట వలన నీవు ధన్యత గాంచినావమ్మా. భూమాత కూడా నీ సమ్ముద్ధతిని ధక్షతతో చేయుచున్నది. మీ యిరువురునూ క్షేమమును కోరువారే. భాగ్యము నిజముగా మాదేనమ్మా.

 

. నిరుపమ కల్వపూడి మహనీయ సదన్వయ రాఘవార్యు సం

స్మరణము ముక్తిదాయకము. మా గురుదేవులు వారు. వారిచే

వరముగ పొందితీ చదువు భాగ్యవశమ్మున భక్తియుక్తిమై

రణయుగంబునెంచి గురు సన్నుతి చేసెదనమ్మ, భారతీ! ౮౯. 

భావము. వాగ్దేవీ! నా గురుదేవులు శ్రీ కల్వపూడి వర వంశజులైన వేంకట వీర రాఘవాచార్యులవారు. వారిని స్మరించుటయే ముక్తిదాయకము. నా భాగ్యము చేత భక్తుతో వారినుండి విద్యపొందఁ గలిగితినమ్మా. వారి పాదములను స్మరించుకొని వారిని సన్నుతింతును తల్లీ.

 

. గురువులు శేషశాయియును, గోపక పాలుడు, కోరినట్లుగా

నిరుపమ సాధనాపటిమ నీదయనొందితి నీదు సత్కృపన్

ధర కవితానురక్తిని ముదంబున గర్భ సు చిత్ర బంధముల్

సరసులు మెచ్చునట్టులుగ సన్నుతి వ్రాయుదునమ్మ భారతీ! ౯౦.

భావము. వరారోహా మాతా! శ్రీ మానాప్రగడ శేషశాయియు, శ్రీ గోపాలరావును నాకు చదువు చెప్పిన గురువులే నిరంతర సాధనతో నీ దయను పొందితిని. నీ దయతో కవితానురక్తునై చిత్ర బంధ గర్భ కవిత సరసులు మెచ్చువిధముగా వ్రాయుదును తల్లీ.

 

. పరమ దయానిధానగు పార్వతి,  మాత రమా కృపాబ్ధియున్

నిరుపమవైన నీవును మనీషుల మధ్యను నన్ను నిల్పగా

గరువముతోడ నొప్పితిని. కావ్యరమాసతి కంఠ హారమై

మరువకుడమ్మ ముక్తినిడి మాన్యతఁ నిల్పఁగ భవ్య భారతీ! ౯౧ .

భావము. వారాహీ! లక్ష్మీదేవియు పార్వతీ మాతయు నీవునుమహనీయుల మధ్య నన్ను నిలుపుట చేత ఆత్మ గౌరవముతో కవ్యరమాకంఠహారమై రహించితిని. నాకు ముక్తినొసగి గౌరవమును ఇచ్చుట మీరు మరువవలదమ్మా.

 

. తెలిసి వచించియుంటినొకొ, తెల్పితొ యేమి యెఱుంగకే. మదిన్

దలచినదెల్లఁ దెల్పితిని, తన్మయతన్,  మహనీయమైన నీ

సులలిత సుందరోజ్వల విశుద్ధసుపూజ్య గుణాదికంబులన్

దలచుచు నిన్ను నేఁ బలుకఁ దప్పక యుక్తమె యౌను భారతీ! ౯౨.

భావము. వారిజాసనా!నిన్ను గూర్చి తెలిసి చెప్పితినో, తెలియక చెప్పితినో,మనసున భావించినదంతయు తన్మయత్వముతో చెప్పియుంటిని.గొప్పదైన నీయొక్కసులలితమైన సుందరమైన ఉజ్వలమైన శుభ్రమైనప్రపూజ్యమైనగుణములు మున్నహువాన్ని తలచుచు నిన్ను గూర్చి చెప్పినప్పుడు అవి యుక్తమైనవే యగునమ్మా.

 

. పదములు రావు నాకు, పరిపక్వత లేదు, పఠించువాటిలో.

ముదమున నిన్ను నేఁ దలచి పొందుదు బంధుర బంధ నైపుణిన్.

వదలను నీదు పాదములు వ్రాయగనెంచినవెల్ల వ్రాయుటన్

ముదమున చేయుదాక. వరమో? భరమో? కరుణించు భారతీ! ౯౩.

భావము. చిత్రాంబరా మాతా! నాకుపదసంపద తక్కువ. పఠించువాటినర్థము చేసుకొనునంతటి జ్ఞాన పక్వత లేదు. సంతోషముతో నిన్ను తలంచుకొని నేను బంధురమైన బంధ కవితా నిపుణతను పొందితినమ్మా. నేను వ్రాయనెంచినవి పూర్తిగా వ్రాయు వరకు నీ పాదములు వీడనమ్మా.  ఇది వరమో, భరమో, ఎఱుఁగను. కరుణించుమమ్మా.

 

. శుభముల కాలవాలమయి శోభిలఁ జేసెడి శారదాంబ ! మా

కభయము నీవు. నీ కృపమహాద్భుతరీతిని గాంచితమ్మ! నీ

విభవము నూరు పద్యముల విస్తృతి మించి రచించి తిద్ది. నా

కుభయ ఫలంబు లీవొసఁగి, యుద్ధతినొప్పఁ నిల్పు, భారతీ! ౯౪.                                        

భావము. చిత్రగంధా మాతా! శోభనమూర్తివై భక్తులను శోభిలునట్లు చేయు శారదామాతా! నీవే మాకు అభయమమ్మా. నీకృపను నేను గొప్పగా చూచితినమ్మా! నీ వైభవమును నూరు పద్యములమించి ఇది వ్రాసితినమ్మా. ఇహపర సద్గతులు కొలిపి, గొప్పగా నన్ను నిలుపుమమ్మా!

