గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2023, శనివారం

నాలో నెలకొని యున్న జగన్మాత కవితాస్వరూపమునకు SRVD ELITE చే కవికల్పభూజ బిరుదుతో సత్కారము.

జైశ్రీరామ్.
అందరిలో నెలకొనియున్న జగన్మాతకు వందనములు.

ఓం శ్రీమాత్రే నమః.
ఓం లక్మీరీనారసింహాయ నమః.
.
ఓం గం శ్రీ గణనాయకం బుధ నుతం దేదీప్య మానోజ్జ్వలం
ఓంకా రాక్షర రూప సత్ప్రద ముఖం శ్రీమద్గుణై రాశ్రితమ్ ౹
శ్రీంకా రాశ్రయ మాతృ దేహ జనితం చిద్బాసురం  శ్రీ కరం
సంసారాంధ నిరోధకం నుత మతిం,  దేవాదిదేవం భజే ౹౹           

శ్రీమన్మంగళ మానసాబ్జ నిలయన్! శ్రీమాతృ దేవిన్, సదా
బ్రేమోదార సుధాస్రవంతిగ మదిన్ విఖ్యతిగా నిల్చి, నా
క్షేమంబున్ గను శాంభవీసతిని, నే గీర్తించెదన్ భక్తితోన్,
శ్రీమాతృప్రభఁ జూపు శక్తి నిడి నా శ్రీవాక్కులన్ వెల్గుతన్. 

చ. పలుకుల తల్లివమ్మ! పరిపాలనఁ జేసెద్ వెల్ల లోకముల్,
మెలకువ తోడఁ బల్కినను మేలును గూర్తువు మాకు, నట్టి మా
పలుకులలోన దోషములు వచ్చుట నీదయ లేకపోవుటన్
బలుమరు వేడుకొందు వర భాషణ భాగ్యము నిమ్ము భారతీ!

శా.  శ్రీమ ద్దత్తు లనంతకృష్ణయు, కవిశ్రీ ముద్దురాజయ్యయున్,
శ్రీమద్వేంకట రామశర్మయును, మా.శ్రీ, సత్యనారాయణుల్,
స్త్రీమూర్తుల్,మహితాత్ములున్, వినుత సచ్ఛ్రీపూర్ణ సత్యప్రసాద్, 
ధీమాన్యుల్ నయశాస్త్రవేదులు, నిటన్ దీపించిరీ సత్ సభన్. 
శ్రీ మాతృ ప్రభ వెల్గు మీకుఁ బ్రణతుల్, శ్రీదేవి మిమ్మేలుతన్.

సీ.  శ్రీమద్గుణోద్భాస శ్రీనరహరి, సతీష్, శరభరాజుల్, దండు, చంద్రబోసు,
నారాయణులును, జనార్దనుల్, విజయులు,  వాసుదేవులు, శ్రీనివాస్, రమేషు
శ్రీ విజయకుమారు, శ్రీ రామకృష్ణుల్, ప్రసిద్ధ, రమేష్ బాబు, శ్రీ ప్రసాదు,
శ్రీపద్మనాభులు, శ్రీ శంకరుల్, సుబ్బరాజు, గోపాల్రావు, ప్రనుత రెడ్డి, 

తే.గీ.  పూజ్య కోటయ్యయును, మదన్ మోహనులును, 
వినుతులైన కృష్ణారెడ్డి,  విపుల సుగుణ
తేజ పాటిలు, శ్రీజోషు, పూజనీయ
దివ్య మురళీధరుల్, సభన్ దేజరిలిరి. 

శా.  ధీరాత్ముల్ కవికల్పభూజ బిరుదున్ దివ్యంబుగానీయ, సు 
స్మేరానందముఖారవిందయగు బ్రాహ్మీదత్తమౌ పట్టమై 
ధారాపాత సుధాస్రవంతియన చిత్ర శ్రావ్య పద్యార్ణవం 
బే రమ్యంబుగ బాసరాంబ నిలుపున్ హృద్యంబుగా నా కృతిన్.

