గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, డిసెంబర్ 2009, శనివారం

చెప్పుకోండి చూద్దాం 32.

సాహితీ బంధువులారా!
ఒక చక్కని తేట గీతం అత్యద్భుతమైన భాషా పాటవాన్ని, అర్థ సౌష్టవాన్ని కనఁబరుస్తోంది.
మీరూ దీనిని చదివిన పిదప, ఆ పద్యాంతర్గత భావ పాటవాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాలనే ఆసక్తితో ఉంటారనే ఉద్దేశంతో మీ ముందుంచుతున్నాను. ప్రయత్నించి చూడండి.


తే:-
అతివ కచ నాభి జఘన దేహాననము " త
మీనదరసాలతారాజపా " నిరాక
రణ మనంతమనాది నేత్ర గళ భుజ న
ఖౌష్ఠ కుచ వచో దంతంబు లుభయ గతుల.


చూచారుకదా! మఱెందు కాలస్యం? ప్రయత్నించండి. మీ కామెంట్ ద్వారా పాఠకుల కందించుదురని ఆశిస్తున్నాను.
సమాధానం తెలియకపోతే కామెంట్స్ లో ఉంది. చూడండి.


జైహింద్.
Print this post

6 comments:

కామేశ్వరరావు చెప్పారు...

చాలా చమత్కారంగా ఉందండి పద్యం.
"తమీనదరసాలతారాజపా" లను అనంతంగా నిరాకరించేవి "కచ నాభి జఘన దేహాననము"లు. చివరి అక్షరం "పా" తీసేస్తే - తమీ(చీకటి), నద(సరస్సు), రసా(పాదరసం?), లత, రాజు(చంద్రుడు)లను కచ, నాభి, జఘన, దేహ, ఆననములు నిరాకరిస్తాయి
"తమీనదరసాలతారాజపా" లను అనాదిగా నిరాకరించేవి "నేత్ర గళ భుజ నఖోష్ఠ"లు. (ఇక్కడ నఖౌష్ఠ అన్నది సరైన పదం అనుకుంటా)
మొదటి అక్షరం "త" తీసేస్తే - మీన(చేపలు), దర(శంఖం), సాల(చెట్టు కొమ్మ), తరా(నక్షత్రాలు), జపా(మందారం లాంటి ఎఱ్ఱనిపువ్వు)లను నేత్ర, గళ, భుజ, నఖ, ఓష్ఠములు నిరాకరిస్తాయి.
ఉభయగతుల అంటే అనాదిగా, అనంతంగా నిరాకరించేవి "కుచ వచో దంతములు". ఇది పూర్తిగా అర్థమవ్వలేదు.
మీనజ(కుంభం?), రసాల(మామిడి?), తారాజ(ముత్యాలు?)లను తిరస్కరిస్తాయనా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వాహ్! అత్యంత సముచితత్వాన్ని పద్యానికి ప్రతిపాదిస్తూ మీరూహించి వ్రాసినది కడు మనో రంజకంగా ఉందండీ కామేశ్వర రావుగారూ!

ఔనండి. నఖోష్ఠ కాదు. నఖౌష్ఠ. ఇప్పుడే సరి చేశాను.

Vasu చెప్పారు...

నాకేం అర్థం కాలేదు మాష్టారు. అర్థం చెప్పగలరు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! కొంచెం ఓపిక పట్టు. ఆలోచించే వారికి అవకాశం ఇచ్చి, ఆతరువాత మనం దాని విషయం గుర్తుగా చర్చించుకొని తెలుసుకొందాం. ఏమంటారు?

చదివిన వారు దీనిఁ గని, చక్కగ నర్థము చేసుకొంచు, ఆ
చదివిన దాని యర్థమును సౌమ్యముగా వివరింపఁ జూతురే!
మదిని వికాస వంతముగ మాటలతో మన ముందు ఉంతురే
పదిలము చేసి భావనలు! పన్నుగ వారిని చెప్పనీయుడీ!
పిదప వచించెదన్ మదికిఁ బ్రీతిఁ గొలుంపుచు, పాఠకోత్తమా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వాసు గారూ! మీ రడిగిన వివరం తరువాత టపాలో వివరించాను. చూడఁ గలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చెప్పుకోండి చూద్దాం 32 కు నా వివరణ.


శ్రీమ దాంధ్రామృ తాస్వాదనా లోలులారా!
దీనికి ముందు టపాలో "చెప్పుకోండి చూద్దాం 32" కు శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారు కామెంట్ ద్వారా చక్కని వివరణను కొంత వరకు ఇచ్చి యున్నారు. నాకు తోచిన వివరణను మీముం దుంచుతున్నాను. దోషము లుండకపోవు. కంటఁ బడితే మాత్రం వెంటఁ బడి మరీ చెప్పి, సరిచేయండి.
ఇక పరిశీలించండి.

తే:-
అతివ కచ నాభి జఘన దేహాననము " త
మీనదరసాలతారాజపా " నిరాక
రణ మనంతమనాది నేత్ర గళ భుజ న
ఖోష్ఠ కుచ వచో దంతంబు లుభయ గతుల.
భావము:-
1:-
అతివ యొక్క
-- కచ ----- నాభి ------ జఘన ------ దేహ --------ఆననము లతో
-- తమీ ---- నద ------- రసా---------లతా -------- రాజ.
-- చీకటి. --- సుడి ------ భూమి ------ లత ---------చంద్రుడు. సరి పోలును.
నిరాకరణ మనంత = అంతమందలి "పా" విడిచిపెట్ట వలెను.

2:-
అనాది = ఆది అక్షరమైన "త" విడిచి పెట్టినచో.
---నేత్ర ---- గళ -------- భుజ ------- నఖ ----------ఓష్ఠ ములతో
---మీన----దర---------సాల---------తారా----------జపా
---చేప. --- శంఖము.----ప్రాకారము---నక్షత్రములు.-- మంకెనపువ్వు.
సరి పోలును.

3:-
కుచ వచో దంతము లుభయ గతులు = ఆద్యంత్యాక్షరములను తొలగించి అనగా ఆద్యక్షరము "త". అంత్యాక్షరము"పా". అను రెండిటినీ విడిచిపెట్టి చూడఁ దగును

--- కుచ --------------- వచో ------------------------ దంతము లకు
---మీనద---------------రసాల-----------------------తారా
---కుంభములు(?)------తీయ మామిడి రసము--------నక్షత్రములు
సరిపోలును.

అని నే నూహిస్తున్నాను. ఇంతకన్నా యుక్తమైన సమన్వయం మీకు తోచినచో తప్పక తెలుపఁ గలరని ఆశిస్తున్నాను.

జైహింద్..
రాసింది చింతా రామకృష్ణారావు. AT SUNDAY, DECEMBER 20, 2009

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.