గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, డిసెంబర్ 2009, ఆదివారం

పూజా ప్రారంభ సమయంలో గంట ఎందుకు వాయిస్తారో తెలుసా?

భగవద్బంధువులారా!
మనం పూజా సమయంలో గంట మ్రోగిస్తాం. ఎందుకో తెలుసా?
తెలుసుకోవాలనుకొంటే ఏ క్రింది శ్లోకాన్ని, అనువాద పద్యాన్ని, చూడండి.

శ్లో:-
ఆగమార్థంతు దేవానాం - గమనార్థంతు రాక్షసాం
కురు ఘంటా రవం తత్ర - దేవతాహ్వాన లాంఛనం.

గీ:-
దేవతల రాక కొఱకని తృప్తిఁ గొలుప,
రాక్షసుల పోక కొఱకు, పరాకు లేక
గంట వాయించు టొప్పును, గర్భ గుడిని,
దేవ తాహ్వాన పద్ధతి తెలియఁ దగును.

భావము:-
పూజా సమయంలో మనం పూజించే దేవతలు అక్కడికి రావడం కొఱకు, మన బాహ్యాంతర ప్రదేశాల నుండి రాక్షసులు పోవడం కొఱకు, గంట మ్రోగించ వలెను. దేవతల నాహ్వానించు లక్షణము ఇదేసుమా.

దోషములు న్నచో తప్పక తెలియఁ జేసి, సరి చేయఁ బ్రేరేపించ మనవి.

జైహింద్.
Print this post

6 comments:

Unknown చెప్పారు...

అంత కన్వెంసింగ్ గా లేదండి . ఎందుకంటె మనం గంట పూజ అయిపోయేముందు హారతి ఇచ్చే టప్పుడు వాయిస్తం . ఆ టైం లో దేవతలనని పిలవడం అంటే మెయిన్ పూజ అప్పుడు వారు లేరనే గా అర్ధం?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవిగారూ!
గుడిలోకి ప్రవేశింపగానే ఘంటా నాదం ఎందుకు చేస్తారో అన్న విషయం ఈ శ్లోకంలో తెలియఁజేయ బడింది.
గంట వాయించడానికి గల కారణాలలో ఇది ఒక కారణం మాత్రమే. ఇంకేకారణం లేదని అర్థం కాదు.

Sanath Sripathi చెప్పారు...

చిన్న ముద్రా రాక్షసం..

"కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనం. "

రవిగారు,
(1) మన ఊర్ల లో మన చిన్నప్పుడు చాటింపు వేసేతప్పుదు ముందు గా దప్పు వాయించి "ఇందు మూలముగా యావన్మందికీ తెలియజేయునదేమనగా..." అనుకుంటూ చెప్పేటప్పుడు ఎందుకు ముందూ వెనకా డప్పు వాయించేవారు?

(2) పెళ్ళిళ్ళల్లో ముహూర్తానికి ముందు "సావధాన, సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన" అని ఎందు మంగళ శ్లోకాలు చదువుతారు? బాజా భజంత్రీల వాళ్ళు కూడా ఆ ముహూర్తం సమయం లో ఎందుకు తారస్థాయి లో వాయిస్తారు?

(3) రాజుల కాలం లో రాజులు సభలోనికి వేంచేసేటప్పుడు ముందుగా వంధి మాగధులు రాజు గారి శౌర్య ప్రాభవాలనీ కీర్తిని స్లాఘిస్తూ ఎందుకు ఆహ్వానం పలికేవారు?

వీటన్నికిటికీ సమాధనం ఏమిటో, దీనికీ సమాధానం అదే....
పూజ ప్రారంభించేటప్పుడు ఘంటారవం చేసి ఇంక మేము పూజ ప్రారంభిస్తున్నామహో .. దేవతలారా మీరు సన్నధ్ధులు కండి. అసురులారా మీరు ఇక దయచేయండి అని ఘంటారం ఒక చాటింపు లాంటిది.

పంచేంద్రియాలకూ ప్రియమైన వాటిని అందిస్తూ వాటిద్వారా భగవదనుభూతిని పొందటానికి పెద్దలు ఏర్పరచిన ఫూజా ప్రక్రియలో ఇదీ ఒక భాగమే.

కళ్ళకి ఇంపుగా --> అలంకరణ, దీప హారతులూ; చెవులకింపుగా --> మంగళ వాయిద్యాలు, స్త్రోత్రాలు; జిహ్వకి ఇంపుగా --> తీర్థ ప్రసాదాలు; నాసికకి ఇంపుగా --> ధూప, గంధాదులూ, శరీరానికి ఇంపుగా --> ఆసనమూ మొదలైన వాటిని పూజావిధానం లొ అంతర్లీనం గా ఇచ్చారు.

పూజా ప్రారంభలో గంత వాయించటం "సావధానమంటూ" సూచిస్తే పూజావసానం లో ఘంటారవం శిఖరానుభూతి ని కల్గిస్తుంది. మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే సినేమాలో హీరో గారు ఎంటృఈ ఇస్తూంటే ఉండే బాగ్రౌండు మ్యూజిక్ చివరాఖర్లో ఉత్కంఠభరితమైన క్లైమాక్సు లో విజయాన్ని సొంతం చేసుకునేటప్పుడు మ్యుజిక్ కీ ఉన్న తేడా అన్న మాట.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి సనత్ గారూ! ధన్యవాదాలు.
మీరు సూచించిన మార్పు చేసాను.

శ్రీపతి సన్నిధానమది సత్యము నిత్య మవేద్యమై భువిన్.
శ్రీపతి చెప్పినట్లు మన చేసెడి పూజకు ముందు వెన్కలన్
ప్రాపుగనుండ దైవమును ప్రార్థనఁజేయుచు ఘంటనాదము
న్నీపగిదిన్ ఘటించుటది యెన్నగ సచ్ఛుభసంప్రదాయమౌన్

Unknown చెప్పారు...

పెళ్ళిలో భజంత్రీలు తారాస్తాయిలో వాయించడం - ఎవరైనా ఆ సమయంలో తుమ్మడం లాంటి అశుభ సూచకాలు వినపడకుండా ఉండడానికని విన్నాను. ఎంతవరకు కరెక్టో తెలీదు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కేకే గారూ!
భఝంత్రీలు తారాస్థాయిలో వాయించడానికి గల అనేక కారణాలలో మీరు చెప్పింది కూడా ఒక ముఖ్యమైన కారణమే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.