గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, డిసెంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 24.

ప్రియ సాహితీ పిపాసా తప్త హృదయులారా! ఈ క్రింది పద్యాలలో ఒక కవీశ్వరుడు, ఒక నెఱజాణయైన వేశ్యల మధ్య జరిగిన చతుర సంభాషణను గమనించండి.
సమాధానాలను రాబట్టి కామెంట్ ద్వారా తెలియఁజేయ గలందులకు మనవి.

ఇక చూడండి్ కవీశ్వరుని చలోక్తి.

తే:-
పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి,
అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి,
ప్రేమ తోడుత వానికి పెద్ద బిడ్డ !
సున్నమిట్టుల తేగదే సుందరాంగి?


నెఱజాణ యగు వేశ్య ప్రత్యుత్తరము:-

క:-
శత పత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము తల దాల్చిన శివ
సుత వాహన వైరివైరి సున్నంబిదిగో.

సమాధానం పంపుతారు కదూ!
ఇటువంటి పద్యములు మన ఆంధ్ర సాహితీ జగత్తులో అనంతముగా కలవు.
మీరు మీకు తెలిసిన ఆహ్లాద జనకమైన యిటువంటి పద్యములు పంప గలిగినచో అందరికీ మన ఆంధ్రామృతము ద్వారా పంచ గలనని మనవి చేయు చున్నాను.

జైహింద్.
Print this post

4 comments:

కథా మంజరి చెప్పారు...

రామ క్రిష్ణ కవి గారూ, మీ పద్యానికి వివరణ యిదిగో అవధరించండి ...
పర్వత శ్రేష్ఠుని పుత్రిక = పార్వతి
ఆమె పతి = శివుడు
అతని విరోధి = మన్మధుడు
అతని అన్న = బ్రహ్మ
అతని భార్య = సరస్వతి
ఆమె అత్త = లక్ష్మి
ఆమె తల్లి = గంగా దేవి
ఆమె ముద్దుల పెద్ద బిడ్డ జ్యేష్ఠా దేవి.
కవి గారు నెరజాణతో ఓసి జెష్ఠా, సున్నం తేవే అని అడిగాడు.
నెరజాణ తక్కువ తిందా ?
అంతే కొంటెగా జవాబిచ్చింది ..

చూడండి ...

శత పత్రంబుల మిత్రుడి = సూర్యుడు
అతని సుతుడు = కర్ణుడు
అతనిని చంపిన వాడు = అర్జునుడు
అతని బావ = నల్లనయ్య
అతని సూనుడు = మన్మధుడు
అతని మామ = చంద్రుడు
అతనిని సతతం తల మీద ధరించే వాడు = శివుడు
అతని సుతుడు = వినాయకుడు
అతని వాహనం = ఎలుక
దాని వైరి = పిల్లి
దాని వైరి = కుక్క

ఓరి కుక్కా , సున్నం యిదిగో అని నెరజాణ కొంటెగా జవాబిచ్చింది.

ఇది ప్రసిద్ధమైన పద్యమే ...తెలీని వాళ్ళ కోసం ఇంత వివరంగా చెప్పాను ...
మీకు నా ధన్యవాదాలు ....

కంది శంకరయ్య చెప్పారు...

పద్యం.నెట్
October 21, 2009 at 11:08 pm

కంది శంకరయ్య

మిత్రులు పంపిన చమత్కార పద్యాలకు వివరణ …
తే.గీ. పర్వతశ్రేష్ఠపుత ్రికా పతి విరోధి
యన్న పెండ్లాము నత్తను గన్నతండ్రి
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేఁగదే సన్నుతాంగి.
వివరణ: పర్వతశ్రేష్ఠపుత ్రిక-పార్వతి. ఆమె పతి-శంకరుడు. అతని విరోధి-మన్మథుడు. మన్మథుని అన్న-బ్రహ్మ. బ్రహ్మ పెండ్లాము -సరస్వతి. ఆమె అత్త-లక్ష్మి. లక్ష్మిని కన్నతండ్రి-సముద్రుడు. అతని పెద్దబిడ్డ-పెద్దమ్మ(దరిద్ర దేవత). “ఓ పెద్దమ్మా (దరిద్ర దేవతా)! సున్నం తే” అని అర్థం.
కం. శతపత్రంబుల మిత్రుని
సుతుఁ జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతు వాహన వైరి వైరి సున్నంబిదిగో.
వివరణ: శత్రములు-తామర పూలు. వాటి మిత్రుడు-సూర్యుడు. అతని సుతుడు-కర్ణుడు. కర్ణుని చంపినవాడు-అర్జునుడు. అతని బావ-కృష్ణుడు. అతని సూనుడు-ప్రద్యుమ్నుడు(మ న్మథుడు). మన్మథుని మామ-చంద్రుడు. చంద్రుని తలదాల్చినవాడు-శివుడు. అతని సుతుడు-వినాయకుడు. వినాయకుని వాహనం-ఎలుక. దాని వైరి-పిల్లి. పిల్లికి వైరి-కుక్క. “ఓ కుక్కా! ఇదిగో సున్నం” అని అర్థం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండితులె పంతు లనఁబడు,
పండితులగు పంతులింట ప్రభవించిన సత్
పండిత! జోగారావూ!
నిండుగ నర్థంబు తెలిపు నేర్పరివీవే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కంది శంకరయ్య గారూ!
పద్యము నెట్టులోన కడు ప్రస్ఫుటమొప్పగనుంచినట్టు,పల్
హృద్యములైన భావనల నందునెఱుంగగఁ జేసినట్టు, యీ
విద్యలకాలవాలమయి వెల్గుచునున్నటు గాంచనైతి. యీ
విద్యల నేగురుండటు వివృద్ధి యొనర్చిరొ! అంజలించెదన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.