గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2024, మంగళవారం

కౌసల్యా సుప్రజారామ ప్రవక్త ... బ్రహ్మశ్రీ ముదిగొండ విశ్వేశ్వర శాస్త్రి

జైశ్రీరామ్. 

కౌసల్యా సుప్రజారామ 

విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యజ్ఞానికి సుబాహు మారీచుల వలన ఆటంకం కలుగకుండా ఉండటానికై యాగ సంరక్షకులుగా రామ లక్ష్మణులను ఎంచుకొని దశరధుని వద్దకు వచ్చి ఆతనికి నచ్చ చెప్పి వారిని తన వెంట తీసుకొని ఆశ్రమానికై బయలుదేరాడు. అయోధ్యా నగరం నుంచి బయలుదేరిన గురు శిష్యులు ముగ్గురూ ఒకటిన్నర యోజనాల దూరం నడిచి సాయంత్రానికి సరయూ నదీ దక్షిణ తీరానికి చేరారు. సంధ్యోపాసనలు ముగించుకున్న తరువాత , విశ్వామిత్రుడు తన శిష్యులకు బల, అతిబల అనే మహా శక్తివంతములైన రెండు విద్యలను ఉపదేశం చేసాడు. వాటి ప్రయోగ విధానాలను సాధనా ప్రక్రియలను కూడా వివరించాడు. ఆ రాత్రికి ముగ్గురూ విశ్రాంతి తీసుకున్నారు.

              మరునాడు అరుణోదయ సమయంలో విశ్వామిత్రుడు లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానాలను పూర్తి చేసుకొని వచ్చి లక్ష్మణునితో కలిసి సుఖంగా నిద్రిస్తున్న రాముణ్ణి చూసాడు. రాముని ఆ సౌందర్యం కనులారా చూచిన మహర్షి "పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం" , అని మనసులోనే మంగళాశాసనం చేసాడు. ఇంతటి లోకోత్తర సౌందర్యరాశి అయిన శ్రీమహావిష్ణువునే తన గర్భంలో దాచుకొని కని పెంచిన కౌసల్య ఎంతటి తపస్సు చేసిందో! అని ఒక్కసారిగా ఆమెను మనసారా స్మరించాడు. రాముని మేల్కొలిపే ప్రయత్నంలో అప్రయత్నంగా తన నోటి వెంట వెలువడిన పలుకులే సుప్రభాతాలైనాయి.

             శ్లో || కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |                           

                    ఉత్థిష్ట నరశార్దూల కర్తవ్యమ్ దైవమాన్హికం||

(రామా - బాల – 23-2)

  కౌసల్యకు సత్పుత్రుడవైన ఓ రామా ! ప్రాతఃకాల సంధ్యా సమయం ప్రవేశించింది, ఓ నర శ్రేష్ఠుడా లెమ్ము! సంధ్యా వందనాది పగటి పూట చేయవలసిన దైవ కార్యాలు అన్నీ చేయవలసి ఉన్నది అని ఈ శ్లోకానికి అర్ధం. కానీ ఇందులో ఉన్న (1) కౌసల్యా సుప్రజా రామ  (2) పూర్వా సంధ్యా ప్రవర్తతే  (3) ఉత్థిష్ట నరశార్దూల (4) కర్తవ్యం దైవమాన్హికం. అనే నాలుగు వాక్యాలలోను  నాలుగు మహార్దాలు ఇమిడిఉన్నాయని ప్రసిద్ధ వ్యాఖ్యానకారుల అభిప్రాయం.

కౌసల్యా సుప్రజా రామ! 

ఓ రామ నీవంటి సుగుణాల రాశిని కన్న నీ తల్లి కౌసల్య నిజంగా సుప్రజయే (మంచి సంతానవంతురాలే) అని లోక ప్రసిద్ధి పొందింది. సహజంగా యే తల్లి ఐనా తనకు సత్సంతానం కలిగినప్పుడే అది తన సౌభాగ్యంగా భావిస్తుంది, ఇక్కడ కూడా అదే జరిగింది . అందుకే విశ్వామిత్రుడు రాముని సంబోధించేటప్పుడు కౌసల్యా సుప్రజా రామ అని అన్నాడే  తప్ప రాఘవా అని కానీ దాశరథే అని కానీ అనలేదు. ఇందులోనే దాగినావున్నది మహార్థం అంతా. 