 

. తెలతెలవారుచుండగనె దీక్షగ పద్య శతంబు వ్రాసితిన్

నిలుపుచు నిన్ను నా మదిని నిత్యశుభావహ శారదాంబ! నీ

తలపులె వ్రాయఁ జేసినవి, ధన్యతఁ గూర్పఁగ నాకు. నిత్యమున్

మెలకువతోడ నిన్గొలిచి మేలుఁ వర్ధిలనిమ్ము.భారతీ! ౯౫.

భావము. నిత్యమును శుభములకు స్థానమైన చిత్రమాల్యావిభూషితా!నిన్ను నా మనసులో నిలిపి ఉదయము ప్రారంభించిన శతక రచనను తెలతెలవారుచుండుసరికి దీక్షతో వ్రాయఁగలిగితిని. నా జన్మను చరితార్థము చేయుటకు నిన్ను గూర్చిన ఆలోచనలే నాచే వ్రాయించినవి. ఎల్లప్పుడూ ధ్యాసతో నిన్ను కొలుచుచు మేలుగా అభివృద్ధి చెందనిమ్ము.

 

. నిరతము  నీ పదాబ్జములు నేను మదిం గని, పొంగనిమ్ము, సు

స్థిరముగ నీ నిధానమగు తెల్గుల తేజము చాటనిచ్చి, యం

తరములు లేని యాత్మనిడి ధన్యత తోడఁ జరింపనిమ్ము, నే

పరమ పథంబుగాంచఁదగు భక్తినొసంగుము. దివ్య భారతీ! ౯౬.

భావము. దివ్య భారతీ మాతా! నీ పాదపద్మముల నెల్లప్పుడునూ నామదిలో చూచుకొనుచు నన్ను సంతోషింపనిమ్ము. నీ నిధానములైన తెలుగు తేజమును సుస్థిరముగ చాటునట్లు చేయుము. భేద భావములు లేని మనసును నాకు ప్రసాదించిధన్యతతో జీవింపనిమ్ము. పరమపథమునంద తగిన భక్తిని నాకొసగుమమ్మా.

 

. వినయముతోడ సత్కృతిని విజ్ఞులుమెచ్చఁ నీ కొసంగెదన్.

ఘనమగు భావనాపటిమ కన్బడుటన్న నమోఘమౌనొ. శో

ధనమున దోషపంకిలము తప్పదొ తోచక. సైచుమన్నియున్

గుణములనేకముల్ గలుఁగుఁ గూర్మిని గొల్పితివీవె భారతీ! ౯౭.                                           

భావము. శివా!  విజ్ఞులు మెచ్చునట్లుగా వినయముతో నీకీ చంపకభారతిని సమర్పింతునమ్మా.గొప్ప భావనాపటిమ కనఁబడుచూ అమోఘముగా ఉండునో లేక పరిశీలన చేసిచూచినచో దోషపు మరకలు కనబడి తీరునో యేమో. అన్నియు నీవు సహించుమమ్మా.నీవే ప్రేమతో శతకము వ్రాయఁ జేసితివి కాన గుణములు తప్పక ఉండి తీరునమ్మా.

 

. సుధఁ గురిపించు తల్లివని శోభిలఁ జేసెదవంచు నెంచి, నే

నెద నిను నిల్పి, నేడు పరమేశ్వరునానతిఁ జేసి వ్రాసితీ

సదమల శోభనోజ్వలిత చంపక భారతి. మంచి చెడ్డలన్

మదినిడఁబోక కైకొనెడి మాతవు సన్నుత రూప. భారతీ! ౯౮.

భావము. కామప్రదా!! సుధను వర్షించు తల్లివని, శొభిలఁ జేయుదువని.నేను నిన్ను నా మనసులో నిలిపి పరమేశ్వరునాజ్ఞ వలన నేడు సదమల శోభనోక్వలిత చంపక భారతిని రచించితిని. మంచిచెడ్డలనెంచక స్వీకరించే తల్లివమ్మా నీవు. చంపక భారతీ శతకమును గ్రహించుమమ్మా.

 

. కొనుమిది భారతీ జనని కోమల చంపక భారతీ కృతిన్

వినఁబడఁ జేయుమమ్మ  పృథివీ స్థలి నందరు సంతసింపఁగా.

జననము లేని ముక్తిపథ సద్గతినిమ్మ పఠించువారికిన్.

గని ననుఁ గావుమమ్మ వర కామితముల్ నెరవేర్చి, భారతీ! ౯౯.

భావము. విద్యాధరసురపూజితా! కోమలమైన చంపక భారతీశతకమును నీవు స్వీకరింపుమమ్మా. భూమిపై అందరూ సంతోషించునట్లు దీనిని వినఁబడునట్లు చేయుము తల్లీ. డతకపాఠకులకు పునర్జన్మరహిత ముక్తిని ప్రసాదించుము. నీవు నన్ను ప్రేమతో జూచి, మంచి కోరికలును నెరవేర్చి కాపాడుము తల్లీ

 

. శుభమగు పాఠకాళికి వసుంధర చంపక భారతీ కృతిన్.

ప్రభుతకు మేలుగాత. పరిపాలనచే ప్రజ సంతసించుతన్.

