గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2024, సోమవారం

కాళిదాసు కృత దేవీ అశ్వధాటిDevi Aswadhati 08 వివరణ.

జైశ్రీరామ్.
జైహింద్.
శ్లో:-
జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభా కరీంద్ర కర దంభాపహోరు గతి డింభానురంజిత పదా
శంభా ఉదార పరి రంభాంకురత్పులక దంభానురాగ పిశునా
శం భాసు రాభరణ గుంఫా సదా దిశతు శుంభాసుర ప్రహరణా!౮.
సీ:-
జంభారి కరి యొక్క కుంభస్థలముమించు 
పాలిండ్ల ముత్యాల పేరు తోడ;
అరటి బోదలయొక్క హస్తి హస్తముయొక్క 
గర్వమ్ము నణచెడి యూర్వులొప్ప;
నడచేటి సమయాన నవ జాత శిశువుల
పాదాలఁ బోలెడి పాదములది;
శివుని కౌగిలి చేత ధవళాక్షిపులకలు
ప్రణయ సూచకముగ ప్రబలు జనని;
గీ:-
తేజరిలు సొమ్ములను దాల్చు దివ్య తేజ.
శుంభుడను దుష్టు దునిమిన శూలి రాణి;
అండ దండగ నాకెపుడుండు గాక.
ఈప్సితార్థము; శుభములు నిచ్చు గాక.
భావము:-
జంభాసురుని సంహరించిన ఇంద్రుఁడి ఏనుగైన ఐరావతము యొక్క మిక్కిలి గొప్పదైన కుంభ స్థలమును అపహసిస్తున్న స్తనాల మీద మిక్కిలి అందగించే ముత్యాల హారము కలదీ; అరటి బోదెల యొక్క; శ్రేష్ఠమైన ఏనుగు తొండము యొక్క గర్వాన్ని పోగొట్టే తొడలు కలిగి; నడక చేత పిల్లలకు వలె ఎఱ్ఱఁ బడిన పాదాలు కలదీ; శివుని తోడి గాఢమైన ఆలింగనం వల్ల మోసులెత్తుతున్న గగుర్పాటు అధికమైన ప్రేమకు సూచన ఐనదీ; ప్రకాశిస్తున్న సొమ్ముల కూర్పు కలదీ; శుంభుఁడనే రాక్షసుని శిక్షించినదీ ఐన పార్వతీ దేవి (నాకు) శుభాన్ని ఎల్లప్పుడూ ఇచ్చు గాక.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.