     రాముని తన వెంట పంపుమని ముని దశరధుని అడిగినప్పుడు అతడు కేవలం పుత్రవాత్సల్యం అనే ఒకేఒక బంధాన్ని వీడ లేక ఒక సామాన్య తండ్రి వలెనే " న రామం నేతుమర్హసి " (బాల - 20 - 4). నా రాముని నా నుండి దూరం చేసి తీసుకువెళ్లటం తగదు, అని నిక్కచ్చిగా "నైవ దాస్యామి పుత్రకం" (బాల- 20 - 24). బాలుడైన నా కుమారుని మాత్రం నీకు ఇవ్వనే ఇవ్వను అంటాడు. దశరధుడు అంటేనే దశేన్ద్రియములకు వశుడు ఐనవాడు అని కదా అర్ధం ? కాబట్టి పుత్ర ప్రేమ అనే వ్యామోహంలోనే అతడు ఉండిపోయాడు. 

        (రామే కేవలం పుత్రత్వం మన్వానః వశిష్ఠ సంధుక్షిత హృదయో రామం ప్రేషితవాన్ . గోవిందా రాజీయ వ్యాఖ్య) 

దానికి మహర్షి, దశరథా ! నీ కుమారుని నాకంటికి రెప్పలా కాపాడుకుంటాను అన్నాడు,  లోకంలో అనేకవిధాలైన శ్రేయస్సులను ఇస్తానన్నాడు, నీ కుమారుని కీర్తి మూడు లోకాలలోను వ్యాపింప చేస్తాను అన్నాడు. చివరగా దశరథా అంతెందుకు , ఆ మారీచ సుబాహులు నీ కుమారుని చేతిలో మరణించారని అనుకో అన్నాడు; ఐనా రాజు ఒప్పుకోలేదు. చివరకు ముని దశరథా! ఎంత చెప్పినా రాముని శక్తి నీవు యెరుగలేకున్నావు కానీ అతని అమిత పరాక్రమ శక్తి నేనెరుగుదును. వశిష్ఠునకు తెలుసు, ఇంకా ఇక్కడ ఉన్న కొంతమంది మహర్షులకు తెలుసు. 

                    శ్లో || అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం|           

                            వశిష్ఠోపి మహాతేజా యేచేమే తపసి స్థితాః ||

(బాల - 19 – 14)                               

          అని యెంతగా చెప్పినా వినకపోయేసరికి ఆగ్రహంతో ముని పరుషంగా కూడా మాట్లాడవలసి వచ్చింది.

       కానీ కౌసల్య మాత్రం మారు మాట్లాడక వెంటనే రామునికి రక్షకట్టి విశ్వామిత్రుని వెంట పంపటానికై సిద్ధపడింది. ఆమెకు తెలుసు రాముడు సామాన్య మానవుడు కాదని,  మహా విష్ణువు అవతారమని. కానీ ఆ విషయం మాత్రం ఆమె చాలా గోప్యంగా ఉంచింది. రాముడు మానవుడుగా ఉంటేనే రావణుడు సంహరింపబడతాడు అని. 

                రామ జనన సమయంలో జరిగిన ఒక అద్భుతమైన దృశ్యం ఒక్క కౌసల్యకు మాత్రమే తెలుసు. ప్రసూతి భవనం అంతా ఒక్క సారిగా వేలసూర్యుల వెలుగులతో నిండి పోయింది. అందులోనుండి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు, శంఖ చక్ర గదా పద్మ వనమాలా ధారియై, నాలుగు చేతులతో, కిరీట, కటక, కుండలములతో , శ్రీ వత్స వక్షంతో, కలువల వంటి  కన్నులతో, కరుణా రస దృక్కులతో, పీతాంబరధారియై దర్శనమిచ్చాడు. 

