గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జనవరి 2024, బుధవారం

గడి దోమకొండ సంస్థానంలో జరిగిన బృహత్కార్యక్రమం.

 

జైశ్రీరామ్.
దోమకొండ సంస్థాన సాహిత్యసేవ అమూల్యం!
తెలంగాణలో దోమకొండ సంస్థానం చేస్తున్న సాహితీసేవ
అమూల్యమైందని పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ ఉపకులపతి
ఆచార్య తంగెడు కిషన్ రావు అన్నారు. ఈ నెల 6 వ తేదీన కామారెడ్డి
జిల్లా దోమకొండ గడి కోటలో జరిగిన 'తెలంగాణ సంస్థానాల సాహిత్య
'సేవ' సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీశిష్ట అతిథిగా
శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్. జయరామరెడ్డి
పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యంలో సంస్థానాల పాత్ర విశిష్టమైందనీ
అన్నారు. మరొక విశిష్ట అతిథి కామారెడ్డి జిల్లా పూర్వ పాలనాధికారి డాక్టర్
ఎస్. సత్యనారాయణ ప్రసంగిస్తూ దోమకొండకోటలో పలు సామాజికాభివృద్ధి
కార్యక్రమాలు జరగడం హర్షణీయం అన్నారు. సభకు స్వాగతం పలికిన
సంస్థాన పాలకుల వారసులు అనిల్ కామినేని మాట్లాడుతూ తమ పూర్వికులు
నడచిన మార్గంలో సాహిత్యసేవను కొనసాగించడానికే ఈ సదస్సును ఏర్పాటు
చేశామన్నారు. ప్రముఖ కవి డా. ఏనుగు నరసింహారెడ్డి సంస్థాన సాహిత్య
వికాసంపై విపులంగా ప్రసంగించారు. ప్రముఖ చరిత్రకారులు డా.ఈమని
శివనాగిరెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డా. లక్ష్మణ
చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ నృత్య దర్శకురాలు మధుమతి కులకర్ణి శిక్షణలో పలువురు
నృత్యవిద్యార్థినులు చేసిన స్వాగత నృత్యం అందరినీ ఆకట్టుకొన్నది. అనంతరం
ప్రారంభమైన తొలి సదస్సుకు డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, బాబ్రీ జాలాది
సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ప్రముఖ పరిశోధక పండితుడు వైద్యం
వేంకటేశ్వరాచార్యుల అధ్యక్షతన పలు సంస్థానాలలోని సాహిత్యసేవలపై
వక్తలు ప్రసంగించారు. ప్రముఖ పరిశోధకులు, రచయితలు డాక్టర్
రాయారావు సూర్యప్రకాశ్ రావు, డాక్టర్ అంబటి భానుప్రకాశ్, అబ్దుల్ అజీజ్
డాక్టర్ జి. శ్యామసుందర్, డాక్టర్ నాయకంటి నరసింహశర్మ, డాక్టర్
ఎం. అనంతకుమారశర్మ, డాక్టర్ తాడేపల్లి పతంజలి, డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్,
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, శాస్త్రుల రఘురామశర్మ, బైరోజు చంద్రశేఖర్,
డాక్టర్ వద్ద శంకరయ్య తదితరులు వివిధ సంస్థానాల పరిధిలో జరిగిన
సాహిత కృషిపై పత్ర సమర్పణలు చేశారు. వేదార్థంమధుసూదన శర్మ
అనుసంధానకర్తగా వ్యవహరించారు. సదస్సులో పత్ర సమర్పణలు చేసిన
పరిశోధకులను దోమకొండ సంస్థానాధీశులు అనిల్ కామినేని ఘనంగా
సత్కరించారు.
"ఈ సదస్సుకు ఆత్మీయ అతిథులుగా అమరచింత, ఆత్మకూరు, ఆలంపూరు,
ఆనెగొంది, గద్వాల, గోపాలపేట, జటప్రోలు, కొల్లాపూరు, సిర్నాపల్లి,
నారాయణపేట, పాపన్నపేట, పాల్వంచ, మునగాల, బేతవోలు, రాజాపేట,
సురపురం సంస్థానాల వారసులు హాజరయ్యారు.
అనంతరం జరిగిన కవిసమ్మేళనానికి ప్రముఖ విద్వత్కవి, దాశరథి సాహితీ
పురస్కార గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అధ్యక్షత వహించారు.
డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ
కవినమ్మేళనంలో డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, గుమ్మన్నగారి
బాలసరస్వతి, బండకాడి అంజయ్యగౌడ్, డాక్టర్ శాస్త్రుల రఘుపతి,
, సాయిప్రసాద్, మంచినీళ్ల సరస్వతీరామశర్మ, కొరిడే విశ్వనాథశర్మ, ప్రసాదం
స్వాతి, చింతా రామకృష్ణారావు, పబ్బా విజయశ్రీ తదితరులు కవితాగానం
చేశారు.
సదస్సు ముగింపులో సాయంకాలం ఆరుగంటలకు 'ప్రతాపరుద్రవిజయం'
సాహితీరూపకప్రదర్శన జరిగింది. డాక్టర్ సంగనభట్ల నరసయ్య రచించి,
దర్శకత్వం వహించిన ఈ రూపకానికి మరుమాముల దత్తాత్రేయశర్మ
నిర్వాహకులుగా వ్యవహరించారు. హైదరాబాదులోని అభ్యుదయకళావికాస్
సంస్థ నిర్వహణలో కొనసాగిన ఈ రూపకానికి ప్రముఖసంగీతదర్శకులు
దేశపతి శ్రీనివాస్ శర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఎం. ఆనంద్ వ్యాఖ్యాతగా
వ్యవహరించి రక్తి కట్టించారు.
దోమకొండసంస్థానవారసుల నిర్వహణలో ఒకరోజు సాహితీసదస్సు ఎన్నో
మధురానుభూతులను పంచింది. ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ సంస్థానం
పక్షాన అనిల్ కామినేని సత్కారాలు చేసి, కృతజ్ఞతలను చెప్పగా ఈ సదస్సు
అద్వితీయంగా ముగిసింది.

