గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 24వ శ్లోకం. 172 - 176. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోశారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ

యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ 24

172. ఓం *శారదా*యై నమః

నామ వివరణ.

జ్ఞానమును ఇచ్చు తల్లి మన అమ్మ.

తే.గీ*శారదా*! మాత! నిన్ గొల్తు చక్కగాను,

చక్కనైనట్టి పదములన్ సరగుననిడి

నిన్ను వర్ణింపనీయుమా నేర్పు మీర,

వందనంబులు వాణి! నీవందుకొనుము.

173. ఓం *శరసన్ధానా*యై నమః

నామ వివరణ.

శరములను సంధించు తల్లి మన అమ్మ.

తే.గీచూడు మో *శరసంధాన!* చుట్టిముట్టి

యాత్మలోనున్న శత్రువులందరినిఁక

శరముఁ బట్టి యడంచుమా, సంస్తుతముగ,

నిన్ను దర్శింపనీయుమా నిక్కముగను.

174. ఓం *సర్వశస్త్రస్వరూపిణ్యై* నమః

నామ వివరణ.

సమస్తమగు శస్త్రముల స్వరూపమూ అమ్మయే.

తే.గీ.  *సర్వ శస్త్ర స్వరూపిణీ! *  చంద్రవదన!

శత్రుషట్కమున్, బాపుమా! సన్నుతముగ,

నిన్ను దర్శింపఁగలిగెడి నేర్పునిమ్మ!

నిన్ను చేరంగనగు నాకు నిక్కముగను.

175. ఓం *యుద్ధమధ్యస్థితా*యై నమః

నామ వివరణ.

యుద్ధము మధ్యలో ఉండు జనని మన అమ్మ.

తే.గీ*యుద్ధమధ్యస్థితా!* యాత్మశుద్ధినొసఁగు

మాత్మలోయుద్ధరంగాన నలసి యున్న

నన్నుకాపాడుమమ్మరో! మన్ననమున

నోపలేనింక నీవె నా కాపువమ్మ.

ఓం *దేవ్యై* నమః.

తే.గీ.  *దేవి! * నిన్ గొల్చెదన్ నాకు దీవనలిడు,

భక్తి భావంబు మనసులో ప్రబలనిమ్ము,

యుక్తినే గొల్పి భువిపైననుండనిమ్ము,

వందనంబులు చేసెదనందుకునుము.

ఓం *యుద్ధమధ్యస్థితాదేవ్యై* నమః

తే.గీ.  *యుద్ధమధ్యస్థితాదేవి*! యుక్తినిమ్మ,

నిన్ను మనమున నిరతంబు నిలుపనిమ్మ,

యాత్మలో యుద్ధమాపుమా యహము పాపి

నీవె నిజమని బోధించి నిలుము మదిని.

176. ఓం *సర్వభూతప్రభఞ్జన్యై* నమః

నామ వివరణ.

అన్ని భూతములను మిక్కిలి నశింపఁజేయు తల్లి మన అమ్మ.

తే.గీ*సర్వభూత ప్రభంజనీ! * సదయ నీవు

భూత తతినుండి కావుమా, ఖ్యాతిగ నను,

నిన్నె నిత్యమున్ గొలుచుచునున్నవాఁడ,

నీవెనాలోన నుప్పొంగు భావమమ్మ.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.