             ఆ దృశ్యం చూచిన కౌసల్య వెంటనే సంభ్రమాశ్చర్యాలకు లోనై రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ " స్వామీ! ఈ తేజోమయ రూపాన్ని అందరూ దర్శించలేరు. కాబట్టి వెంటనే ఉపసంహరింప చేసి నాకు ఆనందం కలిగించేవిధంగా సాధారణ మానవ శిశువు రూపంలో అనుగ్రహించు 

             శ్లో|| ఉపసంహరవిశ్వాత్మన్ తేజోరూపమలౌకికం|   

                 దర్శయస్వ మహానంద బాలభావం సుకోమలం||

(అధ్యాత్మరామాయణం -బాల-29)

           పరమాత్మా నీవు సాధారణ మానవ శిశురూపంలో ఉంటేనే నీ బాల్య విలాస చేష్ఠలను చూస్తూ, నీ తియ్యని మాటలను వింటూ ఈ సంసారం నుండి విముక్తురాలనై  మోక్షం పొందుతాను, అని ప్రార్ధించింది. వెంటనే ఆ భగవానుడు "యద్యదిష్టం తవస్యాంబ తత్తద్భవతు నాన్యధా" (అధ్యాత్మ  - బాల- 3 - 30) అని తల్లీ! నీవు యేమేమి కోరుకుంటావో అది అంతా అలాగే జరుగుతుంది, నీ కోరికకు భిన్నంగా ఏదీ జరుగదు, అని చెప్పి వెంటనే బాల భావం పొంది నవజాత శిశువుగా రోదనం చేసాడు. "రామో బాలో భూత్వా రురోదహ" (అధ్యాత్మ - బాల- 3- 34) .

      ఈ విషయం కౌసల్యకు ఒక్కదానికి మాత్రమే తెలుసు కాబట్టి మహర్షి "కౌసల్యా సుప్రజా రామ" అనటంలోని అంతరార్ధం ఇదియే అని గ్రహించాలి. అంతే కాదు "మాతృదేవోభవ పితృదేవోభవ" అనే తైత్తిరీయ ఉపనిషత్ ప్రకారం కూడా తల్లికే ప్రధమ స్థానం. ఈ విషయంలో మనువు కూడా 

          శ్లో|| ఉపాధ్యాయాద్ధశాచార్యః ఆచార్యాణాంశతంపితా|           

                సహస్ర౦తు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే|| 

(మను - 2 - 145 )

     తండ్రి కంటే తల్లియే గౌరవంలో వేయిరెట్లు అధికురాలు అని అంటాడు. కాబట్టి విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామ అని సంబోధించటంలో ఎంతో ఔచిత్యం ఉన్నది. ఇక శ్లోకంలోని రెండవ వాక్యం,

పూర్వా సంధ్యా ప్రవర్తతే:

ప్రాతఃకాలపు సంధ్యా సమయం ప్రవేశించింది, పొద్దు పొడుపున కమల బాంధవుడైన  సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినట్లే, కమల లోచనుడైన రాముడు కూడా కనులు తెరవాలి. శ్రీమన్నారాయణుడు సూర్య మండల మధ్యవర్తియై ఉంటాడు, కాబట్టి సూర్యుని కూడా సూర్యనారాయణా అని పిలుస్తారు, అటువంటి సూర్యునికి నమస్కరిస్తే శ్రీమన్నారాయణునికి నమస్కరించినట్లే. ఈ సవితృ మండల మధ్యవర్తి, సరసిజాసన, సన్నివిష్ఠుడు, కటక కేయూర మకర కుండల కిరీట ధారి, ఐన ఈ శ్రీమన్నారాయణుడే కౌసల్యకు మొదటగా దర్శనమిచ్చిన మూర్తి. 

