గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2024, గురువారం

మూకపంచశతి .... కటాక్ష శతకము01/10 . 01 నుండి 10వ శ్లోకము వరకు పద్యానువాదము. పద్య రచన .. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.

కటాక్ష శతకము. 

శ్రీ కామాక్ష్యై నమః

వసంతతిలక వృత్త శ్లోకములు. త భ జ జ గగ. యతి ౮వ అక్షరము.

1. మోహాన్ధ కార నివహం వినిహన్తు మీడే 

మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్‌ 

శ్రీ కాంచిదేశ శిశిరీకృతి జాగరూకా 

నేకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్‌.

శా.  శ్రీమన్మంగళ కంచికిన్ జలువ వాసిన్ గొల్ప శ్రద్ధాళువున్,

బ్రేమన్ మూకకు సత్కవిత్వఝరినే వ్రేలార్చు నేకామ్రనా

థామోద ప్రియ భామినీ వినుత స్నేహాలోకనం బెంచి నే 

నా మోహాంధసమూహమున్ దఱమగా, నన్ గావగాఁ గొల్చెదన్.

శా.  శ్రీమన్మంగళ కాంచి దేశమును వాసిన్ జల్లగాఁ జేయు నా

శ్రీమాతామృత వీక్షణంబు లొసగున్ శ్రీవాక్కులన్ మూకకున్,

నా మోహాంధసమూహమున్ దఱమగా, నన్ గావగా నెంచి నే

నా మాంగళ్యసుదృక్కులన్ గొలుతు నమ్మా! కంచి కామాక్షిరో!

తా|| శ్రీ కాంచీనగర ప్రాంతమును చల్లబఱచుట యందు శ్రద్ధ కలిగినట్టి, మూగవోయిన మనస్సు కలవారికిని మహాకవిత్వము నొసగునట్టివి అయిన ఏకామ్రనాథ తరుణి అయిన శ్రీ కామాక్షీ కరుణావలోకములను నా మోహాంధకార రాశిని దొలగించ స్తుతించెదను. 

2. మాతర్జయన్తి మమతాగ్రహ మోక్షణాని 

మాహేంద్రనీల రుచి శిక్షణ దక్షిణాని

కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని 

త్వద్వీక్షణాని వరదాన విచక్షణాని.  

మ.  మమకారంబను దయ్యమున్ దరుము సామర్థ్య ప్రభా పూర్ణమై,

సమమై నిల్వఁగ నెంచు నీలముల(మణి)ద్యుత్ సమ్మర్ధ యోగ్యంబునై,

ప్రముదంబున్ వెలయించినట్టి జగతిన్ రక్షింప(గా నొప్పు నీ)శక్యంబునై 

మమతన్ గోర్కెలఁ దీర్చు చూపులవి కామాక్షీ! జయానీకముల్.

తా|| ఓ తల్లీ! కామాక్షీ! నీ చూపులు, నన్ను లేక అందఱను పట్టిన మమకారమనెడి దయ్యమునుండి విడిపించగల్లునవి. ఇంద్రనీల మణుల కాంతిని శిక్షించుటలో, ముల్లోకములకు రక్షణమును కల్పించుటలో, వరములిచ్చుటలో, సమర్థములైనవి. 

3. ఆనంగ తంత్ర విధిదర్శిత కౌశలానా 

మానందమంద పరిఘూర్ణిత మన్థరాణామ్‌ 

తారల్య మంబ తవతాడిత కర్ణసీమ్నాం 

కామాక్షి! ఖేలతి కటాక్ష నిరీక్షణానామ్.

చం.  మదనుని తంత్రపద్ధతి సమంచిత రీతిని చూపునట్టి, స

మ్ముదమది సంభమించుటను, పూర్తిగ తగ్గిన వేగమొప్పి, కా

మ్యద! భవదీయకర్ణముల నంచితరీతిని చేరియున్న నీ

ముదమగు చూపులన్ జలన మాడుచునుండెను, కంచివాసినీ!

తా|| అమ్మా! నీ చూపులు మన్మథ తంత్ర విధానమును ప్రదర్శించినవి. వానిలో ఆనందము మెల్లగా సుడి తిరుగుటచే కదలికలలో వేగము కోల్పోయినవి. అవి కర్ణాంతము వ్యాపించినవి. అట్టి నీచూపులలో చాంచల్యము ఆడుకొను చున్నది. 

4. కల్లోలితేన కరుణారసవేల్లితేన 

కల్మాషితేన కమనీయ మృదుస్మితేన 

మామంచితేన తవకించన కుంచితేన 

కామాక్షి! తేన శిశిరీకురు వీక్షితేన. 