ఉ.  మీరలొనర్చు సత్కృతిని మేలుగ శ్రీలలితాంబ గైకొనెన్ 
శ్రీరమణీయతేజ, విలసిల్లఁగఁ జేయును మిమ్మునిత్యమున్, 
గారణమామె నేను కవిగా ఘన సత్కృతులందుటందు, వి
స్తార కృపాంబురాశి పదసారసముల్ మదినెన్ని గొల్చెదన్.🙏

కృతజ్ఞతాభివందనములతో
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
౦౦౦౦౦౦౦౦


  .         చిత్ర్కవితాసమ్రాట్, కనికల్పభూజ, కవి శిఖామణి 
చింతా రామకృష్ణారావు గారికి 
పంచ పద్యసుమాలు 
డా. నలవోలు నరసింహా రెడ్డిజాతీయ 
తెలుగు సాహితీ పీఠము.
ఉ. ఆతడు నిండుకుండ, మరియాదకు తెల్లని మంచు కొండ, ప్ర 
ఖ్యాతికి పూల దండ, గగనంబున నెత్తిన ఝండ పాండితిన్,    
భూతలమంత నిండ విర బూచిన మండ తెలుంగు  పద్యపుం 
రాతల  లోన గండ, తన లాస్యము శిష్యుల కండ,  నుండెడిన్ 

ఉ . మెత్తని వాడవీవు, సుతి మెత్తని భావము నీది, అన్యులన్   
మొత్తగ బోవు , గుండియలు మోసులు వారగ పండితాళురన్    
చిత్తములోన  మెచ్చు కొను చిత్తము  నీది, నీదు సేవయే 
పొత్తము నందు వ్రాసికొన బోలును ఓ కవి రామకృష్ణుడా! 

ఉ. అందరి వాడు, స్నేహమున హద్దులెరుంగని వాడు, కైతలో 
ముందరి వాడు, నెల్లరకు మోదము గూర్చెడు వాడు, చల్లనౌ
డెందము వాడు, నెయ్యెడల టెక్కులు జేయనివాడు, దర్పమున్ 
జెందని వాడు, సాదు గుణ శీలుడు  మాకవి రామకృష్ణుడున్ 

ఉ. మంచికి మారు పేరు, అభి మానుడు పెద్దల పట్ల, యెన్నడున్వం
చన సేయ నేరడు, వివాదము లందున దూరబోడు, దీ  
పించెడు  సౌమ్య శీలుడయి యెల్లరి  గుండెల  కొల్ల గొట్టు ని 
ర్వంచిత  బుద్ధి శీలునకు రంజిల నా యభినందనంబులున్    

మ. చిర కాలంబును గల్గు గావుత ! శుభాశీస్సుల్ సిరుల్ సంపదల్ ! 
కొరతేమాత్రము లేక జీవితమునన్ కొంగ్రొత్త భాగ్యంబులున్ 
వరలున్  గాత! ధరాతలంబునను దివ్యంబై యశో వల్లికల్ 
విరియున్ గాత! నిరంతరంబు మిము దీవించంగ వాగ్దేవి తాన్
జైహింద్.
Print this post

2 comments:

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గౌరవనీయులు గురుతుల్యులు శ్రీచింతా రామకృష్ణా రావు గారికి "కవికల్పభూజ" బిరుదాన్వితులైన శుభసందర్భమున వారికివే నా హృదయపూర్వక ప్రణామపూర్వక శుభాభినందనములు.

ఘన సత్కావ్య సహస్ర సద్రచన విఖ్యాతున్ నిగర్విన్ ప్రవ
ర్ధనమౌ బంధ కవిత్వ భానుఁడిని విద్వత్పూర్ణ తేజోనిధిన్
వినయాధిక్యుని సద్విశేషరచనా విశ్లేషకున్ సాహితీ
వన సామ్రాజ్య మృగేంద్రునిన్ కవన సద్వ్యాపార నిష్ణాతునిన్

అవిరళ కవితా సేద్యము
వ్యవధానము లేక సలుపు వారలు మిమ్మున్
"కవికల్పభూజ" బిరుదం
బు వలచి తమ దరికి చేరె మురిపెమెసఁగుచున్.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గౌరవనీయులు గురుతుల్యులు శ్రీచింతా రామకృష్ణా రావు గారికి "కవికల్పభూజ" బిరుదాన్వితులైన శుభసందర్భమున వారికివే నా హృదయపూర్వక ప్రణామపూర్వక శుభాభినందనములు.

ఘన సత్కావ్య సహస్ర సద్రచన విఖ్యాతున్ నిగర్విన్ ప్రవ
ర్ధనమౌ బంధ కవిత్వ భానుఁడిని విద్వత్పూర్ణ తేజోనిధిన్
వినయాధిక్యుని సద్విశేషరచనా విశ్లేషకున్ సాహితీ
వన సామ్రాజ్య మృగేంద్రునిన్ కవన సద్వ్యాపార నిష్ణాతునిన్

అవిరళ కవితా సేద్యము
వ్యవధానము లేక సలుపు వారలు మిమ్మున్
"కవికల్పభూజ" బిరుదం
బు వలచి తమ దరికి చేరె మురిపెమెసఁగుచున్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.