గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2024, సోమవారం

కాళిదాసు కృత దేవీ అశ్వధాటిDevi Aswadhati 11 వివరణ.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్లో:-
యత్రాశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా
సుత్రామ కాల ముఖ సత్రాసక ప్రకర సుత్రాణ కారి చరణా 
ఛత్రానిలాతిరయ పత్త్రాభిరామ గుణ మిత్రా మరీ సమ వధూః
కుత్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా! ౧౧.
సీ:-
భయపడే యింద్రాది భక్తులను కాచేటి 
పాదారవింద; ప్రమోద జనని.
ఛత్రానిలము చేత సమధికవేగంబు 
గలిగిన రథమును కలుగు తల్లి;
దేవతాంగనతుల్య దివ్య లక్షణ యుక్త
వనితలే చెలియలై వరలు తల్లి;
నిర్భయ నిరుపమ నిపుణులౌ పుత్రుల;
నితరమౌ సంపదలిచ్చు తల్లి;
గీ:-
రాచిలుక దాల్చు పార్వతి బ్రోచు ననుచు
భక్తి భావాన సేవించు భక్త జనుల
మానసంబుల నిరతంబు మసలు గాక.
మాదు హృదయాల జగదంబ మసలు గాక.
భావము:-
ఇంద్రుఁడు; యముఁడు మొదలైన భయపడి యున్నవారి సమూహాన్ని సమర్ధవంతంగా రక్షించే పాదాలు కలదీ; గొడుగు యొక్క గాలిచేత పెరిగిన వేగం గల వాహనం గలదీ; మనోజ్ఞమైన లక్షణాలు గల చెలులైన దేవతా స్త్రీలతో సమానమైన వనితలు గలదీ; నింద్యమైనభయం లేని రత్నాల బొమ్మల వంటి ఆకారం గల ప్రకాశించే  ( చెడ్డదైన భయాన్ని ధ్వంసం చేసే ఉత్తములైన చిత్రమైన స్వరూపంతో ముద్దులొలికే)పుత్ర సంతానాన్ని ఇంకా ఇతర సంపదలను; ప్రసాదించుటలో సామర్ధ్యం కలదీ; అయిన సాటి లేని చిలుకలతో కూడిన అందమైన పార్వతీ దేవి ఎచ్చటైతే ఆమె హృదయం లగ్నమై యుండునో అక్కడ మరెక్కడైనా ఉండును గాక.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.