గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఆగస్టు 2011, శనివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ11)

కవి మిత్రులారా!
ఆటవెలది, కంద గర్భ తేటగీతి:-  
కవన కుతుకమొ లయుభవ కవి వరులు త  
మరు! తమదు గుణ విపుల రుచిరముల కని, 
దివిజ కవివరులును, భువి దివి వెలసిన
కవులను మిము, ప్రవిమల వర వరులుగను. 
గర్భస్థ ఆటవెలది:-
కవన కుతుక మొలయు భవ కవి వరులు త  
మరు! తమదు గుణ విపుల రుచిరముల
దివిజ కవివరులును భువి దివి వెలసిన 
కవులను మిము. ప్రవిమల వర వరులు. 
గర్భస్థ కందము:-
కవనకు తుకమొలయు భవ  క     
వి వరులు తమరు!   తమదు గుణ విపుల  రుచిరముల్!
దివిజ కవివరులును భువి ది
వి వెలసిన కవులను మిము ప్రవిమల వర వరుల్ . 
అంతటి ప్రాశస్త్యం మీరు పొందినట్టుగా భావించి వ్రాసినపద్యం ఈ ఆట వెలది, కంద గర్భ తేటగీతి.
నా భావనను నిజం చేసే సత్తా మీలో ఉందని నేను భావిస్తూ,
ఈ నాడు అవధానిగారెదుర్కొని పూరించిన ఒక సమస్యను మీ ముందుంచుతున్నాను.
"భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను  సత్య భామకున్".
చూచారు కదా! సమస్య?
అవధానిగారి యొక్క, నాయొక్క పూరణలను  వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలతో పాఠకులను ఆనంద పరవశులుగా చేయగలరని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

10 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నేను చేసిన పూరణము.

ప్రేమ తలిర్ప కుంతి తన వేల్పగు సూర్యుని వేడి మంత్రమున్
నీమముతోపఠింపగనె నిల్చెను భాస్కరుఁడామె ముంగిట
న్నేమని చెప్పుదున్!ప్రకృతి నేమని వర్ణన చేయ నేర్తు? శో
"భామయు భామయున్ గలియ, బాలుఁడు పుట్టెను సత్య! భామకున్"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు అవధానిగారి పూరణము.

భామలు కాంతునిం గలియ బాలుఁడు పుట్టుట లోక సాజమే.
భామగ వేష మూనియు,విభావరి యందొకడిల్లు చేరి, తా
ప్రేమగ కాంతతో కలియ వేడుక నంతటి నాటకమ్ములో
"భామయు భామయున్ గలియ, బాలుఁడు పుట్టెను సత్యభామకున్"

అవధానిగారు ఎంత సునాయాసంగా పూరించారో కదా!
వారికి నా భినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఈ మహిలోన ముచ్చటల కెంతయు నంతము లేని దెప్పుడో?
భీముని నా హిడింబ వలపించి రమించిన నేమి యయ్యె? సం
గ్రామమునందు నా నరకుఁ గట్టడి చేసిన మెప్పు దేనికో?
భామయు భామయున్ గలియ; బాలుఁడు పుట్టెను; సత్యభామకున్.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నోములు పూజలంచు మరి నూరక బిల్వరు, నంతరార్థమౌ--
భామను మేనమామ మనువాడెను, నేటికి భాగ్యమబ్బెనో--
లేమకు గర్వమందమగు లెమ్మని మెప్పులు కీర్తులేరికిన్
భామయు భామయున్ గలియ; బాలుడు పుట్టెను; సత్యభామకున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ! మీరు చక్కగా అలవోకగా క్రమాలంకారంలో పూరించారు. అధుతం. మీ పూరణా సామర్ధ్యానికి అభినందనలు.
గర్భ కవిత మీ హౄదయాన్ని ఆకట్తుకోలేకపోయింది.ప్చ్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ! చక్కని పూరణ నందించిన మీకు నా అభినందనలు.

ఊకదంపుడు చెప్పారు...

గ్రామము;లేడువైద్యుడును, కాంతుడు సీమలకేగనేలనో,
లేమకు నొప్పిదోచి నడిరేయిని, పెంపయ నంతనంతకున్
భారము దేవుఁదయ్య,నట ప్రాకగ వాదిది, పుర్డువోయగన్
భామయు భామయున్ గలియ; బాలుఁడు పుట్టెను సత్యభామకున్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఏమియు చెప్ప లేము గననిట్టుల మాటలు దొర్లు చుండు గా

భామయు భామయున్ గలియ; " బాలుఁడు పుట్టెను సత్యభామకున్
ప్రేమలొ కాలు జారగను, పెద్దగ హిట్టగు ' పిచ్చి' చిత్రమే,
హేమము రేటు హెచ్చె, మరి హీటరు కుక్కరు కొంటి నిన్ననే !

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

నోములనెన్ని నోచినదొ,నోచిన నోముల పుణ్యమేయనన్
భామను బెండ్లియాడె యదుబాలుడు. గర్భము దాల్చెభామయున్
శ్రీమణిభూషణాదులతొ శ్రీకరమౌ సిరమంతవేళలో
భామయు భామయున్ గలియ, బాలుడు పుట్టెను సత్యభామకున్

గురువుగారు సీమంతమును కొన్ని ప్రాంతాలలో శ్రీమంతము అని అనుచుండగా విన్నాను. సరికానిచో సవరింప ప్రార్థన.

మిస్సన్న చెప్పారు...

ఆర్యా మీ బాటలోనే

భామినులందు సత్య యగు ప్రౌఢ యనంగను పారిజాతమున్
కోమలి రుక్మిణీ సతికి కూరిమి నీయగ నల్క బూనె తా
నామెకు మ్రొక్కె మాధవుడు నల్కలు దీరిన యంత కౌస్తుభా-
భామయు భామయున్ గలియ, బాలుఁడు పుట్టెను సత్యభామకున్"

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.