శ్రీరస్తు                            శుభమస్తు                   అవిఘ్నమస్తు.

గడిదోమకొండ సంస్థాన సాహితీ వైభవమ్. నవరత్నమాలిక.

రచన చింతా రామకృష్ణారావు. … (చరవాణి .. 8247384165)

౧.శా.  శ్రీమన్మంగళ కామినేని కుల రాశీభూత పుణ్యాత్ములై

శ్రీమత్ కావ్యరమా లలామల నిలన్ జెన్నారఁ గొల్పంగ సు

క్షేమంబున్ వెలుగంగ గణ్య కవులన్ జేఁ గొంచు పోషించి నా

రామాన్యోజ్వల మూర్తులన్ గొలుతు నే నానంద ముప్పొంగగన్.

 

౨.ఉ.  ఈ సభ లోన నొ ప్పె డి నటేశ్వర సత్కవి, నోంప్రకాశునిన్,

భాసిలుచున్న మాన్యగుణ వర్ధనులౌమహనీయ మూర్తులన్,

ధీసతితో రహించు కవి ధీ మణులన్ మదినెంచి మ్రొక్కెదన్

మీ సహవాసి నైన నను మేలుగఁ జూచి రహింపఁ జేయగన్.

 

౩.శా.  శ్రీమన్మంగళ దోమకొండ గడి భాసించన్ యునెస్కో ప్రభన్,

శ్రీమంతంబగు భారతావనియె వాసిం గాంచె ధాత్రీ స్థలిన్,

ధీమంతుల్ వర కాచరెడ్డి కుల సందీప్తుల్ వినిర్మించినా

రీ మాన్యంబగు కట్టడంబుఁ, గన లేరే వీరికిన్ సాటియే.