తే.గీ.  కరుణనుప్పొంగుచున్న నీ కనులఁ జూడ,

సాంజనోద్భాస సన్నుత సరసిజములు,

వాలుకన్నుల కామాక్షి! వరలఁ జేయ

నన్ను, నీకంటఁ జూడుమా, నయనిధాన!

తా|| అమ్మా! నీ శరీరమొక కరుణాసముద్రము. కన్ను అందలి తరంగమువలె నున్నది. అందు దయారసము పొంగుచున్నది. ఆ కన్ను కొంచెము వంగి యున్నది. అదిచూచువారికి పూజింప దగినదిగా తోచును. అందు అందమైన మందహాసము చిందులు త్రొక్కును. దానికి కాటుక దిద్దబడియున్నది. అట్టి నీ కంటి చూపుతో సంసారతాపతప్తుఁడనైన నన్ను చల్లబఱపుము. 

5. సాహాయ్యకం గతవతీ ముహురర్జునస్య 

మందస్మితస్య పరితోషిత భీమ చేతాః. 

కామాక్షి! పాండవచమూ రివ తావకీన 

కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః. 

మత్త.కో.  మాటిమాటికి నొప్పు తెల్లని మందహాసము చేరుచున్

జూటధారికిఁ బ్రీతిఁ గొల్పెడి చూడ్కులయ్యవి యద్దిరా!

కోటికాంతులు నీదు చూపులు కోరి కర్ణసమీపమున్

దాటి పాండవ సేనఁబోలుచు తాము చేరె మహోద్ధతిన్.

తా|| ఈ శ్లోకమున అమ్మవారి కాంతి పాండవసేనతో పోల్చబడినది. అమ్మవారి కడగంటి కాంతి మాటిమాటికి తెల్లని చిరునవ్వునకు సహాయముగా వెళ్ళుచున్నది. ఎట్లు? పాండవసేన అర్జునునకు సహాయముగా వెల్లినట్లు. అమ్మవారి కడగంటి కాంతి శివుని చిత్తమును సంతోషపరచు చున్నది. ఎట్లు? పాండవసేన భీముని చిత్తమును సంతోషపఱచినట్లు. పాండవసేన కర్ణుని దగ్గజకు వెళ్ళినట్లు అమ్మవారి కడగంటి కాంతి చెవిసమీపమునకు కదలుచున్నది. అమ్మవారి కటాక్షములు చిరునవ్వు చిందించునవి. కర్ణాంతమును చేరునంత విశాలములైనట్టివి. 

6. అస్తంక్షణా న్నయతు మే పరితాపసూర్య 

మానన్థచంద్రమస మానయతాం ప్రకాశమ్‌ 

కాలాంధకారసుషమాం కలయ న్దిగన్తే 

కామాక్షి! కోమలకటాక్ష నిశాగమ స్తే. 

శా.  అమ్మా! నీదు కటాక్షమన్ నిశ దిశల్ వ్యాపించి, గాఢాంధమున్

నెమ్మిన్ గొల్పుచు, నాదు తాపఖచరున్ వెన్వెంటనే బాపుచున్,

సమ్మాన్యంబుగ సంతసమ్మనెడి  సచ్చంద్రప్రకాశమ్మునే

క్రమ్మంజేయుము నాదు మానసమునం గామాక్షి! నిన్ గొల్చెన్.

తా|| అమ్మవారి కటాక్షమనెడి రాత్రి యొక్క రాక దిగంతమున చీకట్లను వ్యాపింపజేయుచున్నది. అది పరితాపమనెడి సూర్యకాం తిని వెంటనే అస్తమింప జేయుగాక! అది నాలో ఆనంద చంద్రప్రకాశమును నింపుగాక! రాత్రిరాకతో దిక్కులచివఱలలో చీకట్లు గ్రమ్ముకొనును. సూర్యుడస్తమించును. ప్రకాశము విస్తరించును. కటాక్షా గమముతో పరితాపము నశించును. ఆనందము వెల్లివిరియును. కన్నులలోని నల్లదనము దిగన్తముల విస్తరించును. 

7. తాటంక మౌక్తిక రుచాంకుర దన్తకాన్తిః 

కారుణ్య హస్తిప శిఖామణి నాధి రూఢః 

ఉన్మూలయ త్వశుభపాదప మస్మదీయం 

కామాక్షి! తావక కటాక్షమతంగజేన్ద్రః. 

తే.గీ.  కమ్మలనుగల ముత్యపు కాంతి యనెడి 

దంత కాంతులనొప్పెడి దయ యనఁబడు 

హస్తిపారూఢదృగ్గజేంద్రాకృతమ్ము

మాయమంగళవృక్షమున్ మడుపుఁ గాక.

