గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఆగస్టు 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ5)

కవి, పండిత, సాహితీ ప్రియులారా!
బ్రహ్మశ్రీ కట్తమూరి చంద్రశేఖరావధాని అవధానం చేస్తున్నప్పుడు ఆ నాడు  ఇచ్చిన 
ఈ నాటి సమస్య- 
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.
దానిని వారు పూరించిన విధము  వ్యాఖ్యానములో చూద్దాము. ఎందుకంటే మనం పూరించే భావ స్వచ్ఛ మనకుం టుంది. వారి భావన మనకు తెలిసిపోతే మన భావన కుంచించుకు పోయే అవకాశం ఉంది.
ఈ సమస్యను మీరు అద్భుతంగా పూరించగలరని నా విశ్వాసం.ఆ వాగ్దేవి మనల ననుగ్రహించు కాక.
నా పూరణను వ్యాఖ్యలో చూడగలరు.
జైశ్రీరాం.
జైహింద్.




Print this post

14 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మేనమామను పెండ్లాడిన భామ చీరెలు కొనడానికి వెళ్ళిన సందర్భం ....

గాడిగ లేదు, చూడ కన కాంబర వర్ణము నాకు నచ్చెగా చూడుము పట్టు చీర యిది, చూడుము కట్టిన చీర యందమున్
వీడను దీని నేను, విను వేడితి, మూల్యము నెంచ బోకనెన్
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.

ఊకదంపుడు చెప్పారు...

గాఢసుఖానుభూతిగొన కౌగిలినన్ బిగియించిబట్టియే
చేడియె వేడినన్ వినకఁ "జిక్కెదవెప్పుడొ?"నంచుబల్కుచున్
క్రీడలఁ దేలి తేల్చియును రే చివరన్ గని భీముడేగుటన్-
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.

(డ-ఢ ల ప్రాస ఆమోదయోగ్యం కాదేమోనండీ, వేరే మార్గం తోచలేదు.)

భవదీయుడు
ఊకదంపుడు

గతం లో రాఘవగారు ఇచ్చిన ఒక సమస్య చూడమని ప్రార్ధన.
http://vaagvilaasamu.blogspot.com/2007/05/5.html

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యను నేను పూరించిన విధంబెట్టిదనిన...

కోడలుగావలెన్ సుతుఁడ! కోరెద నీ ప్రియ మేనకోడలే.
నీడగ నిన్నుగాచునన నెమ్మిగ నాతఁడు పెండ్లి యాడె. ఆ
తోడుగవచ్చినట్టి సతి దుందుడుగొప్పగ మామఁ జేరె. యా
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యను చంద్రశేఖరావధాని గారు ఆసువుగా పూరించిన పద్యం ఈ విధంగా ఉంది.
వాడి మయూఖముల్ కలుగు భానుఁడు తా నడి నెత్తినుండగా
వాడిన మోము దమ్మున నవారిగఘర్మ జలంబు జారగా
మోడగు చెట్టు చందమున మూర్ఛిలి యెంతయు తా హిడింబియన్
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.

ఎంత అద్భుతమైన ఊహ! అవధాని ప్రతిభకు అభినందనలు తెలియఁ జేయ లేకుండా ఉండలేముకదా! వారికి నా భినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! రామకృష్ణుల సామర్ధ్యం సమస్యా పూరణా నిపుణతలోనే అర్ధమౌతుంది.
మీ పూరణ బాగుంది.
ఐతే
మీరన్నట్టుగానే డ - ఢ లకు ప్రాస కుదరదు.
డ - ల లకు ప్రాస కుదురుతుంది కాబట్టి ఆ దృక్కోణంలో ప్రయత్నిస్తే సుసాధ్యమేమో కదా?
అలాగ కూడా ప్రయత్నించి ఊడండి.
ఇక

భామిని కౌగిలించె తన భర్తకు తండ్రిని కౌతుకమ్ముతో

అనే సమస్యను వాగ్విలాసంలో ఇరంజీవి రాఘవ యివ్వగా మీ పూరణము
కాముడు సందడింపమది, కౌగిలి గోముగ జేరినట్టి యా
భీముని బాహుబంధనపు బిఱ్ఱున కాయము చిత్తడిల్లగన్
మామను, పైటవీవెనల, మంద్రముగా,దను జేరపిల్చి,ఆ
భామిని కౌగిలించెతన "భర్తకు తండ్రిని" కౌతుకమ్ముతో

అని అద్భుతంగా ఉందనడానికి సందేహం లేదు.
ధన్యవాగదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ! సమస్యని అలవోకగా పూరించ కలగటం మీ ప్రత్యేకత. అద్భుతంగా పూరించిన మీకు నా ధన్యవాదాలు.

మిస్సన్న చెప్పారు...

కోడలు గూటి దివ్వె యను కోతలు చాలును నీ సుతుండిదే
చూడుము తాళి దోచునెడ చోరుని వోలెను, పట్ట, కొట్టె నన్
గోడకు, చింపె చీర, తిను కూడును తన్నెను కావు మంచు నా
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

నాడు సభాంతరంబునననాథగ మారెను, వీరులేరి, కా
పాడగ మానమున్ మరియు పాండవ జాతిని, ధార్తరాష్ట్రుడే
పాడగు కార్యముల్ తలచె, పాడి సహింపక దుష్టుడై సభన్,
కోడలు పైట తీసి మరి, కోరెను మామను మాటిమాటికిన్.

మామను = శకునిని

సంపత్ కుమార్ శాస్త్రి

ఊకదంపుడు చెప్పారు...

గురువు గారూ,
మార్చినానండీ, ఇంకా దోషాలేమైనా ఉంటే తెలుపండి.

కూడిసుఖానుభూతిగొన కోమలికృష్ణనుకౌగిలించియే
చేడియె వేడినన్ వినకఁ "జిక్కెదవెప్పుడొ?"నంచుబల్కుచున్
క్రీడలఁ దేలి తేల్చియును రే చివరన్ గని భీముడేగుటన్-
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.


భవదీయుడు
ఊకదంపుడు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభోనమ:

వేడిగ జేసియుంచినది వెన్నను బూసిన జొన్నరొట్టెలన్
చూడగ దిష్టి కల్గునని చుక్కల చీరను గప్పెవాటిపై
వాడకు వెళ్ళివచ్చు తన వల్లభు దండ్రికి నివ్వజూపుచున్
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.

రాఘవ చెప్పారు...

ఇదే సమస్యను నవద్వీపంలో "కావ్యకంఠ"
బిరుదమిచ్చేముందు అంబికాదత్తులు అయ్యలసోమయాజుల గణపతిశాస్త్రిగారికి ఇచ్చారు.

పూరణం:
హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా,
స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశురమిచ్ఛతి.

అవధానివారి పూరణం కూడా అలాగే ఉండటం సంతోషకరం, ఉచితం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అబ్బా! మిస్సన్నగారూ!
గ్రామీణ జీవనం సాగిస్తున్న ఒక కోడలి యదార్థ జీవనానికి దర్పణం పడుతోందండి మీ పూరణము. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ!
భారత కథాంశాన్నితీసుకొని అలవోకగా పూరించిన మీ రచనా నిపుణత అభినందనీయం.

రామ కృష్ణా! ప్రాస సమస్య లేకుండా చక్కని పూరణను చేసిన నీకు నా అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవా!

హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా,
స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశురమిచ్ఛతి.

అనే పూరణా, మన అవధాని చంద్రశేఖరం గారి పూరణా భావ సారూప్యత కలిగి ఉన్నాయి.
నీ నిశిత పరిశీలనా శక్తిని నేనభినందిస్తున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.