      సూర్యుడు ఉదయిస్తే శ్రీమన్నారాయణుని దివ్యతేజస్సు భూమిపై ప్రసరించినట్లే, అటువంటి సూర్యవంశంలో జన్మించిన రాముడు రామనారాయణుడే. సూర్యోదయంతో తూర్పు దిక్కుకు యెనలేని గౌరవం వచ్చినట్లే రాముని కనటం వలన కౌసల్యకు కూడా ఎంతో గౌరవం దక్కింది, అందుకే రాముడు కౌసల్యానంద వర్ధనుడయ్యాడు. సూర్యుడు ఎలాగైతే చీకట్లను పోకార్చి వెలుగులు నింపటానికే ఉదయిస్తాడో అలాగే ఈ రాముడు కూడా 

         రాక్షస బాధలనే చీకట్లను తొలగించి ధర్మాచరణ తత్పరులలో వెలుగులు నింపటానికే ఈ లోకంలో అవతరించాడు. ఈ విషయం పరిపూర్ణంగా తెలిసిన వాడు కాబట్టే మహర్షి రాముని గురించి "అహంవేద్మి మహాత్మానం" అన్నాడు. పరమాత్మ కన్నుమూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు. "నిమేషసే భవేద్రాత్రీ ఉన్మేషస్తే భవేద్దివా" . ఇక మూడవ వాక్యమైన 

ఉత్తిష్ఠ నరశార్దూల: 

    పెద్ద పులి నిద్రిస్తున్నంత వరకే క్షుద్ర జంతువులు అడవిలో విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. పులి మేల్కొనగానే అవన్నీ ఎక్కడివక్కడ తలకొక దిక్కుగా పారిపోతాయి. అలాగే ఓ రామా! నీవు నిద్రిస్తున్నావని భావించి ఇక్కడి రాక్షసులంతా ధైర్యంగా ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నారు. నీవు మేల్కొంటే వారంతా మరుక్షణమే కనుమరుగౌతారు. కాబట్టి నీ చల్లని చూపులకై ఎదురుచూస్తు, నిన్నాశ్రయించిన వారిని వెంటనే రక్షించవలసి ఉన్నది. దానికై వెంటనే లేచి కార్యోన్ముఖుడవు కావలసి ఉన్నది, కాబట్టి రామా! నీకిక నిద్రించే అవకాశమే లేదు, నీవు నరులలో శ్రేష్ఠుడవు, కాబట్టి నీవు నీ ధర్మాన్ని ఆచరించి లోకుల చేత ఆచరింప చేయవలసి ఉన్నది. ఇక నాల్గవ వాక్యమైన 

కర్తవ్యమ్ దైవమాహ్నికం:

        రామా! దైవానికి సంబంధించిన, లేదా దేవతలకు సంబంధించిన ప్రీతికరమైన పగలు చేయవలసిన క్రియలు అనగా సకాలంలో ఆచరించ వలసిన సంధ్యా వందనాదులు, ఆన్హిక క్రియలైన దేవతర్పణాలు, ఋషి తర్పణాలు , అగ్నికార్యములు మొదలైనవన్నీ కూడా నిర్వహింపవలసి ఉన్నది. అంతే కాదు దైవ స్వరూపుడవైన నీ చేత విధింపబడిన సమస్త వైదిక కర్మలు కూడా మేము ఆచరింపవలసి ఉన్నది. అంతే కాదు, ప్రధానంగా ఇప్పుడు నేను తలపెట్టిన యజ్ఞానికి నిర్వాహకుడవు కూడా నీవే. కావున నీకు నిద్రించే అవకాశమే లేదు, అని విశ్వామిత్రుని పలుకులలోని ఆంతర్యం.

      ఇలా విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను మేల్కొలిపిన విధానమే ప్రపంచానికి ఒక మేలుకొలుపు. మనమీనాడు ప్రతి చోటా వినే వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా మొదటగా  వినపడేది ఈ మేలుకొలుపే.

                                                             భద్రమస్తు!

                                                                                                         ముదిగొండ విశ్వేశ్వర శాస్త్రి 

                                                                                                                           9440103664

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.