విభవముతోడ సజ్జనులు వెల్గుత మంగళ కార్యధుర్యులై

యభయముగా వెలుంగుమిల నార్యుల సంస్కృతిఁ బెంచి భారతీ! ౧౦౦.                                 

భావము. శ్వేతాననా! చంపక భారతీకృతి కారణముగా పాఠకులకు శుభము అగుగాక. ప్రభుత్వమునకు శుభమగుగాక. పరిపాలన ప్రజారంజకముగా ఉండు గాక.మంగళ కార్య ధుర్యులఒ సజ్జనులు విభవముతో ప్రకాశింతురు గాక. ఆర్య సంస్కృతిని పెంచి అభయముగా ఉండుగాక.

 

కంద గీత గర్భ చంపకమాల.

స్వర విలసన్నుతా! సహజ సౌమ్య లసద్గుణ శారదాంబ!

మ్మరయుమిలన్ సదా. మధుర మంజుల వాగ్ఝరి మాకొసంగి సుం

దర గళ మాధురుల్, కవిత ధారలు కొల్పుచు కావుమింక రా.

దరి నిలుమా మదిన్. ఘనత దాల్చిన  సన్నుత జ్ఞాన భారతీ! ౧౦౧.

భావము. ధ్వనిరూపమున ప్రకాశించుచు పొగడఁబడు భారతీమాతా! నిరంజనా! ఘనత దాల్చిన సన్నుత జ్ఞాన భారతీమాతా! సహజమైన సౌమ్యముతో ప్రకాశించు స్వభావము గల శారదాంబా! మధురమైన మంజులమైన వాగ్ఝరిని మాకు ప్రసాదించి మమ్ములనెల్లప్పుడు భూమిపై అరయుచుండుమమ్మా.  ఇంకనూ సుందరమైన గళ మాధుర్యమును, కవితా స్రవంతిని మాకొసంగుచు కాపాడుచుండుము. వచ్చి మా సమీపముననే మా మనస్సులలో ఉండుము తల్లీ!

 

బహు ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల

మము జననీ సదా నిలుపు మా ఘనతన్ గణనీయ తేజ గా

మము మననీ భువిన్, తెలుపుమా కనఁ జేయుచు దీప్తిరాశిగా

మము కననీ నినున్, కొలుపుమా ఘన తేజము కూర్మి తోపగా

మము విననీ స్తుతిన్,, కనుమ మాదిన చర్యలు జ్ఞాన భారతీ! ౧౦౨

భావము. చతుర్వర్గ ఫలప్రదా! జననీ! మమ్ములను ఎల్లప్పుడు నిలుపుము.  ఘనత యేదైతే మాకు కలదో దానినిగణనీయ తేజముతో నొప్పునట్లు ఎల్లప్పుడు నిలుపుము. నిన్ను కాంతి పుంజముగా మాకు కనఁ కేయుచు మమ్ములను చూడనిమ్ము.మాలోనను ఘనమైన తేజస్సు తోచునట్లుగా ప్రేమతో కొలుపుము.నిన్ను గూర్చిన స్తోత్రమును విననిమ్ము. మా దిన చర్యలను గమనించుచు ఉండుమమ్మా. .

 

గూఢ పంచమ పాద చంపకమాల.

గురు   లెఱున్మెలంగ శుభగుల్ ని నేర్తు రుగ్ర వర్తనల్.            

గురు గుణముల్వరల్త్రు.ప్ర గొప్ప రాళిగ    ల్తురుద్ధతిన్.

గురువులె భవ్య పూజ్య శుభ గోత్రజ   రావుఁబోలుభాస్కరుల్.         

గురువను దైవముండి   సుగోత్రులు   దేవులుకారె?భా తీ!   ౧౦౩.

ఇందలి గూఢ పంచమ పాదము.

గురువును కల్వపూడి శుభ గోత్రుని రాఘవుఁ దల్తు భారతీ!

భావము. చతురానన సామ్రాజ్యా! భారతీ మాతా! గురువులు తెలివి కలిగి ప్రవత్రించుచున్నచో మంచివారు వారిని గమనించి శ్రేష్టమైన ప్రచర్తనలను వారినుండి గ్రహింతురు. అటువంటి గురువుల గుణములను ప్రవర్ధింపఁ చేయుదురు. లభించెడి జ్ఞాన ప్రభను గొప్ప వరములుగా భావించుదురు. అట్టి శ్రేష్టులైన గురువులే ఉత్తమ కులజుఁడయిన రాముని పోలెడి సూర్యులే. గురువలబఁడే మంచి దైవమున్నచో సద్గోత్రులు సాక్షాత్ దైవస్వరూపులగుదురు కదా.

గుప్త పంచమ పాద భావము.

భారతీ మాతా! కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య గురుదేవులను నేను ఆత్మలో తలచెదను తల్లీ!

 

గూఢ పంచమ పాద చంపకమాల.

గురుతు ట్టి వారు నెలకొల్ప   హించెడి     దివ్య వాగ్ఝరీ!

రుణను   ష్టపాళి  తొగన్    బ్రవహించుమ వ్య తేజమై 

గురురమై  ప్రకాశమును కొల్పుమ   వేచెదనమ్మ   భావికై.

ధర  రు ణాలవావయి  ల్పగనే       డి  బ్రోచు భారతీ!    ౧౦౪.

గూఢ పంచమపాదము

గురువరులష్టకాల నెలకొల్ప రహించెడి దివ్య భారతీ!

