గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2009, బుధవారం

ద్వ్యర్థి శ్లోకమున కనువాద పద్యము.

ప్రియ సాహితీ బంధువులారా!
శ్లో:-
య:పూతనా మారణ లబ్ధ వర్ణ:,
కా కోదరోయేన వినీత దర్ప:,
యస్సత్యభామా సహితస్సపాయా
న్నాధో యదునా మధనా రఘూణామ్!(రచన:- కోలాచలం పెద్దిభట్టు)
తే.గీ:-
లక్ష్య పూతనామారణ లబ్ధ కీర్తి,
ఉగ్ర కాకోదరో వినీతోద్ధతియును,
తుష్టి సత్యభామా సహితుండు నయిన
కృష్ణ రాముఁడు మిమ్ము రక్షించుఁ గాక!
రాముని పరముగా అన్వయార్థ దండాన్వయములు.:-
లక్ష్య = లక్ష్యముతోఁ గూడిన,
పూత=పవిత్రమైన
నామా=పేరు గలవాడును,
రణ = యుద్ధము చేయుటయందు,
లబ్ధ కీర్తి=లభించిన కీర్తి గలవాడును,
ఉగ్ర =భయంకరమైన
కాకోదరో(కాక+ఉదర:)=నిర్భయముగ ప్రవర్తించు కాకాసురుని యొక్క, 
వినీతోద్ధతియును=గర్వాపహారియును,
తుష్టి =తృప్తి కరముగా,
సత్య=సత్య వర్తియు,
భా=ప్రకాశవంతమైనవాడును,
మా సహితుండు నయిన=లక్ష్మితో కూడిన వాడును అయిన,
కృష్ణ =నీలి వర్ణుడయిన,
రాముఁడు=శ్రీరాముడు, 
మిమ్ము రక్షించుఁ గాక=మిమ్ములను కాపాడును గాక!
దండాన్వయము:-
లక్ష్యముతోఁ గూడిన పవిత్రమైన పేరు గలవాడును, యుద్ధముఁ జేయుట యందు లభించిన కీర్తి కలవాడును, నిర్భయముగ ప్రవర్తించు భయంకరుడగు కాకాసురుని యొక్క గర్వాపహారియును, తుష్టుగా సత్యప్రవర్తకుడును, కాంతివంతుడును,గృహ రాల్య లక్ష్మితో కూడుకొన్నవాడును, నీలి వర్ణుడయిన శ్రీరాముడు మిమ్ములను కాపాడు గాక!
కృష్ణుని  పరముగా అన్వయార్థదండాన్వయములు:-
లక్ష్య =లక్ష్యమును కలిగి,
పూతనా=పూతన యను రాక్షసిని,
మారణ =చంపుట చేత,
లబ్ధ కీర్తి=లభించిన కీర్తి కలవాడును,
ఉగ్ర =భయంకరమైన,
కాకోదరో=కాళియుడను సర్పము యొక్క, 
వినీతోద్ధతియును=అణచివేయఁబడిన గర్వము కలవాడును,
తుష్టి =తృప్తికరముగ,
సత్యభామా సహితుండు నయిన=సత్యభామా సహితుడును అయిన,
కృష్ణ = కృష్ణుడను పేరుతోగల,
రాముఁడు=రమ్య మూర్తి, 
మిమ్ము రక్షించుఁ గాక= మిమ్ములను కాపాడును గాక.
దండాన్వయము:-
లక్ష్యమును కలిగి పూతన యను రాక్షసిని చంపుట చేత లభించిన కీర్తి గలవాడును, భయంకరమైన కాళీయుఁడను సర్పము యొక్క గర్వ మడంచిన వాడును, తృప్తికరముగ సత్యభామతో కూడి యున్నవాడును,  రమ్యమూర్తి యగు కృష్ణుఁడు మిమ్ములను రక్షించుఁ గాక!
జైహింద్.
Print this post

1 comments:

రవి చెప్పారు...

అద్భుతం. అభినందనలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.