గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 28వ శ్లోకం. 203 - 211. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోతరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ

విశ్వంభరాధరా కర్త్రీ గళార్గళవిభంజనీ 28  

203. ఓం *తరుణ్యై* నమః

నామ వివరణ.

అమ్మ నిత్య యౌవన.

తే.గీతరుణమిదె ననుఁగావగ *తరుణి! * కృపను

పరమనోహర మార్గాన వరలఁజేసి

నిరుపమానందసామ్రాజ్య నేతగ నను

చేయుమోయమ్మ కృపఁ జూపి చిద్విభాస.

204. ఓం *వారుణ్యై* నమః

నామ వివరణ.

అమ్మ వరుణ స్వరూపిణి,వారుణి అమ్మయే.

తే.గీ*వారుణీ!*మాత! నాయందు వరలుమమ్మ,

భక్తిసుధనాకుదయనిచ్చి ముక్తి కనెడి

మార్గమందున నడపుమామహితముగను.

నిన్ను సేవింతునమ్మ నేన్ నెమ్మితోడ.

205. ఓం *నార్యై* నమః

నామ వివరణ.

సృష్టికి మూల ప్రకృతి అయిన స్త్రీ అమ్మయే. శత్రు భజన చేయునపుడు వింటి నారి

శక్తియు  అమ్మయే.

కం*నారీ! * నీవే దారిగఁ

గోరుచు నిను జేరితమ్మ, కూర్మిని నాకున్

వారిజనాభుని జూపుము

వారికి నే నంజలింతు భక్తిగనిపుడున్.

206.  ఓం *జ్యేష్ఠాదేవ్యై* నమః

నామ వివరణ.

జ్యేష్ఠాదేవి అమ్మయే.

తే,గీవినుము మొరను *జ్యేష్ఠా దేవి* విశ్వసించి

కలుగు  కష్టంబులన్ గని కనికరించు,

పాపుమీ కష్టముల్ నీవు ప్రాపువగుచు.

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *జ్యేష్ఠాయై* నమః

నామ వివరణ. సృష్టికే జ్యేష్ఠురాలు అమ్మ.

తే.గీజ్యేష్ఠగా నీవు నాలోని  చిలిపి దౌష్ట్య

భావజాలంబు తుడిచి స్వభావ సిద్ధ

ధర్మ సన్మార్గ గామిగా దయను చేసి

కాచి రక్షించుమా *జ్యేష్ఠ! * కరుణతోడ.

ఓం *దేవ్యై* నమః.

నామ వివరణ.

కం*దేవీ!* దీవింపుము నన్

భావనలో నిలువుమమ్మ వరలఁగఁ జేయన్,

సేవానిరతినికొలుపుము

సేవించెద నమ్మ నిన్ను, శ్రితజన పోషా!

207. ఓం *సురేశ్వర్యై* నమః

నామ వివరణ.

దేవతలకు అధిపతి అమ్మయే

కంసర్వాత్మ! *సురేశ్వరి!*  మా

సర్వేశ్వరి! సర్వ జగతి సన్మయముగ, సత్

పర్వముగా నడిపించుమ,

గర్వాంధము వాపి ప్రజను కాయుము జననీ!

208. ఓం *విశ్వమ్భరా*యై నమః

నామ వివరణ.

సృష్ఠి మొత్తమును భరించు తల్లి అమ్మయే.

తే.గీవిపుల *విశ్వమ్భరా*దేవి! వినుత కీర్తి!

గాంచి యున్నట్టి నిను కృపన్ గాంచనిమ్ము,

ముక్తిసాధన మార్గంబు రక్తినొసగి

భక్తితోపాటు ముక్తిని వరల నిమ్ము.

209. ఓం *ధరా*యై నమః

నామ వివరణ.

సృష్టి మొత్తమును ధరించు జనని అమ్మయే.

తే.గీవిను *ధరా! * నాదు మొరలను వీనులార,

కనుమ మదిలోని వేదనన్ గరుణతోడ,

మనగఁ జేయుము నీ దరిన్ మన్నన గన,

ప్రణతులందుము చేసెద భక్తితోడ.

210. ఓం *కర్త్ర్యై* నమః

నామ వివరణ.

సమస్త సృష్టి కార్యమునకు కర్త అమ్మయే. శత్రిభంజక ఖడ్గము అమ్మయే.

తే.గీకార్యకర్తవు నీవెగా *కర్త్రి! * యరయ

కర్మఫలములననుభవమర్మమెఱుగ

కర్మ మాచేత చేయించు కర్త్రివి కని

కర్మఫలములు బాపుమా మర్మదూర!

211. ఓం *గలార్గలవిభఞ్జన్యై* నమః

నామ వివరణ.

సమస్యలను ఛేదించు అమ్మ. శివుని గలమునవిషప్రభావమును ఆపినది మన అమ్మయే.

తే.గీమొర విను *గలార్గలవిభఞ్జని! * రయమునను

నన్ను కాపాడగారమ్ము మన్ననమున

శివుని కంఠాన గరళమున్ జేవచూపి

మ్రింగుటాపి జగాలకు మేలు కనవె?

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.