గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, డిసెంబర్ 2009, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 65.

ఋగ్వేద వాగమృతము:-

మహనీయులైన మన పూర్వీకులు మానవ మనుగడ సుఖతరం కావాలని, సమాజం శాంతి భద్రతలకాలవాలవాలమవాలని, అలా ఉండాలంటే కోప తాపాలకు దారివ్వ కూడదని, అలా దారివ్వకూడదూ అంటే కోపతాపాలు కలిగించేవి చూడకూడదని, మాటాడకూడదని, విన కూడదని, చెప్పారు. అలాచెప్పడంలో గాంధీ మహాత్ముడు మూడుకోతుల్ని చూపించాడు. ఆవిషయం మనకు తెలిసినదే. ఐతే అంతకు ముందే మన పూర్వీకులు ఈ విషయంలో చేసిన ప్రార్థన చూడండి.

మంత్రము:-
భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యే మాక్షభి ర్యజత్రాః
స్థిరై రంగై స్తుష్టువాగ్ంసస్తనూభిః

తే:-
చెవులు భద్రంబె విను గాక జీవితమున.
కనులు కను గాక కల్యాణ కరము లెపుడు.
సాంగ మంత్రంబులను గొల్చి సకల దైవ
తములను, సుఖము లను పొంది తనియు గాక.

భావము:-
మనము మన చెవులతో భద్రమును గొలిపెడి మాటలనే వినుదుము గాక.
మన కనులతో మంగల ప్రదము లగునవియే చూచెదము గాక.
సాంగోపాంగముగా మంత్రములతో దేవతలను స్తుతించి సమస్త సుఖములను పొందుదుము గాక.

వ్యశేషు దేవహితం యదాయుః
స్వస్తిన యింద్రో వృద్ధశ్రవాః

తే:-
దేవతాళిని గొల్చుచు తేజరిలగ
తగిన ఆయువునొందుత. తాను గురుని
నుండి పొందిన యింద్రుడు నిండు గాను
ఆయువునొసంగి మనలను కాయు గాక.

భావము:-
ప్రస్తావింప బడిన దేవతా సమూహమును స్తుతించుటకు తగిన ఆయుర్దాయమును మనము పొందుదుము గాక.
బృహస్పతి యొద్ద గ్రహించిన యింద్రుడు మనకు పరి పూర్ణమైన ఆయువును ప్రసాదించి కాపాడును గాక.

స్వస్తినః పూషా విశ్వ వేదాః
స్వస్తినస్తార్క్ష్యో అరిష్ఠ నేమిః
స్వస్తినో బృహస్పతిర్ దదాతు.

తే:-
రవి యుపాసనాశయమును రగులఁ గొల్పు.
గరుడుఁ డొసఁగుత పూజ యోగ్యతను మనకు.
దేవుడగు గురుఁడొసఁగుత దివ్య శుభము.
మంచి నెన్ని మనకు కలిగించుగాక.

భావము:-
సకల దేవతా స్వరూపుడగు సూర్యుడు మనకు స్వస్తిని అనగా ఉపాసన యొక్క ఆశయము ప్రసాదించును గాక.
వజ్రాయుధముచే కొట్టబడిన గరుత్మంతుడు మనకు స్వస్తిని అనగా పూజించుటకు తగిన యోగ్యతను ప్రసాదించును గాక.
భగవంతుడగు బృహస్పతి మనకు స్వస్తిని అనగా శుభములను ప్రసాదించును గాక.

చూచారు కదా ఋగ్వేదంలో భగవంతుని మనము ప్రార్థించే అంశాన్ని. మనమెప్పుడూ మంచినే చూడాలి. చెడ్డ జోలికి పోకూడదు.
మంచినే వినాలి.
చెడ్డ జోలికి పోకూడదు అనే విషయం చెప్పడంలో కూడా ఎక్కడా చెడ్డ అనే పదప్రయోగం కూడా చేయలేదంటే చెడ్డ అనే పదమే మన జీవిత నిఘంటువులో ఉండ కూడదనే భావం మనకు స్ఫురించకుండా వుంటుందా.
దీనిలో యిమిడియున్న విషయాన్ని గ్రహించి మనం నిరంతరం మంచిమార్గంలోనే పయనిద్దామామరి?

జైహింద్.
Print this post

3 comments:

రవి చెప్పారు...

మంత్రం విన్నాను, చిన్నప్పుడెప్పుడో ఉచ్ఛరించాను కానీ అర్థం ఇప్పుడే తెలుసుకున్నాను. "అరిష్టనేమిః" అంటే, గరుడుడాండీ?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

(భా)రవీ!
వ్జ్రాయుధముచేత కొట్టఁబడనివాడగుటచే అరిష్టనేమి అంటే గరుత్మంతుడు అని చెప్పుకో వచ్చును అని నా అభిప్రాయం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీ! వ్జ్రాయుధము కాదు. వజ్రాయుధము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.