శ్రీమన్మంగళ దోమకొండ గడి, భాసించెన్ యునెస్కో ద్యుతిన్,

 

౪.సీ.  కవిపోషకుల్, కవుల్, గడి దోమ కొండను పాలించి వెలిగిన ప్రభువు లిలను,

సాహితీసంస్కృతు లాహార్యములు కాగ, గడి దోమ కొండకున్ ఘనత పెరిఁగె,

మొదటి కాచారెడ్డి మును దోమకొండ సంస్థాన పాలకులన్ బ్రథముఁడతండు,

శ్రీకర కవి సుధీ లోకానురక్షా కరుం డతండను కీర్తి రూపమతఁడు,

మహిత సర్వజ్ఞతా మహిమతో మెఱిసె నా మొదటి యెల్లారెడ్డి ముదము కదుర,

గ్రంథంబులెన్నియో కైకొనె నీతండు వ్రాయించి కవులచే వాసిఁ గాంచె,

ఘనుఁడు జంగమరెడ్డి కవివర్య కోటికిన్ బంగరు కొండగా ప్రతిభఁ గాంచె,

రెండవవాఁడగు పండిత సుకవి యెల్లారెడ్డి కృతుల నల్లంగఁ జేసె,

సంస్కృతాంధ్రములందు సద్గ్రంథకర్త మల్లారెడ్డి దోమకొండనె ఘనుండు,

కవులెందరో గొప్పకావ్యముల్ రచియించి రాజమన్ననలంది రహిని గనిరి,

తే.గీ.  పాలనా దక్షులై గడి ప్రతిభ పెంచి

శాశ్వతంబగు సత్కీర్తి సకలదిశల

వ్యాప్తమగునట్లు కృషిఁ జేసి ప్రబలినట్టి

రాజకోటికి పద్య నీరాజనమ్ము.

 

౫.సీ.  శ్రీమ దాంధ్ర కవిత్వ చిద్వర సుధ నిండి శ్రీమంతముగ నుండు దోమకొండ,

కవిపుంగవుల నెన్ని గౌరవించుచు నుండిక్షేమంబుతో నొప్పు దోమకొండ,

శాస్త్రార్థ వేద్యులై సన్నుతిన్ గనునట్టి ధీమతాళికి నండ దోమకొండ,

భక్తితోవసియించు భక్తులకెన్నగా సోమశేఖరు నండ దోమకొండ.

తే.గీ.  ఆంధ్ర సంస్కృత సంస్కృతీ సాంద్ర సార

మహిత గోక్షీర ధారల మహిత భూమి,

దోమకొండ గాదిది పరంధామ మరయ,

శోభనానిలులనునొప్పు  ప్రాభవమయ.

 

౬.చం.  వర గడి దోమకొండ పరివర్ధన చేసెను సాహితీ ప్రభన్

నిరుపముఁ డెల్లరెడ్డి, గణనీయముగా పరివృద్ధి చేయగా

సరగున కాసిరెడ్డి యది స్వర్ణయుగంబుగ తీర్చిదిద్దినా

డరయుచు మల్లరెడ్డి రవియా! యన వెల్గెను సాహితీకృషిన్.

 

౭.మత్తకోకిల.

ప్రాభవంబును జూపి పూర్వులు పండితాళిని బెంచగా

శోభనానిలు దంపతుల్ గుణ శోభితుల్ కవిపాళికిన్

శోభనే కలిగించిరిట్లు విశుద్ధ ప్రస్ఫుట చిత్తులై,

ప్రాభవోన్నతితోడ వెల్గుత వారి వంశము నిచ్చలున్.

 

౮.చం.  కవులకు పండితాళికిని గౌరవమిచ్చెడి వారి కెప్పుడున్

భవుఁడు, భవానియున్ గృపను వర్ధిలఁ జేయుచు నుండి యెల్లెడన్

కవుల ప్రశంస లందునటు కావ్యసుకన్యలు చేరునట్లుగాన్

ప్రవర వరంబులిచ్చెదరు భాసిలగన్ గవి పోషకుల్ సదా.

 

౯.ఉ.  మంగళమౌత యీ ధరను మాన్యమహోజ్వల దోమకొండకున్,

మంగళమౌత యీ యనిలు మాన్యునకున్ వర శోభనమ్మకున్,

మంగళమౌత సత్కవుల మంజుల వాక్ ప్రతిభా సమృద్ధికిన్,

మంగళమౌత శ్రీసతికి, మంగళముల్ మన భారతాంబకున్.

స్వస్తి

తే. 06 - 01 - 2024.

మంగళమ్                 మహత్              శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.