గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, డిసెంబర్ 2009, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 66.

శ్లోll
అద్రోహః సర్వ భూతేషు కర్మణా మనసా గిరా.
అనుగ్రహశ్చ దానంచ సతాం ధర్మః సనాతనః.౮౭
(మహా భారతము - వన పర్వము - ౨౯౭ - ౩౫.)
తే.గీll
త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు.
భవము:-
మనోవాక్కాయములచే యే ప్రాణి పట్లను ద్రోహమును చేయ కుండుటయే కాక; అందరి యెడలను ప్రేమాదరములను కలిగి యుండుట; తనకు కలిగిన దానిని యెల్లరకు దానమిచ్చుచుండుట; అనునవి సనాతనమైన ధర్మములు.
ఆర్యులారా! ఈ క్రింది శ్లోకాదులు మేలిమి బంగారం మన సంస్కృతి3 లో ఉన్నవి పునరుక్తమైనవి.
మిత్రులారా! మీరు నమ్మినా నమ్మకపోయినా మన పెద్దలు చెప్పినవన్నీ కూడా నగ్న సత్యాలు. సత్ఫలదాయకాలు.
ఔనో కాదో ఈ క్రింది విషయాన్ని చూసి మీరే చెప్పండి.
శ్లో:-
సంతోష స్త్రిషు కర్తవ్యః " కళత్రే - భోజనే - ధనే."
త్రిషు చైవ న కర్తవ్యః " దానే - తపసి - పాఠనే."
ఆ:-
భార్య - భుక్తి - ధనము ప్రాప్తించునవి గాంచి
సంతసింప వలయు సమ్మతించి.
తపము - దాన - పఠన తాదాత్మ్యు లయ్యును
సంతసింప రాదు సరస మతులు.
భావము:-
భార్య విషయమున, భోజనము విషయమున, ధనము విషయమున మనకు లభించిన దానితోనే మనము సంతోషము పొందవలెను.
దానము చేయు విషయమున, తపస్సు చేయు విషయమున, చదువుట విషయమున ఎంత ఎక్కువైననూ అది తక్కువ గానే భావించి సంతోషపడిపో కూడదు.
ఇప్పుడు నా అభిప్రాయంతో మీరూ ఏకీభవించకుండా ఉండలేరు కదూ!
జైహింద్.
Print this post

2 comments:

రవి చెప్పారు...

అక్షర సత్యాలు.

అజ్ఞాత చెప్పారు...

మంచి మాట చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.