తా|| ఓ కామాక్షీదేవీ! నీ కర్ణభూషణములలోని ముత్యముల కాంతులు దన్తకాంతులుగా కనిపించుచున్నవి. (ఏనుగునకు దంతియను పేరు దన్తముల వలననే వచ్చును) నీ కటాక్షమే ఏనుగు. దానిపై కారుణ్యమను మావటివాడు ఎక్కి యున్నాడు. ఏనుగులకు వృక్షమును పెకిలించుట అలవాటైన సులభమయినపని. కమ్మలలోని ముత్యముల యొక్క కాంతి మొలకలకలనెడి దంతకాతులు గల కారుణ్య హస్తిపారూఢమైన నీ కటాక్ష గజేంద్రము మాయొక్క అమంగళ వృక్షమును సమూలముగా పెకలించి వేయుగాక. 

8. ఛాయా భరేణ జగతాం పరితాప హారీ 

తాటంక రత్న మణితల్లజ పల్లవశ్రీః 

కారుణ్యనామ వికిరన్మకరంద జాలం 

కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమస్తే. 

తే.గీ.  దట్టమైనట్టి నీడచేఁ దలరుచుండి, 

లోక పరితాపమును బాపు లోలకులను

కలుగు మణిచిగురాకులు కలిగినట్టి

కల్పకంబను నీ కడగంటి చూపు

దయను వెదజల్లి వెలిగెడున్, నయనిధాన!

తా|| ఓ కామాక్షీదేవీ! తన చల్లని నీడతో జగముల పరితాపమపహరించునట్టి కమ్మలలో పొదగబడిన శ్రేష్ఠ రత్నమణులే ఎఱ్ఱని చిగురుటాకులై ప్రకాశించుచుండగా దయయను మకరందరసపు వెల్లువను వెదజల్లుచు నీ కటాక్ష కల్పతరువు రాజిల్లు చున్నది. 

9. సూర్యాశ్రయ ప్రణయినీ మణికుండలాంశు 

లౌహిత్య కోకనద కానన మాననీయా 

యాంతీ తవ స్మర హరానన కాన్తిసిన్గుం 

కామాక్షి! రాజతి కటాక్ష కలిన్దకన్యా .

తే.గీ.  అక్షయంబగు యమన కటాక్షమరయ,

మహిత సూర్యాశ్రయహితయు, మణుల కర్ణ

కుండలారుణోత్పలవనకోటిఁ బాఱు,

శివుని ముఖకాంత్రిసంద్రమున్ జేరు నమ్మ.

తా|| ఓ కామాక్షీ దేవీ! నీ కటాక్షము యమునానదియే. యమునానది తన ఆవిర్భావహేతువైన సూర్యుని ఆశయమునందు ప్రేమ కలది. నీ కటాక్షము సూరిజనుల ఆశ్రయించుట యందు బ్రేమకలది. యమునానది ఎఱ్ఱ కలువల వనముల నుండి ప్రవహించును. నీ కటాక్షము మణికుండల కాంతుల నుండి పెల్లుబికి వచ్చును. యమునానది సముద్రమును చేరును నీ కటాక్షము శివముఖ కాంతినిజేరును. అందుచేత నీ కటాక్షము యమునానదియే. 

10. ప్రాప్నోతి యం సుకృతినం తవ పక్షపాతా 

త్కామాక్షి! వీక్షణ విలాస కలాపురంధ్రీ 

సద్య స్తమేవ కిల ముక్తి వధూ ర్భృణీతే 

తస్మా న్నితాన్త మనయో రిద మైకమత్యమ్. 

ఉ.  నీ కనుచూపులన్ గలుగు నిర్భర దివ్యకళాలలామ తా

లోకమునందు నేరిని విలోకన జేయునొ పక్షపాతయై,

శ్రీకర ముక్తికాంతయు వరించును వారినె, నీ కటాక్షమే

సోకిన  ముక్తి సత్ఫలము శోభిలఁగల్గు, నిజంబు శాంభవీ!

తా|| ఓ కామాక్షీదేవీ! నీ చూపుల కదలికలలోని కళయనెడి యొకసతి పక్షపాతము చూపి ఎవనిని చేరుకొనునో ఆతనినే ముక్తి వధువు వెంటనే స్యయముగా వరించును. అందువలన వీక్షణ విలాస పురంధ్రికి ముక్తి వధువునకైకమత్యము కనబడుచున్నది. ఎన్ని జన్మల పున్నెమున్ననో అమ్మవారి కటాక్షము కల్గును. కటాక్షమా పుణ్యాత్మునిపై పడెనో లేదో అప్పుడే అతనికి ముక్తి లభించును.

తే.10 . 01 . 2024.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.