గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఆగస్టు 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ10)

కవన కుతూహల భాసమాన సన్మిత్రులారా!
అవధాని చంద్రశేఖరం గారు పూరణకై ఎదుర్కొన్న సమస్యనొకదాన్ని ఇప్పుడు చూద్దాము.
"రంభకు తాళి కట్టె రఘు రాముఁడు వేల్పులు సన్నుతింపగన్".
ఈ సమస్యకు నాయొక్క, అవధానిగారి యొక్క పూరణలను వ్యాఖ్యలలో చూడవచ్చును.
మీ పూరణలను వ్యాఖ్యల ద్వారా అందించి, పాఠకాళికి ఆనంద కారకులగుదురని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

16 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యను నేను పూరించిన విధంబెట్టిదనిన.

కుంభిని పుత్రి సీత విని కోమలుఁడౌ రఘురాము సాహసా
రంభ ప్రతాప కృత్యములు రాజ్ఞిగ రామునిఁ జేరఁ గోరె. ప్రా
గుంభిత రామ మానస. మహోన్నత శ్రీ వర నూత్నభావ సం
రంభకు తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మన అవధానిగారి పూరణను తిలకించండి.

డింభకుఁడైన రావణుని ఠీవిని చంపగ ముందుగానె ఆ
రంభము చేసినాఁడొ? రఘురాముఁడనంగ సుబాహుఁ జంపె. సం
రంభము తోడ చేరి మిధిలాపురి, వేగమె సీత ఉద్వహా
రంభకు తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్.

చలా చక్కగా సునాయాసంగా పూరించారు కదండీ. వారికి అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

దంభము లేక సత్వగుణ తత్వవిభాసితమై వెలుంగు నా
రంభము నందు లక్ష్మి, కడు లాలన వాగ్మతి, ముద్దరాలు, యా
కుంభిని పుత్రి,మేటిగుణ కోవిదురాలయి పొల్చు సద్గుణా
రంభకు,తాళి కట్టె రఘురాముడు వేల్పులు సన్నుతింపగన్.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

డింభకుడాకుబేరునకు, ఠీవిగఁ బెండ్లికుమారుడై నదో
రంభకుతాళిఁగట్టె; రఘురాముడు వేల్పులు సన్నుతింపగన్
శంభునిఁ నుగ్రతన్ కదిలె శాంతము వీడుచు రావణున్ మహా
జృంభితమైన దుర్నియతిఁ సీతనుఁ బట్టిన వానిఁ జంపగాన్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శంభుని విల్లు బట్టి తన శౌర్యము హెచ్చగ రెండు జేసె, నీ
డింభకు డేమిజేయునని టెక్కులు బోయెడు రాజపుత్రులున్

స్తంభము వోలె నిల్వ; దను జాధమ రావణు గూల్చుదౌ కథా
రంభకు తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంపత్ కుమార్ శాస్త్రి గారూ!సీతా మహా సాధ్విని మీరు పూరణ ద్వారా చేసిన ఆవిష్కరణ ప్రశంసనీయము. మీకు నా అభినందనలు.

మందాకినిగారు! సమస్యను చక్కగా మీపూరణకనువుగా రెండు భాగాలుగా విడదీసి, అద్భుతంగా పూరించారండి. అభినందనలు.

హనుమచ్ఛాస్త్రిగారూ! చాలా చక్కగా పూరించారండి సమస్యని. మీకు నా అభినందనలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

శంభుని వింటినెత్తికొని సాఒబుని మ్రొక్కుచు త్రుఒచివేయగన్
సంభవమయ్యె రామునకు, సాత్వికులందరు మెచ్చుచుండగా
కుంభినిజాతకున్ మృదుల కోమలరూపిణి యైన సద్గుణా
రంభకు,తాళి కట్టె రఘురాముడు వేల్పులు సన్నుతింపగన్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ! చాలా సహజంగా అలవోకగా అద్భుతంగా పూరించారు సమస్యను. అభినందనలు.

మిస్సన్న చెప్పారు...

డింభకు డైన నేమి తగ ఢీకొని చంపెను తాటకాదులన్!
శంభుని విల్లు ద్రుంచి తన శక్తిని చాటె స్వయం వరమ్మునన్!
భంగము నొందు రావణుని బంధురభాగ్యవిలాసనాశనా-
రంభకు తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిస్సన్నగారూ! చాలా వేగంగా చక్కగా పూరించారు.
ఐతే ఆ వేగంలో ప్రాసాక్షరం యతిస్థానంలోచేరింది.
ప్రాసాక్షరం మూడవ పాదంలో సరి చూడగలరు.

మిస్సన్న చెప్పారు...

ఆర్యా ! బలే సుతి మెత్తగా అంటించారు!
సవరించిన నా పూరణను చిత్తగించండి.

డింభకు డైన నేమి తగ ఢీకొని చంపెను తాటకాదులన్!
శంభుని విల్లు ద్రుంచి తన శక్తిని చాటె స్వయం వరమ్మునన్!
బంభర వేణికిన్ దనుజ బంధురభాగ్యవిలాసనాశనా-
రంభకు తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురువు గారూ,

ధన్యవాదములండి. అవధానసమస్యలనిచ్చి మామ్ములను ఉత్తేజపరచుచున్న మీకు వందనములు.

ఊకదంపుడు చెప్పారు...

సంభృతభూషకున్,సుకృత శంభుసతీ వ్రతకు, సీతకు, ధరా
సంభవకున్,రమాపరకు,సాత్రపనిమ్నముఖాబ్జకున్ను,వి
శ్వంభర మంటపంబునను, వైదిక ధర్మవిధిన్నిజ మాతృకా పరీ
రంభకు తాళి కట్టె రఘు రాముఁడు వేల్పులు సన్నుతింపగన్

ఊకదంపుడు చెప్పారు...

గురువుగారు, 1,3 పాదములు దిద్దినాను.

సంభృతభూషకున్,సుకృత శంభుసతీ వ్రతకున్, వసుంధరా
సంభవకున్,రమాపరకు,సాత్రపనిమ్నముఖాబ్జకున్ను,వి
శ్వంభర మంటపంబునను, వైదిక వైఖరిఁ, మాతృకా పరీ
రంభకు తాళి కట్టె రఘు రాముఁడు వేల్పులు సన్నుతింపగన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రామ కృష్ణా! నీ రచన గీతాదుల కంటే వృత్తాలే చాలా బాగుంటూన్నాయి.
నీ పూరణ బాగుంది.
అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.