గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జనవరి 2024, మంగళవారం

తెలుఁగు సాహితీ అభ్యున్నతికి తెలంగాణా సంస్థానాల వారి సేవా సదస్సు.

జైశ్రీరామ్.
శ్రీరస్తు                            శుభమస్తు                   అవిఘ్నమస్తు.
గడిదోమకొండ సంస్థాన సాహితీ వైభవమ్. నవరత్నమాలిక.
రచన … చింతా రామకృష్ణారావు. … (చరవాణి .. 8247384165)
౧.శా.  శ్రీమన్మంగళ కామినేని కుల రాశీభూత పుణ్యాత్ములై

శ్రీమత్ కావ్యరమా లలామల నిలన్ జెన్నారఁ గొల్పంగ సు

క్షేమంబున్ వెలుగంగ గణ్య కవులన్ జేఁ గొంచు పోషించి నా

రామాన్యోజ్వల మూర్తులన్ గొలుతు నే నానంద ముప్పొంగగన్.

౨.ఉ.  ఈ సభ లోన నొ ప్పె డి నటేశ్వర సత్కవి, నోంప్రకాశునిన్,

భాసిలుచున్న మాన్యగుణ వర్ధనులౌమహనీయ మూర్తులన్,

ధీసతితో రహించు కవి ధీ మణులన్ మదినెంచి మ్రొక్కెదన్

మీ సహవాసి నైన నను మేలుగఁ జూచి రహింపఁ జేయగన్.

౩.శా.  శ్రీమన్మంగళ దోమకొండ గడి భాసించన్ యునెస్కో ప్రభన్,

శ్రీమంతంబగు భారతావనియె వాసిం గాంచె ధాత్రీ స్థలిన్,

ధీమంతుల్ వర కాచరెడ్డి కుల సందీప్తుల్ వినిర్మించినా

రీ మాన్యంబగు కట్టడంబుఁ, గన లేరే వీరికిన్ సాటియే.

శ్రీమన్మంగళ దోమకొండ గడి, భాసించెన్ యునెస్కో ద్యుతిన్.

౪.సీ.  కవిపోషకుల్, కవుల్, గడి దోమ కొండను పాలించి వెలిగిన ప్రభువు లిలను,

సాహితీసంస్కృతు లాహార్యములు కాగ, గడి దోమ కొండకున్ ఘనత పెరిఁగె,

మొదటి కాచారెడ్డి మును దోమకొండ సంస్థాన పాలకులన్ బ్రథముఁడతండు,

శ్రీకర కవి సుధీ లోకానురక్షా కరుం డతండను కీర్తి రూపమతఁడు,

మహిత సర్వజ్ఞతా మహిమతో మెఱిసె నా మొదటి యెల్లారెడ్డి ముదము కదుర,

గ్రంథంబులెన్నియో కైకొనె నీతండు వ్రాయించి కవులచే వాసిఁ గాంచె,

ఘనుఁడు జంగమరెడ్డి కవివర్య కోటికిన్ బంగరు కొండగా ప్రతిభఁ గాంచె,

రెండవవాఁడగు పండిత సుకవి యెల్లారెడ్డి కృతుల నల్లంగఁ జేసె,

సంస్కృతాంధ్రములందు సద్గ్రంథకర్త మల్లారెడ్డి దోమకొండనె ఘనుండు, 

కవులెందరో గొప్పకావ్యముల్ రచియించి రాజమన్ననలంది రహిని గనిరి,

తే.గీ.  పాలనా దక్షులై గడి ప్రతిభ పెంచి

శాశ్వతంబగు సత్కీర్తి సకలదిశల

వ్యాప్తమగునట్లు కృషిఁ జేసి ప్రబలినట్టి

రాజకోటికి పద్య నీరాజనమ్ము.

౫.సీ.  శ్రీమ దాంధ్ర కవిత్వ చిద్వర సుధ నిండి శ్రీమంతముగ నుండు దోమకొండ,

కవిపుంగవుల నెన్ని గౌరవించుచు నుండి,  క్షేమంబుతో నొప్పు దోమకొండ,

శాస్త్రార్థ వేద్యులై సన్నుతిన్ గనునట్టి ధీమతాళికి నండ దోమకొండ,

భక్తితో వసియించు భక్తుల కెన్నగా సోమశేఖరు నండ దోమకొండ.

తే.గీ.  ఆంధ్ర సంస్కృత సంస్కృతీ సాంద్ర సార

మహిత గోక్షీర ధారల మహిత భూమి,

దోమకొండ గాదిది పరంధామ మరయ,

శోభనానిలులనునొప్పు  ప్రాభవమిది.

౬.చం.  వర గడి దోమకొండ పరివర్ధన చేసెను సాహితీ ప్రభన్

నిరుపముఁ డెల్లడెన్ని, గణనీయముగా పరివృద్ధి చేయగా

సరగున కాసిరెడ్డి యది స్వర్ణయుగంబుగ తీర్చిదిద్దినా

డరయుచు మల్లడేను రవియా! యన వెల్గెను సాహితీకృషిన్.

౭.మత్తకోకిల.  

ప్రాభవంబును జూపి పూర్వులు పండితాళిని బెంచగా  

శోభనానిలు దంపతుల్ గుణ శోభితుల్ కవిపాళికిన్

శోభనే కలిగించిరిట్లు విశుద్ధ ప్రస్ఫుట చిత్తులై,

ప్రాభవోన్నతితోడ వెల్గుత వారి వంశము నిచ్చలున్.

౮.చం.  కవులకు పండితాళికిని గౌరవమిచ్చెడి వారి కెప్పుడున్

భవుఁడు, భవానియున్ గృపను వర్ధిలఁ జేయుచు నుండి యెల్లెడన్

కవుల ప్రశంస లందునటు కావ్యసుకన్యలు చేరునట్లుగాన్

ప్రవర వరంబులిచ్చెదరు భాసిలగన్ గవి పోషకుల్ సదా.

౯.ఉ.  మంగళ మౌత యీ ధరను మాన్యమహోజ్వల దోమకొండకున్,

మంగళమౌత యీ యనిలు మాన్యునకున్ వర శోభనమ్మకున్,

మంగళమౌత సత్కవుల మంజుల వాక్ ప్రతిభా సమృద్ధికిన్,

మంగళమౌత శ్రీసతికి, మంగళముల్ మన భారతాంబకున్.  

స్వస్తి
తే. 06 - 01 - 2024.
మంగళమ్                 మహత్              శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.