గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, డిసెంబర్ 2009, గురువారం

ఇల్లరికం అల్లుళ్ళూ! ఏమి భోగమయ్యా మీది!

సుగుణ వందితులారా!
ఒక్కొక్క పర్యాయం మనకు కొన్ని కొన్ని శ్లోకాలు భలే బాగుండడమే కాదు ఒక్కొక్కసారి అవి యదార్థానికి దర్పణాలుగా కూడా తోస్తాయి. ఈ క్రింది శ్లోకాన్ని మీరే చూడండి.

శ్లో:-
అసారే ఖలు సంసారే సారం శ్వశుర మందిరం!
హిమాలయే హర శ్శేతే! హరి శ్శేతే మహోదధౌ!

ఆ:-
సార హీనమైన సంసారమందున
సార మయము అత్త వారి యిల్లు.
హరుడు హిమ గృహమున, హరి పాల కడలిని
నిండు మనముతోడ నుండెఁ గాదె!

భావము:-
సార హీనమైన యీ సంసారమునందు అత్తవారిల్లే (మామగారిల్లే) సారవంతంగా ఉంటుంది. అందుకే గదా పరమ శివుడు తాను తన అత్తవారిల్లైన (మామగారిల్లైన) హిమాలయ పర్వతముపై కైలాసమున నివసించుచున్నాడు? సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా తన అత్తవారిల్లైన(మామగరిల్లైన) పాల కడలలోనే నివసిస్తున్నాడు? ఎంత సారవంతమైనవి కకపోతే అలా ఉంటారు?

జైహింద్.
Print this post

5 comments:

rākeśvara చెప్పారు...

నిజంగా అపురూపంగా వుందండి. రేపు నిజంగా ఇల్లరికం పుచ్చుకుంటే ఈ శ్లోకం పనికివస్తుంది :D

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాకేశ్వరుడౌననెగా!
నాకిక లోటేమి కలుగు? నా బ్లాగునకున్
ప్రాకటముగ నభివృద్దియు,
శ్రీకర సజ్జనుల దృష్టి చేకురు నికపై.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

శివుడు కొండ మీద, విష్ణువు సంద్రం లో ఉండడంలో ఇంకో రహస్యముందండోయ్.

శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
పవళించుట నల్లి బాధ పడలేక జుమీ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

దీనిలో ఒక రాజకీయం లేకపో లేదండోయ్.

అల్లుల నత్తల యింటనె
యిల్లరికము లుంచఁగోరి, ఈశుడు, హరియున్
నల్లుల సృష్టిని చేసె, మ
నల్లులు వారలను పోలి, యమరుట కొఱకున్.

ఔనంటారా?

Unknown చెప్పారు...

చాలా బాగున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.