భావము. రక్తమధ్యా! భూమిపై కరుణకు ఆలవాలమయి, నిన్ను తలంచినంతనే వేగముగా కాపాడెడి భారతీమాతా! ప్రసిద్ధులయినవారు నీ యునికిని గుర్తించి నిన్ను నెలకొల్పగా ప్రకాశించెడి దివ్యమైవ వాగ్ప్రవాహ రూపమా! కరుణ చూపి నా కష్టములు తొలిగిపోవునట్లుగానీవు నవ్య తేజముగా నాలో ప్రవహించుము. గురుదేవుల వరమై నాలో ప్రకాశమును కొల్పుము. నేను ఉజ్వలభవితకై వేచియుందును తల్లీ!

గూఢ పంచమపాద భావము.

గురుపుంగవులయిన బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామశర్మ అనంత సాగరమున నిన్ను ప్రతిష్ఠింపగాప్రపంచమున వెలుగొందుచున్న దేవతామూర్తివైన సరస్వతీమాతా! అని సంబోధన.

 

. దినమున నూరు పద్యములు తీరుగ వ్రాసితి పిమ్మటిచ్చటీ

యెనిమిది చిత్రబంధము లనేక మహద్గతులన్ రచించితిన్.

కనుఁగొని వ్రాయఁ జేసితివి గౌరవమబ్బగ నాకు నీవె, నీ

యనుపమమైన బ్రేమయె మహత్వముఁ గొల్పినదమ్మ భారతీ!  ౧౦౫.

భావము. నీలభుజా! భారతీమాతా! రోజులో నూరు పద్యములను వ్రాసితిని. అటు పిమ్మట ఎనిమిది పద్యములు చిత్రబంధ మహత్తరమైన అనేక గతులలోరచించితినమ్మా. నేను వ్రాయుచుండుట కనుగొని నాకు గౌరవము కలిగించ దలచి నీవే వ్రాయునట్లు చేసితివమ్మా.నీ సాటిలేని ప్రేమయే నాకవితకు గొప్పఁదనము కలుగఁ జేసినదితల్లీ!

 

గూఢ పంచమపాద గోమూత్రికా బంధ చంపకమాల

నిరవధిగా     సుకృత్యముల నిన్నె గ్రహించఁగఁ జేయ,   భారతిన్

నిరుపమ రా  కృష్ణ యన  నేర్పు  హింతును గాదె   శాదా!

నిరు? రా గాంచి ని   నే  నిట  నెంనె    నీ    మహద్ధృతీ

శ్వర సునోజ్ఞ తేజము?  వివర్ధిలు         దీవె ధాత్రి       భారతీ ! ౧౦౬

భావము. హంసాసనా! సాటిలేని జననీ! శారదాంబా! అవధియే లేకుండా మంచిపనులందు నిన్నే గ్రహించునట్లు చేసినచో భారతావనిలో సాటిలేని రామకృష్ణ అని అందరూ అనుకొను విధముగా నిపుణతను కలుగుదును కదా! విధముగా రాణ గడించి, నిపుణతతో చూచి, ఇచ్చట నేను నీ గొప్ప గా వహించిన మహనీయ ఈశ్వరుని మనోజ్ఞమయిన తేజమును గుర్తించకుందునా? ఆవిధముగా నేను చేయుటచే వర్ధిల్లునది నీవే కదా తల్లీ!

గూఢ పంచమ పాదము.

నిరుపమ రామకృష్ణ కవి నేర్పు గ్రహించగ నీదె భారతీ!

భావము. భారతీ మాతా! సాటిలేనిదైనటువంటి రామకృష్ణ కవి చిత్రకవితా నైపుణ్యము అది నీదైన నిపుణతయేనమ్మా.      

. ఘనముగ చిత్ర బంధ వర గర్భ కవిత్వమునష్టకంబులో

వినుతిగ వ్రాయ గోరిరిట విజ్ఞులు పూజ్య వరాష్టకాల

ద్వినుతులు. వ్రాసినాడ నిట విజ్ఞతతో నరసింహునానతిన్.

ప్రణుతులు వారిలో శుభదవై మము గాంచెడి నీకు, భారతీ! ౧౦౭.

భావము. నీలజంఘా! బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహ రామ శర్మ మహోదయులు చంపక భారతీ శతకమును చూచి, చిత్ర, బంధ, గర్భ కవిత్వములతో అష్టోత్తర శతకముగా పూర్తి చేయమని కోరగా వారి ఆదేశము మేరకు నిన్ను ప్రార్తించి, నీ ప్రభావముచే పై ఎనిమిది పద్యములు వ్రాసితిని తల్లీ! మహనీయునిలో శుభదవై యుండి మమ్ములను చూచెడి నీకు నా నమస్కారములు తల్లీ!

 

. నిరతము మంగళంబులగు నిర్మల భారతమాతకిద్ధరన్.

నిరుపమ భారతీయతను నిత్యము మంగళముల్ వహించుతన్

కరుణ గుణాలవాలమగు గణ్యులపాళికి మంగళంబు. సుం

దర వర భాషణామృత! మదంబరొ మంగళ మీకు భారతీ! ౧౦౮.

భావము. బ్రహ్మ విష్ణు శివాత్మికా! ధరపై భారతమాతకు నిత్యము మంగళములు ప్రాప్తించుచుండును గాక. సాటిలేని భారతీయతను మంగళదేవత ఆవహించుగాక. కరుణామూర్తులయిన సజ్జనుల సమూహమునకు మంగళములు ప్రాప్తించుగాక. సుందరమగు అమృత భాషణాస్వరూపిణీ! భారతీ! నా తల్లీ! నీకు మంగళమగుగాక.

