గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 29వ శ్లోకం. 212 - 222. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోసంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా

ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ 29  

212. ఓం *సన్ధ్యా*యై నమః

నామ వివరణ.

త్రిసంధ్యలూ అమ్మయే. మానవుని జీవితమున సంధ్యలన్నియు అమ్మయే.

కం.  *సంధ్యా! * కాలము గతమగు,

మాంద్యమునెడఁ బాపి బుద్ధిమంతునిగా నన్

బంద్యంబనకునికిక ప్రాక్

స్సంధ్యగ మేల్గొలుపుమమ్మ మేదినిపైనన్.

213. ఓం *రాత్ర్యై* నమః

నామ వివరణ.

రాత్రి స్వరూపము అమ్మయే.

తే.గీ*రాత్రి! * యజ్ఞానతిమిరమే రాత్రి కనఁగ,

రాత్రి వేళల మము ప్రోవ రాత్రివయితె?

యాత్మ సుజ్ఞాన తేజంబునమరఁజేసి

జ్ఞాన సంపత్తితో ముక్తి కాంతనిడుమ.

214. ఓం *దివా*యై నమః

నామ వివరణ.

పగలు అమ్మ రూపమే.

తే.గీ దివా! నీదు తేజమే యొప్పగ మది

వెలుగుగా నిమ్ము వాగ్ఝరిన్ వేల్పువగుచు,

మాయ తిమిరంబు నీ కృపన్ మాయఁజేసి

వ్రాయగానిమ్ము సత్కృతుల్ వాసిగాను.

215. ఓం *జ్యోత్స్నా*యై నమః

నామ వివరణ.

వెన్నెల అమ్మయే.

కంచల్లగ వెలిగెడి *జ్యోత్స్నా!*

యుల్లంబున నీవె కలుగ నోంకృతివగుచున్

మల్లెల సౌరభములతో

కల్లలు లేనట్టి కవిత కల్పింతునుగా.

216. ఓం *కలా*యై నమః

నామ వివరణ.

చంద్రవంక అమ్మయే. అమ్మ కళలస్వరూపమే.

కంకలకాలము నిలిచెడి సత్

కలవై ప్రభవించుమ *కల!* కావ్యాకృతిగా

సులలిత పదచయమున మన

సులనే గొనునటులను భువిజులుగని మెచ్చన్.,

217. ఓం *కాష్ఠా*యై నమః

నామ వివరణ.

కాలమున కాష్ఠ పరిమితి అమ్మయే.

తే.గీకాష్ట భాగంబు నా కృతిన్ గలిగి నీవె

యున్న శేషంబు పూరింతు మన్ననముగ,

*కాష్ట!* నినుఁ గొల్తు నటులుండు గౌరవమిడ,

నీదు ప్రేమకు జయమమ్మ, నిర్వివాద!

218. ఓం *నిమేషికా*యై నమః

నామ వివరణ.

రెప్పపాటు కాలము అమ్మయే.

పంచచామరము.

*నిమేషికా!* సతంబు నేను, నిన్నుఁ గొల్తు సమ్మతిన్,

సమంచితప్రభన్ వెలింగి చక్కగాను నా మదిన్

ప్రమోదమందఁ జేయుచున్ నిరంతరంబు భక్తితో

నమస్కరింతునమ్మ నీకు, నన్ను తీర్చి దిద్దుమా.

219. ఓం *ఉర్వ్యై* నమః

నామ వివరణ.

విశాలమయిన భూభాగము అమ్మయే.

కం.  *ఉర్వీ!* నీ దయ కలిగిన

సర్వంబును సాధ్యమగునసామాన్యముగన్,

గర్వంబణచుము, నన్నున్

బర్వంబులలోన ముంచి వర్ధిలనిమ్మా!.

220. ఓం *కాత్యాయన్యై* నమః

నామ వివరణ.

కాత్యాయన మహర్షి కుమార్తె అయిన కాత్యాయని అమ్మయే.

కంనిత్యానందకరీ! మా

*కాత్యాయని!* నిన్ను నేను గణియింతు మదిన్,

నిత్యంబు నాత్మతేజము

నత్యుత్తమమంచునెంచి, యలరగ నిమ్మా.

221. ఓం *శుభ్రా*యై నమః

నామ వివరణ.

పవిత్రత అనునది అమ్మయే.

తే.గీ.  *శుభ్ర!* సత్ పూజ్య! నిన్ను నా శుద్ధ మతిని

నిలిపి కొలిచెద నెమ్మితో నిష్కలంక!

కనెద పరమాత్మ శుభ్రతన్, కన్నులలయ,

మన్ననముననీవుండుమా మదిని కృపను.

222. ఓం *సంసారార్ణవతారిణ్యై* నమః

నామ వివరణ.

సంసార సాగరమును దాటించు జనని అమ్మయే.

కం*సంసారార్ణవ తారిణి! *

హంసవు మదిలోన నీవహమ్మన నీవే,

హింసా దూరునిచేసి, ప్ర

శంసార్హునిగా నొనర్చి చక్కగ కనుమా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.