గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 30.

సుజ్ఞాన సంపన్నులారా!
అజ్ఞాతకవి రచించిన ఈ క్రింది చాటువును చదివి సమాధానం చెప్పుకోండి చూద్దాం.

క:-
నగ పగతు పగతు పగతుకు
పగతుండౌ మగధ రాజుఁ బరిమార్చిన యా
జగ జెట్టి యన్న తండ్రికి
తగువాహన మైనయట్టి ధన్యుడవు భళా !

జైహింద్.
Print this post

2 comments:

కథా మంజరి చెప్పారు...

ఈ చిన్ని పద్యంలో ఒకరితోనొకరికి సంబంధం గల వ్యక్తులు
వరుసగా : ఇంద్రుడు , నరకుడు , నల్లనయ్య , జరాసంధుడు , భీముడు , ధర్మ రాజు , యముడు ... వాని వాహనం ...
దున్నపోతు !!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పాఠకులు ఆలోచనలో పడినట్లున్నారు.
ఈ పద్యంలో సారాంశం శ్రీ పంతుల జోగారావు సూచనప్రాయంగా తెలియఁజేశారు.
దానినే నేను వివరంగా ఇక్కడ తెలియఁ జేస్తున్నాను.

నగ పగతుడు = ఇంద్రునకు,
పగతు = శత్రువైన నరకాసురునకు,
పగతుకు = శత్రువైన కృష్ణునకు,
పగతుండౌ = శత్రువైన,
మగధరాజు = మగధ దేశాధిపతియైన జరాసంధుని,
పరిమార్చిన = సంహరించిన,
ఆ జగ జెట్టి = గొప్ప మల్లుడైన భీమునకు,
అన్న = అన్న అయినటువంటి ధర్మరాజుకు,
తాండ్రికి = తండ్రియైన యమధర్మ రాజుకు,
తగు వాహనము = తగిన వహనమైన దున్నపోతు,
ఐన యట్టి ధన్యుడవు = ఐన ధన్యాత్ముడవయ్యా!
ఓ దున్నపోతా! అని తాత్పర్యము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.