ఏతత్ సర్వం శ్రీవాగ్దేవీ చరణారవిందార్పణమస్తు.

చంపక భారతీశతకము సంపూర్ణము.

. మూర్తీభవించె శతకము (మొదటి నూరు పద్యములూ)

కార్తికము విశుద్ధ విదియ ఘన మన్మధనా

డార్తిగ చంపక భారతి - కర్తను, నే రామకృష్ణ కవి నిల చింతాన్. ౧౦౧. స్వస్తి.   తే. 13 - 11 - 2015.

౧౦౨ . ౧౦౩ . ౧౦౪ . ౧౦౫ . ౧౦౬. పద్యముల చిత్ర కవిత వివరణ.

౧౦౨ బహు ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల

మము జననీ సదా నిలుపు మా ఘనతన్ గణనీయ తేజ గా

మము మననీ భువిన్, తెలుపుమా కనఁ జేయుచు దీప్తిరాశిగా

మము కననీ నినున్, కొలుపుమా ఘన తేజము కూర్మి తోపగా

మము విననీ స్తుతిన్,, కనుమ మాదిన చర్యలు జ్ఞాన భారతీ! ౧౦౨

చంపకమాల గర్భస్థ తేటగీతి

నిలుపు మా ఘనతన్ గణనీయ తేజ

తెలుపుమా కనఁ జేయుచు దీప్తిరాశి

కొలుపుమా ఘన తేజము కూర్మి తోప

కనుమ మాదిన చర్యలు జ్ఞాన భార!

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము .

జననీ సదా నిలుపు మా

ఘనతన్ గణనీయ తేజ గామము మననీ

కననీ నినున్, కొలుపుమా

ఘన తేజము కూర్మి తోపగామము విననీ.

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము .

మననీ భువిన్, తెలుపుమా

కనఁ జేయుచు దీప్తిరాశిగా మము కననీ.

విన నీ స్తుతిన్, కనుమ మా

దిన చర్యలు జ్ఞాన భారతీ! మము జననీ.

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము

జననీ సదా నిలుపు మా

ఘనతన్ గణనీయ తేజ గా మము కననీ

కననీ నినున్, కొలుపుమా

ఘన తేజము కూర్మి తోపగా మము జననీ.

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము .

మననీ భువిన్, తెలుపుమా

కనఁ జేయుచు దీప్తిరాశిగా మము విననీ

విననీ స్తుతిన్,, కనుమ మా

దిన చర్యలు జ్ఞాన భారతీ! మము మననీ..

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము 

జననీ సదా నిలుపు మా

ఘనతన్ గణనీయ తేజ గా మము విననీ

మననీ భువిన్, తెలుపుమా

కనఁ జేయుచు దీప్తిరాశిగా మము జననీ.

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము .

మననీ భువిన్, తెలుపుమా

కనఁ జేయుచు దీప్తిరాశిగా మము జననీ.

విననీ స్తుతిన్, కనుమ మా

దిన చర్యలు జ్ఞాన భారతీ! మము కననీ.

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము

కననీ నినున్, కొలుపుమా

ఘన తేజము కూర్మి తోపగా మము మననీ

జననీ సదా నిలుపు మా

ఘనతన్ గణనీయ తేజ గా మము విననీ

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము .

విననీ స్తుతిన్,, కనుమ మా

దిన చర్యలు జ్ఞాన భారతీ! మము కననీ

మననీ భువిన్, తెలుపుమా

కనఁ జేయుచు దీప్తిరాశిగా మము జననీ

చంపకమాల గర్భస్థ కందము

జననీ సదా నిలుపు మా

ఘనతన్ గణనీయ తేజ గా మము జననీ

కననీ నినున్, కొలుపుమా

ఘన తేజము కూర్మి తోపగా మము కననీ

చంపకమాల గర్భస్థ ద్వివిధ కందము ౧౦

మననీ భువిన్, తెలుపుమా

కనఁ జేయుచు దీప్తిరాశిగా మము మననీ

విననీ స్తుతిన్, కనుమ మా

దిన చర్యలు జ్ఞాన భారతీ! మము విననీ.

)ఇంకనూ పెక్కు కందములిందు కల వు)   

 

౧౦౩ గూఢ పంచమ పాద చంపకమాల.

గురు   లెఱుకన్మెలంగ శుభగుల్ గని నేర్తు రుదగ్ర వర్తనల్.            

గురు గుణముల్వరల్త్రు.   ప్రభ గొప్ప వరాళిగ    దల్తురుద్ధతిన్.

గురువులె భవ్య పూజ్య శుభ గోత్రజ   రాఘవుఁబోలుభాస్కరుల్.

గురువను దైవముండిన   సుగోత్రులు    దేవులుకారె?భార తీ!   ౧౦౩.

గురువును కల్వపూడి శుభ గోత్రుని రాఘవుఁ దల్తు భారతీ!                                         

 

౧౦౪. గూఢ పంచమ పాద చంపకమాల.

గురుతు గలట్టి వారు నెలకొల్ప   రహించెడి     దివ్య వాగ్ఝరీ!

కరుణను   కష్టపాళి  తొలగన్    బ్రవహించుమ నవ్య తేజమై

గురువరమై  ప్రకాశమును కొల్పుమ   వేచెదనమ్మ   భావికై.

