గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2009, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 74.( తేటగీతి గర్భ కందము.)


ప్రియ పాఠక బంధువులారా!
సమాజానికికంటక ప్రాయంగా ఉండే దుర్మార్గుల విషము లోను, కంటకముల విషయము లోను రెండు పరిష్కార మార్గాలు ఈ క్రింది శ్లోకంలో సూచించ బడ్డాయి. చాలా చక్కని సూచన చేయఁబడింది. గమనించండి.
శ్లో:-
ఖలానాం, కంటకానాంచ, ద్వివిధైవ ప్రతిక్రియా!
ఉపానన్ముఖ భంగోవా, దూరతోవా విసర్జనమ్.
తే.గీ.:-
ఖలునకునుకంటకమునకు నలతిగ తగి
న ప్రతిక్రియల్ రెండు గనన్ గలవిల.
చెప్పున ముఖమున్ మడచుటొ,తప్పుకొ్నుటొ,
తగు,మనకది పరగునయ్య! సుగమ మిదియె. 
తే.గీ. గర్భ కందము 4పాదాలు 4రంగుల్లో.:-
ఖలునకునుకంటకమునకు నలతిగ తగి
న ప్రతిక్రియల్ రెండు గనన్ గలవిల.
చెప్పున ముఖమున్ మడచుటొ,తప్పుకొ్నుటొ,
తగు,మనకది పరగు(న్ + అ)నయ్య! సుగమ మిదియె. 
భావము:-
దుష్టులకు, ముండ్లకు  ప్రతి క్రియ రెండే విధములు.  చెప్పుతో ముఖ భంగము చేయుటో, తప్పుకొని దూరముగా పోవుటో, ఈ రెండే తగిన మార్గములు.

నా అనువాదమైనతేటగీతి పద్యముననే కందపద్యము కూడా గర్భితమై యున్నదన్న విషయమును మీకు  స్పష్ట పరచఁ  గలిగాననుకొంటున్నాను. గమనింప మనవి.
జైహింద్.
Print this post

4 comments:

rākeśvara చెప్పారు...

మాష్టారు మడచుటో దగ్గర కంద పద్యప్రాస భంగమైనట్టుంది చూడండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రాకటముగ "ల-ళ" "ల-డ" లకు
నీకరణి నభేద ప్రాస నేర్పిరి గురువుల్.
నేఁ గని తప్పకవీయము.
రాకేశ్వరుడా! యభేద ప్రాసను గనుమా!

సురేష్ బాబు చెప్పారు...

అలా ఊరకే తప్పుకొని పోకుండా వారికి సద్భుద్దిని ప్రసాదించమని భగవంతున్ని కోరుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా బాగుంటుందేమో కదండీ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సురేష్ బాబూ! మీ సూచన చలా బాగుంది. ఐతే మూలశ్లోకంలో ఉన్న భావాన్ని మాత్రమే అర్థం చెడిపోకుండా అనువాదం చేయడం జరిగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.