గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2009, మంగళవారం

దండం దశ గుణం భవేత్.

దండం దశ గుణం భవేత్. అంటారుకదా! ఆ దశ గుణాలూ ఏవో మీకు తెలుసా? తెలుసుకోవాలనుందా?
ఐతే చూడండి.

శ్లో:-
విశ్వామిత్రాహి పశుషు - కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్థక్యే - దండం దశగుణం భవేత్.

ఆ:-
పక్షి, కుక్క, శత్రు, పాము, పశులఁ ద్రోల,
చేతి కర్ర మిగుల చేవఁ జూపు.
బురద, నీరు, రేయి, ముసలి, గ్రుడ్డియుఁ గల్గ
చేతికర్ర దాటఁ జేయు మనల?

భావము:-
పక్షులు, కుక్కలు, అమిత్రులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకున్ను, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డితనంలో, ముసలితనంలో అవలంబనంగానున్ను, చేతి కర్ర పనికివస్తుంది. అందుచేతనే దండం దశ గుణం భవేత్ అంటారు.

జైహింద్.
Print this post

7 comments:

రవి చెప్పారు...

కర్దమేషు - బురద యందు
జలేషు - నీటి యందు
అంధే - గ్రుడ్డితనంలో
తమసి - చీకటిలో
వార్ధక్యే - ముసలితనంలో
దండం దశగుణం భవేత్ - ఇంతవరకు బానే ఉందండి.

విశ్వామిత్రాహి పశుషు - ఈ పాదం కాస్త విశదీకరించాలి. (విశ్వ + అమిత్ర + అహి ..ఇలా చెప్పుకోవాలా? లేక విశ్వామిత్రాహి పశుషు లో విశ్వామిత్రాహి అన్నది విశేషణమా?)

ఇంకో విషయం - దండం దశగుణం భవేత్ అనే మాట, చిన్నప్పుడు మా మాస్టారు, "మీరు దెబ్బలకు తప్ప లొంగర్రా" అనే వ్యుత్పత్తిలో వాడేవారు. :-). ఈ శ్లోకంలో ఆ అర్థం లేదు మరి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వి - శ్వ - అమిత్ర - అహి - పశుషు. అని పదములుగా విడదీసి అర్థం చెప్పుకొంటే సరిపోతుంది.
మీ మాష్టారు చిన్నప్పుడు వాడడాంలో అనౌచిత్యమేమీ లేదు.
విద్య సరిగా అభ్యసింపని శిష్యుడు గురువుకు అమిత్రుడు అనగా శత్రువు. దండంతో సరిచేయ వచ్చునని భావం.

రవి చెప్పారు...

బావుందండి.

శ్వ అంటే కుక్క - (శునిచైవ శ్వపాకేచ పణ్డితాస్సమదర్శినః అని గీతాకారుడు చెప్పాడు, అందులో శ్వ వచ్చింది కాబట్టి, శునకం అనుకుంటున్నాను)

ఇక మిగిలింది వి కాబట్టి, వి అంటే పక్షి అనుకుంటున్నాను. శ్వ, వి రెండూ సప్తమీ విభక్తి రూపాలయిఉండాలి.

తప్పులు సరిదిద్దగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! నీవు సరి చేయగలిగిన దోషాలు నీవే సరిచేస్తేఅదే నేను పదిమందికీ ప్రదర్శింపఁ జేస్తాను.
తప్పక సరిచేసి చూపఁగలవని ఎదురు చూస్తుంటాను.
ఆయుష్మాన్ భవ.

రవి చెప్పారు...

అయ్యయ్యో, శ్లోకాల్లో తప్పులున్నాయనలేదండీ మాస్టారు. వారి శ్లోకాల్లో తప్పులు పట్టేంత తాహతు నాకు లేదు. నేను అర్థం చేసుకున్న విధానంలో తప్పులున్నవా అని మాత్రమే నా సందేహం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీ! నీ ఊహ సరైనదే. సప్తమీ విభక్తే.దోషాలేమీ లేవని నా నమ్మకం.
చక్కని సాహిత్యాంశాలను పంపగలవని ఆశిస్తున్నాను.

SATYA చెప్పారు...


1) వి = పక్షి
2) శ్వా = కుక్క
3) అమిత్ర = శత్రువు
4) అహి = పాము
5) పశుషు = పశువులు6) కర్ధమేన = బురద
7) జలేనచ = నీటియందు
8) అందః = గుడ్డితనమందు
9) తమసి =చీకటిలో
10) వార్ధక్యము = ముసలితనము
దండము = కర్ర

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.