ధర  కరు ణాలవాలవయి  తల్పగనే       వడి  బ్రోచు భారతీ!    ౧౦౪.

గూఢ పంచమపాదము

గురువరులష్టకాల నెలకొల్ప రహించెడి దివ్య భారతీ!

 

౧౦౫ కంద గీత గర్భ చంపకమాల.

స్వర విలసన్నుతా! సహజ సౌమ్య లసద్గుణ శారదాంబ!

మ్మరయుమిలన్ సదా. మధుర మంజుల వాగ్ఝరి మాకొసంగి సుం

దర గళ మాధురుల్, కవిత ధారలు కొల్పుచు కావుమింక రా.

దరి నిలుమా మదిన్. ఘనత దాల్చిన సన్నుత జ్ఞాన భారతీ! ౧౦౫.

చంపకమాల గర్భస్థ కందము..

విలసన్నుతా! సహజ సౌ

మ్య లసద్గుణ శారదాంబ! మమ్మరయుమిలన్

గళ మాధురుల్, కవిత ధా

రలు కొల్పుచు కావుమింక. రా. దరి నిలుమా.

చంపకమాల గర్భస్థ తేటగీతి..

సహజ సౌమ్య లసద్గుణ శారదాంబ!   -  మధుర మంజుల వాగ్ఝరి మాకొసంగి

కవిత ధారలు కొల్పుచు కావుమింక   -  ఘనత దాల్చిన  సన్నుత జ్ఞాన భార!

 

౧౦౬ గూఢ పంచమపాద గోమూత్రికా బంధ చంపకమాల. CAmPAKABH

నిరవధిగా     సుకృత్యముల నిన్నె గ్రహించఁగఁ జేయ,  భారతిన్

నిరుపమ రామ  కృష్ణ యన  నేర్పు  వహింతును గాదె శారదా!

నిరుపమ? రాణ గాంచి కని   నే  నిట  నెంచనె    నీ  మహద్ధృతీ

శ్వర సుమనోజ్ఞ తేజము?  వివర్ధిలు         దీవెగ ధాత్రి    భారతీ ! ౧౦౬

గూఢ పంచమ పాదము.

నిరుపమ రామకృష్ణ కవి నేర్పు గ్రహించగ నీదె భారతీ!

                                                       

ఏతత్ సర్వం శ్రీవాగ్దేవీ చరణారవిందార్పణమస్తు..

                                                                           

అకారాది పద్యసంఖ్య.

అజముఖ వేద్య! యీ సృజనమౌ సకలంబును నీ యధీనమై..2.

అజుఁడు సృజింపనోపునె సహాయము నీ వొనరింపకున్నచో ....22.

అనయమునా గజాననుని, యాతనిఁ గాంచిన పార్వతీసతిన్,1.

అణువు కదల్పనౌనె పరమాత్మకునైన భవత్ ప్రతాపమున్ ….౭౪.

అభయము నిచ్చి భాషణ ననంత శుభాస్పద మార్గ వేద్య ...33.

అసదృశమంచు వస్తువుల నాదరణంబొనరింత్రు కొన్నిటిన్,….26.

ఇహ పర మెన్న శబ్ద చయమే కద మూలము సృష్టికంతకున్….13.

ఇహ పర సాధకంబగు మహీస్థలి వాక్ పరి భూషణంబు. ....9.

కటిక కసాయి బోయకు ప్రకాశముఁ గొల్పఁగ నారదుండు ప్రా....20

కదలదు లోక మించుకయు కాదని నీవు నిరాకరించినన్…..25.

కదలిక లేని జన్మలకు గౌరవమెద్ది? విధాత సృష్టిలో ....34.

కనుప నకారమాద్యవయి కల్పన చేయుదువన్ని నీవెయై …6.

కనులకుఁ గానిపించునవి కల్గు టబద్ధము. జ్ఞాన చక్షువున్....42.

కనులకుఁ గానిపించునవి కావు మహీస్థలి శాశ్వతంబు లీ ....21.

కవన సుధాపయోధిని ప్రకాశితమౌనటు, కావ్యరాజమే ....౬౭.

కొనుమిది భారతీ జనని కోమల చంపక భారతీ కృతిన్ ....౯౯.

క్షణములలోన పద్యములు కమ్మగ వ్రాయు కవీశులందు, సద్....౫౬.

క్షరమగు సృష్టిఁ బుట్టి, ఘన కర్కశ వృత్తులు చేతఁ బట్టి, ....18.

క్షరము గణింప నీ జగతి. గౌరవ సన్మహనీయ గాధలన్....27.

క్షరములె యక్షరమ్ములగు సాధన సత్కవితామృతంబగున్…..15.

గగన తలంబునన్ వెలుఁగు కాంతిమయుండగు సూర్య దేవుఁడీ ....41.

గరువము బాపు దేవతవు, కామిత సత్ ఫలదాతవీవు. నీ....౬౦.

గురుతు ట్టి వారు నెలకొల్ప   హించెడి     దివ్య వాగ్ఝరీ!....౧౦౪.

గురు   లెఱున్మెలంగ శుభగుల్ ని నేర్తు రుగ్ర వర్తనల్.....౧౦౩.

గురువులు శేషశాయియును, గోపక పాలుడు, కోరినట్లుగా ....౯౦.

ఘనముగ చిత్ర బంధ వర గర్భ కవిత్వమునష్టకంబులో ....౧౦౭.

