గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2022, శనివారం

అప్రకాశోప్రవృత్తిశ్చ - ...14 - 13...//.....యదా సత్త్వే ప్రవృద్ధే తు - , , .14 - 14,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

 జైశ్రీరామ్.

|| 14-13 ||

శ్లో.  అప్రకాశోప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ|

తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన.

తే.గీ.  మది తమోగుణవృద్ధిచే మందమతియు,

భ్రమయు, దానిచే నష్టము, వరలుచుండు

పతనమార్గాన పడిపోయి యతులితమగు

జీవితమువ్యర్థమయిపోవు జీవులకును.

భావము.

హే కురునందనా! తమోగుణము వృద్ధిలో నున్నపుడు బుద్ధి

మాంద్యము, అఙ్ఞాన భ్రమతో కూడిన ప్రమాదములు కలుగుచున్నవి.

|| 14-14 ||

శ్లో.  యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్|

తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే.

తే.గీ.  సత్వగుణవృద్ధిలోనుండి మహత్వమయిన

మృత్యు వొందినన్ ఘనులట్లు మేల్తరమగు 

ముక్తినొందుదురర్జునా యుక్తమదియె

జీవమొందినవానికి జీవితమున.

భావము.

దేహధారియగు జీవుడెపుడు సత్త్వగుణము అభివృద్ధిలో నుండగా 

మరణించునో, అపుడు ఉత్తమ ఙ్ఞానులు పొందెడు నిర్మలమైన 

లోకములను పొందుచున్నాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.