చదువుల జోలికేగుటది సాధ్యము కానిది నీవు లేక. సం....౪౬.

చదువులతల్లికిన్ శుభము, సద్గురు పూజ్య మహత్వ భారతీ ....౭౨.

చదువుల తల్లివైన నిను చంపక భారతిఁగా రచించితిన్ ….౮౪.

జగతికి మూలమెద్ది కన? శబ్దమె కాఁదగు. నక్షరాకృతిన్....18.

జగతికి వెల్గువీవె. విరజాజుల సౌరభమీవె.  వెల్గుదీ.....౫౫.

జగతి ననంత సాక్షి గుణ సన్నుత పాళికి, దుష్ప్రజాళికిన్ ....28.

జగతిని కల్గు దైవమది సద్విభవంబయి వెల్గుచుండు, నీ....35.

జగతిని కొల్పునప్పుడు ప్రజాళి హితంబు గణింప వచ్చుగా!....౪౯.

జననమునొందఁ జేసితివి. చక్కని సంస్కృతి నేర్పినావు. నీ....౬౫.

జనని భవాని నీవలెనె సన్నుత శ్రీహరి రాణి నీవలెన్ ….౭౭.

జయములనిచ్చు తల్లివి,  ప్రజన్ గృపఁ గాచెడి కల్పవల్లివై ....౪౩.

తనయుఁడ నేను. తల్లివి. నితాంతము నీ మహనీయ భావనా....౪౭.

తలపులలోన నిల్పుమిక తత్పరతత్వము. దైవ మార్గమున్…..౪౪.

తెలతెలవారుచుండగనె దీక్షగ పద్య శతంబు వ్రాసితిన్ ....౯౫.

తెలివి యనంగ నేది? యది తెల్లమె నీవని నగ్న సత్యమే…..౬౯.

తెలిసి వచించియుంటినొకొ, తెల్పితొ యేమి యెఱుంగకే. మదిన్....౯౨.

దినమున నూరు పద్యములు తీరుగ వ్రాసితి పిమ్మటిచ్చటీ .....౧౦౫.

ధరణియె నీకు తల్లియొకొ? ధాత్రికి తల్లివి నీవెయొక్కొ? యీ ….౮౮.

ధ్వని జనియింప భావమును, తత్వము, నెన్నసుసాధ్యమౌను, ....౫౨.

ననుఁ గను. రామకృష్ణ కవి నాన్ రహియింతు, ననన్య సాధ్యమై ....౫౦.

నలువ ముఖాబ్జ సంభవ మనంత నిరంత వసంత సంతతుల్….14

నిఖిలము నీవె నిండితివి నిర్మల మానస వీధులందు. ....౮౩.

నిరతము  నీ పదాబ్జములు నేను మదిం గని, పొంగనిమ్ము, సు ....౯౬.

నిరతము మంగళంబులగు నిర్మల భారతమాతకిద్ధతన్ ....౧౦౮.

నిరవధిగా     సుకృత్యముల నిన్నె గ్రహించఁగఁ జేయ,   భారతిన్....౧౦౬.

నిరుపమ కల్వపూడి మహనీయ సదన్వయ రాఘవార్యు సం....౮౯.

పర మహనీయ బ్రహ్మమది పావన సచ్చరితామృతంబు సు....౬౪

పరవశమైతి నీ కృపకు భద్రతఁగొల్పెడి భవ్య తేజమా!....౭౧.

పరుల మనంబులన్నిలువ, పట్టుగ వారికి శోభఁ గూర్పఁగా,....8

నిరుపమ శాంతి తత్వము, వినిర్మల చిత్తము, సత్ప్రవృత్తి, నీ....17.

నిరుపమ సాధనా పటిమ నిన్ను గ్రహింపఁగఁ జేయు. నీదు సుం ....౫౭.

పదములు రావు నాకు, పరిపక్వత లేదు, పఠించువాటిలో .....౯౩.

పరమ దయానిధానమగు పార్వతి,  మాత రమా కృపాబ్ధియున్...౯౧.

పరమ రహస్యమై ప్రకృతి వర్ధిలు ప్రాణులలోన ప్రాణమై....౮౧.

పలుకక యుంట నేరమగు, పల్కిన నేరము, పల్కు పల్కునం ...5

పలుకుల తల్లివీవు. పరిపాలనఁ జేసెద వెల్ల లోకముల్,…7

పలుకుల లోన మాధురులు, పంచఁగ నేర్చిన పండితాళికిన్....31.

పలుకులు భావముల్ భవుఁడు పార్వతి రూప మనంగ వచ్చు నా....40.

ప్రగతిని కోరువారలకు భాగ్యము నీ కృప, భద్ర మార్గమున్....౫౪.

ప్రణవమె నీవు. మద్ధృది విరాజిత భవ్య ప్రబంధ శారదా....౪౮.

మగనికి సృష్టి కర్త యను మన్ననఁ గొల్పితివీవె కాదె? నీ....29.

మదికి పురాణముల్ కథలు, మార్గ సుదర్శకమెట్టులౌను? ....౪౫.

మనమున భక్తి భావమును మాకు నొసంగిన లోటు రాదుగా?....37.

మనమున హావ భావములు మాటలఁ గానఁగఁ జేయుచుండ నా ...10.

మనసును విప్పి చెప్పుటకు మాటలు చాలవు నీ ప్రతాపమున్ ….౮౭.

మనము విచిత్ర సాధనము, మంచికి, చెడ్డకు మార్గమిద్ది. సద్ ....౬౩.

మనుజులు వ్రాయు వ్రాతలవి మానక నీవయి యుండునెల్లెడన్,….౬౧.

మము జననీ సదా నిలుపు మా ఘనతన్ గణనీయ తేజ గా....౧౦౨.

మరిమరి వేడుచుంటినని మారము చేసితి నంచు నన్నునే ....౬౮.

మరువకు మమ్మ నన్ను, గుణమాంద్యము బాపుము. శక్తినిమ్ము. నీ ....౮౨.

మునుమును పాడు లోకమున పూజ్యులు దుర్భర జీవనంబుతో....36.

మొరవినుమా! దయా సరసి! పూజ్యుల నే కొలువంగఁ జేయుమా!...39.

వదనము నుండి వెల్వడు ప్రభావము చూపెడి శబ్దశక్తియే...4.

వరగుణ గణ్య వాఙ్మధుర భవ్య మనోజ్ఞ సుధాస్రవంతిగా,...11

వరగుణ గణ్యులౌ సుజన వర్గమునన్ కవితామృతంబు నే....౮౬.

వరముగ నీవె దక్కితివి వర్ధిలఁ జేయగ మమ్ము తల్లివై....౫౮.

వలచిన నిన్ను నెంచుచునవారిత రీతిని బ్రహ్మ మోములన్ ….౭౬.

విదితము చేయు దైవమును వేదములెల్ల గ్రహింపఁ గల్గినన్….24.

విధికి నమస్కరించెదను. విద్యలరాణి కృపాబ్ధినున్ననే ....౭౦.

వినయముతోడ సత్కృతిని విజ్ఞులుమెచ్చఁ నీ కొసంగెదన్……౯౭.

వినుటకు వీనులిచ్చితివి విజ్ఞత నిచ్చితి విన్నవెన్నఁగన్…..32.

వెలుగులవెల్ల నీవలన వెల్గెడి వెల్గులె, వేద రూపిణీ!....౭౮.

శరణు సరస్వతీ! సుకవి సన్నుత! సత్కమనీయ కావ్య సం....12

శిశువుల జ్ఞాన సంపదను చిందరవందర చేయుచుండి రీ ....౭౩.

శుక పిక శారికా వితతి చూపులలో పరిభాష లేమిటో?....23.

శుభమగు పాఠకాళికి వసుంధర చంపక భారతీ కృతిన్…..౧౦౦.

శుభముల కాలవాలమయి శోభిలఁ జేసెడి శారదాంబ ! మా....౯౪.

సరగున పొంగివచ్చెనిట చంపక భారతి సద్విభాతి నే...3.

సరసవిదూరమౌ కవిత సద్గురు తేజముఁ జూపఁబోదు.నీ....౭౫.

సరియెవరమ్మ నీకు మనసా వచసా భవదీయ పాద సం....౫౯.

సుజనుఁడె దుర్జనుండగుట చూచుచునుంటిమి. దుర్జనుండె తా ...౮౦.

సుజనులఁ జేర్చి సచ్చరిత శోభిలఁ గూర్చెడి తల్లివీవు. నా ....౬౬.

సుధఁ గురిపించు తల్లివని శోభిలఁ జేసెదవంచు నెంచి, నే ....౯౮.

సునిశితమైన తత్వమును శోభను గాంచ నొసంగితీవు. మా ....38.

సుమధుర భావనాంబర సుశోభిత మూర్తి యనంత కృష్ణ తే....16.

సురుచిర బ్రహ్మ దృష్టిని వసుంధర నెల్ల సృజంబులయ్యె సు....౫౩.

సృజనములైన సర్వమును సృష్టిగ ధాత యొనర్చినట్టివే ....౭౯.

స్మర రిపు నాశ్రయించి, సతి సత్పద ధూళి వహించి, చిత్త సం....౬౫.

స్వరములలోన నోంకృతిని, స్వాదుశుభాస్పద భాషణంబునున్,....౫౧.

స్వర విలసన్నుతా! సహజ సౌమ్య లసద్గుణ శారదాంబ! ....౧౦౧.

హరి జగతిన్ వహించియు నహర్నిశలున్ మదిఁ జింతనొందు. నీ....30.

హృదయపు స్పందనంబుడుగ హృద్వరభావమనంత తేజమై....౬౨.

 

కవి. చిత్రకవితా సమ్రాట్ చింతా రామకృష్ణారావు.

జననము. తే. 06 - 10 - 1951.

వేట్లపాలెం. తూర్పుగోదావరి జిల్లా.

తల్లి. కీ.శే. చింతా వేంకటరత్నమ్.

తండ్రి. కీ.శే. చింతా సన్యాసి రామారావు.

గురుదేవులు. కీ.శే. కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులు.

స్వస్థలము. సర్వసిద్ధి గ్రామము. విశాఖపట్టణం జిల్లా.

నివాసం. భాగ్యనగరము.

దూరవాణి సంఖ్య. 8247384165.

మెయిల్ ఐడీ. < chinta.vijaya123@gmail.com >

నిర్వహిస్తున్న బ్లాగు.. ఆంధ్రామృతమ్.

 

 

 

 

 

 

 

 

 

నేను,  నా రచనలు

 

కృతికర్త. 

భాషాప్రవీణ చింతా రామ కృష్ణా రావు. P.O.L., M.A.,

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు    

    ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత

      118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున

      మూడు మకుటములతో మూడు శతకములు.)

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి

    పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద   

    ఉత్పలమాలిక.

జైహింద్.

 

 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.